నెహ్రూ పథమా? మోదీ మార్గమా?

ABN , First Publish Date - 2023-06-14T00:50:58+05:30 IST

‘నేనుమరణించిన తర్వాత నా చితాభస్మాన్ని గంగానదిలో కలపండి. ఇది మతపరమైన విశ్వాసం కాదు. నాకు చిన్నప్పటి నుంచే అలహాబాద్‌లో గంగా, యమునా నదులతో అనుబంధం ఏర్పడింది. రుతువులు మారినప్పుడల్లా ఈ నదీజలాల మనోభావాలు మారడాన్ని...

నెహ్రూ పథమా? మోదీ మార్గమా?

‘నేనుమరణించిన తర్వాత నా చితాభస్మాన్ని గంగానదిలో కలపండి. ఇది మతపరమైన విశ్వాసం కాదు. నాకు చిన్నప్పటి నుంచే అలహాబాద్‌లో గంగా, యమునా నదులతో అనుబంధం ఏర్పడింది. రుతువులు మారినప్పుడల్లా ఈ నదీజలాల మనోభావాలు మారడాన్ని నేను గమనించాను. ఈ నదులతో ముడివడిఉన్న కల్పన, చరిత్ర, సంప్రదాయాల గురించి నేను ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాను. గంగానది భారతదేశ పురాతన సంస్కృతి, నాగరికతకు ప్రతీక. నిరంతరం ప్రవహిస్తున్నా, నిరంతరం మారుతున్నా అదే గంగానది మన కళ్లముందు ఆడుతుంది’ అని ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ తన వీలునామాలో పేర్కొన్నారు. తన చితాభస్మాన్ని గంగానదిలో కలపాలని ఆయన కోరారు. తన అభీష్టానికి మతపరమైన ప్రాధాన్యత ఏమీ లేదని కూడా నెహ్రూ చెప్పారు. అయినా నెహ్రూ చితాభస్మాన్ని వేద మంత్రాల మధ్య గంగానదిలో ఆయన ఇద్దరు మనుమలు రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ కలిపారు. తనను తాను లౌకిక వాదినని చెప్పుకున్న నెహ్రూ 1954లో అలహాబాద్‌లో కుంభమేళాలో గంగానదిలో మునకలు వేశారు! కాని సోమనాథ మందిరాన్ని రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ ప్రారంభించడాన్ని ఆయన స్పష్టంగా వ్యతిరేకించారు. దేశం మతరాజ్యంగా మారితే జరిగే ప్రమాదాన్ని నెహ్రూ కంటే తీవ్రంగా హెచ్చరించిన మరో కాంగ్రెస్ నేత లేరు.

ఇందిరాగాంధీ అయితే ఏనాడు తన మత విశ్వాసాలను దాచుకోలేదు. వసంత పంచమి రోజు పసుపుచీరలు ధరించడం నుంచీ స్వామీజీలను కలుసుకోవడం, మతపరమైన సభల్లో పాల్గొనడం వరకూ ఆమె తన విశ్వాసాలను బహిరంగంగానే వ్యక్తం చేశారు. ఢిల్లీకి వచ్చిన తిరుపతి ప్రధాన అర్చకులను తమ కుటుంబ సభ్యులు కలుసుకునే సంప్రదాయాన్ని ఇందిరాగాంధీయే ప్రారంభించారని, తామెప్పుడు ఢిల్లీ వచ్చినా వారి కుటుంబ సభ్యులు తమను కలుసుకోవడం ఆనవాయితీగా పాటిస్తారని ఒక ప్రధానార్చకుడు కొద్ది సంవత్సరాల క్రితం తెలిపారు. రాజీవ్‌గాంధీ అయోధ్యలో మందిరం తాళాలు తెరిపించడమే కాక రామరాజ్యాన్ని నెలకొలుపుతానని ప్రకటించిన సంగతి విస్మరణీయం కాదు. ఇక పివీ అయిదేళ్ల పాలనలో బాబ్రీ మసీదు విధ్వంసం చెరపలేని మచ్చగా మిగిలిపోయింది. నిజానికి బిజెపిని, ఆర్ఎస్ఎస్‌నూ కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించినప్పటికీ ఆ పార్టీ అనేక సందర్భాల్లో వ్యక్తిగత విశ్వాసాల పరిధిని దాటి మత రాజకీయాలను ఆలింగనం చేసుకుంది. మైనారిటీల బుజ్జగింపు రాజకీయాలు అనుసరిస్తున్నారనే ఆరోపణలనూ ఆ పార్టీ ఎదుర్కొంది.

కానీ భారతీయ జనతా పార్టీ ఒక ఉప్పెనలా రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత దేశంలో పరిస్థితులు భిన్నంగా మారాయి. మతమే ప్రధాన రాజకీయాంశంగా మారింది. ఆడ్వాణీ రథయాత్ర దేశ రాజకీయాలను ఒక మలుపు తిప్పితే నరేంద్రమోదీ రంగ ప్రవేశం చేసిన తర్వాత దేశంలో సామాజిక, రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోతుందా, కాంగ్రెస్, మరికొన్ని పార్టీలు ఎంతో కొంత మోతాదులో అవలంబించిన లౌకిక విధానాలు పూర్తిగా గాలికి కొట్టుకుపోతాయా అన్న అనుమానాలు చెలరేగాయి. ప్రజలే మతపరమైన భావోద్వేగాల్లో కొట్టుకుపోతే ఓటు బ్యాంకు రాజకీయాలు అవలంబించే వారికి కూడా వేరే గత్యంతరం ఉండదు. అందుకే రాష్ట్ర స్థాయి నేతలు కూడా గతంలో కంటే ఎక్కువగా మఠాలను, మందిరాలను పావనం చేయసాగారు. ఇది ఒకరకంగా బిజెపి సాధించిన విజయం.

బిజెపి ఆవిర్భవించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో తాము అనుసరిస్తున్న లౌకిక వాదం సరైనదా కాదా, ప్రజలు తమను ఆమోదిస్తారా అన్న చర్చలు ప్రారంభమయ్యాయి. విఎన్ గాడ్గిల్ లాంటి వారు మెజారిటీ మనోభావాల గురించి ఆలోచించాలని సలహా ఇవ్వడం ప్రారంభించారు. దిగ్విజయ్ సింగ్, ఫోతేదార్ తదితరుల సలహా మేరకు 2001లో సోనియాగాంధీ కుంభమేళాకు హాజరై అలహాబాద్‌లో గంగానదిలో మునకలు వేశారు. 2002లో గుజరాత్ అల్లర్ల తర్వాత బిజెపికి లభించిన భారీ విజయంతో కాంగ్రెస్ మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో మెతక హిందూ రాజకీయాలు అనుసరించడం ప్రారంభించింది. 2014 ఎన్నికల్లో బిజెపి భారీ విజయం తర్వాత కాంగ్రెస్ ఆంటోనీ నాయకత్వంలో ఒక కమిటీని నియమించింది. ఆంటోనీ క్రైస్తవుడైనప్పటికీ కాంగ్రెస్ మైనారిటీ రాజకీయాలు చేయడం సరైంది కాదని హెచ్చరించారు. దీనితో కాంగ్రెస్ కూడా బిజెపి దారిలో పయనించాలని నిర్ణయించింది. కాంగ్రెస్ ప్రారంభించిన హిందూ రాజకీయాలకు అనుగుణంగానే రాహుల్ గాంధీ తనను తాను శివభక్తుడుగా ప్రకటించుకున్నారు, కేదార్‌నాథ్, కైలాస్ మానస సరోవర్ యాత్రలకు వెళ్లారు. తనను తాను జంధ్యం ధరించిన బ్రాహ్మణుడుగా చెప్పుకున్నారు. అనేక మందిరాల్లో పూజల్లో పాల్గొన్నారు. ఒక ప్రబల మతతత్వ పార్టీ రంగంలో ఉన్న తర్వాత ప్రజలు దాన్ని అనుసరించే నకిలీ మతతత్వ పార్టీని గౌరవిస్తారనుకోవడం అమాయకత్వం. భారతదేశ మౌలిక తత్వానికి అనుగుణంగా తన సిద్ధాంతాలను, రాజకీయాలను అనుసరించడం కాంగ్రెస్ ఎప్పుడైతే మానేసిందో, ద్వంద్వ రాజకీయాలను అనుసరించడం ఎప్పుడైతే మొదలు పెట్టిందో ప్రజలు ఆ పార్టీ పట్ల విశ్వాసం కోల్పోవడం ప్రారంభించారు. కాంగ్రెస్ రెంట చెడ్డ రేవడిగా మారడంతో అటు హిందువులూ, ఇటు ముస్లింలూ ఇద్దరూ దూరం అయ్యే ప్రమాదం ఏర్పడింది. ముస్లింలు కొన్ని ప్రాంతాల్లో ఒవైసీ పార్టీని ఆదరించేందుకు కారణం కూడా ఇదే. యూపీ లాంటి చోట్ల ముస్లింలు దూరం కావడంతో 2022లో ప్రియాంకాగాంధీ ఎంత విస్తృతంగా ప్రచారం చేసినా, ఆ పార్టీ 2.4 శాతం కంటే ఎక్కువ ఓట్లు సాధించలేదు. వారు సమాజ్‌వాది పార్టీ వైపు మొగ్గు చూపడంతో ఆ పార్టీ సంఖ్యాబలం పెంచుకుంది. బిజెపి ఆయుధాలతోనే బిజెపిని ఎదుర్కోవడం కష్టమని కాంగ్రెస్ గ్రహించడంలో ఆలస్యం జరిగింది.

గత కొద్దినెలలుగా కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆ పార్టీ తన రాజకీయాలను మార్చుకోవాలని నిర్ణయించిందా అన్న ఆలోచన కలుగుతోంది. రెండు సార్వత్రక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ‘పోయేదేమి లేదు బానిస సంకెళ్లు తప్ప’ అన్నట్లుగా కాంగ్రెస్, బిజెపి రాజకీయాలకు పూర్తి భిన్నమైన రాజకీయాలను అనుసరించడం ప్రారంభించింది. అందులో భాగంగానే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ప్రారంభించినట్లు కనపడుతోంది, విద్వేష రాజకీయాలను వ్యతిరేకిస్తున్నానని, పరస్పర ప్రేమను ఆహ్వానిస్తున్నానని రాహుల్ ఈ యాత్రలో అంతటా చెప్పుకున్నారు. దేశంలో లౌకిక వాదం పట్ల తీవ్ర చర్చను ప్రారంభించారు. ఉద్దేశపూర్వకంగానే రాహుల్ మహారాష్ట్రలో వినాయక్ దామోదర్ సావర్కర్‌పై విమర్శలు సంధించడం, కర్ణాటకలో ఎన్నికల మేనిఫెస్టోలో బజరంగ్‌దళ్‌పై నిషేధాన్ని ప్రకటించడం జరిగాయి. ఈ అంశాలపై అనేకమంది రాహుల్‌గాంధీని తప్పు పట్టినప్పటికీ తానేం అమాయకుడిని కాదని, ఎక్కడ ఎవరికి ఎలాంటి సందేశం పంపాలో తనకు తెలుసునని నిరూపించుకున్నారు. హనుమాన్ చాలీసాలు, బజరంగ్ బలీ నినాదాలు చేసిన హేమాహేమీలైన బిజెపి నేతలు కాంగ్రెస్ ఒక వ్యూహం ప్రకారమే అలా చేసిందని గ్రహించలేకపోయారు. కర్ణాటక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు అత్యంత సీనియర్ దళిత నాయకుడైన మల్లికార్జున ఖర్గేను పార్టీ అధ్యక్షుడుగా ఎంపిక చేయడం కూడా యాదృచ్ఛికంగా జరిగింది కాదు. తద్వారా ముస్లింలు, దళితులు కాంగ్రెస్‌కు అనుకూలంగా సంఘటితమయ్యారు. పాత మైసూరు ప్రాంతంలో ఎప్పుడూ జనతాదళ్(ఎస్)కు ఓటు వేసే ముస్లింలు కూడా ఈసారి కాంగ్రెస్ వైపు మళ్లారు. కర్ణాటకలోని 51 ఎస్‌సి, ఎస్‌టి సీట్లలో బిజెపి 39 సీట్లను కోల్పోయింది. ఈ దేశంలో ఆదివాసీలు, దళితులమాదిరే ముస్లింలు కూడా అదే రకమైన కష్టాలను ఎదుర్కొంటున్నారని రాహుల్ ప్రకటించి కాంగ్రెస్ ఓట్లను సంఘటితం చేశారు. ముస్లింలీగ్‌ను లౌకికవాద పార్టీగా ఆయన ఎటువంటి జంకు లేకుండా అభివర్ణించారు. జిన్నా ముస్లింలీగ్ గురించి కాక కేరళ ముస్లింలీగ్ గురించి రాహుల్ మాట్లాడారని పార్టీ తర్వాత వివరించింది కాని ముస్లింలకు వెళ్లాల్సిన సందేశమే వెళ్లింది.

ఒక సుదీర్ఘ చరిత్ర గల, అనేక భావజాలాలు ఉన్న నేతలతో నిండిన కాంగ్రెస్ అనేక ప్రయోగాల తర్వాత ఒక స్పష్టమైన సైద్ధాంతిక దృక్పథంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించగలిగింది. రాహుల్ మళ్లీ నెహ్రూవియన్ మార్గంలో కాంగ్రెస్‌ను పయనింపచేయవచ్చు కాని భారతీయ జనతా పార్టీకి అలాంటి అవకాశమే లేదు. కొద్ది కాలం అధికారంలో ఉన్న అటల్ బిహారీ వాజపేయి తరహా రాజకీయాలను ఆ పార్టీ అనుసరించి ఉంటే ఇవాళ దాని పరిస్థితి ఏ విధంగా ఉండేదేమో కాని నరేంద్రమోదీ పట్టులోకి బిజెపి వెళ్లిన తర్వాత ఆ పార్టీ స్వభావం మారే అవకాశం ఏ మాత్రం లేదు. హిందూ రాజకీయాలే బిజెపి తన ఊపిరిగా మార్చుకుంది. ఆఖరుకు కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని కూడా నరేంద్రమోదీ రాజదండంతో, యజ్ఞయాగాదుల మధ్య చేసి ‘హిందూ హృదయ సామ్రాట్’ తానేనని ప్రచారం చేసుకునేందుకు సిద్ధపడ్డారు. కాంగ్రెస్ ఎంచుకున్న దారి, బిజెపి ఎంచుకున్న దారికి మధ్య ఒక స్పష్టమైన వ్యత్యాసం ఇప్పుడు కనిపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెనుక వైపు బాటను చూపించే అద్దాన్ని చూస్తూ వాహనం నడుపుతారని రాహుల్ గాంధీ అమెరికాలో వ్యాఖ్యానించడం ద్వారా దేశంలో పురోగామి, తిరోగామి దృక్పథాల మధ్య పోటీ జరుగుతోందని సూచించారు. కర్ణాటక ఎన్నికలతో తనకు స్పష్టమైన దిశానిర్దేశం కల్పించుకున్న కాంగ్రెస్‌లో వచ్చిన ఈ పరిపూర్ణమైన మార్పును ప్రజలు ఆదరిస్తారా లేదా అనేది అయిదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ, సార్వత్రక ఎన్నికల్లోనూ తేలనుంది. ఏమైనా ఈ దేశంలో మోదీ నాయకత్వంలో బిజెపి అనుసరిస్తున్న రాజకీయాలకూ, కాంగ్రెస్ అనుసరించాలని నిర్ణయిస్తున్న రాజకీయాలకూ మధ్య సంఘర్షణను రెండు రాజకీయ పార్టీల మధ్య సంఘర్షణగా మాత్రమే కాదు, రెండు సైద్ధాంతిక శిబిరాల మధ్య మొదలైన సంఘర్షణగా చూడాల్సి ఉన్నది. ఇది దేశ భవిష్యత్‌కు సంబంధించిన సంఘర్షణ.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2023-06-14T00:50:58+05:30 IST