ప్రాంతీయ పార్టీలపై మోదీ అంకుశం

ABN , First Publish Date - 2023-07-05T02:30:29+05:30 IST

జూన్23న పట్నాలో కాంగ్రెస్‌తో సహా 15 ప్రతిపక్ష పార్టీలు సమావేశం అయిన పదిరోజుల్లోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన సత్తా ఏమిటో నిరూపించుకున్నారు. ఈ సమావేశానికి హాజరైన...

ప్రాంతీయ పార్టీలపై మోదీ అంకుశం

జూన్23న పట్నాలో కాంగ్రెస్‌తో సహా 15 ప్రతిపక్ష పార్టీలు సమావేశం అయిన పదిరోజుల్లోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన సత్తా ఏమిటో నిరూపించుకున్నారు. ఈ సమావేశానికి హాజరైన మరాఠా నాయకుడు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీని రెండు ముక్కలు చేశారు. మహారాష్ట్రలో శివసేనను రెండుగా చీల్చిన ఏడాది లోపే ఎన్‌సీపీని చీల్చి మరోసారి ఆపరేషన్ లోటస్‌ను అమలు చేసిన ఘనత మోదీకి దక్కింది. 2019లో బిజెపికి రాష్ట్రంలోని 288 అసెంబ్లీ స్థానాలకు గాను 105 సీట్లే దక్కాయి. మిత్రపక్షమైన శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్‌తో కలిసి మహావికాస్ అగాధీ కూటమి పేరిట ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని ఆ పార్టీ జీర్ణించుకోలేకపోయింది. దాదాపు రెండున్నరేళ్లు విశ్వయత్నాలు చేసిన తర్వాత, అనేక సామ, దాన, భేద దండోపాయాలను ప్రయోగించిన తర్వాత శివసేనను చీల్చడం ద్వారా మహా వికాస్ అగాధీ ప్రభుత్వాన్ని కుప్పకూల్చి బీజేపీ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఎన్‌సీపీని కూడా చీల్చింది. నిజానికి మరో ఏడాదిలో సార్వత్రక ఎన్నికలతో పాటు మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్నందువల్ల బీజేపీకి శివసేనను చీల్చనవసరం లేదు. కాని కురువృద్ధ నేత శరద్ పవార్ పట్టు రోజురోజుకూ బలహీనపడుతున్న తరుణంలో ఎన్‌సీపీని చీల్చడం ద్వారా మహారాష్ట్రలో బీజేపీని మరింత శక్తిమంతమైన పార్టీగా మార్చడమే మోదీ ధ్యేయం. ముఖ్యంగా పవార్ పట్టు ఉన్న పశ్చిమ మహారాష్ట్ర, ఉత్తర మహారాష్ట్ర, మరాట్వాడా ప్రాంతాల్లో బిజెపి కూటమి బలోపేతం చేయడమే ధ్యేయంగా ఆయన పావులు కదిపారు. వచ్చే సార్వత్రక ఎన్నికల్లో దేశంలో అనేక రాష్ట్రాల్లో గతంలో సాధించిన సీట్లు తగ్గిపోయే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని మోదీ మహారాష్ట్రలో కీలక చర్యలు తీసుకున్నారు. నిజానికి గత ఎన్నికల్లో ఆ రాష్ట్రంలోని 48 సీట్లలో 23 సీట్లు బీజేపీకి దక్కాయి కాని ఈ సారి అజిత్ పవార్ ఎన్‌సీపీ, ఏక్‌నాథ్ షిండే శివసేనలతో కలిసి బిజేపీ మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చేందుకే కాక లోక్‌సభలో కూడా దాదాపు 40 సీట్లకు పైగా దక్కించేందుకు పథకం పన్నిందని బీజేపీ వర్గాలు అంటున్నాయి, ప్రతిపక్షాల ఓట్లను చీల్చేందుకు మరి కొన్ని చిన్నా చితక పార్టీలు కూడా ఒవైసీ సారథ్యంలోని ఎంఐఎం మాదిరి బీజేపీకి పరోక్షంగా సహాయపడవచ్చు.

ఈ మొత్తం ప్రహసనం చూస్తుంటే దేశంలో ప్రాంతీయ పార్టీలు ఎంతటి దుస్థితిలో ఉన్నాయో అర్థమవుతోంది. ఒకప్పుడు అధికారం తలకెక్కి కాంగ్రెస్ కన్నూమిన్ను గానకుండా వ్యవహరించినందుకు దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు ఉద్భవించాయి. వాటిని ఇప్పుడు మోదీ నయానా, భయానా లొంగదీసుకునేందుకు ప్రయత్నించడమే కాక వాటిని తుదముట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. జయలలిత మరణించిన తర్వాత అన్నాడిఎంకె చీలిపోవడంతో మోదీ ప్రయోగం ప్రారంభమైంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో నేతలను, ఎమ్మెల్యేలను వశపరుచుకుంటూనే మోదీ ప్రాంతీయ పార్టీలను బలహీనం చేయడం ప్రారంభించారు. వాటి నాయకుల బలహీనతలు, అవినీతి కుంభకోణాలు మోదీకి ఆయుధాలుగా మారాయి. మోదీ ఎత్తుగడల మూలంగా ఒకప్పుడు మహారాష్ట్రను గడగడ లాడించిన బాల్ థాకరే శివసేన అస్తిత్వ పరీక్షలో పడింది. బాల్ థాకరేను కలుసుకోవడం కోసం, శివసేనను తమ వైపుకు తిప్పుకోవడం కోసం ఒకప్పుడు అటల్ బిహారీ వాజపేయి, ఆడ్వాణీ తీవ్ర యత్నాలు చేశారు. 1986లో పాలంపూర్‌లో జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల్లో శివసేనతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించిన తర్వాతే అదే ఏడాది ముంబైలో జరిగిన సమావేశాల్లో శివసేన అధినేత బాల్ థాకరే ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఆ తర్వాతే మహారాష్ట్రలో బిజెపి ఉనికి ఏర్పర్చుకుంది. వాజపేయి, ఆడ్వాణీల ప్రయత్నాల వల్లే అకాలీదళ్‌కు బీజేపీకి పొత్తు కుదిరింది. మోదీ ఈ రెండు పార్టీల ఉనికిని దెబ్బతీశారు. ఇక ఎన్‌సీపీని లొంగదీసుకునేందుకు ఆయన చాలా యత్నాలు చేశారు. కాని శరద్ పవార్ బలంగా నిలబడడం వల్ల అది సాధ్యపడలేదు. నిజానికి ఒక ప్రాంతీయ పార్టీని నెలకొల్పి ముఖ్యమంత్రి కాలేకపోయిన ఏకైక నేత శరద్ పవారే. పీవీ నరసింహారావు కాలం నుంచి ప్రధానమంత్రి పదవికోసం ఆయన పోటీపడుతున్నారు. కాన్సర్ వ్యాధితో బాధపడ్డా ప్రతిపక్ష ఐక్యత కోసం తీవ్ర యత్నాలు చేశారు. అలాంటి పవార్ అనే పర్వతాన్ని విరిగిపడేలా మోదీ చేయగలిగారు. ఒకప్పుడు శక్తిమంతమైన సోనియాగాంధీ లాంటి నేతను ధిక్కరించిన జగన్మోహన్ రెడ్డి తన దయాదాక్షిణ్యాలపై ఆధారపడేలా చేసుకున్నారు. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీనైనా చీల్చడమో, లొంగదీసుకోవడమో చేయగలిగిన శక్తి మోదీకి ఉన్నదని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి. బీజేపీకి స్వంతంగా తన విధానాల ద్వారా ప్రజలను ఆకర్షించి విస్తరించగలిగిన శక్తి ఉంటే ఇలాంటి అనారోగ్యకరమైన చర్యలకు పాల్పడాల్సిన అవసరం ఉండేది కాదని వేరే చెప్పనక్కర్లేదు.

విచిత్రమేమంటే అమెరికా నుంచి వచ్చీ రాగానే భోపాల్‌కు వెళ్లి కార్యకర్తల సమావేశంలో దేశంలో అవినీతికి, కుంభకోణాలకు పాల్పడుతున్న శక్తుల్నీ ఏకమవుతున్నాయని విరుచుకుపడిన మోదీ వారం రోజుల దాటకముందే అజిత్ పవార్ వర్గంతో పొత్తు ఏర్పర్చుకుని ఆయనను ఉప ముఖ్యమంత్రిగా చేశారు. గత పదేళ్లుగా అజిత్ పవార్ అత్యంత అవినీతిపరుడని బీజేపీ విమర్శిస్తోంది. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈడీ ఆయనను ఒక సహకార బ్యాంకు కేసులో మనీలాండరింగ్ కేసులో ఇరికించింది. ఆయన, ఆయన భార్య సునేత్రకు చెందిన రూ.65 కోట్ల మేరకు ఆస్తుల్ని అటాచ్ చేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈడీ ఛార్జిషీటు దాఖలు చేసినప్పుడు అజిత్ పవార్ దంపతుల పేర్లు అందులో లేవు. అంటే ఆయనతో బేరం కొద్ది రోజుల ముందే కుదిరిందని, శరద్ పవార్ పట్నా సమావేశానికి హాజరైన నేపథ్యంలో బీజేపీ దెబ్బకొట్టిందని అర్థమవుతోంది. ఓబీసీ నేత ఛగన్ భుజ్‌బల్, మరో బలమైన నేత హసన్ ముష్రిఫ్‌ను కూడా ఈడీ ద్వారానే బీజేపీ లొంగదీసుకుంది. ఒక ఈడీ కేసులో ఇరుక్కున్న హసన్ ముష్రిఫ్‌కు నిన్న మొన్నటి వరకూ ముందస్తు బెయిల్ కూడా దొరకలేదు. చివరకు హైకోర్టు ఆయనను జులై 11 వరకు అరెస్టు చేయకూడదని చెప్పింది. ఈలోపు బిజెపితో డీల్ కుదిరి, ఆయన మంత్రివర్గంలో చేరినందువల్ల ఇక ఆయన భవిష్యత్ సురక్షితంగా మారినట్లే. ప్రధానమంత్రి స్వయంగా నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీని నేషనలిస్టు కరప్ట్ పార్టీగా అభివర్ణించారు. ఇప్పుడు ఆ పార్టీ బీజేపీకి పాలతో కడిగిన పార్టీగా మారిందా? ప్రతిపక్ష పార్టీలు రూ. 20 లక్షల కోట్ల మేరకు కుంభకోణాలు చేశాయని మోదీ భోపాల్‌లో ఆరోపించారు. అందులో 70 వేల కోట్ల వాటా ఉన్న ఎన్‌సీపీలో ప్రధాన నిందితుడు ఇప్పుడు బీజేపీ భాగస్వామిగా మారాడు కదా!

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలపై అవినీతి ఆరోపణలు చేస్తే ప్రజలు ఎలా విశ్వసిస్తారు? అవినీతిపరులపై చర్యలు తీసుకుంటామన్న మోదీ ఉపన్యాసాలకు ఏ విలువ ఉంటుంది? మోదీ హయాంలో బీజేపీ గతంలో ఎన్నడూ లేనంతగా నైతిక, సైద్ధాంతిక, రాజనీతికి సంబంధించిన ప్రశ్నలను ఎదుర్కోవల్సిన పరిస్థితిలో ఉన్నది. ఇతర పార్టీలతో పోలిస్తే బీజేపీ ఒక విశిష్టమైన పార్టీ అని చెప్పుకోలేని దుస్థితిలో పడిందని, ఎన్నికల్లో గెలిచేందుకు ఎటువంటి దుష్కార్యాలకైనా పాల్పడుతుందని చెప్పక తప్పదు.

బహుశా అందుకే ప్రజలను, రాజకీయ పార్టీలను మతం పేరుతో విడదీసేందుకు మోదీ ఉమ్మడి పౌర స్మృతి పేరుతో మరో అస్త్రాన్ని బయటకు తీశారు. ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీయడం, కాంగ్రెస్‌ను ఆత్మరక్షణలో పడవేయడం, హిందూ ఓటర్లను ముస్లింలపై ఉసిగొల్పడం ఆయన ప్రధాన లక్ష్యం. ఆధునిక ప్రజాస్వామ్యంలో ప్రజలందరికీ ఉమ్మడి పౌరస్మృతి ఉండడం వాంఛనీయమే కావచ్చు కాని మోదీకి ఆధునిక ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్నదా? గత తొమ్మిదేళ్లుగా ఆయన ఉమ్మడి పౌరస్మృతి గురించి ఎందుకు మాట్లాడలేదు? ఈ దేశంలో ముస్లింలు వెనుకబడి ఉండడానికి కారణం హిందువులకూ, ముస్లింలకూ వేర్వేరు చట్టాలు ఉండడమే అన్నట్లు మోదీ మాట్లాడారు. కాని సమాజంలో ఏ వర్గమైనా ఇవాళ వెనకబడి ఉండడానికి, గతంలో కంటే ఎక్కువగా కొద్ది మంది చేతుల్లో సంపద కేంద్రీకృతం కావడానికి, 50 శాతం సంపద కేవలం మూడు శాతం జనాభా చేతుల్లో ఉండడానికి కారణమేమిటి? అత్యధిక జనాభా రెండుపూటల భోజనం చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నదని ప్రభుత్వానికి తెలుసా? సామాజిక అభివృద్ధి విషయంలో ప్రపంచంలోని 163 దేశాల్లో భారతదేశం 113వ స్థానంలో ఉన్నదన్న విషయం నిజం కాదా? పేదరికం, అత్యాచారాలు, అవమానాలు, అణిచివేత ఈ దేశంలో దళితులు, ఆదివాసీలే ఎక్కువగా భరిస్తున్న విషయం వాస్తవం కాదా? ఈ దేశంలో నిరుపేదలైన ఆదివాసులు చిన్నచిన్న నేరాలపై ఏళ్లతరబడి బెయిలు లేకుండా జైళ్లలో మగ్గుతున్నారని స్వయంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా చెప్పినప్పుడైనా ప్రభుత్వం పట్టించుకుందా? ఆర్టికల్ 17 క్రింద అస్పృశ్యతను నిషేధించినప్పటికీ ఎంతమంది దళితులు అస్పృశ్యతకు గురవుతున్నారో ప్రభుత్వం పరిశీలించిందా? యూనివర్సిటీల్లో చదువుకోసం వచ్చిన ఎంతమంది దళిత యువకులు రోహిత్ వేముల, దర్శన్ సోలంకి లాగా అవమానాలకు లోనై ఆత్మహత్యలు చేసుకుంటున్నారో మోదీకి తెలుసా?

స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మోదీ మరో పాతిక సంవత్సరాల అమృతకాలంలో తీసుకోవాల్సిన చర్యల గురించి మాట్లాడుతున్నారు. అయితే ఈ అమృత కాలంలో అంతం కావల్సింది ఈ దేశంలో ఎల్లెడలా కనిపిస్తున్న సామాజిక, ఆర్థిక అసమానతలు. వివాహం, విడాకులు, దత్తత మొదలైన అంశాల్లో అన్ని మతాల వారి మధ్య సమానత్వం గురించి మోదీ మాట్లాడుతున్నారు. ఒక ప్రధానమంత్రిగా ఆయన ఈ దేశంలో సామాజిక, ఆర్థిక, లైంగిక, చట్టపరమైన అసమానతలపై మాట్లాడవలసి ఉన్నది. అయినా ఆయన ప్రాధాన్యాలు, ఆశిస్తున్న ప్రయోజనాలు వేరు.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2023-07-05T02:33:16+05:30 IST