‘మోదీ భయం’ తగ్గిపోతోందా?

ABN , First Publish Date - 2023-07-12T00:50:25+05:30 IST

ఒకప్పుడు నరేంద్రమోదీ ఉపన్యాసాలు జనాన్ని ఉర్రూతలూగించేవి. పార్లమెంట్‌లో మాట్లాడినా, బహిరంగ సభల్లో మాట్లాడినా ఆయన ఉపన్యాసాలకు జనం విపరీతమైన భావోద్వేగాలకు...

‘మోదీ భయం’ తగ్గిపోతోందా?

ఒకప్పుడు నరేంద్రమోదీ ఉపన్యాసాలు జనాన్ని ఉర్రూతలూగించేవి. పార్లమెంట్‌లో మాట్లాడినా, బహిరంగ సభల్లో మాట్లాడినా ఆయన ఉపన్యాసాలకు జనం విపరీతమైన భావోద్వేగాలకు గురయ్యేవారు. గుజరాత్ ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున ఆయన సభలకు రావడం కోసం ఎదురు చూసేవారు. బీజేపీ జాతీయ అధ్యక్షులైనా, ఢిల్లీ నుంచి వచ్చిన ఏ బడా నేత అయినా గుజరాత్‌లో మోదీ ముందు దిగదుడుపే అన్నట్లుండేవారు. వారు సభలో మాట్లాడిన తర్వాతే మోదీ సభావేదికపై ప్రవేశించి జనం కరతాళ ధ్వనుల మధ్య రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేసేవారు. ఆయన మాట్లాడిన తర్వాత జనం మరెవరి ప్రసంగాలను వినకుండా ఇళ్లకు వెళ్లిపోయేవారు. ఇదే ప్రాభవాన్ని ఆయన జాతీయ రాజకీయాల్లో నిన్నమొన్నటి వరకూ ప్రదర్శించారు. లాల్ కృష్ణ ఆడ్వాణీ రథయాత్ర ద్వారా బీజేపీ ప్రజా బలాన్ని విస్తరిస్తే మోదీ ఉపన్యాసాల ద్వారా జనాన్ని ఆకర్షించేవారు. బహుశా ఇప్పుడు ఎందుకో ఆయన ఉపన్యాసాలు రొటీన్‌గా, సాదాసీదాగా అనిపిస్తున్నాయి. ప్రత్యర్థులపై ఆయన ఎంత తీవ్రమైన ఆరోపణలు చేసినా వాటిని జనం అంత పట్టించుకోనట్లు కనిపిస్తోంది.

రాజకీయ నాయకుల మాటల్లో, చేతల్లో నిజాయితీ లేకపోతే వారి విలువ కూడా ఇదే రకంగా ప్రశ్నార్థకం అవుతుందనడంలో సందేహం లేదు. ఒకప్పుడు ఆకాశమంత ఎత్తున ఎదిగిన నేత కూడా మాట్లాడిందే మాట్లాడుతూ, తన మాటలను తానే తిప్పిగొడుతూ, ఇతరుల తప్పులను విమర్శిస్తూ తాను కూడా అదే తప్పులు చేస్తున్నప్పుడు అతడు ప్రజల దృష్టిలో కుదించుకుపోక తప్పదు. పైగా ఎవరిపైన అయినా తాను విమర్శలు సంధిస్తున్నప్పుడు ఆ విమర్శలు హృదయంలోంచి రావడం లేదని జనం గ్రహించడం మొదలు పెడితే ఆ ఉపన్యాసం వారికి పేలవంగా కనిపిస్తుంది. ఎన్ని హావభావాలు ప్రదర్శించినా అవి నాటకీయంగా కనిపిస్తాయి. గత వారం ప్రధానమంత్రి తెలంగాణ బహిరంగ సభలో ప్రసంగిస్తూ కేసీఆర్ ప్రభుత్వాన్ని అత్యంత అవినీతి ప్రభుత్వంగా అభివర్ణించారు. ఆ వెంటనే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ స్పందిస్తూ మేఘాలయలో కాన్రాడ్ సంగ్మాను, మహారాష్ట్రలో అజిత్ పవార్‌ను కూడా అవినీతిపరులుగా అభివర్ణించిన బీజేపీ ఆ తర్వాత కొద్దిరోజుల్లోనే వారి భాగస్వామ్యంతో ప్రభుత్వాలను ఏర్పర్చిన విషయాన్ని ప్రశ్నించారు. విచిత్రమేమంటే కేసిఆర్‌పై మోదీ చేస్తున్న విమర్శలు తమకే ఆత్మవిశ్వాసం కలిగించడం లేదని రాష్ట్ర బీజేపీ నేతలే అంటున్నారు. గత ఏడాది హైదరాబాద్‌లో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో బీజేపీలో కనపడినంత ఊపు క్రమక్రమంగా తగ్గిపోవడానికి ప్రధాన కారణం ఆ ఊపును ఒక నిర్మాణంగా మార్చుకునేందుకు, బీజేపీలో చేరిన నేతలకూ, పార్టీ అధ్యక్షుడికీ మధ్య సయోధ్యను ఏర్పర్చేందుకు, పార్టీ అధ్యక్షుడిని సరైన దారిలో నడిపించేందుకు కేంద్ర నేతలు అవసరమైనంత వేగంగా చర్యలు తీసుకోకపోవడమే అని ఎవరికైనా అర్థమవుతుంది. ఇప్పుడు అధ్యక్షుడిని మార్చినంత మాత్రాన కోల్పోయిన ఊపును సంపాదించడం సాధ్యమవుతుందా, ఉద్దేశపూర్వకంగానే నాయకత్వం తమ కార్యకర్తల పోరాట స్ఫూర్తిని తానే నీరు కార్చిందా అన్న ప్రశ్నలు ఆ పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతున్నాయి.

జగన్ విషయంలో కూడా బీజేపీ అధిష్ఠానం అదే విధంగా వ్యవహరిస్తోంది. కేంద్రం పంపిస్తున్న డబ్బుల్ని జగన్ ప్రభుత్వం లూటీ చేస్తోందని జూన్ 11న విశాఖపట్టణంలో తీవ్రంగా విమర్శించిన అమిత్ షా ఆ తర్వాత కొద్ది రోజులకే జగన్‌కు ఢిల్లీలో అపాయింట్‌మెంట్ ఇచ్చి గంటకు పైగా మాట్లాడారు. ఆ తర్వాత మోదీ కూడా మరో గంట ఆయనకు సమయం కేటాయించారు. గత నాలుగేళ్లుగా జగన్ ప్రభుత్వానికి పూర్తి అండదండలిస్తూ, గతంలో విడుదల చేయని నిధులను కూడా విడుదల చేస్తూ, తమ కార్పొరేట్ స్నేహితులను జగన్ మచ్చిక చేసుకునేలా చేస్తూ, ఆయనకు సంబంధించిన కేసుల విషయంలో ఉదాసీనంగా ఉంటూ, ఏజెన్సీల చర్యల విషయంలో కూడా జోక్యం చేసుకుంటూ ఉన్నప్పుడు ఏపీలో బీజేపీ నిలదొక్కుకుంటుందని ఆ పార్టీ నేతలు ఎలా అనుకోగలరు? అసలు నాలుగేళ్లుగా ఏపీలో బీజేపీ కనీస ప్రతిపక్షంగానైనా వ్యవహరించిందా? సోషల్ మీడియాలో, పత్రికల్లో కనపడే నేతల హడావిడే కాని, తమకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని, ప్రజల్లోకి వెళ్లి నిర్మాణాత్మక విమర్శలు చేస్తూ బలోపేతం కావాలని బీజేపీ అధిష్ఠానం ఏనాడైనా భావించిందా? ఎన్నికలు కొద్ది నెలలు ఉండగా ఇప్పుడు పార్టీ నాయకత్వాన్ని మార్చడం ద్వారా ఫలితం ఏమైనా ఉంటుందా?

నిజానికి జాతీయ స్థాయిలో రెండుసార్లు భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత దక్షిణాదిలో కూడా బీజేపీ తన కాషాయ ధ్వజాన్ని రెపరెపలాడిస్తుందని అనేకమంది భావించారు. కాని కర్ణాటకలో చేసిన అనేక ఘోర తప్పిదాల మూలంగా ఉన్న అధికారం కోల్పోగా, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ స్థానిక నేతలకు తగిన దిశానిర్దేశం చేయలేకపోయారు. కర్ణాటకలో అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పటికీ కాంగ్రెస్‌ను ఎదుర్కోవడానికి శాసన సభా పార్టీ నేతను నియమించలేని దుస్థితిలో బీజేపీ పడింది. గత్యంతరం లేక యడ్యూరప్పను ఢిల్లీ పిలిపించుకుని ఆయన సలహా ప్రకారం బొమ్మయిని శాసన సభా నేతగా నియమించవలిసి వచ్చింది. బహుశా ఆయన డిమాండ్ మేరకు ఆయన కుమారుల్లో ఒకరిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా, లేక మరొకరిని కేంద్రమంత్రిగా నియమించాల్సి వస్తుందేమో? కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత రాజస్థాన్‌లో వసుంధరా రాజేకు వ్యతిరేకంగా ఏమైనా చేయడానికి బీజేపీ నాయకత్వం వెనుకాడుతోందని అంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లో యోగీ ఆదిత్యనాథ్ రాష్ట్ర రాజకీయాలపై తన పట్టు బిగించడమే కాక, జాతీయ స్థాయిలో ప్రచారానికి ఉవ్విళ్లూరుతున్నారు. కాంగ్రెస్ మాదిరే పలు రాష్ట్రాల్లో బీజేపీకి తిరుగుబాటు అభ్యర్థుల బెడద పెరుగుతోందని చెప్పడానికి గత ఏడాది జరిగిన హిమాచల్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలే నిదర్శనం.

ఈ నేపథ్యంలో వచ్చే వారం జరిగే రెండు ప్రధాన కూటముల సమావేశాలు దేశంలో భావి రాజకీయ పోరాట స్థితిగతుల గురించి ఒక అంచనాకు వచ్చేందుకు తోడ్పడనున్నాయి. జూలై రెండో వారంలో కాంగ్రెస్, ప్రతిపక్షాలు బెంగళూరులో సమావేశమైతే మూడో వారంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల సమావేశం జరుగనుంది. దేశంలో రెండు మూడు ప్రాంతీయ పార్టీలు తప్ప ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధపడడం, వీరిలో నాలుగైదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు మాజీ ముఖ్యమంత్రులు కూడా ఉండడం చెప్పుకోదగ్గ విషయం. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల్లో శివసేన, అకాలీదళ్ మరికొన్ని చిన్నా చితక పార్టీలు తప్ప బీజేపీతో మనస్ఫూర్తిగా చేతులు కలిపే పార్టీలు లేవనే చెప్పాలి. ఏమైనా దేశంలో రాజకీయ శక్తులు ఏఏ దిశన వెళతాయో ఒక స్పష్టత ఏర్పడేందుకు ఈ సమావేశాలు ఆస్కారం కలిపిస్తాయి. ప్రస్తుతం బీజేపీతో అంటకాగుతున్న పార్టీలు, లేదా అవసరార్థం దాసోహమన్న పార్టీలు కూడా ఎన్నికల తర్వాత ఫలితాలను బట్టి తమ వైఖరిని మార్చుకుంటాయనడంలో సందేహం లేదు.

దేశ రాజకీయ వాతావరణంపై మోదీ ప్రభావం గురించి చర్చ జరుగుతున్న సమయంలోనే ఈడీ డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా సర్వీసును మాటిమాటికీ పొడిగించడాన్ని చట్ట వ్యతిరేకంగా పేర్కొంటూ సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది. జూలై 31లోపు మిశ్రా ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆదేశించింది. ఇది మోదీ ప్రభుత్వానికి గట్టి విఘాతం తగిలినట్లయింది. 2018 అక్టోబర్‌లో మూడు నెలలకోసమని నియమించిన సంజయ్ కుమార్‌ను పూర్తి స్థాయి ఈడీ ఛీప్‌గా నియమించడమే కాక ఆ తర్వాత మూడుసార్లు పొడిగించారు. అతడికి పొడిగింపు నీయవద్దని సుప్రీంకోర్టు 2021లో చెప్పినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. సంజయ్ కుమార్ హయాంలో దేశంలో అనేకమంది ప్రతిపక్ష నాయకులపై కేసులు నమోదు చేయడం మోదీ రాజకీయ వ్యూహానికి తోడ్పడింది. సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేసిన రాజకీయనాయకుల్లో 90శాతం ప్రతిపక్ష నేతలే కావడం ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం అస్సాం ముఖ్యమంత్రిగా ఉన్న హిమంత బిశ్వా శర్మపై 2014, 2015లో శారదా చిట్ ఫండ్ కుంభకోణం క్రింద సీబీఐ, ఈడీలు దర్యాప్తు ప్రారంభించాయి. ఆయన బీజేపీలో చేరిన తర్వాత ఆ దర్యాప్తు ఊసే లేదు. ఏక్‌నాథ్ షిండే నుంచి అజిత్ పవార్ వరకు బీజేపీతో చేతులు కలిపేందుకు కారణం ఈడీయే. మోదీ చేతుల్లో ఈడీ ఒక పావుగా మారిందని అందరూ భావిస్తున్న తరుణంలో సంజయ్ కుమార్ మిశ్రా పొడిగింపు తప్పని సుప్రీంకోర్టు ప్రశ్నించడం కీలక పరిణామం.

అంతేకాక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈడీ, సీబీఐలు తమను ఏమో చేస్తాయని, మోదీతో చేతులు కలపకపోతే ఏదో రకంగా తమకు రాజకీయంగా నష్టం కలిగిస్తారని భయపడే పరిస్థితి కూడా రోజురోజుకూ తగ్గిపోతుందనడంలో సందేహం లేదు. ‘ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇప్పుడు మోదీని చూసి భయపడి, ఆయనతో చేతులు కలిపితే రాజకీయంగా నష్టపోయినట్లే. ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉన్నప్పుడు ఎవరూ ఓటర్లను, అధికార యంత్రాంగాన్ని ప్రభావితం చేయలేరు. కర్ణాటకలో కేంద్ర, రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నా ఏమైనా చేయగలిగిందా? మోదీ ఆ రాష్ట్రంలో రోజుల తరబడి గడుపుతూ గల్లీ గల్లీ తిరిగినా ఏమైనా చేయగలిగారా?’ అని ఒక ప్రాంతీయ పార్టీ నేత ప్రశ్నించారు. మోదీ ప్రభావం, భయం రెండూ తగ్గిపోయే క్రమం ప్రారంభం కావడం భావి రాజకీయ పరిణామాలకు సంకేతం అని చెప్పక తప్పదు.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2023-07-12T00:50:25+05:30 IST