ఇందిర తరహాలో మోదీ చాణక్యం!

ABN , First Publish Date - 2023-10-04T01:36:33+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ సుడిగాలిలా తిరుగుతూ పలు బహిరంగ సభల్లో పాల్గొంటున్నారంటే ఆయన పర్యటిస్తున్న రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరుగనున్నాయని అర్థం. ఎన్నికల షెడ్యూలు ఎప్పుడు...

ఇందిర తరహాలో మోదీ చాణక్యం!

ప్రధానమంత్రి నరేంద్రమోదీ సుడిగాలిలా తిరుగుతూ పలు బహిరంగ సభల్లో పాల్గొంటున్నారంటే ఆయన పర్యటిస్తున్న రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరుగనున్నాయని అర్థం. ఎన్నికల షెడ్యూలు ఎప్పుడు ప్రకటిస్తారో మోదీకి ముందుగానే తెలుసు కనుక వివిధ మంత్రిత్వ శాఖలన్నీ ఫైళ్లలోంచి పథకాలను తీసి ఆయన ముందుకు పంపిస్తాయి. కొన్ని లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ఆయన ప్రకటించనున్నారనే అభిప్రాయాన్ని ప్రజల్లో ఏర్పర్చేందుకు అధికార వర్గాలు ప్రయత్నిస్తాయి. అసలు రాష్ట్రాలకు చెందిన ఏ పథకాలు, ప్రాజెక్టులనైనా ఎన్నికల ముందే ఎందుకు ప్రకటించాలి? రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, ఎక్స్‌ప్రెస్ వేలు, గ్యాస్‌పైప్ లైన్లు ఆయా శాఖలకు చెందిన కేంద్ర మంత్రులు ఎందుకు ప్రారంభించకూడదు? తెలంగాణకు పసుపుబోర్డు, గిరిజన యూనివర్సిటీని ప్రకటించారు. మంచిదే. అయితే వాటి కోసం ప్రజలు ఎన్నికలు సమీపించేంత వరకూ ఎదురు చూడాలా?

వచ్చే వారం అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించబోతున్నందువల్ల ఆయా రాష్ట్రాల్లో మోదీ విశ్వరూపాన్ని ప్రజలు మాటిమాటికీ దర్శించబోతున్నారు. ఈ అయిదు రాష్ట్రాల్లో ప్రధానంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికలను మోదీ ఈ సారి గతంలో ఎన్నడూ లేని రీతిలో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు అర్థమవుతోంది. ఆ కీలక ఉత్తరాది రాష్ట్రాల్లో స్థానిక నాయకత్వాలను పక్కనపెట్టి మోదీ, అమిత్ షా, నడ్డాల త్రయం ఎన్నికల నిర్వహణను, ప్రచారాన్ని పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. ఎవరెవరికి సీట్లు ఇస్తున్నారో, ఎప్పుడు ప్రకటిస్తారో ఎవరికీ తెలియదు. తమ నాయకుడెవరో ఆ రాష్ట్రాల్లోని స్థానిక నేతలకు అర్థం కావడం లేదు. అనూహ్యంగా కేంద్రమంత్రులు, పార్లమెంట్ సభ్యులతో పాటు మొత్తం సీనియర్ నాయకులను అభ్యర్థులుగా రంగంలోకి దించడంతో ప్రతి ఒక్కరూ తామే నాయకులమన్నట్లుగా భ్రమిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కే సీటు దక్కే పరిస్థితి లేకుండా పోయింది. రాజస్థాన్‌లో వసుంధరా రాజేను, ఛత్తీస్‌గఢ్‌లో రమణ్ సింగ్‌ను ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థులుగా ప్రకటించేందుకు అధిష్ఠానం సుముఖంగా లేదు. ఈ కేంద్రీకృత వ్యూహం ద్వారానే కాంగ్రెస్‌ను తిప్పికొట్టడం సాధ్యమవుతుందని మోదీ భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణను రాష్ట్ర నేతలు ఎవరికీ వదిలిపెట్టేందుకు నరేంద్ర మోదీ, అమిత్ షాలు సిద్ధంగా లేరు. ప్రస్తావిత మూడు ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ– కాంగ్రెస్ మధ్య ముఖాముఖి పోటీ నడుస్తోంది. కాంగ్రెస్ గెలిస్తే దేశ వ్యాప్తంగా ఆ పార్టీ బలోపేతం కావడానికి వీలవుతుంది. ఆ తర్వాత ‘ఇండియా’ కూటమి కూడా తప్పక పుంజుకుంటుంది. అందువల్లనే సెమిఫైనల్‌లోనే కాంగ్రెస్‌ను దెబ్బతీయాలనే ఉద్దేశంతో మోదీ ముందుకు సాగుతున్నట్లు కనపడుతోంది. ఈ రకంగా దెబ్బతిస్తే దేశమంతటా ‘ఇండియా’ కూటమి మనోబలాన్ని దెబ్బతీసినట్లు అవుతుందని బీజేపీ అగ్రనాయకులు భావిస్తున్నారు.

స్థానిక నాయకత్వాలను కాదని, పార్టీ అధిష్ఠానమే ఎన్నికల నిర్వహణను పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకుంటే విజయం సాధ్యమా అన్న చర్చ కూడా జరుగుతోంది. కర్ణాటకలో యడ్యూరప్పను, ఆయన కుటుంబాన్ని పక్కన పెట్టి, మొత్తం మోదీయే పూర్తిగా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కారణంగానే స్థానిక నేతలు మనస్ఫూర్తిగా ఎన్నికల నిర్వహణలో పాల్గొనలేకపోయారు. దీనివల్ల కర్ణాటకలో బీజేపీ దెబ్బతిన్నది. ఇటువంటి చేదు అనుభవం తర్వాత కూడా మోదీ, షాలు అదే ప్రయోగాన్ని మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో అవలంబిస్తున్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలను మధ్యప్రదేశ్‌లో అమలు చేసి పార్టీపై పట్టు బిగించిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌కు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బొమ్మై పరిస్థితి ఏర్పడింది. ఆయనకు పోటీగా ఢిల్లీ నుంచి నరేంద్ర సింగ్ తోమర్ , ప్రహ్లాద్ పటేల్, ఫగ్గన్ సింగ్ కులస్తే, కైలాశ్ విజయ్ వర్గీయ వంటి నేతలను రంగంలోకి దించింది.


రాజస్థాన్‌లో వసుంధరా రాజేను మించిన బలమైన నేత మరొకరు లేరు. అయినప్పటికీ ఆమెను రాజస్థాన్ నుంచి తప్పించేందుకు మోదీ చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. గతంలో వెంకయ్యనాయుడును రాజకీయాలనుంచి తప్పించిన మాదిరి వసుంధరా రాజేకు కూడా ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వజూపారు కాని ఆమె అందుకు ససేమిరా అన్నారు. దాంతో రాజస్థాన్ రాష్ట్ర రాజకీయాల్లో ఆమెను కొనసాగించక తప్పలేదు. అయినప్పటికీ వసుంధరా రాజేను ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థిగా ప్రకటించలేదు. సరికదా అభ్యర్థుల ఎంపిక విషయంలో సైతం ఆమెను సంప్రదించడం లేదు. స్పీకర్ ఓం బిర్లా, కేంద్రమంత్రులు గజేంద్ర సింగ్ షెఖావత్, అర్జున్ రాం మేఘ్వాల్, రాజ్‌వర్ధన్ సింగ్ రాథోడ్, సిపి జోషీ వంటి నేతలను రంగంలోకి దించి వసుంధర ప్రాధాన్యతను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. అధిష్టానంతో అమీ తుమీ తేల్చుకునేందుకు ఆమె సిద్ధమవుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న రమణ్‌సింగ్‌ను కూడా పూర్తిగా పక్కన పెట్టారు.

‘ప్రతి బీజేపీ కార్యకర్తా తమ గుర్తింపు కమలం ద్వారానే వచ్చిందని గ్రహించాలి.. కమలం కోసమే వారు పనిచేయాలి’ అని మోదీ జైపూర్ ర్యాలీలో ప్రకటించి పార్టీకి వ్యక్తులు ముఖ్యం కాదని ప్రకటించారు. వ్యక్తులు ముఖ్యం కాదని అన్నప్పుడు మోదీ, మోదీ అన్న నినాదాల్ని, తన ఆరాధనను ఆయన ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? రాష్ట్రాల నేతలు పార్టీని గెలిపించలేరని, తాను ఒక్కరే పార్టీని గెలిపించగలనని ఆయన భావిస్తున్నారా? మోదీ ఆకర్షణ ఈ రాష్ట్రాల్లో ఎంతవరకు పనిచేస్తుంది? గుజరాత్‌లో ముఖ్యమంత్రి పదవికి అంత ప్రాధాన్యత లేదు. మోదీ ఎవర్ని కావాలంటే వారిని ముఖ్యమంత్రిగా నియమించి ఢిల్లీ నుంచి గుజరాత్ రాజకీయాలను, పార్టీని నిర్వహించగలరు. అయితే ఇతర రాష్ట్రాల్లో కూడా గుజరాత్ మాదిరి ఢిల్లీ నుంచి పెత్తనం నిర్వహించడం సాధ్యమవుతుందా? పూర్తిగా కేంద్ర నాయకత్వం క్రింద రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా స్థానిక కార్యకర్తలు పనిచేయడం సాధ్యమవుతుందా?

ఏమైనా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఇందిరాగాంధీ తరహా రాజకీయాలను అవలంబించేందుకు మోదీ నిర్ణయించారని అర్థమవుతోంది. కేంద్రంలో ఉన్న నాయకులు అందరినీ రాష్ట్రాలకు పంపించి వారిని సమష్టిగా విజయంకోసం పనిచేయాలని నిర్దేశించి, ఎవరికీ ప్రాముఖ్యత లేకుండా చేసి మొత్తం ప్రచారంలో తానే వీరవిహారం చేయడం ద్వారా ఈ అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించాలనేది ఆయన వ్యూహం. ఈ ప్రయోగం విజయవంతమైతే ఇక మోదీ ధాటికి ఎదురుండదు. డమ్మీ నాయకులు మినహా నిజమైన నేతలెవరూ రాష్ట్రాలలో మనకు పెద్దగా కనపడరు. ఉత్తరప్రదేశ్‌లో యోగీ ఆదిత్యనాథ్ నాయకత్వంపై కూడా మోదీ కన్నుపడే అవకాశాలున్నాయి. మరి ఈ ప్రయోగం విఫలమయితే?! లోక్‌సభ ఎన్నికలకు మరో వ్యూహాన్ని మోదీ అవలంబించే అవకాశాలున్నాయి.

విచిత్రమేమంటే దక్షిణాదిలో మోదీ వ్యూహం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. తెలంగాణలో పోటీని ప్రధానంగా బిఆర్ఎస్‌కు, కాంగ్రెస్‌కే వదిలేయాలని ఆయన ఉద్దేశపూర్వకంగా నిర్ణయించుకున్నట్లు గత కొద్ది నెలలుగా పార్టీ అవలంబిస్తున్న విధానాన్ని బట్టి అర్థమవుతోంది. పని గట్టుకుని తెలంగాణలో బీజేపీని బలహీనం చేయడం వెనుక మోదీ ఆంతర్యమేమిటో పార్టీ నేతలకే అర్థం కాలేదు. ఎంతో కొంత సమర్థంగా పనిచేస్తున్న బండి సంజయ్‌ను పక్కన పెట్టిన తర్వాత తెలంగాణలో బీజేపీ భవిష్యత్ అంధకార బంధురమైందని, ప్రధాని సభకే కొందరు హాజరు కాని పరిస్థితి ఏర్పడిందని నాయకులు భావిస్తున్నారు.


తెలంగాణలో మాత్రమే కాదు, మొత్తం దక్షిణాదిన బీజేపీ ఆత్మహత్యా సదృశమైన నిర్ణయాలను తీసుకుంటోంది. కర్ణాటకలో ఓటమి పాలయినప్పటినుంచీ బీజేపీ అధిష్ఠానం ఆ రాష్ట్రాన్ని గాలికి వదిలేసినట్లు కనపడుతోంది. అసెంబ్లీలో కాంగ్రెస్‌ను గట్టిగా ఢీకొనే శాసన సభా పార్టీ నాయకుడిని కూడా ఇంతవరకూ నియమించలేదు. బీజేపీ నేతలు పలువురు కాంగ్రెస్‌లో చేరేందుకు తహతహలాడుతున్నారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన నేతలను తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తమిళనాడులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై చేసిన వ్యాఖ్యల వల్ల చిరకాల మిత్రపక్షమైన అన్నాడిఎంకే ఎన్డీఏతో తెగతెంపులు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఒకనాడు బీజేపీకి ఎంతో కొంత ఊపిరి పోసింది తెలుగుదేశం పార్టీయేననడంలో సందేహం లేదు. అయినప్పటికీ ఇప్పుడు తనకు ఏ ఊపిరి లేకపోయినా ఫర్వాలేదన్నట్లు ప్రస్తుతం బీజేపీ వ్యవహరిస్తోంది.

ఈ పరిస్థితుల్లో ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో మోదీ వ్యూహం ఫలించకపోతే లోక్‌సభ ఎన్నికల్లో ఆ వైఫల్య ప్రభావం ఎంతో కొంత ఉండక తప్పదు. గతంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటకలో బీజేపీ అత్యధిక స్థానాలు సాధించడం వల్ల ఆ పార్టీ లోక్‌సభలో గణనీయమైన మెజారిటీని పొందగలిగింది. మోదీ అవలంబిస్తున్న రాజకీయాల వల్ల 2024లో అవే ఫలితాలు సాధించడం సాధ్యమవుతుందా? మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ఫలితాలు ప్రతికూలంగా ఉంటే అవి ‘ఇండియా’ కూటమికి నైతికంగా బలం చేకూర్చినట్లవుతుంది. ఇది సార్వత్రక ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలు బీజేపీ పట్ల అవలంభించే వైఖరిపై కూడా తప్పక ప్రభావం చూపుతుంది. సార్వత్రక ఎన్నికల్లో మెజారిటీ రాకపోయినా కొన్ని ప్రాంతీయ పార్టీలు తమను కాపాడతాయని ప్రస్తుత నాయకత్వం భావిస్తే అంతకంటే అమాయకత్వం మరొకటుండదు. పైగా పైకి మౌనంగా ఉన్న బీజేపీ ఇతర నేతలు కూడా నోరు విప్పేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. ఏది ఏమైనా మోదీ, అమిత్ షాలు పార్టీ భవిష్యత్ విషయంలో విపత్కరకరమైన ప్రయోగాలు చేస్తున్నారనడంలో సందేహం లేదు. ఈ ప్రయోగాలు వారి భవిష్యత్తునే కాక దేశ భవిష్యత్తును కూడా నిర్దేశించడం ఖాయం.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2023-10-04T01:36:39+05:30 IST