Share News

బీజేపీలో జాతీయ నాయకులు ఇద్దరేనా?

ABN , First Publish Date - 2023-10-25T02:25:41+05:30 IST

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పోటీలో నిలదొక్కుకునే పరిస్థితి లేదని, కనీసం రెండంకెలయినా సాధిస్తుందో లేదో అని వార్తాకథనాలు, సర్వేలు వెలువడుతున్న తరుణంలో ఇతర పార్టీల్లోంచి ఆ పార్టీలో చేరిన నేతల్లో తీవ్ర కలవరం...

బీజేపీలో జాతీయ నాయకులు ఇద్దరేనా?

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పోటీలో నిలదొక్కుకునే పరిస్థితి లేదని, కనీసం రెండంకెలయినా సాధిస్తుందో లేదో అని వార్తాకథనాలు, సర్వేలు వెలువడుతున్న తరుణంలో ఇతర పార్టీల్లోంచి ఆ పార్టీలో చేరిన నేతల్లో తీవ్ర కలవరం మొదలైంది. ముఖ్యంగా తమ భవిష్యత్ విషయంలో వారు డోలాయమాన స్థితిలోపడ్డారు. కొద్ది నెలల క్రితం ఇదే పరిస్థితి కాంగ్రెస్లో నెలకొని ఉండేది. రెండు రోజుల క్రితం ఇలాంటి వారిలో ఒకరు ఫోన్ చేసి ‘బిజెపి గెలిచే పరిస్థితి కనపడడం లేదు. కాంగ్రెస్ నుంచి సునీల్ కనుగోలు, కేసి వేణుగోపాల్ నాతో మాట్లాడుతున్నారు. నా మిత్రులు, శ్రేయోభిలాషులు, అనుయాయులంతా కాంగ్రెస్ లో చేరమని, బిజెపికైతే తాము ఓటు వేసే అవకాశం లేదని చెబుతున్నారు. ఏం చేయమంటారు?’ అని అడిగారు. ‘మీ స్వజనం ఏది చెబితే అది చేయండి. నేనేం చెప్పగలను?’అన్నాను. మళ్లీ మంగళవారం పొద్దున్నే ఫోన్ చేసి ‘బిజెపి జాతీయ పార్టీ కదా.. ఒక వేళ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిస్తే రాష్ట్ర మంత్రిపదవి మాత్రమే వస్తుంది. బిజెపిలో అయితే జాతీయ స్థాయి నాయకుడినవుతాను కదా.. కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలున్నాయి. భవిష్యత్ అద్భుతంగా ఉండదా.. ’అని అడిగారు. నేను ఒక్క క్షణం ఆలోచించి ‘బిజెపిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్ షా తప్ప జాతీయ నాయకుడు ఎవరైనా ఉన్నారా? అసలు ఇప్పుడున్న కేంద్రమంత్రులకు కానీ, రాష్ట్ర స్థాయిలో బలమైన నేతలకు గానీ గుర్తింపు ఏమైనా ఉన్నదా?’ అని అడిగాను. ‘మీరన్నది నిజమే. ఆలోచించుకోవాల్సిన విషయమే’ అని ఆ నేత ఫోన్ పెట్టేశారు.

భారతీయ జనతా పార్టీ లాల్ కృష్ణ ఆడ్వాణీ పార్టీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు పార్టీని నిర్మించే క్రమంలో రాష్ట్రాల స్థాయిలో బలమైన నేతలను తయారు చేశారు.ఆయనకు రాష్ట్రాల్లో ముఖ్యమైన నేతలందరి పేర్లూ తెలిసేవి. వారితో ఆయన స్వయంగా మాట్లాడేవారు. బిజెపి పాత తరంలో నానాజీ దేశ్ ముఖ్, జగదీశ్ ప్రసాద్ మాథుర్, సుందర్ సింగ్ భండారీ,కృష్ణ లాల్ శర్మ,భైరాన్ సింగ్ షెఖావత్, కుశాభావు థాక్రే, సికిందర్ భక్త్, జానా కృష్ణమూర్తి,కె.ఆర్ మల్కానీ, కేదార్ నాథ్ సహానీ,కైలాశ్ పతి మిశ్రా,మురళీ మనోహర్ జోషి, జస్వంత్ సింగ్, వేద్ ప్రకాశ్ గోయల్,కేశు భాయి పటేల్,మదన్ లాల్ ఖురానా, విజయ్ కుమార్ మల్హోత్రా, సుందర్ లాల్ పట్వా, కైలాశ్ జోషి,శాంతా కుమార్,సూరజ్ భాను, అప్నా ఘటాటే తదితరులు ఉండేవారు. వాజపేయి, అడ్వాణీ తన తరం నేతల పట్ల ఎంతో గౌరవంతో వ్యవహరించేవారు. మంత్రివర్గంలోనూ,ఇతర పదవుల విషయంలోను వారికి తగిన స్థానం కల్పించేవారు. అదే సమయంలో యువ నేతల విషయంలో ఎలాంటి కొరతా లేకుండా చూసుకునేవారు. వెంకయ్యనాయుడు, సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ, నరేంద్రమోదీ, ప్రమోద్ మహాజన్, రాజ్ నాథ్ సింగ్, సంజయ్ జోషి, ఉమాభారతి, బండారు దత్తాత్రేయ, చెన్నమనేని విద్యాసాగర రావు, ప్రేమ్ కుమార్ ధూమల్, బిఎస్ యడ్యూరప్ప, గోపీనాథ్ ముండే, నితిన్ గడ్కరి, వసుంధరా రాజే, డా. రామన్ సింగ్, అనంత్ కుమార్, సుశీల్ కుమార్ మోడీ, శివరాజ్ సింగ్ చౌహాన్, రవిశంకర్ ప్రసాద్, మనోహర్ పరిక్కర్, షానవాజ్ హుస్సేన్, ప్రకాశ్ జవదేకర్, అనంత్ కుమార్, ధర్మేంద్ర ప్రదాన్ లు ఎందరినో అడ్వాణీయే వెన్ను తట్టి ప్రోత్సహించారు. రాజకీయేతర, బిజెపియేతర నేపథ్యం ఉన్న జగ్ మోహన్, అరుణ్ శౌరి, యశ్వంత్ సిన్హా, నజ్మాహెప్తుల్లా, జార్జి ఫెర్నాండెజ్ లాంటి వారిని బిజెపి వైపు ఆకర్షితులు చేసింది కూడా ఆడ్వాణీ, వాజపేయిలే. ‘పార్టీలో యువరక్తం పట్ల నాకెంతో విశ్వాసం ఉంది. వాజపేయి తర్వాత ఎవరు? ఆడ్వాణీ తర్వాత ఎవరు? అన్న ప్రశ్న ఎప్పుడూ తలెత్తదు. కాంగ్రెస్ పార్టీలో అయితే ఉన్నత స్థానం వారసుడికోసం శాశ్వతంగా రిజర్వు అయి ఉంటుంది. బిజెపి అలాంటిది కాదు. సాధారణ కార్యకర్తకు కూడా ఉన్నత స్థాయికి ఎదిగి,అంకిత భావం, సామర్థ్యం, సేవాచరిత్ర ద్వారా నాయకత్వ బాధ్యతలు చేపట్టే అవకాశం మా పార్టీ కల్పిస్తుంది. బిజెపిలో ఉన్నందుకు నేను గర్వపడేకారణాల్లో ఇది కూడా ఒకటి..’ అని ఆడ్వాణీ తన ఆత్మకథ ‘నా దేశం- నా జీవితం’లో పేర్కొన్నారు.


ఇవాళ బిజెపి పాతతరంలో చాలా మంది దివంగతులయ్యారు. ఆడ్వాణీ, మురళీ మనోహర్ జోషి వంటి ఒకరిద్దరు నేతలు మిగిలిపోయారు. వారినెవరూ పట్టించుకోవడం లేదు. ఆడ్వాణీ ప్రోత్సహించిన తరంలో కూడా చాలా మంది కీర్తి శేషులయ్యారు. మిగిలిన వారిని నరేంద్రమోదీ క్రమంగా ప్రక్కన పెడుతున్నారు. వెంకయ్యనాయుడును ఒక టర్మ్ ఉపరాష్ట్రపతి పదవిలో నియమించి గౌరవంగా రాజకీయాల నుంచి తప్పించారు. నితిన్ గడ్కరి, శివరాజ్ సింగ్ చౌహాన్ లను బిజెపి పార్లమెంటరీ బోర్డు నుంచి పక్కన పెట్టారు. గడ్కరికి మూడు మంత్రిత్వ శాఖలుంటే తీసేసి ఒక మంత్రిత్వశాఖకు పరిమితం చేశారు. రెండు దశాబ్దాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న శివరాజ్ సింగ్ చౌహన్ ను, రాజస్థాన్ లో బలమైన నేతగా ఉన్న వసుంధరా రాజే, ఛత్తీస్ గఢ్ లో రమణ్ సింగ్ ను పక్కన పెట్టారు. కర్ణాటక లో యడ్యూరప్పను బలవంతంగా తప్పించారు. ఉమాభారతి, సంజయ్ జోషి తదితరులు ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. మోదీ మొదటి మంత్రివర్గంలో మంత్రులుగా ఉన్న రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్ తర్వాత ఉద్వాసనకు గురై ప్రస్తుతం మోదీ,షాల మనసు చూరగొనేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఉత్తర ప్రదేశ్ రాజకీయాల వల్ల రాజ్ నాథ్ సింగ్, ఒడిషాలో మరో నేత లేక ధర్మేంద్ర ప్రధాన్ ను కొనసాగిస్తున్నారు. ఆడ్వాణీ ప్రోత్సహించిన వారి జాబితాలో అమిత్ షా లేరు. ఇప్పుడు మోదీ, అమిత్ షాలు తప్ప జాతీయ స్థాయిలో మరో నేత కనిపించడం లేదు.

గుజరాత్ లో నరేంద్రమోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ జాతీయ స్థాయి నేతా ప్రచారానికి రానవసరం లేదని చెప్పేవారు. వచ్చినా వారికి అక్కడ గుర్తింపు ఉండేది కాదు. పోస్టర్లలోనూ, కటౌట్లలోనూ వారి గురించి ప్రచారం కల్పించేవారు కాదు. మోదీ వేదికపైకి రాకముందే జాతీయ స్థాయి నాయకులు మాట్లాడి కూర్చోవాల్సిన పరిస్థితి ఉండేది. అంతా మోదీ మయంగా కనపడడంతో తామెందుకు ప్రచారానికి వచ్చామన్న అభిప్రాయం వారికి కలిగేది. ఇప్పుడు పరిస్థితి రివర్స్ గా మారింది. రాష్ట్రాల్లో కూడా స్థానిక నేతల ప్రమేయం లేకుండా ఎన్నికల ప్రచారాన్ని మోదీ, అమిత్ షాలే చేస్తున్నారు. స్థానిక కార్యకర్తలు కూడా రాష్ట్ర నాయకత్వం పేర్లను ప్రస్తావించేందుకు జంకే పరిస్థితి కల్పించారు. ‘నన్నెందుకు తొలగించారు?’ అని కొద్ది నెలలక్రితం ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు నడ్డాను అడిగితే ఆయన టీవీ ఛానెల్స్ మారుస్తూ చూస్తూ ఉండిపోయారని సమాచారం!

పోనీ, కేంద్రంలో మంత్రివర్గంలో మరెవరికైనా ప్రాధాన్యత ఉందా అంటే అది కూడా కనపడడం లేదు. రాష్ట్రాలనుంచి ముఖ్యమంత్రులు ఎవరైనా వస్తే మోదీ, షా, ఒకరిద్దరు మంత్రులను మాత్రమే కలుసుకుని వెళ్లిపోతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంటి వారు అప్పుడప్పుడు పోలవరం లాంటి అంశాల వల్ల జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్, ఆర్థిక సమస్యల వల్ల ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ను కలుసుకోవాల్సివస్తుంది.అది కూడా ప్రధానమంత్రి కార్యాలయం నుంచో, అమిత్ షా ఆఫీసు నుంచో గ్రీన్ సిగ్నల్ వస్తే కాని ఇతర మంత్రులు ఏ ముఖ్యమంత్రికైనా అపాయింట్ మెంట్ ఇవ్వరు. అసలు వివిధ శాఖల మంత్రులకు తమ శాఖలనుంచి రాష్ట్రాలకు ఎంత మేరకు నిధులు వెళ్తున్నాయన్న విషయంలో అవగాహన లేదు. ఇటీవల ఒక కేంద్ర మంత్రికి ఆయన శాఖ నుంచి జగన్ సర్కార్ కు భారీ నిధులు వెళ్లాయని ఆ రాష్ట్ర నేత ఒకరు చెబితే ఆ అమాత్యులవారు ఆశ్చర్యపోయారు. ‘అలా వెళ్లే అవకాశం లేదు సార్’ అని పక్కన ఉన్న ఐఏఎస్ అధికారి మాటమార్చాలని ప్రయత్నిస్తే మన రాష్ట్ర నేత వివరాలు ఇవ్వడంతో మంత్రి హతాశుడు కావల్సి వచ్చింది. మోదీ హయాంలో కేంద్ర మంత్రులకు అంత విలువ లేదని తెలియడంతో జగన్మోహన్ రెడ్డి ఐఏఎస్ అధికారుల ద్వారా తమకు కావల్సిన పనులు చేయించుకోగలుగుతున్నారు. ఏపీ సీనియర్ అధికారులు ఢిల్లీలో ప్రైవేట్ హోటల్ లో దిగి ఏదో రకంగా తోటి అధికారులను మచ్చిక చేసుకుని రాష్ట్రానికి కావల్సిన నిధులను సాధించుకుని జగన్ మెప్పు పొందగలుగుతున్నారు. ఆ మధ్య ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్వయంగా నాలుగు రోజులు ఢిల్లీలో మకాం వేసి రూ. పదివేలకోట్లకు పైగా విడుదల చేయించుకుని వెళ్లారు.


ఇలాంటి పరిస్థితి వాజపేయి హయాంలోనూ, కాంగ్రెస్ హయాంలోనూ ఉండేది కాదు. కేంద్ర మంత్రుల పేషీలు రాష్ట్రాల నేతలతో కళకళ లాడేవి. కేంద్ర-రాష్ట్రాల మధ్య, పార్టీకి- ప్రభుత్వానికి మధ్య సత్సంబంధాలు కొనసాగడంలో కేంద్ర మంత్రులు కీలక పాత్ర పోషించేవారు. పార్టీ కార్యకర్తలు నేరుగా కేంద్రమంత్రులను కలుసుకుని పనులు చేయించుకునేవారు. ఇప్పుడు బడా వ్యాపారవేత్తల పనులు తప్ప మరెవరి పనులూ నెరవేరడం లేదు. ఒకప్పుడు ప్రధానమంత్రి కార్యాలయం కొన్ని కీలక సందర్భాల్లోనే జోక్యం చేసుకునేది. ఇప్పుడు అన్ని వ్యవహారాలను ప్రధానమంత్రి, హోంమంత్రుల కార్యాలయాలే నిర్దేశిస్తున్నాయి. ఇటువంటప్పుడు బిజెపిలో జాతీయస్థాయి రాజకీయాల్లో ప్రవేశించి ఒరగబెట్టేది ఏముంటుంది? రాష్ట్రాల్లో ఉన్న బలమైన నాయకులను పక్కన పెట్టి సమష్టి నాయకత్వం పేరుతో రకరకాల నాయకులను దింపి కార్యకర్తలను అయోమయం లో పడవేస్తున్నారు. ప్రజాస్వామ్యం విలువ తెలిసిన వారికి సమష్టి అన్న పదానికి విలువ కూడా తెలుస్తుంది. కేంద్రంలో మోదీ, షాలు సమష్టి నాయకత్వం అమలు చేస్తున్నారా?

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2023-10-25T02:25:41+05:30 IST