Share News

మరో ‘ఊపా’లా మనీలాండరింగ్ చట్టం!

ABN , First Publish Date - 2023-10-18T03:58:46+05:30 IST

మన నేర న్యాయవ్యవస్థలో ఒక వ్యక్తి నేరస్థుడో, కాదో తేలడానికి చాలా సమయం పడుతోంది. అయితే ఈ మధ్య కాలంలో అతడు నేరస్థుడో, కాడో తేల్చే లోపు సమాజం, వ్యవస్థలు అతడిని నేరస్థుడుగా...

మరో ‘ఊపా’లా మనీలాండరింగ్ చట్టం!

మన నేర న్యాయవ్యవస్థలో ఒక వ్యక్తి నేరస్థుడో, కాదో తేలడానికి చాలా సమయం పడుతోంది. అయితే ఈ మధ్య కాలంలో అతడు నేరస్థుడో, కాడో తేల్చే లోపు సమాజం, వ్యవస్థలు అతడిని నేరస్థుడుగా చూస్తున్నాయి. నిజానికి కోర్టు శిక్ష విధించినా, విధించకపోయినా అతడికి సమాజం, వ్యవస్థలు శిక్ష వేసినట్లే. నేరం నిర్ధారించే క్రమమే ఒక శిక్షగా మారిపోయిందని ఒక ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. నిర్విచక్షణగా సాగే అరెస్టులను ఎదుర్కోవడం ఒక ఎత్తు అయితే బెయిల్ పొందడం మరో ఎత్తు. దీనివల్ల విచారణ దశలోనే నేరం రుజువు కాకుండానే సుదీర్ఘ కాలం నిర్బంధానికి గురి కావల్సి వస్తుందని ఆయన అన్నారు. ఈ దేశంలో 6,10,000 మంది ఖైదీలుగా ఉంటే అందులో 80 శాతం మంది కేసు విచారణ దశలో ఉన్నవారే! వారిలో అణగారిన వర్గాలు, నిరక్షరాస్యులు, స్కూలు విద్య కూడా పూర్తి చేయనివారే అత్యధికులు.

విచిత్రమైన విషయం ఏమంటే అణగారిన వర్గాలు, నిరక్షరాస్యులు, ఆదివాసీలు, అత్యధిక కాలం జైళ్లలో ఉంటున్నా ఆ శోచనీయ విషయం ఇంతకాలం చర్చనీయాంశం కాలేదు. ఇది వ్యవస్థీకృత లోపంగానే చాలా మంది పరిగణించారు. కానీ కొన్ని సంవత్సరాలుగా ఈ నిర్భాగ్యుల జాబితాలో చదువుకున్నవారు, మేధావులు, ప్రముఖ రాజకీయ నాయకులు కూడా ఉంటున్నారు. ఉదాహరణకు నాలుగు దశాబ్దాలు న్యాయవాద వృత్తిలో ఉండి, హార్వర్డ్‌లో చదువుకుని, నాలుగుసార్లు దేశ ఆర్థిక మంత్రిగా, ఒక సారి హోంమంత్రిగా ఉన్న చిదంబరం కూడా కేసు విచారణకు ముందు 106 రోజులు తీహార్ జైలులో గడపాల్సి వచ్చింది. ఐఎన్ఎక్స్ మీడియాకు రూ. 307 కోట్ల మేరకు విదేశీ నిధులు వచ్చేందుకు విదేశీ పెట్టుబడుల ప్రమోషన్ బోర్డు అనుమతినిచ్చినందుకు ఆయనను సీబీఐ అరెస్టు చేసేందుకు పూనుకుంది. ఒక హత్య కేసులో అప్పటికే జైలులో ఉన్న ఒక నిందితురాలి ప్రకటనే చిదంబరం అరెస్టుకు ప్రధాన సాక్ష్యమైంది. ఢిల్లీ హై కోర్టు సింగిల్ జడ్జి ముందస్తు బెయిల్ నిరాకరించడంతో ఆయన తరఫు న్యాయవాదులు కపిల్ సిబాల్, సల్మాన్ ఖుర్షీద్ రోజంతా సుప్రీంకోర్టు ముందు పడిగాపులు గాసినా కేసు విచారణ చేపట్టేందుకు ఎవరూ సిద్ధపడలేదు. అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గొగొయ్ అయోధ్య కేసు విచారణలో ఉన్నందువల్ల చిదంబరంది అరణ్య రోదనే అయింది. ఈ లోపు చిదంబరం ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లి గోడదూకి లోపలికి ప్రవేశించి ఆయన లేరని తెలుసుకుని బయట నోటీసు అంటించి వచ్చారు. మూడునెలలు జైలులో ఉన్న తర్వాత సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. తొలుత సీబీఐ కేసులో బెయిల్ వచ్చినా, ఈడీ కేసులో బెయిల్ రావడానికి మరో రెండు నెలలు పట్టింది. ‘బెయిల్ అనేది న్యాయం, జెయిల్ అనేది మినహాయింపు మాత్రమే’ అన్న విషయం సుప్రీంకోర్టుకు అప్పుడు గుర్తుకు వచ్చింది. చిదంబరంను కక్ష సాధింపుతో అరెస్టు చేయలేదని, సాక్ష్యాలున్నందువల్లే అరెస్టు చేశామని బీజేపీ వ్యాఖ్యానించింది. చిదంబరం హయాంలో నరేంద్రమోదీ, అమిత్ షా లపై కక్షసాధింపు కోసమే కేసులు పెట్టలేదా, తర్వాత వారు అమాయకులని నిరూపితం కాలేదా అని బీజేపీ ప్రశ్నించింది.

నిజానికి నరేంద్రమోదీ, అమిత్ షా లపై ఉన్న కేసులు వేరు, చిదంబరంపై ఉన్న కేసు వేరు. చిదంబరం మనీలాండరింగ్ చట్టం క్రింద ఆర్థిక నేరస్థుడని కేంద్రం తీర్మానించింది. ఆయనకు బెయిల్ వచ్చి ఇప్పటికి దాదాపు మూడేళ్ళయింది. ఇప్పటికీ ఆ కేసు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు కనపడుతోంది. చిదంబరం విషయంలోనే కాదు, దేశంలో అనేకమందిపై దాఖలు అవుతున్న ఈడీ కేసుల విషయంలో కూడా నిజానిజాలు తేలేందుకు చాలా కాలం పడుతోంది. ఈ విషయంలో కలుగ చేసుకోవాల్సిన న్యాయస్థానాలు ఈ ఆలస్యానికి మరింత దోహదం చేస్తున్నాయి. ఇటీవల పదవీ విరమణ చేసిన ఒడిషా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ ఎస్. మురళీధర్ కేరళలో ఒక సదస్సులో మాట్లాడుతూ మనీలాండరింగ్ కేసులో తాజాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బొప్పన్న, జస్టిస్ సంజయ్ కుమార్ ఇచ్చిన తీర్పును ఉటంకించారు. మనీలాండరింగ్ చట్టం క్రింద ఎందుకు అరెస్టు చేస్తున్నారో లిఖితపూర్వకంగా చెప్పాల్సిన అవసరం ఉన్నదని సుప్రీం తెలిపింది. మనీలాండరింగ్ చట్టంలోని సెక్షన్ 19కూ, సిఆర్‌పిసిలోని సెక్షన్ 167కు వైరుధ్యం ఏమీ లేదని, ఒక వ్యక్తి ఎందుకు నేరస్థుడో, ఎందుకు అరెస్టు చేయాల్సి వస్తుందో కారణాలను అధికారి రికార్డు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టంగా తెలిపింది. ఇవాళ దేశంలో ఈడీ అరెస్టులు చేస్తున్న తీరు దాని పని విధానం ఎంత పేలవంగా ఉన్నదో స్పష్టం చేస్తోందని, మనీలాండరింగ్ వంటి నేరాల్ని అరికట్టాల్సిన బాధ్యత ఉన్న ఈ సంస్థ ప్రతి చర్యలోనూ పారదర్శకంగా, ప్రామాణికంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మనీలాండరింగ్ చట్టం క్రింద బలమైన అధికారాలున్నంత మాత్రాన ఈడీ కక్షసాధింపుతో వ్యవహరిస్తున్నట్లు కనపడకూడదని, నిజాయితీగా చర్యలు తీసుకున్నట్లు కనపడాలని సుప్రీం హితవు చెప్పింది. ఈడీ తన విధులను సక్రమంగా నెరవేర్చడంలో విఫలమైందని స్పష్టం చేసింది. అంతేకాదు, సమన్లకు సహకరించనంత మాత్రాన ఒక సాక్షిని అరెస్టు చేయడం సరైంది కాదని కూడా సుప్రీంకోర్టు అంతకు ముందు తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(1) ప్రకారం తననెందుకు అరెస్టు చేశారో తెలుసుకోవాల్సిన బాధ్యత అరెస్టయిన వ్యక్తికి ఉన్నదని స్పష్టం చేసింది.


నిజానికి ఇదే సుప్రీంకోర్టు రెండేళ్ల క్రితం మనీలాండరింగ్ నిరోధక చట్టానికి చేసిన రెండు కీలక సవరణలను సమర్థించింది. ఇష్టం వచ్చినట్లు సమన్లు జారీ చేయడానికి, అరెస్టులు, దాడులు చేసేందుకు ఈ సవరణలు దోహదం చేశాయి. అంతేకాక మనీలాండరింగ్ చట్టం క్రింద బెయిల్ రావడం అసాధ్యంగా మార్చాయి. ఒక నిందితుడిని నేరస్థుడని రుజువు చేయాల్సిన బాధ్యత ఈడీకి లేకుండా చేసాయి. తాను అమాయకుడినని నిరూపించుకోవాల్సిన భారం కూడా నిందితుడిపైనే ఈ సవరణలు మోపాయి. మనీబిల్లుల రూపంలో ఈ సవరణలను కేవలం లోక్‌సభలోనే ఆమోదించేందుకు కూడా జస్టిస్ ఖాన్విల్కర్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త చట్టం రాజకీయ కక్ష సాధింపులకు దోహదం చేస్తుందని, వ్యక్తిగత స్వేచ్ఛను కాలరాయడమే కాక, రాజ్యాంగ విలువలను కూడా కాలరాచివేస్తుందని దాదాపు 240 మంది పిటిషన్‌దారులు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(1) ప్రకారం అరెస్టయిన వ్యక్తికి అరెస్టు కారణం చెప్పాల్సిన అవసరం కూడా లేదని సుప్రీంకోర్టు నాడు భావించింది. అరెస్టయిన వ్యక్తికి ఈసీఐఆర్ (కేసు దర్యాప్తు నివేదిక) చూపించాల్సిన అవసరం లేదని కూడా తెలిపింది.

రెండేళ్లలో సుప్రీంకోర్టు వైఖరిలో మార్పురావడానికి కారణమేమిటి? తన అధికారాలను ఈడీ ఎడా పెడా దుర్వినియోగపరుస్తుందని సుప్రీంకోర్టుకు స్పష్టమైందా? ఆధారాలు లేకుండానే ఢిల్లీ మద్యం కేసులో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను 8 నెలలుగా ఉంచడంలో అర్థమేమిటని సుప్రీంకోర్టు తాజాగా ప్రశ్నించింది. లిక్కర్ మాఫియా నుంచి మనీష్ సిసోడియాకు డబ్బు ఎలా ముట్టిందో చూపించలేకపోయారని అటువంటప్పుడు ఇంతకాలం జైలులో ఎందుకు నిర్బంధించారని నిలదీసింది. మనీష్ సిసోడియాను అరెస్టు చేసినప్పుడు అవినీతినిరోధక చట్టంలోని సెక్షన్ 17(ఎ) ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకున్నారా అని సుప్రీం ప్రశ్నించినప్పుడు తాము అనుమతి తీసుకున్న తర్వాతే అరెస్టు చేసినట్లు అడిషనల్ సోలిసిటర్ జనరల్ ఎస్.రాజు చెప్పడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుకు ఇదే సెక్షన్ 17(ఏ)ను వర్తింపచేసే విషయంలో సుప్రీంకోర్టులో కొద్ది వారాలుగా ఇంకో బెంచ్ ముందు సుదీర్ఘ వాదనలు జరుగుతుండడం మరో వైరుధ్యం.

భారతదేశంలో మనీలాండరింగ్ చట్టం అన్ని క్రిమినల్ చట్టాలను మించిన క్రిమినల్ చట్టంగా మారిపోయిందని, దేశంలోని అన్ని వ్యవస్థలూ దాని పరిధిలోకి, టెక్నాలజీ దాని చేతుల్లోకి వచ్చిన తర్వాత అది యూఏపీఏ (చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం–ఊపా) మాదిరి మరో క్రూరచట్టంగా మారిపోయిందని న్యాయనిపుణులు భావిస్తున్నారు. నిజంగా అక్రమార్జన, విదేశాలకు నిధులు తరలించడం, మళ్లీ అవే నిధులను దేశానికి మళ్లించడం వంటి ఆర్థిక నేరాలపై చర్యలు తీసుకోవడం సరైనదే కాని గత కొన్నేళ్లుగా రాజకీయ కక్ష సాధింపుచర్యలకు, తమకు అనుకూలంగా లేని వ్యాపార సంస్థల వేధింపులకు మనీలాండరింగ్ చట్టాన్ని ఉపయోగించుకోవడం ఎక్కువగా కనపడుతోంది. ఇది కాఫ్కా సృష్టించిన అణచివేత సమాజానికి దారితీస్తోందని ప్రతాప్‌భాను మెహతా వంటి మేధావులు అభివర్ణించారు.

ఈ పరిస్థితిని మార్చగలిగిన వ్యవస్థ కేవలం న్యాయవ్యవస్థ మాత్రమే. ప్రభుత్వాలు దేశంలో వ్యవస్థల్ని నియంత్రించేందుకు ప్రయత్నించినప్పుడు అణిచివేతకు గురైనవారిని, నిరసన తెలిపే వారిని, మైనారిటీలను కాపాడగలిగింది స్వతంత్ర న్యాయవ్యవస్థ మాత్రమేనని జస్టిస్ మురళీధర్ అన్నారు. ఢిల్లీ అల్లర్ల కేసులో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన కొందరు బీజేపీ నేతలపై ఎఫ్ఐఆర్‌లు దాఖలు చేయమని ఢిల్లీ పోలీసులను ఆదేశించినందుకే జస్టిస్ మురళీధర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కాలేకపోయారని కొందరి అభిప్రాయం. రాజ్యం అణిచివేసినప్పుడు కాపాడేది న్యాయవ్యవస్థ మాత్రమేనన్న నమ్మకం కలగాలని ఆయన అన్నారు. న్యూస్ క్లిక్ అనే వార్తా సంస్థకు చైనానుంచి నిధులు వస్తున్నాయన్న పేరుతో ఈడీ వేధింపుల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఈ కేసు సుప్రీంకోర్టు విచారణకు రానుంది. ‘నిష్పాక్షికత న్యాయవ్యవస్థ ఆత్మ. స్వతంత్రత న్యాయవ్యవస్థ నరాల్లో ప్రవహించే రక్తం. స్వతంత్రత లేకపోతే నిష్పాక్షికత ఉండదు.’ అని జస్టిస్ మురళీధర్ అన్నారు. న్యాయ వ్యవస్థ నుంచి ఎవరైనా ఆశించేది ఇదే.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2023-10-18T03:58:46+05:30 IST