Narasimha : నరసింహునిపై మళ్లీ నీలాపనింద

ABN , First Publish Date - 2023-08-30T04:37:15+05:30 IST

కాంగ్రెస్ రాజకీయాల్లో దివంగత ప్రధానమంత్రి పాములపర్తి వేంకట నరసింహారావుకు ఏ మాత్రం విలువ లేదని మరోసారి స్పష్టమైంది. పీవీ ‘మొదటి బీజేపీ ప్రధానమంత్రి’ అని...

Narasimha : నరసింహునిపై మళ్లీ నీలాపనింద

కాంగ్రెస్ రాజకీయాల్లో దివంగత ప్రధానమంత్రి పాములపర్తి వేంకట నరసింహారావుకు ఏ మాత్రం విలువ లేదని మరోసారి స్పష్టమైంది. పీవీ ‘మొదటి బీజేపీ ప్రధానమంత్రి’ అని కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ ఇటీవల తన ఆత్మకథ ‘మెమోయిర్స్ ఆఫ్ ఏ మావరిక్ : ద ఫస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ (1941–1991)’ విడుదల సందర్భంగా వ్యాఖ్యానించారు. అయ్యర్ మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ సభలోనే ఉన్నారు. రాజీవ్ గాంధీకి సహాధ్యాయి అయ్యర్. రాజీవ్ ప్రోద్బలం వల్లే ఇండియన్ ఫారిన్ సర్వీస్‌ను వదులుకుని అయ్యర్ రాజకీయాల్లోకి వచ్చారు. అటల్ బిహారీ వాజపేయి విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు అయ్యర్‌ను కరాచీలో భారత్ కాన్సుల్ జనరల్‌గా నియమించారు. 1991 లోక్‌సభ ఎన్నికలలో తమిళనాడులోని మైలదుతురై నుంచి విజయం సాధించిన అయ్యర్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వాజపేయి వద్దకు వెళ్లి ఆయన కాళ్లకు నమస్కరించారు. అయ్యర్‌ను పీవీ తన మంత్రివర్గంలోకి తీసుకోలేదు. యూపీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ఆయన సోనియా ఆశీస్సులతో నాలుగు మంత్రిత్వ శాఖల్ని నిర్వహించారు. ఆయనకు రాజ్యసభ సభ్యత్వం కూడా ఇచ్చారు. దీన్ని బట్టి ఆయన గాంధీ కుటుంబానికి ఎంత సన్నిహితుడో అర్థమవుతుంది. రాజీవ్ గురించి అయ్యర్ మాట్లాడినప్పుడల్లా ఆ మాటల్లో ఆరాధనా భావం తొంగిచూడడంలో ఆశ్చర్యమేమీ లేదు.

అయినా పీవీని ఇప్పుడు తొలి బీజేపీ ప్రధాని అన్నారేమో కాని గతంలో కూడా ఆ పెద్ద మనిషిని అయ్యర్ దూషించిన సందర్భాలున్నాయి. ప్రముఖ రచయిత వినయ్ సీతాపతి పుస్తకం ‘హాఫ్ లయన్’ (నరసింహుడు) ఆవిష్కరణ సందర్భంగా కూడా నరసింహారావులోని హిందూ అనుకూల భావజాలం వల్లే బాబ్రీ‍ మసీదు కుప్పకూలిందని మణిశంకర్ అయ్యర్ నిందించారు. తాను రామ్ రహీమ్ యాత్ర చేస్తున్నానని చెప్పినప్పుడు లౌకికవాదం విషయంలో తన నిర్వచనంతో పీవీ ఏకీభవించలేదని, ఈ దేశం హిందూ దేశం అన్న విషయం గుర్తుంచుకోవాలని అన్నారని అయ్యర్ చెప్పారు. మరి లౌకికవాదానికి తాను ఏమి నిర్వచనం ఇచ్చారో అయ్యర్ వివరించలేదు. పీవీ వ్యాఖ్యలపై వివరణ కోరేందుకు కూడా ఆయన సంకల్పించలేదు.

పీవీ గురించి అయినా మరెవరి గురించి అయినా మణిశంకర్ అయ్యర్ లాంటి వాళ్లు వ్యాఖ్యానించడానికి ఒక హేతుబద్ధత ఉండనక్కర్లేదు. 2000 సంవత్సరంలో ఆయన తన పోలికలు ములాయంలో ఉన్నాయని, బహుశా తన తండ్రి ఎప్పుడో ఉత్తరప్రదేశ్‌కు వెళ్లి ఉంటారని వ్యాఖ్యానించి అమర్‌సింగ్‌తో తిట్లు తిన్నారు. 2003లో మణిశంకర్ అయ్యర్ సమాజ్‌వాది పార్టీ ఎంపి నరేశ్ అగర్వాల్‌ను రాజ్యసభలోనే కొట్టేందుకు వెళ్లారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని పాకిస్థానే తొలగించి భారత్ – పాక్ చర్చలకు వీలు కల్పించాలని మణిశంకర్ 2015లో కరాచీ పత్రిక ‘డాన్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. 2015లో ఫ్రాన్స్‌లో హిజాబ్‌ను వ్యతిరేకించినందుకే ఉగ్రవాద దాడులు జరిగాయని ఆయన వ్యాఖ్యానించినప్పుడు కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాద దాడుల్లో అనేకమంది మరణించినప్పుడు ఇలాంటి అమానుష వ్యాఖ్యల్ని కాంగ్రెస్ ఎప్పుడూ ప్రోత్సహించదని ఆ పార్టీ అధికార ప్రతినిధి అజయ్ మాకెన్ చెప్పారు. 2017 డిసెంబర్‌లో నరేంద్రమోదీని ఆయన ‘నీచ్ ఆద్మీ’ (నీచమైన వ్యక్తి)గా అభివర్ణించి సంచలనం సృష్టించారు. తనను నీచ కులస్తుడుగా అభివర్ణించారని మోదీ వ్యాఖ్యానించడంతో దానిపై రచ్చ జరిగింది. బీజేపీకి దీనివల్ల ప్రయోజనం లభిస్తుందని గ్రహించి కాంగ్రెస్ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. రాహుల్ గాంధీ జోక్యంతో ఏడాది లోపుగానే అయ్యర్‌పై సస్పెన్షన్ ఎత్తివేశారు. ఒక సందర్భంలో కాంగ్రెస్ పార్టీని కూడా సర్కస్‌తో అయ్యర్ పోల్చారు. అయినా ఆయనపై ఈగ కూడా వాలలేదు.


అసలు మణిశంకర్ అయ్యర్ లాంటి వారి వల్ల గాంధీ కుటుంబానికి ఏమి ఉపయోగమో అర్థం కాదు. ఆయనేమీ ప్రజానాయకుడు కాదు. పోనీ ఆయన అద్భుతమైన మేధా ప్రతిభ కాంగ్రెస్‌కు ఉపయోగపడుతుందా అన్నదీ చెప్పలేము. ఆయన తరుచూ రాసే కాలమ్స్‌లో చేసే అంచనాలెప్పుడూ విఫలమవుతూనే ఉంటాయి. 2014 మార్చి 16న ఆయన రాసిన కాలమ్‌లో మోదీతో ఎవరూ వేదిక పంచుకునేందుకు సిద్ధంగా లేరని, ఆయన కేవలం అకాలీదళ్, శివసేనలతో కలిసి బీజేపీని అధికారంలోకి తేలేరని అంచనా వేశారు. చరిత్ర నరేంద్రమోదీని చెత్తబుట్టలో విసిరేస్తుందని 2019 ఎన్నికల ముందు కూడా అయ్యర్ ఒక వ్యాసంలో పేర్కొన్నారు. ఆ రెండు ఎన్నికల్లోనూ బీజేపీ అఖండమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది.

నరసింహారావు గురించి గాంధీ కుటుంబ వందిమాగధులు అనేక మంది వెలిబుచ్చిన అభిప్రాయాన్నే మణిశంకర్ అయ్యర్ వ్యక్తం చేశారనడంలో సందేహం లేదు. బీజేపీ పెరుగుదలకు నరసింహారావే కారణమని కాంగ్రెస్ నేతలు పలువురు నిందించారు. గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తే అధికారంలో ఉంటే బాబ్రీ మసీదు కూలేది కాదని స్వయంగా రాహుల్ గాంధీయే అన్నారు. అయితే బీజేపీ ప్రాభవం నరసింహారావుకు ముందు అధికారంలో ఉన్న రాజీవ్ గాంధీ, విపిసింగ్‌ల హయాంలోనే ప్రారంభమైందన్న విషయం చరిత్రను అధ్యయనం చేసిన వారెవరికైనా తెలుస్తుంది. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి పదవి చేపట్టిన తొలి సంవత్సరంలోనే రామజన్మభూమి ఉద్యమం ఊపందుకోవడం మొదలైంది. 1986లో హిందూ మత నేతలు ఒక దశలో రామజన్మభూమి ఆలయం తాళాలు బద్దలు కొట్టాలని నిర్ణయించారు. అయినా రాజీవ్ ప్రభుత్వం ఆగమేఘాలపై స్పందించి ఆలయం గేట్లు తెరిపించింది. ఈ దృశ్యాన్ని దూరదర్శన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. అప్పుడు యూపీలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నది. 1989లో రాజీవ్ అయోధ్యలో వివాదాస్పద కట్టడం సమీపంలో శిలాన్యాస్‌ను అనుమతించడమే కాక అయోధ్య నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మరి అయ్యర్‌కు రాజీవ్‌లో హిందూత్వవాది కనిపించలేదా?

నరసింహారావు అధికారంలోకి రాకముందే 1990లో బీజేపీ నేత ఆడ్వాణీ రథయాత్రను ప్రారంభించారు. 1985లో ఉత్తరప్రదేశ్‌లో 269 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ 1989లో 94 సీట్లకు, 1991లో 46 సీట్లకు పడిపోవడానికి, 221 సీట్లతో కల్యాణ్ సింగ్ అధికారంలోకి రావడానికి కారణమైన రాజీవ్‌ను మణిశంకర్ అయ్యర్ ఎందుకు నిందించలేదు? ఎవరి హయాంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది? నిజానికి బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ పాలిత ప్రభుత్వాలను రద్దు చేసి నిర్వహించిన ఎన్నికలలో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ విజయానికి నరసింహారావు కారణం కాదా? అప్పుడు పీవీలో లౌకికవాది మణిశంకర్‌కు కనిపించలేదా?

ఇందిరాగాంధీ కూడా ప్రధానమంత్రిగా ఉన్నకాలంలో దేవరస్ వంటి ఆర్ఎస్ఎస్ నేతలతో తరుచూ చర్చించేవారని, వారి సలహాలను స్వీకరించే వారని సీనియర్ జర్నలిస్ట్ నీరజా చౌదురి ఇటీవల తన వ్యాసంలో ప్రస్తావించారు. స్వామీజీలను ఇందిర ఎంతగా నమ్మేవారో చరిత్ర పుటల్లో నమోదైంది. కాంగ్రెస్ మాత్రమే కాదు, బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఆ కాషాయ పార్టీ ఎదుగుదలను పసికట్టడంలో విఫలమయ్యాయి. 2014లో నరేంద్రమోదీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చేంత వరకూ బీజేపీ, ఆ పార్టీ భావజాలం దేశంలో చాప క్రింద నీరులాగా విస్తరించడాన్ని ఈ శక్తులు ఊహించలేకపోయాయి. నిజానికి దిగ్విజయ్‌సింగ్, ఫోతేదార్ వంటి నేతలు హిందూ ఓటర్లపై దృష్టి కేంద్రీకరించాలని సోనియాగాంధీని హెచ్చరించినందువల్లే ఆమె 2001లో అలహాబాద్ కుంభమేళాకు హాజరై గంగానదిలో మునకలు వేశారు. 2013లో తన కుమారుడు రాహుల్ గాంధీతో కలిసి ఆమె కుంభమేళాకు హాజరయ్యారు. హిందూ ఓటర్లను ఆకర్షించేందుకు తాను శివభక్తుడినని, జంధ్యం ధరిస్తానని కూడా రాహుల్ చెప్పుకున్నారు. మరి సోనియా, రాహుల్‌లను మణిశంకర్ అయ్యర్ ఏమీ అనలేదే?

మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న కమల్‌నాథ్ ఇటీవల రుద్రాభిషేకం చేసి స్వామీజీలను కలుసుకున్నారు. దిగ్విజయ్ సింగ్ కూడా తాను హిందూ నాయకుడినేనని చెప్పుకున్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ సహా అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు ఆలయాలకు, యజ్ఞాలకు హాజరవుతున్నారు. కాంగ్రెస్ మైనారిటీలను బుజ్జగిస్తోందని, హిందువులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ప్రజలు భావించినందువల్లే తమను దూరం పెడుతున్నారని ఆ పార్టీ సీనియర్ నేత ఏకె ఆంటోనీ 2014లో కాంగ్రెస్ పరాజయం తర్వాత నివేదిక ఇచ్చారు. ఆయనను ఇటీవల మళ్లీ వర్కింగ్ కమిటీలో నియమించారు. భారతదేశ ప్రజల మనసు చూరగొనాలంటే హిందూ ఓటర్ల మనసును చూరగొనాలనే ఆలోచన అనేకమంది కాంగ్రెస్ నేతల్లో ఉన్నదనడంలో సందేహం లేదు. మతం వ్యక్తిగత స్థాయి నుంచి ఓట్లను ఆకర్షించే సాధనంగా ఈ దేశంలో ఎప్పుడో మారింది. మణిశంకర్ లాంటి వందిమాగధుల ద్వారా తిట్టించినంత మాత్రాన ఈ దేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులలో సమూల మార్పులను తీసుకువచ్చిన నరసింహారావు పాత్రను పూర్తిగా కప్పిపుచ్చడం, తమకే చరిత్రలో ప్రాధాన్యత ఉండేలా చూడడం కాంగ్రెస్ ప్రథమ కుటుంబానికి ఎంతమాత్రమూ సాధ్యం కాదు. పైగా తమ నేతను తామే విస్మరించి బీజేపీకి అప్పగించిన ఘనత ఆ పార్టీకి దక్కింది. బీజేపీకి ప్రత్యామ్నాయంగా మారేందుకు ఇలాంటి సంకుచిత వైఖరి తోడ్పడుతుందా? హిందూత్వ విషయంలో ఎటువంటి వైఖరి అవలంబించాలో తమకే స్పష్టత లేనప్పడు పీవీని కాంగ్రెస్ నాయకులు ఎలా నిందించగలుగుతారు? ఇంతకూ లౌకికవాదం అంటే ఏమిటో మరింత లోతుగా చర్చించాల్సిన సమయం ఆసన్నమైంది.

Untitled-1.jpgఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2023-08-30T07:33:29+05:30 IST