’24లో 2004 పునరావృతం?

ABN , First Publish Date - 2023-07-19T02:41:56+05:30 IST

బెంగళూరులో జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ హాజరు కావడం దాదాపు రెండు దశాబ్దాల క్రితం జరిగిన పరిణామాలను గుర్తుకు తెస్తోంది...

’24లో 2004 పునరావృతం?

బెంగళూరులో జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ హాజరు కావడం దాదాపు రెండు దశాబ్దాల క్రితం జరిగిన పరిణామాలను గుర్తుకు తెస్తోంది. అటల్ బిహారీ వాజపేయి ప్రధానమంత్రిగా దిగ్విజయంగా పాలిస్తున్న రోజులవి. ‘భారతదేశం వెలిగిపోతున్నది’ అన్న ప్రచారం దేశమంతా మారుమ్రోగిపోతూ ‘అటల్‌ను ఎవరు ఢీకొనగలరు?’ అన్న ప్రశ్న అందరి మనసుల్లోనూ మెదలుతున్న కాలమది.

‘కాంగ్రెస్‌కు ప్రధానమంత్రి పదవిపైనా, అధికారంపైనా ఆసక్తి లేదు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకిక వాదం, సామాజిక న్యాయం మొదలైన వాటిని పరిరక్షించడమే మా ధ్యేయం’ అని ఇప్పుడు బెంగళూరులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించినట్లే 20 సంవత్సరాల క్రితం సోనియాగాంధీ కూడా ప్రధానమంత్రి అభ్యర్థిని కాంగ్రెస్ ప్రవేశపెట్టబోదని, ఎన్నికల తర్వాత ఏకాభిప్రాయంతో ప్రధాన మంత్రి ఎవరో నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల ఐక్యతకు ఇదే ప్రధాన సూత్రం.

రవీంద్రుడి గీతం ‘ఏక్ లా చలో’ గీతం ప్రబోధించినట్టు ‘ఒంటరిగా సాగిపోవాలి ముందుకు’ అని 2004 వరకు నిర్ణయించుకున్న కాంగ్రెస్ ఆ తర్వాత వ్యూహం మార్చుకుంది. వాజపేయి లాంటి జనాదరణ గల నేతను ఎదుర్కోవడానికి ఇతర శక్తులతో చేతులు కలపక తప్పదని గట్టిగా భావించింది. తన భర్త హత్య కేసులో డిఎంకెను నిందించిన సోనియా చెన్నై వెళ్లి కరుణానిధికి శాలువా కప్పారు. తనను విదేశీ నేతగా అభివర్ణించిన శరద్ పవార్ ఇంటి తలుపు తట్టారు. హరికిషన్ సింగ్ సూర్జిత్, మాయావతి, ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, అజిత్ సింగ్ తదితర నేతలతో చర్చలు జరిపారు. కాంగ్రెస్ పోటీ చేసి విజయం సాధించగలిగిన రాష్ట్రాల్లోనే తన ప్రచారాన్ని కేంద్రీకరించారు. అనేకమంది సిట్టింగ్, మాజీ ఎంపీలను పక్కన పెట్టి కొత్త వారికి అవకాశాలు ఇచ్చారు. ‘ఇండియా షైనింగ్’ అన్న ఎన్డీఏ నినాదానికి పోటీగా ‘కాంగ్రెస్ కే హాత్ – ఆమ్ ఆద్మీకే సాథ్‍’ అన్న నినాదాన్ని ప్రవేశపెట్టారు. దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ పేరుతో ఏకమయ్యాయి.

ప్రాంతీయ పార్టీలను కలుపుకుపోలేకపోవడం వల్ల 1999లో ఒక్క ఓటు తేడాతో అధికారాన్ని కోల్పోయిన వాజపేయి ఆ తర్వాత అజాత శత్రువులా అనేక ఇతర పార్టీలను ఆకర్షించినందువల్లే దాదాపు అయిదు సంవత్సరాలు స్థిరంగా అధికారాన్ని నడపగలిగారు. బీజేపీకి 182 సీట్లు మాత్రమే వచ్చినప్పటికీ లోక్‌సభలోని 543 సీట్లలో ఎన్డీఏ 303 సీట్లు సాధించడంతో వాజపేయికి తిరుగులేకుండా పోయింది. 1999లో కేవలం 114 సీట్లు సాధించిన కాంగ్రెస్‌కు ఇక భవిష్యత్ లేదనుకుంటున్న సమయంలో సోనియాగాంధీ వ్యూహం మార్చి ప్రతిపక్షాలను కలుపుకుని పోయారు. 2004లో కాంగ్రెస్‌కు కేవలం 145 సీట్లు మాత్రమే లభించినప్పటికీ మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక్క కరుణానిధి వల్లే కాంగ్రెస్‌కు 39 మంది ఎంపీల మద్దతు లభించింది. మళ్లీ మోదీ ప్రభంజనం వీచేవరకూ మన్మోహన్ సింగ్ పాలనకు దాదాపు పది సంవత్సరాల పాటు తిరుగులేకుండా పోయింది.

ఇప్పుడు మోదీ కూడా మన్మోహన్ సింగ్‌లా పదేళ్ల అధికారాన్ని పూర్తి చేసిన తర్వాత 2004 నాటి పరిస్థితులు పునరావృతమయ్యే అవకాశాలున్నాయా అన్న అంశంపై చర్చ జరుగుతోంది. మోదీ, వాజపేయి హయాంలకు కొన్ని పోలికలున్నాయి. వాజపేయి అభివృద్ధిని ఎన్నికల్లో ప్రధానాంశంగా మార్చుకున్నారు. ఆడ్వాణీ కూడా తన శైలికి భిన్నంగా అభివృద్ధి గురించి వివరిస్తూ 8500 కిమీ మేరకు భారత ఉదయ్ యాత్రను నిర్వహించారు. వాజపేయి హయాంలో మౌలిక సదుపాయాల రంగంలో అనేక పరిణామాలు సంభవించాయి. ప్రస్తుతం మోదీ కూడా వాజపేయిలాగా తాను తప్ప బీజేపీకి మరో జనాకర్షణ గల నేత లేరన్న పరిస్థితిని కల్పించుకున్నారు. వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు, సొరంగాలు, కారిడార్లు ఎడా పెడా ప్రారంభిస్తున్నారు. గతంలో ఎవరూ తనలా అభివృద్ధిని సాధించలేదని ప్రచారం చేసుకుంటున్నారు. అధ్యక్ష తరహా పాలనను ఆయన దాదాపు ప్రవేశపెట్టారు. అయితే అభివృద్ధి, వ్యక్తిగత జనాకర్షణ మాత్రమే ఒక పార్టీని అధికారంలోకి తేలేవని 2004లోనే రుజువైంది.

మోదీకి లేని ఒక బలం వాజపేయికి ఉన్నది. అది బీజేపీలోనే కాక ఇతర పార్టీల్లో కూడా ఆయన పట్ల గౌరవం ఉండడం. వాజపేయి తన సహజసిద్ధమైన హావభావాలు, ప్రజాస్వామిక స్వభావం, ఒక కవిలో ఉండే సున్నితత్వం, ప్రతిపక్షాలకైనా సహాయం చేయగల ప్రవృత్తి తదితర లక్షణాల మూలంగా అన్ని వర్గాలను ఆకట్టుకోగలిగారు. ఇలాంటి లక్షణాలేవీ మోదీకి ఉన్నట్లు కనిపించడం లేదు. కిడ్నీ ఆపరేషన్ కోసం తనను అమెరికా పంపించేందుకు తోడ్పడిన రాజీవ్ గాంధీని వాజపేయి బహిరంగంగానే ప్రశంసించారు. పార్లమెంట్‌పై ఉగ్రవాదుల దాడి జరిగినప్పుడు తన యోగక్షేమాల గురించి సోనియాగాంధీ ఫోన్ చేసి వాకబు చేశారని ఆయన గుర్తుకు తెచ్చుకున్నారు. వాజపేయి చనిపోయినప్పుడు సోనియా ఆయనను జీవితాంతం ప్రజాస్వామ్య విలువలకోసం తపించిన ఒక ఉన్నత శిఖరం అని ప్రశంసించారు. మోదీ లాగా వాజపేయి ప్రతిపక్షాలపై కుతంత్రాలు ప్రయోగించి ఈడీ, సిబిఐ తదితర ఏజెన్సీలను విశృంఖలంగా ఉపయోగించుకోలేదు. గదిలో బంధిస్తే పిల్లి అయినా తిరుగబడుతుందనే పరిస్థితిని వాజపేయి కల్పించుకోలేదు.

2004 ఎన్నికల్లో యూపీఏ కేవలం 218 సీట్లు సాధించినప్పటికీ ఇతర పార్టీల మద్దతుతో అధికారాన్ని చేజిక్కించుకోగలిగింది. నిజానికి 1999లోనూ, 2004లోనూ కాంగ్రెస్‌కు, బీజేపీకి దాదాపు ఒకే శాతం ఓట్లు లభించాయి. రెండు సార్లూ 10.3 శాతం ఓట్లు సాధించిన కాంగ్రెస్ తన సీట్ల సంఖ్యను పెంచుకుంటే, రెండు ఎన్నికల్లోనూ 8.3 శాతం ఓట్లు సాధించిన బీజేపీ సీట్లు సంఖ్య తగ్గిపోవడం ఆసక్తికరం. కాంగ్రెస్ పరిస్థితి కొద్దిగా మెరుగుపడుతున్నదనుకుంటే దేశంలో ప్రతిపక్ష పార్టీలన్నీ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతాయని 2004లోనే రుజువైంది. జనాకర్షణ గల వాజపేయికే ఇతర పార్టీల మద్దతు లభించని పరిస్థితి ఎదురైనప్పుడు దేశంలో ప్రతి ఇతర పార్టీని శత్రువుగా మార్చుకున్న మోదీని అవి మనస్ఫూర్తిగా సమర్థించగలవా? 2024లో బీజేపీకి మెజారిటీ సీట్లు రాకపోతే మోదీ పరిస్థితి ఏమిటి?

అయితే వాజపేయికి లేని బలం, శక్తియుక్తులు మోదీలో లేవని చెప్పలేం. కేవలం ఆర్థిక అభివృద్ధి గురించి గొప్పలు చెప్పుకోవడాలు, ఊకదంపుడు ఉపన్యాసాలు, విన్యాసాల వల్ల ఓట్లు సాధించలేమన్న విషయం మోదీకి తెలియనిది కాదు. రామజన్మభూమికోసం ఉద్యమాన్ని నిర్వహించి, రథయాత్ర చేసిన లాల్ కృష్ణ ఆడ్వాణీ ప్రధాని అయి ఉంటే ఎలా ఉండేదేమో కాని వాజపేయి హయాంలో హిందూ ఓట్లు అంత సంఘటితం కాలేదు. నిజానికి వాజపేయి బీజేపీ హిందూత్వ గుర్తింపునకు అతీతంగా ఆ పార్టీకి ఆదరణను కల్పించారు. మోదీ హయాంలో ప్రధానంగా హిందూ ఓట్లు సంఘటితమయినందువల్లే 2014లోనూ, 2019లోనూ బీజేపీ ఘన విజయం సాధించగలిగింది ఉత్తరాదితో పాటు దేశంలో అనేక ప్రాంతాల్లో హిందూ ఓటర్లు బీజేపీ ప్రాభవానికి మౌనంగా కారణమయ్యారు. పుల్వామా, బాలాకోట్ ఘటనలు, సర్జికల్ దాడులు మొదలైన వాటిని మోదీ సమయోచితంగా ఉపయోగించుకున్నారు. బీజేపీ ఓట్ల శాతం 2014లో 31 శాతం నుంచి 2019లో 37 శాతానికి పెరగడానికి మోదీ– షాల వ్యూహరచనే కారణం. ఈ రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు దాదాపు 20 శాతమే ఓట్లు లభించాయి.

అయితే దేశంలో 2024లో కూడా హిందూ ఓటర్లు మోదీకి అనుకూలంగా సంఘటితమయ్యే అవకాశాలున్నాయా అన్న విషయం చర్చనీయాంశం. కర్ణాటక ఎన్నికల్లో హిందూ కార్డును బీజేపీ గరిష్ఠంగా ఉపయోగించినా ఫలితం లభించలేదు. మతతత్వ రాజకీయాలు ఎల్లకాలమూ ఫలించవని ఆ ఎన్నికల ఫలితాలు సందేశం పంపాయి. గత మూడేళ్లుగా దేశంలో జరిగిన ఎన్నికలు, ఉప ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలే లభించాయి కాని ఒక్క గుజరాత్‌లో తప్ప హిందూ ఓట్ల వల్ల కానీ మోదీ ఆకర్షణ వల్ల కానీ సానుకూల ఫలితాలు లభించిన దాఖలాలు లేవు. నిజానికి గత కొద్ది సంవత్సరాలుగా దేశంలోని మిత్రపక్షాలను తనవైపుకు తిప్పుకునేందుకు, ఎన్డీఏను బలోపేతం చేసేందుకు ప్రయత్నించేబదులు మోదీ వాటిపై దాడులు ప్రారంభించారు. ఆయన పార్టీలను చీల్చారు. బీజేపీ తప్ప అన్ని పార్టీలను అవినీతి పార్టీలుగా, కుటుంబ పార్టీలుగా అభివర్ణించడం ప్రారంభించారు. తమతో చేతులు కలిపిన పార్టీలు, వ్యక్తుల అవినీతిని, వారసత్వ రాజకీయాలను మరిచి తనను వ్యతిరేకించిన పార్టీలనే దుమ్మెత్తి పోయడం మూలంగా మోదీ తన ప్రసంగాల విలువ తగ్గుతోందని గ్రహించలేకపోయారు. ఇవాళ ఉన్నట్లుండి ప్రతిపక్షాలకు పోటీగా ఎన్డీఏపై దృష్టి సారిస్తే ఫలితం ఏమైనా ఉంటుందా? ఎన్డీఏ సమావేశానికి హాజరైన 38 పార్టీల్లో 36 పార్టీలకు పార్లమెంట్‌లో అంతగా ఉనికిలేదన్న విషయం వాస్తవం కాదా? ఇంతకాలం మనుగడలోలేని ఎన్డీఏకు ఇప్పుడు ఒక్క సమావేశం నిర్వహిస్తేనే ఉనికి ఏర్పడుతుందా? తానొక్కడినే ప్రతిపక్షాలనన్నిటినీ ఎదుర్కోగలనని గత బడ్జెట్ సమావేశాల్లో ఛాతీపై చరుచుకుంటూ ప్రకటించిన మోదీకి ఇన్నాళ్లకు ఎన్డీఏ గుర్తుకు వచ్చిందా?

గత రెండు దశాబ్దాల్లో దేశ రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారాయి. కాని అధికారం కోసం నేతల ఆకాంక్ష మారలేదు. అప్పుడున్న నేతలూ ఇప్పుడు లేరు. అప్పటి నేతల సుపుత్రులు ఇప్పుడు రాజకీయాలు నిర్వహిస్తున్నారు. బెంగళూరులో జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో సోనియా పాల్గొనడం ఒకప్పటి రాజకీయ పరిణామాలను గుర్తు చేస్తున్నది. 2004లోనూ, 2009లోనూ కాంగ్రెస్ నాయకత్వంలోని రాజకీయ కూటమి రెండుసార్లు బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోగలిగింది. ఇప్పుడు ఆ చరిత్ర పునరావృతమవనున్నదా? ఎన్డీఏను ‘ఇండియా’ (ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్– 26 పార్టీలతో కొత్తగా ఏర్పడిన రాజకీయ కూటమి) ఢీ కొంటుందా? ఈ ప్రశ్నలకు ఆస్కారమిస్తున్న రాజకీయ వాతావరణం విశేషంగా కనిపిస్తోంది.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2023-07-19T02:41:56+05:30 IST