భారతంలో ‘కుక్కపిల్లా, అగ్గిపుల్లా...’

ABN , First Publish Date - 2023-04-03T01:22:10+05:30 IST

‘ఋక్కులు’ కవితాఖండికను ‘కుక్కపిల్లా, అగ్గిపుల్లా...’ అంటూ మొదలు పెట్టిన క్షణాల్లో శ్రీశ్రీ మనసులో ఏం మెదులుతూ వుండినదో చెప్పలేను గాని, శౌనకాది మహామునుల మహాభారతం కథాశ్రవణం...

భారతంలో ‘కుక్కపిల్లా, అగ్గిపుల్లా...’

‘ఋక్కులు’ కవితాఖండికను ‘కుక్కపిల్లా, అగ్గిపుల్లా...’ అంటూ మొదలు పెట్టిన క్షణాల్లో శ్రీశ్రీ మనసులో ఏం మెదులుతూ వుండినదో చెప్పలేను గాని, శౌనకాది మహామునుల మహాభారతం కథాశ్రవణం మొదలుకు మాత్రం ఈ రెండింటితోనూ సంబంధం ఉంది.

పాండవుల సామ్రాజ్యానికి వారసుడైన పరీక్షిత్తు మహారాజు కుమారుడు జనమేజయుడు. తన పాలనలో ప్రజల క్షేమం కోరి దీర్ఘకాలం కొనసాగే యజ్ఞం ఒకటి చేస్తూండగా, ఒక కుక్కపిల్ల ఆడుకుంటూ అటూ ఇటూ తిరుగుతూ ఆ యజ్ఞం జరుగుతూవున్న ప్రదేశంలోకి వచ్చింది. అది మామూలు కుక్కపిల్ల కాదు. సరమ అనే పేరున్న ఒక దేవశునకం మగ సంతానం. సారమేయుడు అన్నది ఆ కుక్కపిల్ల పేరు. అలా యజ్ఞం జరుగుతున్న ప్రదేశంలోకి చిన్నదైనా ఒక కుక్క రావడం సహించలేని జనమేజయ మహారాజు తమ్ములు ముగ్గురు, శ్రుతసేనుడు, భీమసేనుడు, ఉగ్రసేనుడు అనేవారు, దానిని అవతలికి తరిమే ఉద్దేశంతో అదిలించి కొడతారు. వారి చేతిలో దెబ్బలు తిన్న సారమేయుడనే ఆ కుక్కపిల్ల కుయ్యో మొర్రో అని ఏడుచుకుంటూ వెళ్ళి తల్లితో జరిగినదంతా మొరపెట్టుకుంటాడు.

పిల్ల ఏడుపు చూస్తున్న ఏ తల్లికి కోపం రాదు? అభం శుభం తెలియని ఈ కుక్కపిల్లని కొట్టడానికి మహారాజులకు చేతులెలా వచ్చాయో? కనుక్కొని సంగతి తేల్చుకోవాలన్న కోపంతో వచ్చిన సరమ, ఏకంగా జనమేజయ మహారాజునే అడుగుతుంది.

క్షితినాథ! కడు నకరుణా

న్వితులై నీ తమ్ము లతివివేకవిదూరుల్‌

మతిఁ దలఁపక నా పుత్త్రకు

నతి బాలకు ననపరాధు నడిచిరి పెలుచన్‌.

(ఆదిపర్వం, ప్రథమాశ్వాసం, 84 కంద పద్యం)

‘జనమేజయ మహారాజా! నువ్వేమో నీ ప్రజల క్షేమం కోరి మహా గొప్పగా యజ్ఞం చేస్తున్నానంటావు. అటువైపు నీ తమ్ములేమో జాలి, దయ అనేవి ఏమాత్రం లేని వివేకహీనుల్లా, రాక్షసుల్లా కనబడుతున్నారు. కల్లా కపటం తెలియని వయసులో ఉన్న వాణ్ణి, అతి బాలకుడైన నా కొడుకును, ఏ తప్పూ చేయని వాడిని, బాల్య చాపల్యంతో ఆడుకుంటూ అటువైపుగా వచ్చిన వాడిని, పసివాడని కూడా చూడకుండా, వాడు అక్కడ అడుగు పెట్టడంతోనే అదేదో పెద్ద అపచారం జరిగిపోయినట్లుగా భావించి, ఇది చేయదగిన పనేనా కాదా అని ఒక్క క్షణమైనా ఆలోచించకుండా, దెబ్బలు తగిలి ఏడ్చేలాగా కొట్టారు. ఆ పాపం ఊరికే పోతుందనుకున్నావా? పోదు.’

తగు నిది తగ దని యెదలో

వగవక, సాధులకుఁ బేదవారల కెగ్గుల్‌

మొగిఁ జేయు దుర్వినీతుల

కగు ననిమిత్తాగమంబు లయిన భయంబుల్‌.

(ఆదిపర్వం, ప్రథమాశ్వాసం, 85 కంద పద్యం)

‘చేసేముందు, ఈ పని చేయదగిన పనేనా కాదా అని ఒక్కటంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సాధు స్వభావులైనవారికి, పేదవారికి హాని కలిగించే పనులు చేసే నీతిమాలిన మనుషులకు ఊహించడానికి కూడా అలవి కాని ఆపదలు సంభవిస్తాయి’ అని తిట్లతో పాటు ఒక పాటి భయం కూడా మనసులో గట్టిగా నాటుకునేలా చెప్పి, తన పిల్లవాడితో సహా అదృశ్యమైపోతుంది సరమ.

జనమేజయుని వైపు నుంచి ఆలోచిస్తే - ప్రజల, పురోహితుల సమక్షంలో జరుగుతున్నది చాలా పెద్ద రాచకార్యం. ఒకటి రెండు రోజులలో ముగిసేది కూడా కాదు. ఎన్నో రోజుల పర్యంతం జరిగే ఒక బృహత్తర యజ్ఞం. అంత పెద్ద కార్యం జరుగుతూండగా, విధివశాన సంభవించినది

ఒక చిన్న సంఘటన - సారమేయుడు అనే కుక్కపిల్ల యజ్ఞం జరిగే ప్రదేశంలో తెలియక తిరుగాడడం అన్నది. కానీ ఆ సంఘటనే జనమేజయుని మనసులో ఒక శంకకు కారణమై, అతనికి ఆ తరువాత నిద్రను దూరం చేసింది కదా! సరమ మాటలలోని ఆపదలకు ప్రతిక్రియగా జనమేజయుడు మరిన్ని యాగాలను చేయవలసిన అవసరాన్ని సృష్టించింది కూడా ఆ చిన్న సంఘటనే కదా!

కుక్కపిల్ల అని చులకనగా చూసి చేయి చేసుకుని చివాట్లు తిన్నారు జనమేయుడు, అతని తమ్ములు. కాబట్టి ‘చులకనగా చూడకు దేన్నీ’ అన్నదే కదా ఇందులోని సారాంశం. ఋక్కులు కవితాఖండికలో శ్రీశ్రీ రాసింది కూడా అదే - హీనంగా చూడకు దేన్నీ, కవితామయమేనోయ్‌ అన్నీ!

‘ఋక్కులు’ కవితాఖండికకు మాటలను వెదుక్కునే క్షణాలలో శ్రీశ్రీ మనసులో ఏం మెదులుతూ వుందో చెప్పలేనని మొదటి వాక్యంలో అన్నాను గాని, ఇప్పుడు, ఈ చిన్నపాటి విశ్లేషణ తరువాత, ‘భారతంలోని ఈ ఉదంతం ప్రభావం ఆ క్షణాలలో శ్రీశ్రీ ఆలోచనలలో లేకపోవచ్చని ఎలా అనకోగలం?’ అని వ్రాయడానికి సందేహించనవసరం లేదేమో అనుకుంటున్నాను.

భట్టు వెంకటరావు

Updated Date - 2023-04-03T01:22:10+05:30 IST