కేసీఆర్‌ పాలనలో ప్రజాపక్షం ఎంత?

ABN , First Publish Date - 2023-06-01T02:06:44+05:30 IST

2014 జూన్ 2న తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవించి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వేళ రాష్ట్ర ఆవిర్భావం కోసం సుదీర్ఘ కాలం పోరాడిన సాధారణ ప్రజలకు, ఉద్యమ శక్తులకు శుభాకాంక్షలు.....

కేసీఆర్‌ పాలనలో ప్రజాపక్షం ఎంత?

ఈ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. నిజానికి ఉమ్మడి రాష్ట్రంతో పోల్చినప్పుడు, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి అవసరమైన నిధులు పన్నుల రూపంలో అందుబాటులోకి వచ్చినప్పటికీ, సరైన అభివృద్ధి నమూనా లేకపోవడం వల్ల, కాంట్రాక్టర్లకు లాభాలు, నాయకులకు కమీషన్లు ప్రాతిపదికన అభివృద్ధి నమూనా రూపొందించి అమలు చేయడం వల్ల, రాష్ట్రం ఐదు లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో కూరుకుపోయింది.

2014 జూన్ 2న తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవించి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వేళ రాష్ట్ర ఆవిర్భావం కోసం సుదీర్ఘ కాలం పోరాడిన సాధారణ ప్రజలకు, ఉద్యమ శక్తులకు శుభాకాంక్షలు. మనసు నిండా అనేక ఆకాంక్షలను నింపుకుని ఉద్యమించిన ప్రజలు తమ జీవితాలు బాగుపడతాయని ఎన్నో కలలు కన్నారు.

ప్రజాస్వామ్యం, ప్రభుత్వ పాలనా తీరు, ఎన్నికల హామీల అమలు, చట్టాల అమలు, ఆర్థిక వ్యవస్థ పని తీరు, సామాజిక న్యాయం, సహజ వనరుల వినియోగం, ఉపాధి అవకాశాలు, పర్యావరణం లాంటి కీలకమైన తొమ్మిది అంశాలను పరిశీలించడం ద్వారా, తొమ్మిదేళ్ల ప్రభుత్వ పాలనా స్వభావాన్ని అర్థం చేసుకోవాలి.

ప్రస్తుత అధికార పార్టీ గత తొమ్మిదేళ్లలో పార్లమెంటరీ ఎన్నికల వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించింది. ఇతర పార్టీల కార్యకర్తలను, ఓటర్లను ప్రలోభ పెట్టడానికి, కొనుగోలు చేయడానికి వందల కోట్లను వెచ్చిస్తున్నది. స్థానికంగా గెలిచిన ఇతర పార్టీల అభ్యర్థులను, ప్రలోభపెట్టి తన పార్టీలో కలిపేసుకుంటున్నది. అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన ఇతర పార్టీల శాసన సభ్యులను, తన పార్టీలో చేర్చుకుని, ప్రజల తీర్పుపై తనకేమీ గౌరవం లేదని చెప్పకనే చెప్పింది. తమది ఫక్తు రాజకీయ పార్టీ అని నిస్సిగ్గుగా ప్రకటించుకున్నది. దశాబ్దాల పోరాటాలతో గ్రామీణ ప్రజలు తెలంగాణలో కూల్చేసిన వందలాది దొరల గడీల సారం మళ్ళీ ప్రగతి భవన్ రూపంలో నగరం నడిబొడ్డున వెలిసింది. తాజాగా ఇప్పుడు నయా సెక్రటేరియట్ అదే స్వభావంతో నిర్మాణమైంది.

ప్రభుత్వ పెద్దలు స్వయంగా ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకోరు. ప్రజల సమస్యలపై చర్చకు ప్రతిపక్ష పార్టీలకు, ప్రజా సంఘాలకు సమయం ఇవ్వరు. తమను ప్రశ్నించే మీడియా సంస్థలను కూడా సచివాలయంలోకి అడుగు పెట్టనివ్వరు. ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు జిల్లాల పర్యటనకు వెళితే, ప్రజా సంఘాల కార్యకర్తలు ముందస్తు అరెస్టులతో పోలీస్ స్టేషన్లలో మగ్గాలి. ఈ ప్రభుత్వ పాలనా కాలంలో 16 ప్రజా సంఘాలపై నిషేధం, ఇందిరా పార్క్ ధర్నాచౌక్ రద్దు నిర్ణయాలు అమలయ్యాయి. కోర్టు తీర్పులతో కొంత ఊరట లభించినా అవి ప్రభుత్వ స్వభావానికి అద్దం పట్టాయి. ప్రజా సంఘాల కదలికలపైన, సమావేశాలపైన ఆంక్షలు, పోలీస్ నిఘా ప్రజల భావ ప్రకటనా స్వేచ్ఛకు ఆటంకం కలిగిస్తున్న చర్యలే. ఆర్టీసీ కార్మికుల, ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ల, రెవెన్యూ ఉద్యోగుల, తాజాగా గ్రామ పంచాయితీ జూనియర్ కార్యదర్శుల సమ్మె పోరాటాలపై బెదిరింపులు, వారితో చర్చలకు నిరాకరించడం, వారి యూనియన్ల ఉనికిని గుర్తించకపోవడం ఈ ప్రభుత్వం చట్టబద్ధ పాలనకు కట్టుబడి లేదన్న నిజాన్ని చెబుతున్నాయి.

2014, 2018 ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ఈ ప్రభుత్వం సీరియస్‌గా పూనుకోలేదు. రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే, సెటిల్మెంట్ చేయకపోవడం, ప్రభుత్వ రంగంలో నిజాం సుగర్స్ లిమిటెడ్‌ను పునరుద్ధరించకపోవడం, ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించకపోవడం, 30 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్న ప్రభుత్వ స్కూళ్లలో, విద్యార్థుల వసతి గృహాలలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయకపోవడం, నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం... వంటివన్నీ ఇందుకు తార్కాణం.

అసెంబ్లీ ఆమోదించిన చట్టాలను, ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను అమలు చేయడంలో ఈ ప్రభుత్వానికి రాజకీయ చిత్తశుద్ధి లోపించింది. దున్నేవారికి భూమి కావాలని పోరాడిన తెలంగాణలో భూమి లేని పేదలకు భూమి అందించడానికి 1973 భూ సంస్కరణల చట్టం వైపు అసలు దృష్టి సారించనే లేదు. రాష్ట్రంలో 2011 కౌలు రైతుల గుర్తింపు చట్టాన్ని అమలు చేయడం లేదు. 2016లో ఆమోదించిన వ్యవసాయ కుటుంబాల ఋణ విముక్తి చట్టం క్రింద ఏర్పడిన కమిషన్ చైర్మన్‌గా రిటైర్డ్ న్యాయమూర్తి స్థానంలో తమ పార్టీ నాయకులను నియమించి కమిషన్‌ను పని చేయకుండా ఆపింది. 2013 భూ సేకరణ చట్టం స్ఫూర్తికి, ప్రజాభిప్రాయ సేకరణ పద్ధతికి తూట్లు పొడిచి, వివిధ జిల్లాలలో అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో, వేలాది ఎకరాలను ప్రభుత్వం బలవంతంగా రైతుల నుంచి గుంజుకుంటున్నది.

ఈ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. నిజానికి ఉమ్మడి రాష్ట్రంతో పోల్చినప్పుడు, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి అవసరమైన నిధులు పన్నుల రూపంలో అందుబాటులోకి వచ్చినప్పటికీ, సరైన అభివృద్ధి నమూనా లేకపోవడం వల్ల, కాంట్రాక్టర్లకు లాభాలు, నాయకులకు కమీషన్లు ప్రాతిపదికన అభివృద్ధి నమూనా రూపొందించి అమలు చేయడం వల్ల, రాష్ట్రం ఐదు లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఇందులో సగం బడ్జెట్ సంబంధిత అప్పులయితే, మరో సగం మిషన్ భగీరథ, కాళేశ్వరం లాంటి కార్పొరేషన్ల పేరుతో తెచ్చిన రుణాలు. దీర్ఘకాలానికి ఎక్కువ వడ్డీలతో తెచ్చిన ఈ ఋణాలు, అనుకున్న ఫలితాలను సాధించకపోగా, బడ్జెట్ కేటాయింపులలో సింహభాగాన్ని తినేస్తున్నాయని కాగ్ నివేదికలే చెబుతున్నాయి. గత తొమ్మిదేళ్లలో జీఎస్టీ, అమ్మకం పన్ను, ధరణి, ఇతర సర్వీసు ఫీజుల రూపంలో ప్రజలపై పన్నుల భారం భారీగా పెరిగిపోయింది. పెరిగిన విద్యుత్, రవాణా ఛార్జీలు కూడా సాధారణ ప్రజలపై భారాన్ని మోపుతున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేలా మద్యాన్ని ఏరులై పారిస్తూ, ఆదాయం కోసం ప్రధానంగా ఎక్సైజ్ పన్నుపై ఆధారపడడం ఈ ప్రభుత్వ దివాళాకోరు తనానికి నిదర్శనం. ఆర్టీసీ, విద్యుత్ ట్రాన్స్‌కో సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో ఆయా కార్పొరేషన్‌లు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్సుమెంట్ పథకాలకు బకాయిల వల్ల ఆయా వర్గాల ప్రజలకు ఉచిత సర్వీసులు అందడం లేదు.

ఈ ప్రభుత్వానికి వివక్షకు గురయ్యే సామాజిక వర్గాలకు సామాజిక న్యాయం అందించాలన్న నిజమైన ఎజెండా లేదు. దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి కొనుగోలు చేసి ఇచ్చే జీవో నంబర్ 1 పక్కకు పడిపోయింది. దళిత బంధు పథకం ఇప్పటి వేగంతోనే కొనసాగితే, దశాబ్దాలు గడిచినా ఆశించిన ఫలాలు దక్కవు. సమాజంలో 54 శాతం ఉన్న వెనుకబడిన వర్గాల ప్రజల సంక్షేమం కోసం బడ్జెట్లో కేటాయింపులు అతితక్కువగా ఉంటున్నాయి. ఆదివాసీల పోడు భూములకు పట్టాలు ఇవ్వనే లేదు. మైనారిటీల సంక్షేమం కోసం సుధీర్ కమిషన్ చేసిన సిఫారసుల అమలు ప్రారంభించనే లేదు.

సమగ్ర వ్యవసాయ విధానమూ, రాష్ట్ర అవసరాలకు తగినట్లుగా పంటల ప్రణాళికా లేకపోవడం వల్ల మెజారిటీ గ్రామీణ వ్యవసాయ కుటుంబాలలో సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. సమాజంలో మెజారిటీగా ఉన్న గ్రామీణ రైతాంగ సంక్షేమం లక్ష్యంగా రైతు బంధు లాంటి పెట్టుబడి సహాయ పథకాలు అవసరమే. కానీ ఈ పథకం పేరుతో, ఒక వైపు వ్యవసాయం చేయని రైతులకు, వ్యవసాయం చేయని భూములకు, బడా భూస్వాములకు కూడా ప్రతి సంవత్సరం వేల కోట్లు పంపిణీ చేస్తూ నిధులను వృథా చేస్తున్నారు. మరో వైపు కౌలు రైతులకు ఒక్క రూపాయి కూడా సహాయం అందించడం లేదు.

రైతుల పంట రుణాల మాఫీ సరిగా సకాలంలో చేయలేదు. బ్యాంకులు ఇచ్చిన పంట రుణాలపై వడ్డీ రాయితీ బకాయిలు చెల్లించడం లేదు. ఫలితంగా రైతులకు సంస్థాగత రుణాలు అందడం లేదు. పంటల బీమా పథకాలను అమలు చేయడం లేదు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు ఇన్‍పుట్ సబ్సిడీ కూడా అందించడం లేదు.

రాష్ట్ర జీఎస్‌డీపీ 13 లక్షల కోట్లకు చేరిందనీ, సగటు తలసరి ఆదాయం రూ.3 లక్షలు దాటిందనీ ప్రభుత్వం చెప్పే మాటలు పాక్షిక సత్యం మాత్రమే. సాధారణ ప్రజల నిజ ఆదాయాలు, జీవన ప్రమాణాలు ఏ మేరకు పెరిగాయి, ఐక్యరాజ్యసమితి నిర్వచించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల వైపు రాష్ట్రం ఎంత ప్రయాణించింది అన్నది ముఖ్యం. ఈ విషయంపై ఎన్‌ఎస్‌ఎస్‌ఓ, హెచ్‌డీఐ నివేదికలు, ప్రభుత్వ ప్రచార బండారాన్ని బయటపెడుతున్నాయి.

రాష్ట్ర సహజ వనరుల సద్వినియోగంపై ఈ ప్రభుత్వానికి పట్టింపే లేదు. రాష్ట్రానికి భూ వినియోగ విధానం లేదు. ఫలితంగా ఆన్ని జిల్లాలలో లక్షలాది ఎకరాల సాగు భూమి రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిపోతున్నది. మరో వైపు ప్రభుత్వమే, అవసరం లేకపోయినా రీజనల్ రింగ్ రోడ్డు, నగరాల చుట్టూ ఔటర్ రింగ్ రోడ్లు, ఆహార శుద్ధి పరిశ్రమల పేరుతో భూములను కబళిస్తున్నది. కేవలం దశాబ్ధి ఉత్సవాల ప్రచారానికి పరిమితం కాకుండా, రానున్న అసెంబ్లీ ఎన్నికల లోపు అయినా, ప్రభుత్వం తన పాలనా స్వభావాన్ని మార్చుకుంటుందని ఆశించవచ్చా?

l కన్నెగంటి రవి

రైతు స్వరాజ్య వేదిక

Updated Date - 2023-06-01T02:06:44+05:30 IST