Share News

మూలధన వ్యయం లేకుండా అభివృద్ధి ఎలా సాధ్యం?

ABN , First Publish Date - 2023-11-30T01:12:57+05:30 IST

రాష్ట్ర అభివృద్ధిలో మూలధన వ్యయం కీలక పాత్ర పోషిస్తుంది. నీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన, విద్య, వైద్యం, రహదార్లు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి...

మూలధన వ్యయం లేకుండా అభివృద్ధి ఎలా సాధ్యం?

రాష్ట్ర అభివృద్ధిలో మూలధన వ్యయం కీలక పాత్ర పోషిస్తుంది. నీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన, విద్య, వైద్యం, రహదార్లు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, ప్రత్యేక ప్యాకేజీల వంటి వాటిపై ప్రభుత్వం తన బడ్జెట్‌ ద్వారా చేసేదే మూలధన వ్యయం. ఈ వ్యయం వల్ల ప్రభుత్వానికే కాక ప్రజలకు ఆదాయ వృద్ధి జరుగుతుంది. ప్రజల కొనుగోలు శక్తి పెరిగి మార్కెట్‌లో సరుకులకు డిమాండ్‌ పెరిగి పారిశ్రామికీకరణ, సేవారంగం వృద్ధి చెందుతుంది. మూలధనం వ్యయం వల్ల పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఉత్పాదక శక్తి పెరుగుదలతోపాటు ప్రాంతీయ అసమానతలు తగ్గుముఖం పడతాయి. ఇంత కీలకమైన ఈ వ్యయాలకు జగన్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడంలేదు. మూలధనం వ్యయంలో ఏపీ ఈశాన్య రాష్ట్రాల స్థాయిని కూడా చేరలేకపోయింది. మూలధనం వ్యయం 2023లో 56 శాతం తగ్గింది.

వివిధ రాష్ట్రాల బడ్జెట్‌లో మూలధన వ్యయాలపై అధ్యయనం చేసి ఇటీవల బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఒక నివేదిక విడుదల చేసింది. మొత్తం 24 రాష్ట్రాల బడ్జెట్‌ పెట్టుబడుల వ్యయాలను పరిశీలించగా అందులో కర్ణాటక ప్రథమ స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్‌ 23వ స్థానంలో అట్టడుగున ఉన్నట్లు వెల్లడైంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయంగా రూ. 30,680కోట్లు కేటాయించగా ఇందులో కేవలం రూ.6189కోట్లు మాత్రమే జగన్ ప్రభుత్వం ఖర్చు చేసినట్లు సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023–24లో మొత్తం రూ.2.79లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఇందులో మూలధన వ్యయ అంచనాగా రూ.31,061 కోట్లు కేటాయించారు. ఇందులో సగం కూడా ఖర్చు చేస్తారనే నమ్మకం లేదు.

జగన్‌రెడ్డి తన హయాంలో రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నదని గొప్పలు చెబుతున్నారు. సంక్షేమ రాజ్యమంటూ నవరత్నాలను పదే పదే ప్రజల ముందుకు తెస్తున్నారు. భారీగా అప్పులు తీసుకొస్తూ భారీ బడ్జెట్‌లను ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్‌లో మూలధన వ్యయం మాత్రం తిరోగమన దిశలో ఉన్నది. అభివృద్ధి ఉంటే రాబడి పెరుగుతుంది. ప్రజల ఆదాయాలు ఉంటే కొనుగోళ్లు పెరిగి ఆ మేరకు పన్నులు వసూళ్లు అవుతాయి. రాష్ట్ర స్థూల ఉత్పత్తిపై గొప్పలు చెబుతున్న జగన్ పాలనలో రాబడి కనిపించదు. జీఎస్‍డీపీ వృద్ధిరేటులో రాష్ట్రం దూసుకుపోతోందని, ఏపీ వృద్ధిరేటు 11.43 శాతం ఉందని డబ్బా కొట్టుకొంటున్నారు. వృద్ధిరేటు పెరిగితే మరి ఖజానా ఆదాయం ఎందుకు పెరగలేదు? తర్వాత ఉద్యోగాల కల్పన పెరగాలి. రాష్ట్రంలో ఈ రెండూ జరిగాయా? అయినా వృద్ధిరేటు రెండంకెలకు ఎలా చేరిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.

రెవెన్యూ వసూళ్లు అంతంత మాత్రమే. రెవెన్యూ లోటు లెక్కకు మించి పెరిగింది. ఈ ఏడాది మొత్తానికి రాష్ట్ర రెవెన్యూ లోటు రూ.22,316.70 కోట్లు ఉంటుందని అంచనా వేస్తే ఏడు నెలలకే లోటు రూ.42,343.59 కోట్లుగా తేలింది. అంటే 189 శాతం రెవెన్యూ లోటు ఏర్పడింది. ఈ ఏడాది మొత్తంలో రూ.54,587 కోట్ల మేర అప్పులు చేస్తామని బడ్జెట్ అంచనాల్లో చెప్పారు. కానీ ఏడు నెలల్లోనే రూ.59,720కోట్ల అప్పులు తెచ్చినట్లు సమాచారం. మిగిలిన అయిదు నెలల్లో ఇంకెన్ని అప్పులు తెస్తారో తెలియదు.

దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా మన రాష్ట్రానికి 975కి.మీ., సముద్ర తీర ప్రాంతం ఉంది. ఈ నాలుగున్నరేళ్లలో తీరప్రాంత అభివృద్ధికి, ఈ ప్రాంత మత్స్యకారుల అభివృద్ధికి ఎటువంటి చర్యలు చేపట్టలేదు. రూ.3వేల కోట్లతో పది ఫిషింగ్‌ హార్బర్లు, ఫిష్‌ ల్యాండింగ్‌ జెట్టీలు నిర్మిస్తామని ప్రకటించినా ఏ ఒక్కటీ పూర్తి చేయలేదు. ప్రభుత్వ పెట్టుబడుల ద్వారా సముద్ర తీర అభివృద్ధికి బహుముఖ చర్యలు ప్రణాళికాబద్ధంగా చేపట్టినట్లయితే ఈ నాలుగున్నరేళ్లలో మత్స్యకారులకు అనేక ప్రయోజనాలు కలిగేవి. వారి జీవనోపాధి, ఆదాయాలు పెరిగేవి. ఈ తరహా అభివృద్ధి మానేసి, మొత్తం తీర ప్రాంతాన్ని బడా పెట్టుబడిదార్లకు ధారాదత్తం చేసే విధానాలను చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో విశాఖలో నిర్మించిన గంగవరం పోర్టును కూడా అదానీపరం చేశారు. అందులో ప్రభుత్వానికి ఉన్న వాటాను మోదీ ప్రభుత్వానికి లొంగిపోయి కారు చౌకగా అదానీకి అమ్మేశారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తూ క్రిష్ణపట్నం పోర్టుని కూడా అదానీ పరం చేశారు. ఇప్పుడు అదానీ చేతుల్లో ఉన్న గంగవరం, క్రిష్టపట్నం పోర్టులు ఆధునిక జైళ్ళుగా నడుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా మూలపేట, కృష్ణా జిల్లా బందరు పోర్టులకు జగన్‌ శంకుస్థాపన చేశారు. అలాగే నెల్లూరు జిల్లాలో రామయపట్నంలో కూడా పోర్టును నిర్మిస్తున్నట్లు గతంలో ప్రకటన చేశారు. ఈ మూడు గ్రీన్‌ ఫీల్డ్‌ పోర్టుల నిర్మాణం పూర్తి అయిన తరువాత వీటి నిర్వహణను పూర్తిగా ప్రైవేటు సంస్థలకు ఇస్తామని ప్రకటన చేశారు. ప్రభుత్వం కేవలం ఒక ఫెసిలిటేటర్‌గా మాత్రమే ఉంటుందని, ల్యాండ్‌ లార్డ్‌ పోర్టులుగా ఉంటాయని ప్రకటించారు. వాస్తవంగా ఈ మూడు పోర్టులను ప్రభుత్వమే రాష్ట్ర బడ్జెట్‌ నుంచి, ఋణాల ద్వారా నిధులు సమీకరించి నిర్మించి నడిపితే బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుంది.

సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయకపోవడం రాష్ట్రానికి మరో శాపంగా మారింది. ముఖ్యంగా వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రతోపాటు ఇతర జిల్లాలలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయటానికి బడ్జెట్‌ నుంచి నిధులు కేటాయించడంలేదు. కేటాయించినా ఖర్చు చేయకుండా ఇతర కార్యకలాపాలకు దారి మళ్ళిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు కూడా ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని దుస్థితి. ఫలితంగా రాష్ట్రంలో లక్షలాది ఎకరాలకు నీటి సదుపాయం లేక వ్యవసాయం దెబ్బతింటున్నది.


రాష్ట్రాభివృద్ధిలో విద్యుత్‌ రంగం అత్యంత కీలకం. ఈ రంగంలో ప్రభుత్వ పెట్టుబడుల కల్పన పూర్తిగా స్తంభించిపోయింది. అనాదిగా పెండింగులోను, నిర్మాణంలోను ఉన్న విద్యుత్‌ ప్రాజెక్టులు పూర్తి చేయటానికి బడ్జెట్‌ నుంచి నిధులు కేటాయించడటం లేదు. ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న విద్యుత్‌ సంస్థలను కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ సంస్కరణలకు తలొగ్గి కార్పొరేట్‌ శక్తుల పరం చేస్తున్నది. కృష్ణపట్నం దగ్గర ఉన్న దామోదరం సంజీవయ్య థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేయపూనుకున్నది. కొత్తగా ప్రభుత్వ పెట్టుబడులతో విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణం చేయకూడదనే విధానం చేపట్టింది. ఇటీవల గ్రీన్‌ ఎనర్జీ పేర రాయలసీమ, ఉత్తరాంధ్రలో వేలాది ఎకరాలను అదానీకి కట్టబెట్టారు.

రాష్ట్రంలో మరో ముఖ్యమైన వ్యవసాయ అనుబంధ పరిశ్రమ పాడి పరిశ్రమ. అనేక ఏళ్ళ క్రితం ఈ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులతో శక్తివంతమైన సహకార వ్యవస్థను నెలకొల్పారు. ఈ రంగంలో కూడా గత కొన్నేళ్లుగా బడ్జెట్‌ నుంచి పెట్టుబడి కేటాయింపులు జరపకపోగా అనేక డెయిరీలను మూసివేశారు. ఇటీవల ఈ రంగం మొత్తాన్ని గుజరాత్‌కు చెందిన అమూల్‌ సంస్థ పరం చేశారు. ఈ చర్యలు డెయిరీ రంగంలో సహకార వ్యవస్థ పూర్తిగా ధ్వంసమవ్వటానికి దారితీస్తాయి.

విద్య, వైద్య, సామాజిక రంగాల్లో కూడా పెట్టుబడుల వ్యయం తగినంతగా పెంచటంలేదు. విద్యా రంగంలో కేవలం అమ్మ ఒడి, నాడు నేడులకే ప్రభుత్వం పరిమితమయ్యింది. గత కొంత కాలంగా పాఠశాలల విలీనం, ప్రభుత్వ విద్యారంగంలో ప్రైవేటు భాగస్వామ్యం పెంచే చర్యలకు ప్రభుత్వం పాల్పడుతున్నది. వైద్యరంగంలో కూడా పెట్టుబడుల వ్యయం కోతకు గురౌతున్నది. ప్రణాళికాబద్ధంగా ఆరోగ్య సదుపాయాలను ప్రజలకు అందించే చర్యలు చేపట్టటం లేదు. మెడికల్‌ కాలేజీల పేర ప్రాథమిక, ప్రాంతీయ, జిల్లా స్థాయి ఆసుపత్రులకు పెట్టుబడి నిధులు కేటాయించటం లేదు. ఆరోగ్యశ్రీ, ఫ్యామిలీ డాక్టర్‌ పేర ఈ రంగాన్ని నీరు కారుస్తున్నది. ఇక వెనుకబడిన ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు రోడ్లు, మంచినీరు, విద్యుత్‌, పారిశుద్ధ్యం తదితర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేకంగా బడ్జెట్‌ నుంచి నిధులు కేటాయించటం లేదు. ఈ ప్రాంతాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నది. రాష్ట్ర అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక లేకుండా, తగిన విధంగా బడ్జెట్‌ నుంచి పెట్టుబడి నిధులు కేటాయించి ఖర్చు చేయకుండా, కేవలం సంక్షేమ పథకాల ద్వారానే సమగ్రాభివృద్ధి జరగడం అసాధ్యం. రాష్ట్ర అభివృద్ధికి మూలధనం వ్యయం ఎంత కీలకమో ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది.

యనమల రామకృష్ణుడు

పోలిట్ బ్యూరో సభ్యులు

Updated Date - 2023-11-30T01:13:01+05:30 IST