Share News

కొండుభట్టీయంలో గురజాడ తత్త్వం

ABN , First Publish Date - 2023-10-30T01:07:37+05:30 IST

కళింగాంధ్ర రాజమకుటం వంటి విజయనగరానికి చెందిన మహారాజుకు ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేస్తూ కూడా, ఆనాటి అట్టడుగు సమాజాన్ని తన మనోదృష్టితో చూచి చలించిపోయిన మహనీయుడు గురజాడ అప్పారావు...

కొండుభట్టీయంలో గురజాడ తత్త్వం

కళింగాంధ్ర రాజమకుటం వంటి విజయనగరానికి చెందిన మహారాజుకు ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేస్తూ కూడా, ఆనాటి అట్టడుగు సమాజాన్ని తన మనోదృష్టితో చూచి చలించిపోయిన మహనీయుడు గురజాడ అప్పారావు. ఆయన దేశమంటే ఓ సామ్రాజ్యమో, భూభాగమో కాదని, ‘దేశమంటే మనుజులోయ్‌’ అంటూ సమాజానికి కొత్త ఎరుకను కల్గించిన దార్శనికుడు. ఆనాటి వైదిక బ్రాహ్మణ సమాజాన్ని, అందులోని కర్కశమైన సంప్రదాయాల కశ్మలాన్ని కడిగి పారేసిన సంఘసంస్కర్త. జనసామాన్యానికి చైతన్యం కలిగించేది జనం మాట్లాడే వాడుక భాషేనని, దానిని తన రచనలలో తళతళమెరిసే కత్తిలా వినియోగించిన యోధుడు.

గురజాడ అప్పారావు కన్యాశుల్కం, కొండుభట్టీయం, బిల్హణీయం అనే మూడు నాటకాలు, నాలుగున్నర కథలు, కొన్ని వ్యాసాలు రాశాడు. ఆయన రాసినవే మరెన్నో కవితలు, డైరీలు, లేఖలు దొరుకుతున్నాయి. కళింగదేశచరిత్ర కూడా రాశాడు. కాని దురదృష్టవశాత్తు కనిపించకుండా పోయింది.

‘నాటకాంతంహి సాహిత్యం’ అని అన్నారు ఆలంకారికులు. లలితకళలలో కావ్యరచనది అగ్రస్థానమైతే, కావ్యరచనలలో నాటకరచనది అగ్రతాంబూలం అన్నది వారి అభిప్రాయం. ప్రేక్షకజనాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చెయ్యగల కళ నాటకం. గురజాడ రచించిన అలాంటి నాటకం ‘కొండు భట్టీయము’. 1957లో ముద్రించిన కొండుభట్టీయానికి అవసరాల సూర్యారావు అవతారికరాస్తూ గురజాడ వంగోలు సుబ్రహ్మణ్యంగారికి రాసిన లేఖలోని కొన్ని భాగాలను ఎత్తుకున్నారు:

‘‘నాకు మానవ సమాజం పట్ల మహత్తర బాధ్యత అనేది ఒకటి ఉన్నది... ఇక నాటక ఇతివృత్తం గురించి ప్రపంచ ప్రసిద్ధికెక్కిన ప్రాచీన శృంగారగాథలనుంచి ఇతివృత్తాలను సేకరించుకుని రచయితలు యెందుకు నాటకాలను రచిస్తారో నాకాశ్చర్యంగా వుంది. జీవితంలో ఎంత వైవిధ్యముంది! ఎంత తీవ్రగమనముంది! నేటిజీవితం పుష్కలమైన, అనంతమైన గాథలతో నిండి వుంది. అయితే దీనిని రచయితలు దర్శించరు. అది గొప్ప లోపమని భావించి నిత్యజీవితంనుంచి వొక వస్తువును తీసుకొని దానిని చిత్తరువువలె తీర్చిదిద్ద ప్రయత్నించాను... ప్రజలు మాటలాడుకునే తీయతీయని భాషే దీనికి తగిఉంటుందికదా అని దానినే కళ్ళకద్దుకున్నాను.’’ ఈ వాక్యాల ద్వారా అప్పటికే గురజాడకు సమాజంపట్ల స్పష్టమైన బాధ్యత ఉందని, ఆ దిశగానే సాహిత్యాన్ని సృష్టించారని అర్థమౌతోంది.

కన్యాశుల్కం గొప్ప, సంపూర్ణ సాంఘికనాటకం. అయితే తాను చెప్పదలచుకొన్న విషయం ఇంకా మిగిలిపోయిందని అసంతృప్తికి గురై, మరింత విపులంగా, నేరుగా చెప్పాలని భావించి, కన్యాశుల్కానికి శేషగ్రంథంగా రచించిన నాటకం కొండుభట్టీయం. దీనిని గురజాడ మూడుసార్లు రచించినట్టు తెలుస్తోంది. 1906లో రాసింది గల్లంతు కాగా, మరలా రాశారు. ఈ రెండవది మద్రాసు వెళుతుండగా రచనలున్న సందుగ పెట్టెను దొంగలెత్తుకెళ్ళారు. 1910లో మూడు అంకాలతో మూడవ ప్రతిని తయారు చేశారు.

అవసరాల సూర్యారావు ‘‘1909లో కన్యాశుల్కము రెండవసారి ముద్రించాలని, దానిని మార్చి వ్రాసినపుడు ఆ నాటకానికీ, దీనికీ పోలికలు కనిపించడమలా ఉండగా, ఇందుగల చమత్కారములు కొన్ని అందు చోటు చేసుకున్నవి’’ అని రాశారు. అయినా ఈ రెండింటినీ ఒకచోటచేర్చి తైపారువేసి చూద్దాం.

కన్యాశుల్కంలో వేశ్య మధురవాణి, కొండుభట్టీయంలో వేశ్య పేరు మంజువాణి. మధురవాణి పాత్ర తెలుగు సాహిత్యంలోనే అరుదైనది, ఉదాత్తమైనది అనుకుంటే, మంజువాణి ఒకచోట దిగజారి ప్రవర్తిస్తుంది. తుమ్మపాల జమీందారు త్రివిక్రమరావుతో తాగి, ఇద్దరూ ఒళ్లుతెలియక పడిపోతారు. బ్రాహ్మణులను తన్నడం, వీపులమీద బాదడంలో మధురవాణి కంటే రెండాకులు ఎక్కువ చదువుకుంది మంజువాణి.

కొండుభట్టీయంలోనూ గిరీశం ఉన్నాడు, కాని కన్యాశుల్కం అంతటి పోకిరీ కాడు. కొంత స్థాయి తెలివితేటలు ప్రదర్శిస్తాడు. గిరీశం శిష్యుడు రామ్మూర్తి పరిపక్వత చెందిన బ్రహ్మసమాజ భావాలు కలిగినవాడు. తప్పుచేసిన తండ్రిని ఎదిరిస్తాడు. మేనత్త కూతురు విధవయైున పార్వతిని పెళ్ళాడడానికి సిద్ధంగా ఉంటాడు. పూర్తి నాటకం తయారైతే వారి పెళ్ళితో సుఖాంతమయ్యేదేమో! కన్యాశుల్కంలో వెంకటేష్‌ గురువుచాటు శిష్యుడు. రెంటిలోనూ కొడుకులను తల్లిదండ్రులు మునసబు ఉద్యోగం చేయించాలనుకుంటారు.

కొండు భట్టీయంలో విధవపాత్ర పార్వతి రెండు చోట్ల కనిపిస్తుంది. మేనమామ కొడుకు వెంకన్న అర్భకుడు. వాడితో తన కోర్కెలు తీర్చుకోడానికి ప్రయత్నిస్తుంది. పంతులుగారి అప్ప కనిపించని ఓ విధవ. కొండుభట్లు ఆమెతో సంపర్కం పెట్టుకుంటాడు. దివాన్‌ బహద్దర్‌ రాజారాంకు ఓ విధవ కూతురు ఉంది. ఆమె మీద గిరీశం కన్నేసి, తండ్రి వరస రాజారాంను మామగారూ అని పిలుస్తాడు.

కన్యాశుల్కం 208 పేజీలు. కొండుభట్టీయం 58 పుటల చిన్ననాటకం. ముగింపు లేదన్న లోపం తప్ప ప్రదర్శనయోగ్యం. మూడు అంకాలు, 22 చిన్నచిన్న రంగాలు కలిగిన నాటకం. సంఘటనలు, సంభాషణలు, భాష కన్యాశుల్కంలాగనే ఉంటాయి.

కన్యాశుల్కం రాసిన తరువాత కూడ తన మనసును దొలుస్తున్న అంశాలైన- వైదిక మత నిరసన, నాటి పురోహితవర్గ లౌల్యాన్ని వీధినపెట్టాలనే కోరిక, బ్రహ్మసమాజ కార్యాచరణను నాటకంగా రాసి ప్రజలవద్దకు తీసుకెళ్ళాలనే సంకల్పం... వీటిని నాటకీకరిద్దామనే ఉద్దేశంతో ఈ కొండుభట్టీయాన్ని గురజాడ రాసినట్టు అర్థమౌతుంది. ప్రధాన పాత్ర కొండుభట్లును ఆధారం చేసుకొని గురజాడ కన్యాశుల్కంలో చెప్పగా మిగిలిపోయిన నాటి వైదికబ్రాహ్మణుల అకృత్యాల్ని ఖడ్గధారలాంటి తన సంభాషణలతో నాటకం నిండా ముంచెత్తారు.

నిత్యం జపహోమాదులతో అనుష్ఠానాన్ని నిర్వహించడం, సత్యసంధత, మృదుభాషిత్వం, అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండడం వంటి సత్కర్మలతో ప్రజలమన్ననలను పొందడం పురోహితుని జీవితం. అలాంటి గుణగణాలు కలిగినవాడు తమకు దేవుని ఆశీస్సుల్ని అందజేయగలడనే నమ్మకంతోనే ప్రజలు అతడిని గౌరవిస్తారు. ఇలాంటి వృత్తిలో ఉన్న కొండుభట్లు చలికాలంలో తలకు స్నానం చేయకుండానే శరీరమంతా తడిగుడ్డతో తుడుచుకొని, విభూది రేఖలు పెట్టుకొని, మంత్రాలు చదవడం ప్రారంభిస్తాడు.

సానివాడల్లో తిరుగుతూ, విటులనుతెచ్చి తారుస్తూ వారినుండి డబ్బు సంపాదిస్తాడు. భోగం స్త్రీలతో తన్నులు, దెబ్బలూ తింటాడు. డబ్బు సంపాదించడానికి ఏ అడ్డమైన గడ్డీ తినడానికి సంకోచించడు. మాయలూ, మోసాలూ చేస్తుంటాడు. మంజువాణి ఇచ్చిన బంగారు వస్తువును అక్కాబత్తుడికి అందించిన తరువాత చెవిలో ‘‘చూశారూ మంజువాణి, డబ్బులక్ష్యంగాని, డబ్బు జాగ్రత్తగాని ఉన్న మనిషికాదు. బంగారం కరగడంలో కొంచం కొంచం చెయ్యి తడిచేసుకోవచ్చును. మావాడి వివాహం ఒకటి తటస్థించింది. డబ్బుకు వ్యాపకం పడుతున్నాను’’ అని కొండుభట్లు మాయను ఉపదేశిస్తాడు.

కొడుకు రామ్మూర్తితో- రాముడు దేవుడుకాడని, వెధవముండల్ని పెళ్ళిచేసుకొమ్మనే కిరస్థానపు వెధవలకు సానింటికి వెళితే తప్పొచ్చిందీ అని సానింటికి వెళ్ళడాన్ని సమర్థించుకుంటాడు. ఈ వైదికబ్రాహ్మణుడు ఇంకోచోట అవసరంకొద్దీ ‘నేను పరాయివాణ్ణికాను శాక్తేయుణ్ణీని, వామాచారతత్పరుణ్ణిన్ని’ అంటాడు. ఏయెండ కాగొడుగు డబ్బుకోసం పడుతుంటాడు.

ఒకే డైలాగ్‌లో రంగులెలా మారుస్తాడో చూడండి. శెట్టితో ఇలా అంటాడు: ‘‘సరేగానీ ప్రొద్దు పోతూంది. నువ్వు ముందువెళ్ళి పెరటిగుమ్మం దగ్గిర ఉండు. నేనిప్పుడే ఆ బోడిపంతులుని బసకు దిగబెట్టి వచ్చి కలుసుకుంటాను.’’ త్రివిక్రమరావు వద్దకు వెళ్ళి ఇలా అంటాడు: ‘‘ప్రభువువారు దయ చెయ్యాలి. యేదిరా గుఱ్ఱబ్బండీ. తీసుకురా జట్కా! ప్రభువ్వారి హోదాకు తగినదికాదు కాని, కుచేలుడింటికి కృష్ణమూర్తివారు విజయంచేసినట్టు అనుగ్రహించాలి’’. ‘బోడిపంతులు’ అని సంబోధించిన నోటితోనే వెనువెంటనే త్రివిక్రమరావును ‘ప్రభువ్వారు’ అంటూ పిలుస్తాడు.

ఆ తరువాత మంజువాణి ఇంట్లోకి దొంగతనానికి వెళ్ళి రత్నాంగి చేతికి దొరికిపోతాడు. ఆవిడ అతడి శిఖను కత్తిరిస్తుంది. వైదికులకు పవిత్రమైన యజ్ఞోపవీతాన్ని, దర్భముడి ఉంగరాన్ని లాక్కుంటుంది, తీవ్రంగా అవమానిస్తుంది.

ఒకచోట పాపన్నతో ఇలా అంటాడు. ‘‘నేను కొంచం వైద్యం కూడా చేస్తాను. పంతులుకి పైత్యాధికం పోవడానికి అప్పటప్పట విరోచనసాధనం చేస్తాను. దాంతో మూడునాలుగు రోజులు మంజువాణికి ఆటవిడుపు కలుగుతూ వుంటుంది’’ అని ఆమెను ఉంచుకున్న నరహరిరావుకు కళ్ళుకప్పి, తుమ్మపాలేం మొఖాసాదారు త్రివిక్రమరావుకు మంజువాణిని తార్చడానికి పథకం పన్నుతాడు.

కొండుభట్లు తాను చేసిన అకృత్యాలన్నిటినీ ఒక శ్లోకంద్వారానో, మంత్రంద్వారానో సమర్థించుకుంటాడు. అలాంటిచోట్ల గురజాడ ప్రాచీనసంస్కృతవాక్యాలను తగిలిస్తుంటాడు: ‘గతానుగతికో లోకః’, ‘భీష్మాత్‌ వాతః పవతే భీష్మోదేతి సూర్యః భీష్మాదగ్నిశ్చండశ్చ’, ‘ఘట్కర్ణాభిద్యతే మంత్రాని’, ‘ అవిషం విషమిత్యాహుః బ్రహ్మస్వం విషముత్యతే!’, ‘భార్యా రూపవతీ శతృః’, ‘ప్రాప్తే షోడశ వర్షాణి పుత్రం మిత్రవదాచరేత్‌!’

గురజాడ మతాలన్నిటినీ వ్యతిరేకిస్తాడు. నాస్తికత్వాన్ని కూడ వ్యతిరేకిస్తాడు. బ్రహ్మసమాజం హేతుబద్ధమైనదని నమ్ముతాడు. తృతీయాంకం ఒకటవ, రెండవ రంగాల్లో కేశవరాయుడు, దివాన్‌ బహద్దర్‌ రాజారాం, గంగాధర శాస్త్రి, గిరీశం విధవావివాహ విధిని గురించి, మతాల గురించి చర్చిస్తారు. బ్రహ్మసమాజ మతస్తులు బ్రాహ్మణశాస్త్రోక్త పద్ధతిలో చేసుకొనే వివాహానికి వ్యతిరేకిస్తూ ఇక్కడ ఒక చర్చను నడిపిస్తాడు గురజాడ. ‘‘బ్రహ్మసమాజము లోకములోనుండు మతములన్నిటికన్నా రేషనల్‌’’ అని దివాన్‌ బహద్దర్‌ రాజారాం అంటాడు. అంతేకాదు ‘‘రెలిజియన్‌ రేషనల్‌గా వుండకుంటే అన్యమతస్తుల యొక్క, నాస్తికం యొక్క ఢోకాకు నిలవగలదా?’’ అని కూడా అంటాడు.

రామ్మూర్తి తన పెదనాన్నకొడుకు వెంకన్నతో ‘‘రాముడు దేవుడు కాడుట. మహారాజు రావణాసురుడికి ఒకటే బుర్ర. విన్నావా!’’, ‘‘మంత్రాలబద్ధం. శ్రమపడి పునశ్చరణ చెయ్యకు’’. అని ఆయా సందర్భాలలో చెబుతుంటాడు. తన తండ్రి కొండుభట్లుతో, ‘‘కిరస్తానమతం అసత్యమతం!’’ అంటాడు. ఈ రకంగా గురజాడ నేడు ఉన్న అన్నిమతాలూ స్వార్థపూరితమైనవి, దోషభూయిష్టమైనవని నిర్ధారించి చెబుతాడు. దార్శనికుడు కనుకనే ‘మతములన్నియు మాసిపోవును, జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును’ అనగలిగేడు. 160 ఏళ్ళు దాటినా ప్రజలమధ్య జీవించ గలుగుతున్నాడు. ప్రజాకవి అనిపించుకుంటున్నాడు గురజాడ అప్పారావు.

గార రంగనాథం

98857 58123

Updated Date - 2023-10-30T01:07:37+05:30 IST