పిడికెడు ఆత్మగౌరవం కోసం...!

ABN , First Publish Date - 2023-06-03T01:51:21+05:30 IST

‘ఐరోపాను ఒక భూతం వెంటాడుతోంది. అదే కమ్యూనిజం’. 1848 ఫిబ్రవరి 21న అత్యంత ప్రభావవంతమైన రాజకీయ పత్రాన్ని (కమ్యూనిస్టు మేనిఫెస్టో) రాస్తూ జర్మన్‌ తత్వవేత్తలైన కార్ల్‌ మార్క్స్‌, ఫ్రెడరిక్‌ ఎంగెల్స్‌ అన్న మాట ఇది.

పిడికెడు ఆత్మగౌరవం కోసం...!

‘ఐరోపాను ఒక భూతం వెంటాడుతోంది. అదే కమ్యూనిజం’. 1848 ఫిబ్రవరి 21న అత్యంత ప్రభావవంతమైన రాజకీయ పత్రాన్ని (కమ్యూనిస్టు మేనిఫెస్టో) రాస్తూ జర్మన్‌ తత్వవేత్తలైన కార్ల్‌ మార్క్స్‌, ఫ్రెడరిక్‌ ఎంగెల్స్‌ అన్న మాట ఇది. అలానే వర్తమాన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ను దళిత భూతం వెంటాడుతోంది. రాష్ట్రంలో నాలుగేళ్ళ వైసీపీ ఏలుబడిలో జరిగిన ఎస్సీ, ఎస్టీలపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు, శిరోముండనాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అమానుష, అవమానకర రీతిలో జరిగిన దాడులపైనా, దౌర్జన్యాలపైనా, మరణాలపైనా, మానభంగాలపైనా వారు ‘పిడికెడు ఆత్మగౌరవం కోసం’ అంటూ రాష్ట్రమంతటా నిలదీస్తున్న పరిస్థితి ఉంది.

కొవిడ్‌ మహమ్మారి నుంచి ప్రాణ రక్షణ కోసం మాస్కుల కొరతపై ప్రశ్నించిన దళిత డాక్టర్‌ కోలవెంటి సుధాకర్‌ పట్ల అటు పోలీసులు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన అమానవీయ వైఖరి దళితుల గుండెల్ని బలంగా గాయం చేసింది. ఉద్యోగం నుంచి సస్పెండ్‌ చేసి, పిచ్చోడు అన్న ముద్ర వేసి, నడిరోడ్డుపై పెడరెక్కలు విరిచి కట్టి, అరెస్టు చేసిన దృశ్యాలు, ఆయన హృద్వేగానికి గురై మరణించిన సంఘటన వారి కళ్ళ ముందు కదలాడుతున్నది. మాస్క్‌ పెట్టుకోలేదన్న కారణంతో కిరణ్‌ బాబు, అబ్రహాం అనే ఇద్దరు యువకులు చీరాల వెళ్తుండగా పోలీసులు అడ్డుకొని ప్రయోగించిన లాఠీ దెబ్బలకు కిరణ్‌ ఆసుపత్రిలో మృతి చెందాడు. తన దగ్గర పని చేసిన డ్రైవర్‌ వీధి సుబ్రహ్మణ్యంను పక్కా ప్లాన్‌తో ఇంటి నుంచి తీసుకెళ్లి, చిత్రహింసలకు గురిచేసి, తన కారులోనే శవాన్ని డోర్‌ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు దుశ్చర్య ప్రభుత్వ రాకాసి పాలనకు అద్దం పడుతోంది. ఇసుక ట్రాక్టర్‌ అడ్డుకున్నాడు అన్న ‘నేరం’పై సీతానగరం పోలీస్‌ స్టేషన్‌లో ఇందుగుమిల్లి వరప్రసాద్‌కు శిరోముండనం చేశారు. ఆత్మగౌరవంతో రాష్ట్రపతికి లేఖ రాసినా, రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదు. వడ్డీ డబ్బులు కట్టలేదని నేరేడుచర్లలో రమాకాంత్‌ భూక్యా అనే గిరిజన మహిళను ట్రాక్టర్‌తో తొక్కించి చంపారు. దళిత జడ్పీటీసీ శీనయ్య కుర్చీపై మూత్రం పోసి అవమానపరిచారు. పేరేచర్లలో దళిత మహిళపై జరిగిన అత్యాచారం కేసులో 80 మంది అనుమానితులుగా పోలీసులు చెప్పారు. పుంగనూరులో ఒక దళిత యువకుడిని కాళ్లూచేతులు కట్టి బావిలో పడేశారు. కడప పశుసంవర్ధక శాఖ డిడిగా పనిచేసిన డాక్టర్‌ అచ్చన్నను హత్య చేశారు. పులివెందుల నాగమ్మ, నంద్యాల మహాలక్ష్మి అత్యాచారాలకు గురయ్యారు.

ఏపీలో ఆసుపత్రులు, రైల్వేస్టేషన్లు అత్యాచారాల కేంద్రాలుగా మారాయి. అబ్దుల్‌ సలాం అనే మైనార్టీ ఆటో డ్రైవర్‌ నలుగురు కుటుంబ సభ్యులతో సామూహిక ఆత్మహత్య చేసుకోవటం మహా దారుణం. హజీరా అనే యువతిపై అత్యాచారం జరిగి రెండేళ్ళు గడిచినా దోషులు దొరకలేదు. ఇన్ని సంఘటనలు జరుగుతున్నా, దున్నపోతు మీద వర్షం కురిసినట్లుగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉలుకూ లేదు. పలుకూ లేదు. ఈ దాడులు, హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? వీటి నివారణకు మార్గాలు ఏమిటి? అన్న ధ్యాస ఇసుమంతైనా లేదు. రాష్ట్ర ప్రభుత్వంలో 40 మంది దాకా ప్రభుత్వ సలహాదారులు ఉన్నా, వారేం చేస్తున్నారో తెలియదు. పైగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి నా ఎస్సీ, నా ఎస్టీ... అనే పదాలను వల్లెవేయడం తప్ప, ఎస్సీలు ఎందుకు చంపబడుతున్నారు? ఎస్టీలు ఎందుకు చనిపోతున్నారు? అన్న రహస్యం గూర్చి మాత్రం ఆయన చెప్పరు.

ఈ హత్యల పరంపరలను ఎదుర్కొనేందుకు ‘మాకు ఊపిరి ఆడటం లేదు’ అన్న నినాదంతో దళితులు సమీకృతులయ్యారు. పోరాట జెండాలు చేతబట్టారు. కంచె చేను మేసిన చందంగా ఏపీలో ఐపీసీ... వైసీపీగా మారిన వేళ, పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న వేళ, రోమ్‌ నగరం తగలబడుతుంటే, ఫిడేలు రాగాలు ఆలపిస్తున్న వేళ... అణగారిన కులాలను తట్టి లేపే పనిని దళిత ఉద్యమకారులు చేపట్టారు. తెలుగు నేలపై దళితుల ఉద్యమ చరిత్రకు కొదవలేదు. వారు చేసిన పోరాటాల చరిత్రలు దేశంలోని అణగారిన వర్గాల పోరాటాలకు ఆదర్శం అంటే అతిశయోక్తి కాదు. కంచికచర్ల నుంచి కారంచేడు వరకు, నీరుకొండ నుంచి కేలవేణ్మని వరకు సుదీర్ఘమైన అంటరాని పెనుమంటల చరిత్ర వారి సొంతం. ‘సంకెళ్లు వేసిన వాడినే వచ్చి సంకెళ్లు తీయమని అడగటం కంటే మన సత్తా పెంచుకొని వాటిని చేధించడం మంచిది’ అంటారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేడ్కర్‌. ఏపీలో దళితులకు ఆయన మాటలే శిరోధార్యం కావాలి. ప్రజాస్వామ్యంపై ప్రమాణం చేసిన పాలకులు రాజ్యాంగపరమైన హక్కులకు ఘోరీ కడుతుంటే, మానవ హక్కులను భక్షిస్తుంటే, మనిషి జీవించే హక్కును కాలరాస్తుంటే అణగారిన కులాలకు పోరాటం ఒక్కటే శరణ్యం. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకెళ్లు తప్ప అన్న నినాదమే వారికి ప్రాణవాయువుగా మారాలి. దళిత వ్యతిరేక ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రం బోనులో నిలబెట్టి అణగారిన కులాలు శిక్షించక మానవు.

పోతుల బాలకోటయ్య

ఆంధ్రప్రదేశ్‌ బహుజన ఆత్మగౌరవ సమితి అధ్యక్షులు

Updated Date - 2023-06-03T01:51:21+05:30 IST