ఒక అమృత భాండం... కొన్ని బిందువులు

ABN , First Publish Date - 2023-05-01T01:04:36+05:30 IST

మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకిని కవ్వపుతాడుగా చేసుకుని దేవ దానవులు జరిపిన క్షీరసాగర మథనం నుంచి వరుసగా..

ఒక అమృత భాండం... కొన్ని బిందువులు

మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకిని కవ్వపుతాడుగా చేసుకుని దేవ దానవులు జరిపిన క్షీరసాగర మథనం నుంచి వరుసగా హాలాహలం, కామధేనువు, ఉచ్ఛైశ్రవం, ఐరావతం, కల్పవృక్షం, మహాలక్ష్మి బయల్వెడలగా, చివరగా అమృత కలశాన్ని చేత ధరించి విష్ణ్వాంశతో ధన్వంతరి అనే దివ్య పురుషుడు ఉద్భవించాడని పౌరాణిక కథనం. ఆ అమృత భాండం అమరలోకంలో భద్రపరచబడింది. మాతృదాస్య విముక్తికోసం ఆ అమృత భాండాన్ని సేకరిం చవలసిన అవసరం గరుత్మంతునికి కలిగింది. దీనికి సంబంధించి ఆంధ్ర మహాభారతం, ఆదిపర్వం, ద్వితీ యాశ్వాసంలో ఒక ఆసక్తికర ఉపాఖ్యానం వుంది. కశ్యప ప్రజాపతికి కద్రువ, వినత అని ఇద్దరు భార్యలు. వినతకు అనూరుడు, గరుత్మంతుడు సంతానం. కారణాంతరావల్ల వినత కద్రువకు దాస్యం చేయవలసివస్తుంది. తన తల్లి వినతకు దాస్యవిముక్తి కలిగించవలసిందిగా గరుత్మంతుడు కద్రువను కోరతాడు. అందుకు కద్రువ తనకు అమృతం తెచ్చి యివ్వమంటుంది. గరుత్మంతుడు దేవలోకం వెళ్లి ఇంద్రుణ్ణి జయించి అమృతం తెచ్చి కద్రువకు ఇచ్చి తల్లి వినతకు దాస్య విముక్తి చేశాడు. ఇంద్రుడు మాయో పాయం చేత ఆ అమృతాన్ని మళ్లీ ఇంద్రలోకం తీసుకు పోతాడు. స్థూలంగా ఇదీ కథ.

గరుత్మంతుడు ఇంద్రలోకం నుంచి అమృతాన్ని తెచ్చే సందర్భాన్ని ఆధునిక సాహిత్యంలో మూడుతరాల కవులు మూడు సందర్భాల్లో అతిశయంగా వర్ణించారు.

మొదటిది తెలుగు సాహిత్య వైతాళికుడు యుగకర్త గురజాడ అప్పారావు రాసిన ‘కన్యాశుల్కం’ (1897-1909) నాటకంలో గిరీశం నోట పలికించిన పద్యం:

‘‘ఖగపతియమృతముతేగా

భుగభుగమనిపోయి చుక్క భూమిని వాలెన్‌

పొగచెట్టై జన్మించెను

పొగతాగనివాడు దున్నపోతై పుట్టున్‌’’.

- గిరీశం, వెంకటేశం గురుశిష్యులు. ఒక సందర్భంలో గిరీశం వెంకటేశాన్ని ఉద్దేశించి చెప్పినది ఈ పద్యం. వెంకటేశం పరీక్ష తప్పినప్పుడు, వాళ్ల మాస్టారు నువ్వు గిరీశంతో మాట్లాడడం మానేయి. ఆయన సావాసం వలనే నీ పరీక్ష పోయిందని అంటాడు. ఆ మాటే వెంకటేశం గిరీశంతో అంటాడు. అనడమే కాదు ‘‘మీ వల్ల నాకు వచ్చిందల్లా చుట్ట కాల్చడం ఒక్కటే. పాఠం చెప్పమంటే ఎప్పుడూ కబుర్లు చెప్పడఁవే కానీ ఒక మారయినా ఒక ముక్క చెప్పిన పాపాన పోయినారా?’’ అని నిలదీస్తాడు. ఊహించని ఈ పరిణామంతో కంగుతినన్న గిరీశం సర్దుకుని తను ఇచ్చిన గొప్ప గొప్ప లెక్చర్స్‌ గురించి ఏకరవు పెడుతూ ఇలా ఉపన్యాసం మొదలు పెడతాడు: ‘‘చుట్ట నేర్పినందుకు థాంక్‌ చెయ్క తప్పు పడుతున్నావ్‌, చుట్ట కాల్చడం యొక్క మజా నీకు ఇంకా బోధపడకపోవడం ఆశ్చర్యంగా వుంది. చుట్ట కాల్చబట్టే కదా దొరలింత గొప్ప వాళ్లయినారు. చుట్ట కాల్చని ఇంగ్లీషువాణ్ని చూసావూ! చుట్ట పంపిణీ మీదనే స్టీము యంత్రం వగయిరా తెల్లవాడు కనిపెట్టాడు. కాకపోతే వాడికి పట్టుబల్లా! శాస్త్రకారుడు యేవన్నాడో చెప్పానే’’ అంటూ పై పద్యం చెప్పాడు గిరీశం. పైగా ‘‘ఇది బృహన్నారదీయం నాలుగవ ఆశ్వాసంలో వున్నది’’ అని ఒక దబాయింపు శాస్త్ర ప్రతిపత్తిని చూపెడతాడు - మంచో చెడో తన తర్కానికి మద్దతుగా అమృతపు బిందువును నుంచి పొగాకు చెట్టు పుట్టిందని ఒక అభూత కల్పన చేశాడు గిరీశం. గురజాడ కన్యాశుల్క నాటక పద్యాన్ని ఆధారంగా తీసుకుని శ్రీశ్రీ తన ‘సిరి సిరి మువ్వ’ శతకంలో:

‘‘ఖగరాట్‌ కృషి ఫలితంగా

పొగాకు భూలోక మందు పుట్టెను గానీ

పొగ చుట్ట లెన్ని యైునను

సిగరెట్టుకు సాటిరావు సిరి సిరి మువ్వా!’’ - అని గరుత్మంతుని కృషివల్లే పొగ చెట్టు భూమి మీద పుట్టిందని స్థిరీకరించడమే కాకుండా పొగ చుట్టలు ఎన్నైనా ఒక్క సిగరెట్టుకు సాటి రావు అంటాడు. గురజాడ అడుగుజాడను శ్రీశ్రీ ఇలాంటి హాస్యపు తావుల్లోను విడిచి పెట్టలేదు.

రెండవది నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువాదిగా చెప్పబడుతున్న చాటుపద్యం:

‘‘వాలి ఖగేశ్వరుండమృత భాండము భూమికి దెచ్చువేళ - జే

జేలరణంబులో తొణికి చిందిన బిందువులే విధాన - సీ

సాలకు బట్టిరో తెలియ జాలము నేడమృతాంజనాఖ్యతో

చాల గడించె పేరు, గుణ సంపద నొప్పులద్రోసి రాజనన్‌’’

‘ఇది జాషువా పద్యమేనా?’ శీర్షికతో జాషువా జయంతి సందర్భంగా ప్రముఖ కవి రసరాజు రాసిన ఒక వ్యాసంలో పై పద్యాన్ని ఉటంకించారు. ఆ వ్యాసంలో రసరాజు ఇలా చెప్పుకొచ్చారు. ‘‘ఈ పద్యాన్ని కవులు, హరికథకులైన మా నాన్న రంగినేని కాశిరాజు ఎవరికో వివరిస్తుంటే నేను నా బాల్యంలో విన్నాను. ఇది జాషువా పద్యమని నాతో ఓ సారి నాన్న అన్నారు. సుమారుగా ఎనభై ఏండ్ల క్రితం పద్యమిది. అప్పుడు విన్న ఆ పద్యం చిన్నవయస్సు కావడం వలన ధారణలో అంతగా లేకపోయింది. పద్యం ఉత్పలమాల. మూడు పాదాలే గుర్తున్నాయి. ఇదే విషయం తణుకులో నివసించిన, కవిపండితులు తంగిరాల వేంకట కృష్ణ సోమయాజులకి విన్నవిస్తే వారు శేషభాగాన్ని పూర్తిచేసారు తనదైన రీతిలో.’’ ఈ కథనాన్ని బట్టి రసరాజు వాళ్ల నాన్న చెప్పిన మాట ఆధారంగా పై పద్యాన్ని జాషువా పద్యంగా నిర్ధారించుకుని, ఇది, జాషువా పద్యమేనా? అంటూ బంతిని పాఠకుల కోర్టులోకి నెట్టారు. ఆ విషయం పక్కన పెడితే, ఆంధ్రపత్రిక, అమృతాంజనం వ్యవస్థాపకులు దేశోద్దారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారు ‘అమృతాంజ నము’ అంశంగా మంచి పద్యం రాసినవారికి వేయినూట పదహార్లు బహుమతి ప్రకటించారనీ, వచ్చిన అనేక కవితల్లో పై పద్యం బహుమతి గెలుచుకుందనీ, ఇది జాషువాగారి పద్యమనీ రసరాజు ఇచ్చిన సమాచారం.

ఈ పద్యంలోనూ గరుత్మంతుడు అమృతాన్ని తెస్తోండగా ‘‘తొణికి చిందిన బిందువులేవిధాన సీసాలకు బట్టినారో నేడమృతాంజానాఖ్యాతో’’ అని అమృతబిందువులు పట్టిన సీసాలు అమృతాంజనంగా పేరు గడించింది అనడం సాభిప్రాయ విశేషం.

ఇక మూడవది సుప్రసిద్ధ భావకవి నాయని సుబ్బారావు ‘జన్మభూమి’ కావ్యంలోనిది. జాషువాకు ‘వినుకొండ’లా నాయనికి ‘పొదిలె’ జన్మభూమి - ‘‘ఇతర జనపదముల నేను ప్రవాసినై / మఱచియైున మేను మఱచియైున/ కన్నతల్లి పొదిలెయున్న దిక్కున కాళు/ లుంచి యెపుడు పవ్వళించలేదు’’ అన్నంత కంఠదఘ్నమైన ప్రేమ పొదిలె పై నాయనివారికి. పొదిలె ప్రకృతి పరిసరాలను వర్ణిస్తూ చెప్పిన ఈ పద్యం చూడండి.

‘‘ఖగపతి మాతృదాస్య విషకర్కశ రోగ నివారణోద్యమ

ద్విగుణిత వేగుడై యమృతబిందువులాయములందుజిందియ

య్యగణిత గండల నివహమ్ముల జీవము చిమ్మి రేగునో

యెగసి నభోంతరాళపథ హిండన దక్షములెల్లవృక్షముల్‌.’’

(- ‘జన్మభూమి’, ప్రకృతిఖండము, 44వ పద్యం)

పొదిలె చుట్టూ రాళ్లూ రప్పలతో కొండలూ గుట్టలూ - అయినా ఆ గండశిలను బద్దలుకొట్టుకుంటూ నవనవ లాడుతూ వృక్షాలు పైకెగసివచ్చాయి - దానికి కారణాన్ని పై పద్యంలో ఊహిస్తున్నాడు. గరుత్మంతుడు ‘‘మాతృదాస్య విషకర్కశ రోగనివారణోద్యమ’’ నిమిత్తుడై అమృతాన్ని ‘ద్విగుణిత వేగుడై’ తెస్తున్నప్పుడు అమృత బిందువులు గండశిలల సమూహంలో చిందాయి. అంటే ఆ అమృతస్పర్శతో గండశిలలు ‘జీవము చింది’ వాటి మొదళ్లనుండి వృక్షాలు ఆకాశానికి మెడలుసాచాయి. అదీ అమృతం మహిమ - మాతృదాస్యాన్ని ‘విషకర్కశరోగము’తో పోల్చడం నాగజాతికి తన తల్లి వినత చేస్తున్న దాస్యంలోని తీవ్రతను తెలియచేస్తుంది - ద్విగుణిత వేగం - అమృతబిందువులు చిమ్మడానికి దోహదం చేసింది. ‘నభోంతరాళపథం’ వృక్షాలు ఆకాశమే హద్దుగా ఎదిగాయని సూచిస్తున్నాయి. ఇలా భారతగతమైన అమృత వృత్తాంతం ఆధునిక సాహిత్యంలో పొగచెట్టు పుట్టడానికి, అమృతాంజనం తయారు కావడానికీ, గండలములు మెత్తబడి జీవం తొణికిసలాడే వృక్షాలు పెరగడానికి కారణమైంది.

ఆధునిక కవిత్వంలో కూడా అమృతం విస్తరించింది. తిలక్‌ తన కావ్యానికి ‘అమృతం కురిసిన రాత్రి’ అని పేరు పెట్టుకున్నాడు. ‘‘జలజలమని కురిసిందివాన/ జాల్వారింది అమృతంపుసోన/ దోసిళ్లతోతాగి తిరిగి వచ్చాను / దుఃఖాన్ని చావునీ వెళ్లిపొమ్మన్నాను’’ అన్నారు. శ్రీరంగం నారాయణబాబు ‘గడ్డిపరకలు’ కవిత గరుత్మంతుడు అమృతం తీసుకురావడం నేపథ్యంగా రాసింది - ఈ వ్యాసకర్త ‘పులసచేప స్వగతం’ కవితలో ‘‘దేవతలే దిగివచ్చి/ ఒక చేత అమృతభాండం/ మరొకచేత/ పులస చేపలపులుసు చట్టి పట్టుకొని/ ఏదికావాలో కోరుకోమంటే/ పులుసుచట్టినే కోరతారు/ ఈ జిల్లా భోగజనులు’’ అని రాశాడు. వచన కవిత్వంలో అమృత ప్రస్తావనలు వెతికితే ఒక గ్రంథమే అవుతుంది. ఇలా ఒక అమృతభాండం.... కొన్ని బిందువులు.

శిఖామణి

- 98482 02526

Updated Date - 2023-05-01T01:13:04+05:30 IST