ఏభై ఏండ్ల దళితోద్యమం.. గతి తప్పింది ఎక్కడ?

ABN , First Publish Date - 2023-09-02T01:26:41+05:30 IST

దళిత విద్యావంతులు, మేధావులలో లంపెన్ వర్గం ఒకటి తయారైంది. వీరందరూ మాటల్లో అంబేడ్కర్‌ను పొగుడుతూ, చేతల్లో....

ఏభై ఏండ్ల దళితోద్యమం.. గతి తప్పింది ఎక్కడ?

దళిత విద్యావంతులు, మేధావులలో లంపెన్ వర్గం ఒకటి తయారైంది. వీరందరూ మాటల్లో అంబేడ్కర్‌ను పొగుడుతూ, చేతల్లో మాత్రం జగ్జీవన్ రామ్‌ను అనుసరిస్తూ పాలకవర్గాలతో చేరి అందుకు అనుగుణంగా రాస్తున్నారు, పాడుతున్నారు, ఆడుతున్నారు.

భారతదేశ ప్రజా ఉద్యమాల్లో మహారాష్ట్ర దళిత ఉద్యమానికి ప్రత్యేకస్థానం ఉంది. అంతవరకు డాక్టర్ అంబేడ్కర్ అవలంబించిన ఘర్షణరహిత వ్యూహాలకు భిన్నంగా షెడ్యూల్ కులాలలో వామపక్ష పోరాట పద్ధతులను ఈ ఉద్యమం తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ప్రభావాన్ని చూపటంతోపాటు, ముఖ్యంగా సాహిత్యరంగంపై నేటికీ విశేష ప్రభావాన్ని కలిగి ఉంది. 1972లో ప్రారంభమై, యాభైయేళ్ళు పూర్తిచేసుకున్న ఈ ఉద్యమంపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది.

దళిత్ పాంథర్స్ ఉద్యమ సిద్ధాంతంలోనూ, దాని పోరాట పద్ధతుల్లోనూ నక్సలైట్ భావజాలం స్పష్టంగా కనిపిస్తుంది. 1973లో ప్రకటించిన దళిత మేనిఫెస్టోలో భూపంపిణీతో పాటు వర్ణ, కుల, వర్గ వ్యవస్థ నిర్మూలనను లక్ష్యంగా ప్రకటించుకున్నది. అంతేగాక వామపక్షాల పార్లమెంటేరియన్ రాజకీయాలను, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అవకాశవాద రాజకీయాలను ఆ కార్యక్రమం విమర్శించింది. 1974లో సెంట్రల్ బాంబే నియోజకవర్గం నుంచి లోక్‍సభకు జరిగిన ఉపఎన్నికను కూడా బహిష్కరించారు. ఉద్యమ నిర్మాతల్లో ఒకరైన నాందేవ్ దసల్‌కు కమ్యూనిస్టు భావజాలం ఉండటమే ఈ ధోరణికి కారణం. బుద్ధిస్ట్ – అంబేడ్కరైట్ అయిన రాజదాలేకు ఆ కార్యక్రమంతో విభేదం ఉన్నప్పటికీ మిలిటెన్సీ విషయంలో విభేదం ఉన్నట్లు కనబడదు.

సహజంగానే అణచివేత, వివక్షలు, పేదరికంవల్ల దళితుల్లో మిలిటెన్సీ పట్ల ఆరాధనాభావం ఉంటుంది. కానీ ఈ మిలిటెన్సీ అంబేడ్కర్ పోరాట పద్ధతికి వ్యతిరేకమైనది. ఆయన జీవితకాలంలో శాసన వ్యవస్థలను కేంద్రంగా చేసుకొని రాజకీయ పోరాటాలను నిర్మించాడు. దళితులు హిందువులలో భాగం కాదని చాటి, ప్రత్యేక రాజకీయ గ్రూపుగా నిలిపి హక్కులను డిమాండ్ చేయటం కోసమనే మహద్ చెరువు పోరాటం, నాసిక్ దేవాలయ ప్రవేశ పోరాటం వంటివి చేపట్టాడు. అణచివేతకు గురవుతున్న ఏ సామాజికవర్గాల సమస్యల పరిష్కారమైనా రాజకీయాల ద్వారానే సాధ్యమవుతుందని విశ్వసించాడు. అందుకు అనుగుణంగానే బాంబే ప్రెసిడెన్సీకి ఎన్నిక మొదలుకొని అటు తర్వాత రాజ్యాంగ నిర్మాణ సభను, పార్లమెంటును తన రాజకీయపోరాట కేంద్రాలుగా చేసుకొని కార్యాచరణ కొనసాగించాడు. ఇందుకోసమే ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ వంటి రాజకీయ పార్టీలను ఏర్పాటు చేశాడు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది ఆఖరిలో వచ్చింది. ఈ విధంగా ఆయన జీవితం అంతా రాజకీయ పోరాటాలే కనిపిస్తాయి. కానీ ఆయన్ను మార్గదర్శిగా భావించే దళిత విద్యావంతులు ఆయన రాజకీయ పోరాట పంథాకు పూర్తి వ్యతిరేక రూపాలను తీసుకుంటున్నారు. అందుకు భిన్నంగా ఈ దళిత్ పాంథర్స్ ఉద్యమం వామపక్ష ఆందోళన పద్ధతులను అనుసరించింది. కాబట్టే ఎలాంటి రాజకీయ ఫలితాలను సాధించకుండానే 1974 నాటికే చీలికకు గురై అ తరువాత స్తబ్ధతలోకి నెట్టబడింది.

ఇక మన దగ్గర చుండూరు, కారంచేడు ఘటనల నేపథ్యంలో దళిత ఉద్యమం పురుడు పోసుకుంది. మొదట హేతువాద ఉద్యమంలో ఉన్న కత్తి పద్మారావు, నక్సలైటు భావజాలం గల బొజ్జ తారకం లాంటి వారు ఈ ఘటనల నేపథ్యంలో దళిత ఉద్యమాన్ని నిర్మించారు. కానీ దళిత మహాసభ ఉధృతి ఈ రెండు ఘటనలకే పరిమితమైంది. ఆ తరువాత అలాంటి ఘటనలు జరిగినప్పటికీ దళిత మహాసభ గతంలోలాగా ఉద్యమించలేకపోయింది. దళితులపై నిత్యం ఏదో మూల హత్యలు, దాడులు, వివక్షలు కొనసాగుతున్నప్పటికీ ఎందుకని దళిత ఉద్యమం కొనసాగలేకపోయిందనే అంశంపై ఇప్పటి వరకు ఆత్మపరిశీలన చేసుకున్నట్లు కూడా కనపడదు.

చారిత్రకంగా పరిశీలిస్తే, మన తెలుగు రాష్ట్రాలలో షెడ్యూల్ కులాల విద్యావంతుల స్పృహ మొదట ఎస్సీ చైతన్యంగా 1990 నాటికి కనబడుతుంది. ఆ తరువాత చుండూరు, కారంచేడు ఘటనలతో దళిత చైతన్యంగా మారింది. కాన్షీరాం రాకతో బహుజన రాజకీయ చైతన్యంగా మారే క్రమంలో ఎమ్మార్పీఎస్ రావటంతో ఎస్సీల విభజన ఉద్యమాలు ముందుకు వచ్చాయి. అంటే దళిత చైతన్యం కాస్తా మాల, మాదిగ, ఉపకులాల చైతన్యానికి కుదించబడ్డది. ఒక్క మాటలో చెప్పాలంటే కులాల అస్తిత్వాన్ని ఘనీభవింపజేసింది. కవులు, మేధావులు మనువాద పద్ధతిలోనే కులాలవారి అస్తిత్వ సాహిత్యాన్ని అద్భుతంగా సృష్టిస్తున్నారు. బహుజన సాహిత్యం కూడా కులాల అస్తిత్వం గురించే రాస్తున్నప్పుడు దళిత చైతన్యం, ఉద్యమం ఎలా బతికిబట్టకట్టగలుగుతుంది?

మనువాద పద్ధతిలో కులాలవారీగా సంఘాలు పెట్టుకుని పోరాడే పద్ధతికంటే దళిత ఉద్యమం అభ్యుదయకరమైనది. వైపరీత్యం ఏమంటే, మహారాష్ట్ర నక్సలైట్ ఉద్యమం షెడ్యూల్ కులాలను ఉమ్మడిగా, ఇంకా విస్తృత అర్థంతో అక్కడ వారిని కలిపి ఉద్యమాన్ని చేపడితే ఇక్కడి నక్సలైట్ ఉద్యమాల నుంచి వచ్చిన కె.జి. సత్యమూర్తి, ఉ. సాంబశివరావు, మారోజు వీరన్న, కంచె ఐలయ్య, బిఎస్ రాములు లాంటి వారు ఇంతకు ముందు పేర్కొన్న మనువాద కుల ఉద్యమాలకు సిద్ధాంత భూమికలను రూపొందించారు. కుల ఉద్యమాలు వచ్చినప్పుడు దళిత ఉద్యమం అనేది సహజంగానే చచ్చిపోతుంది. ఈ కులాలవారీ ఉద్యమాలను అన్ని నక్సలైట్ గ్రూపులు, వారి మేధావులు ఏదోమేరకు సమర్థించిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి తెలుగునాట దళిత ఉద్యమం చాపచుట్టడానికి కులాలవారీ ఉద్యమాలే కారణం.

మొత్తంగా ‘చెంచాయుగం’ ఇక్కడి ఉద్యమాలలోను, సాహిత్యంలోనూ రాజ్యమేలుతున్నది. ఈ విధంగా దళిత విద్యావంతులు, మేధావులలో కూడా లంపేన్ వర్గం ఒకటి తయారైంది. వీరందరూ మాటల్లో అంబేడ్కర్‌ను పొగుడుతూ, చేతల్లో మాత్రం జగ్జీవన్ రామ్‌ను అనుసరిస్తూ పాలకవర్గాలతో చేరి అందుకు అనుగుణంగా రాస్తున్నారు, పాడుతున్నారు, ఆడుతున్నారు. ఈ రకంగా అంబేడ్కర్ ఉద్యమ రథాన్ని వెనక్కి తీసుకువెళ్లడం వల్లే బహుజన రాజకీయాలు బలపడటం లేదు.

పట్టా వెంకటేశ్వర్లు

Updated Date - 2023-09-02T01:26:41+05:30 IST