Share News

ఎన్నికల కురుక్షేత్రంలో ప్రవాసులు

ABN , First Publish Date - 2023-11-29T02:20:24+05:30 IST

భారత జాతీయోద్యమ అగ్రనాయకులలో అనేక మంది తమ ఉన్నత విద్యాభ్యా‍సాన్ని విదేశాలలో ముఖ్యంగా బ్రిటన్‌లో చేసినవారే. ప్రతిష్ఠాత్మక అమెరికా, యూరోపియన్...

ఎన్నికల కురుక్షేత్రంలో ప్రవాసులు

భారత జాతీయోద్యమ అగ్రనాయకులలో అనేక మంది తమ ఉన్నత విద్యాభ్యా‍సాన్ని విదేశాలలో ముఖ్యంగా బ్రిటన్‌లో చేసినవారే. ప్రతిష్ఠాత్మక అమెరికా, యూరోపియన్ విశ్వవిద్యాలయాల నుంచి పట్టభద్రులు అయిన అనంతరం మాతృదేశానికి తిరిగి వచ్చి, పారతంత్ర్య శృంఖలాలలో నలిగిపోతున్న దేశమాత విముక్తికి అంకితమైన వారు ఎందరో. విభిన్న భావాలు కల్గిన మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, ‍సుభాస్ చంద్రబోస్, వీర సావర్కర్, మొహమ్మద్ అలీ జిన్నా, సర్దార్ పటేల్ మొదలైనవారు ఈ ‍‍ సందర్భంగా మన మనస్సుల్లో తప్పక మెదులుతారు.

స్వాతంత్ర్యానంతరం కూడా విదేశాలలో ఉన్నత విద్యాభ్యాసం చేసి ‘దేశ సేవ’ నిమిత్తం స్వదేశానికి తిరిగివస్తున్నవారూ పలువురు ఉన్నారు. రాజకీయాలలో పాల్గొనడం ద్వారా ఎన్నికలలో ఎలాగైనా గెలిచి చట్టసభలలో ప్రవేశించడానికి వీరు ఉవ్విళ్ళూరుతున్నారు! ప్రపంచ అగ్రగామి కంప్యూటర్ల సంస్ధ ఐబిఎంలో ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చిన లోక్‌దళ్ దివంగత నేత అజిత్ సింగ్ మొదలైనవారిని ఈ ‍సందర్భంలో పేర్కొనవలసివుంది. తెలుగునాట కూడ అనేక మంది ప్రవాసులు రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీలక పాత్ర వహించారు. అయితే విజేతలుగా నిలిచినవారు కొందరు మాత్రమే. గల్ఫ్‌లో ఉద్యోగం చేస్తుండగా 1980 దశకంలో రాజీవ్ గాంధీ ప్రోత్సాహంతో రాజకీయాలలోకి వచ్చిన జె.గీతారెడ్డి సుమారు నాలుగు దశాబ్దాల పాటు ఎన్నికలలో పాల్గొన్నారు. విజయాలు ‍సాధించారు. మంత్రి పదవులను అధి‌‌ష్ఠించారు. అయితే ప్రస్తుత తెలంగాణ శాసనసభ ఎన్నికల బరిలో ఆమె లేరు.

ఈ సారి మొత్తం ఐదుగురు ప్రవా‍సులు తెలంగాణ శాసనసభ ఎన్నికలలో పోటీపడుతున్నారు. వరంగల్ జిల్లా పాలకుర్తి నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా ఉన్న 26 ఏళ్ళ మామిడాల యశస్విని రెడ్డి అనూహ్యరీతిలో ఒక్కసారిగా తెరపైకి వచ్చి ఎన్నికల క్షేత్రంలో, రాజకీయ ఉద్దండుడు ఎర్రబెల్లి దయాకర్ రావుతో తలపడుతున్నారు. అమెరికన్ పౌరురాలు ఝాన్సిరెడ్డి అభ్యర్ధిత్వం దాదాపు ఖాయమనుకున్నారు. అయితే ఆమె భారతీయ పౌరసత్వ వ్యవధికి సంబంధించి ఒక ‍ సమస్య ఎదురయింది. పోటీ చేసేందుకు వీలు లేకపోయింది. దీంతో ఆమె తన కోడలు యశస్విని రెడ్డికి టిక్కెట్ ఇప్పించుకున్నారు. భారతీయ పౌరసత్వం కల్గిన యశస్విని రెడ్డి కూడ అమెరికాలో స్ధిరాస్తి వ్యాపారం చేస్తుంటారు. ఆరు నెలలకు పైగా స్ధానికంగా నివసించని పక్షంలో ఓటు హక్కు కొల్పోయే నిబంధన క్రింద యశస్విని రెడ్డి పేరు ఓటరు జాబితాలో ఉంది. దీనితో ఆమె అభ్యర్థిత్వాన్ని సవాల్ చేస్తూ హై కోర్టులో ఒక పిటిషన్ దాఖలయింది. అయితే ఎన్నికల మధ్యలో ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు హైకోర్టు నిరాకరించింది.

అదే విధంగా, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవికి పోటీపడే అవకాశమున్న నల్గొండ ఎంపి యన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజుర్‌నగర్ బరిలో ఉన్నారు. ఉప ఎన్నికలలో విజయం సాధించిన ప్రవాసుడు శానంపూడి సైదిరెడ్డి (భారాస), మరో ప్రవాసురాలు చల్లా శ్రీలత (బీజేపీ)లతో ఉత్తమ్ తలపడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఖానాపూర్ నుంచి భారాస పక్షాన భూక్య జాన్సన్ నాయక్, ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధిగా రంగంలో ఉన్న కంది శ్రీనివాస రెడ్డి కూడ నేరుగా అమెరికా నుంచి ఎన్నికల గోదాలోకి దిగిన వారే.

విదేశాల నుండి వచ్చి నిజామాబాద్‌కు రెండుసార్లు లోక్‌సభలో ప్రాతినిధ్యం వహించిన మధు యాష్కి ఇప్పుడు యల్.బి.నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా రంగంలో ఉన్నారు. అంతకు ముందు నిజామాబాద్ నుంచి ప్రవాసుడు అయిన గడ్డం ఆత్మచరణ్ రెడ్డి కూడ ఒకసారి కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలిచి మరోసారి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి పరాజయం పొంది వెనక్కి వెళ్ళిపోయారు. అన్నట్టు మల్కాజిగిరిలో ఈ సారి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటిలో ఉన్న మైనంపల్లి హన్మంతరావు కూడ ఎన్నారై నేపథ్యం ఉన్న వారే. భారతీయ జనతా పార్టీ అభ్యర్ధిగా మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న ఎ.పి. మిథున్ రెడ్డి తండ్రి జితేందర్ రెడ్డి కూడ సుదీర్ఘ కాలం విదేశాలలో ఉన్నవారే. తిరిగి వచ్చి రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఈ సారి ఆయన కుమారుడు శాసనసభకు పోటీ చేస్తున్నారు. అదే విధంగా మరో ఎన్నారై వేములవాడ ప్రస్తుత ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ ఈ సారి టిక్కెట్ లభించకపోవడంతో పోటీకి దూరంగా ఉన్నారు. ప్రత్యక్ష ఎన్నికలలో అవకాశం రాకపోవడంతో మరో ప్రవాసుడు తాతా మధు ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీగా ఉన్నారు.

1980లలో గీతారెడ్డి విదేశాల నుంచి వచ్చి రాజకీయాలలో ప్రవేశించే నాటికే ఆమె సంపన్నురాలు. అయితే నేటి కాలంలో రాజకీయ పార్టీల అభ్యర్ధులందరూ అంతకంటే సుసంపన్నులు కావడంతో ఎన్నారై అభ్యర్ధులకు ప్రాధాన్యం లభించడం లేదు. పైగా చట్ట‍భలకు ఎన్నికయిన కొందరిపై భూ అక్రమణలతో సహా అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికలకు ముందు నియోజకవర్గాలకు వచ్చి వ్యూహాత్మకంగా సేవా కార్యక్రమాలను చేపడుతూ ప్రజలకు చేరువ అవుతూ పలువురు ఎన్నికల కురుక్షేత్రంలోకి దిగుతున్నారు. అయితే జయాపజయాలను తట్టుకొంటూ ప్రజాక్షేత్రంలో నిలుస్తున్న ప్రవాసులు మాత్రం అతి కొద్ది మంది మాత్రమే.

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

Updated Date - 2023-11-29T02:20:25+05:30 IST