అంతా నొక్కుడే!

ABN , First Publish Date - 2023-01-12T23:54:44+05:30 IST

గ్రామ పంచాయతీల్లో పని చేసే కొంతమంది సిబ్బంది అధికారులు ఇచ్చిన చనువుతో ఇష్టారాజ్యంగా అక్రమాల్లో చెలరేగిపోతున్నారు.

అంతా నొక్కుడే!

పంచాయతీల్లో ఉద్యోగుల ఇష్టారాజ్యం

అనంతపురంరూరల్‌, జనవరి 12: గ్రామ పంచాయతీల్లో పని చేసే కొంతమంది సిబ్బంది అధికారులు ఇచ్చిన చనువుతో ఇష్టారాజ్యంగా అక్రమాల్లో చెలరేగిపోతున్నారు. ఆ అధికారుల సంతకాలను సైతం ఫోర్జరీ చేస్తున్నారు. ఇళ్ల నిర్మాణాలకు అప్రూవల్‌, ఇంటి పన్నులకు సంబంధించిన బిల్లుల్లో సంతకాలు పెట్టేస్తున్నారు. తద్వారా పంచాయతీకి రావాల్సిన ఆదా యానికి పెద్ద మొత్తంలో గండి కొడుతున్నారు. ఉద్యోగులు, సిబ్బంది ఆగడాలను కట్టడి చేయాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఆ ఉద్యోగుల కొల్లగొట్టే సొమ్ము కార్యదర్శులకు కూడా వెళ్తుందటంతోనే నోరు మెదపడంలేదని తెలుస్తోంది. అధికారులు సైతం పట్టించుకోకపోవడంతో క్షేత్రస్థాయిలోని ఉద్యోగులు, సిబ్బంది అడ్డు..అదుపులేకుండా పంచాయతీ సొమ్మును జోబుల్లో వేసుకుంటున్నారు.

ఫ మండలంలోని కక్కలపల్లి కాలనీ పంచాయతీలో క్షేత్రస్థాయిలో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగి ఆయన. ఎన్నో ఏళ్లుగా పంచాయతీలోనే పని చేస్తున్నాడు. అదే అతడి బలం. పంచాయతీకి ఏ అధికారి వచ్చినా ఆతని ట్రాప్‌లో పడాల్సిందే. అలా అధికారులను గుప్పిట్లో పెట్టుకుని పంచాయతీకీ రావాల్సిన సొమ్మును గుట్టుగా స్వాహా చేస్తున్నాడు. దొంగ బిల్లులు మొదలుకొని ఆ పంచాయతీలో ఉన్నాతాధికా రుల సంతకాల ఫోర్జరీ వరకూ అన్ని అక్రమాలు చేయగల సమర్థుడు. అదే ఆ ఉద్యోగికి ఆదాయ వనరుకూడా. ఇప్పటికే ఆ ఉద్యోగి పంచాయతీ సొమ్ము రూ.అరకోటికిపైగానే వెనకేసుకున్నట్లు ఆయా వర్గాల ద్వారా తెలిసింది. ఇటీవల వచ్చిన ఓ అధికారి విషయం తెలుసుకుని గట్టిగానే మందలించినట్లు తెలిసింది. ఈక్రమంలోనే ఆ ఉద్యోగి కార్యాలయానికి రావడం మానుకున్నట్లు సమాచారం. ఆ విధంగా మండలంలోని కొన్ని పంచాయతీల్లోని క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారులు కూడా వారిని ఏమి చేయాలేని స్థితిలో ఉన్నారంటే వారు ఏపాటి పనిమంతులో అర్థం చేసుకోవచ్చు.

Updated Date - 2023-01-12T23:55:02+05:30 IST