విద్యార్థుల ప్రతిభకు పదును

ABN , First Publish Date - 2023-04-09T22:53:11+05:30 IST

అభ్యాసం కూసు విద్య అంటారు. ఆ నానుడిని నిజం చేస్తున్నారు ఏన్కూరు మండలంలోని జిల్లా పరిషత్‌ పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు సుజాత. విద్యార్థులను శాస్త్ర సాంకేతికత వైపు మళ్లిస్తున్నారు.

విద్యార్థుల ప్రతిభకు పదును
జాతీయస్థాయికి ఎంపికైన ఎగ్జిబిట్‌

ఏన్కూరు, ఏప్రిల్‌ 9: అభ్యాసం కూసు విద్య అంటారు. ఆ నానుడిని నిజం చేస్తున్నారు ఏన్కూరు మండలంలోని జిల్లా పరిషత్‌ పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు సుజాత. విద్యార్థులను శాస్త్ర సాంకేతికత వైపు మళ్లిస్తున్నారు. వారితో ప్రయోగాలు రూపొందించి, జాతీయస్థాయిలో అవార్డులు సాధించేలా చేస్తున్నారు. సుజాత ఏన్కూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయురాలిగా 2015 చేరారు. అప్పటి నుంచి విద్యార్థులతో కొత్త ఆవిష్కరణలు చేయించడం ప్రారంభించారు. ఇలా ఆమె ఎంతో వందలాది మంది విద్యార్థులతో ఆవిష్కరణలు చేయించారు. గతంలో సుజాత భర్త పొట్ట రామారావు భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడిగా 2009 నుంచి 2018 వరకు ఇదే పాఠశాలలో పనిచేశారు. వీరు ఇరువురు కలిసి అనేకమంది విద్యార్థులను సొంత ఖర్చులతో సైన్‌స్వ్కేర్‌కు తీసుకెళ్లారు. వీరి ఆధ్వర్యంలో 2017 జాతీయస్థాయి సైన్స్‌ ఫెయిర్‌కు ఎంపికైన ప్రయోగాన్ని భారత ప్రభుత్వం జపాన్‌దేశానికి పంపడం గర్వకారణం. వీరు ఇరువురికి జిల్లా, రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు రావడం మరో విశేషం వీరి ఆధ్వర్యంలో ఈపాఠశాల నుంచి జాతీయస్థాయికి రెండుసార్లు ఒకటి ఢిల్లీ, రెండో రాయపూర్‌కు వెళ్లి బహుమతులు పొందారు. దక్షిణభారతదేశ స్థాయి సైన్సుఫేర్‌కు మూడుసార్లు బెంగళూరు, హైదరాబాదుకు వెళ్లారు. రాష్ట్రస్థాయిలో 9సార్లు అనంతపురం, నిజామబాద్‌, వరంగల్‌, సిద్దిపేట, హైదరాబాద్‌, నిర్మల్‌ వెళ్లి అవార్డులు పొందారు. జిల్లాస్థాయిలో 25 ఎగ్జిబిట్లను ప్రదర్శించగా 16 బహుమతులను గెలుచుకున్నారు.

ప్రయోగాల ద్వారా విద్యా బోధన

సుజాత తన ప్రయోగాల ద్వారా విద్యార్థులకు విద్యాబోధన చేస్తారు. వీలైనంత వరకు ఎక్కువగా ప్రయోగాల ద్వారా పాఠం అర్థమయ్యేలా భాగస్వాములుగా చేస్తారు. తక్కువ ఖర్చుతో ఎన్నో పరికరాలు తయారు చేశారు. దీనిలో సూక్ష్మదర్శిని ఒకటి. కేవలం 50 రూపాయలతో తయారుచేసిన సూక్ష్మదర్శిని ద్వారా ఉల్లి పొరకణాలు, పత్రాల కణాలు, జంతుకణ నిర్మాణాలు, కాండం అడ్డుకోత, నీటిలో బ్యాక్టీరియా, పెరుగులో ఉపయోగపడే బ్యాక్టీరియా, బూజు మొదలగు వాటిని చూపిస్తారు.

రక్త నాళాల పనితీరు, కవాటాల నిర్మాణం

మేక గుండె తీసుకుని దానిలోని గదులను, రక్తనాళాల పనితీరును, కవాటాల నిర్మాణం గురించి తెలియచేస్తారు. మేక కిడ్నీ తీసుకువచ్చి దానిలోని వివిధ భాగాలను మూత్రం వడగట్టే విధానాన్ని నెఫ్రాన్‌ పనితీరును వివరిస్తారు. మేక ఊపిరితిత్తుల్లోకి సైకిల్‌ పంపు ద్వారా దానిలోకి గాలిని నింపి ఎలా పనిచేస్తున్నాయో విద్యార్థులకు వివరిస్తారు. విద్యార్థులకు రక్త పరీక్షలు చేసి గ్రూపులను నిర్ధారిస్తారు. మొక్కల ఆకుల్లో పిండి పదార్థం ఉంటుందని నిర్ధారించే పరీక్ష, కిరణజన్య సంయోగక్రియకు కార్బన్‌డైయాక్సైడ్‌ అవసరమనే ప్రయోగం, విత్తనాల్లో శ్వాసక్రియ, ప్రొటీన్‌ పరీక్ష, ఆమ్ల, క్షార సూచికల తయారీ, జామ్‌ తయారుచేసి చూపించడం వంటి ప్రయోగాలు చేయిస్తూ విద్యార్థులకు సైన్స్‌పై ఆసక్తి కలిగేలా చేస్తున్నారు.

Updated Date - 2023-04-09T22:53:11+05:30 IST