కుల నిర్మూలనకు తొలి అడుగు
ABN , First Publish Date - 2023-11-04T02:06:20+05:30 IST
కులం, రిజర్వేషన్ మళ్లీ పతాక శీర్షికల్లో ఉంటున్నాయి. షెడ్యూలు కులాల, షెడ్యూలు తరగతుల వారికి; సామాజికంగా, విద్యావ్యాసంగాల పరంగా వెనుకబడిన వర్గాల వారికి ‘రిజర్వేషన్’ సదుపాయం కల్పించాలని రాజ్యాంగ అధికరణలు 15, 16 నిర్దేశించాయి.
కులం, రిజర్వేషన్ మళ్లీ పతాక శీర్షికల్లో ఉంటున్నాయి. షెడ్యూలు కులాల, షెడ్యూలు తరగతుల వారికి; సామాజికంగా, విద్యావ్యాసంగాల పరంగా వెనుకబడిన వర్గాల వారికి ‘రిజర్వేషన్’ సదుపాయం కల్పించాలని రాజ్యాంగ అధికరణలు 15, 16 నిర్దేశించాయి. ఆర్థికంగా బలహీన వర్గాల (ఈపీడబ్ల్యూ) వారికి కూడా 2019లో విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు సమకూర్చారు. ‘రిజర్వేషన్’ కల్పన ఒక విధానంగా ఉన్నంతవరకు కచ్చితమైన సమాచారం కోసం కులాల జనాభా గణన తప్పనిసరి.
రిజర్వేషన్ గందరగోళంలో కుల రహిత సమాజస్థాపన అనే ఆదర్శం క్రమంగా అంతరించిపోతోంది. ‘నా కులాన్ని నేను మార్చుకోలేను’ అని భారతీయ జనతా పార్టీ నాయకుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ వ్యాఖ్యానించినట్టు మీడియా వార్తలు వెల్లడించాయి. మరాఠా సామాజిక వర్గం వారు రిజర్వేషన్ కోటాకై ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆయన ఆ వ్యాఖ్య చేశారు. ప్రథమ దృష్టికి ఆ వ్యాఖ్య విమర్శాతీతమైనదిగా కన్పిస్తుంది. నిశితంగా పరీక్షిస్తే ఫడణవీస్ కులం ఎందుకు ఒక సమస్య అయిందని నాకు ఆశ్చర్యం కలిగింది. పేర్లు చెప్పను గానీ కొంత మంది నాయకుల కులం ఏమిటనేది అసంఖ్యాక భారతీయులకు పూర్తిగా అసంగత వ్యవహారం. అయితే కొంత మంది నాయకుల కులం వారి రాజకీయాలకు చాలా ప్రధానమైనది. ప్రజలు ఆ నాయకుల రాజకీయాలను ఎలా పరిగణిస్తున్నారనేది వారి కులంపై ఆధారపడివుంటుంది. ఇది విస్మరించలేని వాస్తవం. మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, వల్లభ్ భాయి పటేల్ ఏ కులంలో పుట్టారని ఎవరైనా ప్రశ్నించినట్టు నాకు తెలియదు. సుభాస్ చంద్రబోస్, రాజేంద్రప్రసాద్ కులం గురించి ఎక్కడైనా చదివిన జ్ఞాపకం నాకు లేదు. వారు మహా నాయకులు, మానవతా ప్రపూర్ణులు. ఏ ఒక్కరూ, చివరకు వారి రాజకీయ ప్రత్యర్థులు సైతం ఆ మేరునగధీరులను ఒక కులానికి పరిమితం చేయరు. అలా చేయడం వారిని నిందించడం, అవమానించడమే అవుతుంది.
దురదృష్టవశాత్తు మన భారతదేశంలో ప్రతీ ఒక్కరు ఒక కులంలో జన్మిస్తున్నారు. విద్యావంతులైన చాలా మంది యవజనులు, ముఖ్యంగా నగరాలలో ఇంకెంత మాత్రం ఏ కులం పరంగాను తమ అస్తిత్వాన్ని చాటుకోవడం లేదు. ఒకే కులానికి చెందిన దంపతులు సైతం తమ బిడ్డలు కులాంతర, మతాంతర వివాహాలు చేసుకోవడాన్ని మనఃస్ఫూర్తిగా సమర్థించడం, ప్రోత్సహించడం చేస్తున్నారు. చాలా మంది అనుకుంటున్న దాని కంటే కులాంతర వివాహాలు చాలా పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి. ఇవన్నీ శుభ పరిణామాలు. ఒక లౌకిక, సమ సమాజ నిర్మాణానికి విశేషంగా దోహదం చేసేవి.
భారతీయుల మనస్తత్వంలో కులం ప్రగాఢంగా ఉన్న ఒక గుణ విశేషమని నేను భావిస్తున్నాను. కుల వ్యవస్థ ఎందుకు బలహీనపడడం లేదు? పలు కారణాలు ఉన్నాయి. ప్రత్యామ్నాయ వ్యవస్థలేవీ లేకపోవడమనేది ప్రధాన కారణం. అందరినీ భాగస్వాములను చేసుకునే వ్యవస్థలను మనం నిర్మించుకోవల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ ఉమ్మడి వ్యవస్థలు ప్రజల హక్కులను కాపాడాలి. కష్ట సమయాలలో వారిని ఆదుకోవాలి. మరీ ముఖ్యంగా రాజ్యాంగ అధికరణ 14 నిర్దేశించినట్టు చట్టం ముందు అందరూ సమానులే అన్న భరోసా కల్పించాలి. మీ చుట్టూ చూడండి. అటువంటి ఆదర్శ వ్యవస్థలు ఉన్నాయా? లేవు కనుకనే ప్రజలు, ముఖ్యంగా పేదలు, పీడితులు ఒక కులంలో శరణు పొందుతున్నారు.
ప్రజల ఆధారిత, ప్రజల ప్రోత్సాహంతో నడుస్తున్న సంస్థలు మన దేశంలో చాలా అరుదు. అటువంటి సంస్థలను నిర్మించేందుకు గాంధీజీ ప్రయత్నించారు. నిర్మించారు కూడా. అయితే ఆయన అనంతరం ఆ సంస్థలు బలహీనపడ్డాయి. క్రమంగా క్షీణించిపోయాయి. మహాత్ముడు అభివృద్ధిపరిచిన సాముదాయక సంస్థలు తమ క్రియాశీలతను, ప్రభావశీలతను కోల్పోయాయి. అహ్మదాబాద్‌లోని సబర్మతీ ఆశ్రమం ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లను ఒకసారి గమనంలోకి తీసుకోండి. మీకు చాలా వాస్తవాలు తెలిసివస్తాయి.
రాజకీయ పార్టీలే అతి పెద్ద స్వచ్ఛంద సంఘాలు, ప్రజాసంస్థలు. విచారకరమైన విషయమేమిటంటే ప్రజలు అంటే సభ్యులు తమ కుల పరమైన గుర్తింపులను రాజకీయ పార్టీలలోకి తీసుకువస్తున్నారు. చాలా మంది రాజకీయ నాయకులు తాము పుట్టిన కులంతో మాత్రమే తాదాత్మ్యం చెందుతున్నారు. ఆ కులానికే కట్టుబడి ఉంటున్నారు. ఇదే దేవేంద్ర ఫడణవీస్‌కు ఎదురైన సందిగ్ధావస్థ. ఆయన లౌకికవాది అని, తన కులంతో గుర్తింపు పొందడానికి ఆరాటపడే వ్యక్తికాదని నేను విశ్వసిస్తున్నాను. అయితే మరాఠా రిజర్వేషన్ గడబిడతో ఇరకాటంలో పడ్డ ఫడణవీస్ దాని నుంచి బయటపడేందుకు ‘నేను నా కులాన్ని మార్చుకోలేను’ అని అంగీకరించి వుంటారు.
కుల శృంఖలాల నుంచి తప్పించుకునేందుకు ఒక వ్యక్తికి అనేక మార్గాలు ఉన్నాయి. కులాన్ని సూచించే వ్యక్తిగత పేర్లను, ఇంటి పేర్లను త్యజించడం మొదటి అడుగు. కుల సంబంధిత సంఘాలు, సంస్థలతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోకపోవడం మరో ముందడుగు. సామాన్య పౌరులు ఇలా ముందంజ వేసేందుకు సామాజిక, రాజకీయ నాయకులు మార్గదర్శకులు కావాలి. జాతి గౌరవించే వ్యక్తులను కులపరంగా పరిగణించే ధోరణికి రాజకీయ పార్టీలు స్వస్తి చెప్పాలి. కుల మతాలకు అతీతంగా సకల ప్రజల శ్రేయస్సుకు కృషి చేసినందునే వారు జాతికి గౌరవనీయులు అయ్యారనే వాస్తవాన్ని విస్మరించకూడదు. ఒకరి కులాన్ని ‘మార్చుకోవడం’ సాధ్యం కాదనే విషయాన్ని నేను ఒప్పుకుంటాను. ఏ కులాన్నీ ప్రత్యేకంగా ప్రోత్సహించకూడదు. సామాన్య పౌరులు ఏదైనా దరఖాస్తులో గానీ, మరేదైనా డాక్యుమెంటులోగానీ తన కులాన్ని పేర్కొనకూడదు. సంబంధిత నిబంధనలను తిరస్కరించి తీరాలి. తన కులస్తులు మాత్రమే ఉండే భవనంలో మాత్రమే కాపుర ముండాలని ఎవరూ ఆరాటపడకూడదు. భిన్నకులాల వారు ఉండే భవన సముదాయంలో మాత్రమే ఉండాలి. జీవన సహచరి/ జీవనసహచరుడిగా భిన్న కులానికి చెందిన వ్యక్తినే ఎంపిక చేసుకోవాలి. తమ బిడ్డలను కూడా అదే రీతిలో గృహస్థు అయ్యేందుకు ప్రోత్సహించాలి. ఆఫీసుల్లో సొంత కులం వారి పట్ల ప్రత్యేక అభిమానాన్ని, ఇతర కులాల వారి పట్ల దుర్భావాన్ని చూపడాన్ని మానుకోవాలి. అందరినీ సమదృష్టితో చూడాలి.
ఇవి చాలా సామాన్యమైన చర్యలు. అయితే ఇటువంటి సులభ సాధ్య నిర్ణయాలతో సొంత కులం పరంగా గుర్తింపు పొందాలనే ధోరణులు సమసిపోవని కొంత మంది భావించవచ్చు. ఈ వాదనలో సహేతుకత ఉండవచ్చుగానీ మనం ఎక్కడో ఒక చోట ప్రారంభమవ్వాలి గదా. కుల రహిత సమాజ నిర్మాణానికి నేను సూచించిన చర్యలు తప్పక దోహదం చేస్తాయి. బాబా సాహెబ్ అంబేడ్కర్ ‘కుల నిర్మూలన’ అనే శీర్షికన ఒక ప్రసంగాన్ని సిద్ధం చేసుకుని కూడా వెలువరించలేకపోయారు. అయితే కులాన్ని అంత సునాయాసంగా, సత్వరమే రూపుమాపడం ఎంతకష్టమో బాగా తెలిసినవారు ఆయన మినహా మరెవ్వరు లేరు. కుల వ్యవస్థను నిర్మూలించలేకపోవచ్చుగానీ కుల-గుర్తింపు, కుల-బాంధవ్యాన్ని నిరంతర కృషి ద్వారా బలహీనపరచడం సుసాధ్యమే. సామాన్య పౌరులు, సామాజిక, రాజకీయ నాయకులు దృఢ సంకల్పంతో పూనుకుంటే భారతీయ సమాజంపై కుల ప్రభావం నిశ్చితంగా తగ్గుముఖం పడుతుంది. ఇది ఒక భావవాది జీవన దృక్పథమే అయితే అటువంటి ఆదర్శవాదిగా ఉండేందుకు నేను సంతోషిస్తాను.
పి. చిదంబరం
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు)