మట్టి పరిమళాలు...
ABN , First Publish Date - 2023-01-15T00:40:56+05:30 IST
హేమంత ఋతువులో ఈ చలిగాలిలో ఎడద గాలిపటమై ఎగసెపైకి పట్టణాలన్నియూ పల్లెను చేరగా
హేమంత ఋతువులో ఈ చలిగాలిలో
ఎడద గాలిపటమై ఎగసెపైకి
పట్టణాలన్నియూ పల్లెను చేరగా
నింగిదిగెను చూడు నేలపైకి
చాన్నాళ్లకు కనిపించావురా మిత్రుడా
పలకరింపుల గుండె పరచుకుంది
సందడే సందడి సంక్రాంతి వేళలో
ఒత్తిడి ఏడకో పారిపోయె
ఫ్లోరు టచ్ డ్రెస్సులు ధరించి మురిసి నడచు
కన్నె పిల్లలే పల్లెల కాంతినిధులు
నాటు బండెక్కి పచ్చని నారు మడుల
వెంట అందాలు తిలకించె పిల్లగాళ్ళు
పిల్ల కాలువ చేప పిల్లయి ఎగిరింది
నల్లకలువలయి నవ్వె చెరువు
కొంగరెక్కలొంది కొబ్బరాకుల చెట్టు
నింగిని విహరించి పొంగిపోయె
మట్టి పరిమళాలు చుట్టమై అరుదెంచి
కొండగాలి చెవిలో గోస చేసె
కూకురక్కీ యని కూస్తోంది ఓ పక్షి
గువ్వల రివ్వులే సవ్వడించె
ఎవరు వేడ్కొనిరో కదా ఇయ్యవనిని
ఇంత సుందర సుకుమార ఈ ప్రకృతిని
దిక్కులన్నియూ బంధమై యొక్కచోట
వచ్చి కలసిన సమయమే పర్వదినము
పాయల మురళీకృష్ణ