అగ్రకుల రాజ్యం నుంచి స్వాతంత్ర్యమెన్నడు?
ABN , First Publish Date - 2023-04-27T01:35:22+05:30 IST
అణగారిన వర్గాల విముక్తి దిశగా అంబేడ్కర్ సిద్ధాంత భూమికతో తెలంగాణ ప్రాంతంలో..
అణగారిన వర్గాల విముక్తి దిశగా అంబేడ్కర్ సిద్ధాంత భూమికతో తెలంగాణ ప్రాంతంలో ఉద్యమాలు జరగలేదని, ఆ లోటును భర్తీ చేయాల్సిన అవసరం ఉందని డా. విశారదన్ మహరాజ్ గత పన్నెండేళ్లుగా ‘దళిత్ శక్తి ప్రోగ్రాం (డీఎస్‌పీ)’ అనే ఉద్యమ వేదికను నిర్మించి పనిచేస్తున్నారు. ఆ క్రమంలో వందల సమావేశాలు, వేల కిలోమీటర్ల సైకిలు యాత్రలు చేశారు. 2017లో 5 వేల కిలోమీటర్ల పాదయాత్రతో బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలలో సాంస్కృతిక, సామాజిక చైతన్యాన్ని రగిలిస్తూ వారిలో ఒక మానసిక భావ విప్లవాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేశారు. దళిత విద్యావంతులైన వారిని వేల సంఖ్యలో క్యాడరుగా నిర్మిస్తూ వారిని ఎంతో ప్రభావితం చేస్తున్నారు.
గత సంవత్సరం 2022 మార్చి 15 కాన్షీరాం జన్మదినం రోజున తెలంగాణ అంతటా ‘స్వరాజ్య పాదయాత్ర’ను తలపెట్టారు. కల్వకుర్తి నుంచి 10,000 కిలోమీటర్ల కాలినడకను ప్రారంభించారు. తెలంగాణలో మూడు కోట్ల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యస్థాపనే లక్ష్యంగా ఆయన కాలినడక సాగుతూ ఉన్నది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మూడు వేల గ్రామాలను, మూడు వందల మండలాలను, ముప్ఫై రెండు జిల్లాలు దాటుకొని 410 రోజులుగా నిర్విరామంగా నడిచారు. చివరగా 33వ జిల్లాగా హైదరాబాద్ మహానగరంలోకి ఇరవై నాలుగు మంది బృంద సభ్యులతో అడుగుపెట్టారు.
ఈ మొత్తం యాత్రలో డీఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షులు విశారదన్ మహరాజ్ 2500 గ్రామ సభలలోను, దాదాపు 250 మండల సభలలోను, 32 జిల్లా కేంద్ర సభలలోను మాట్లాడారు. వేలాది భారత రాజ్యాంగ జెండా దిమ్మెల్ని ప్రారంభించి, వేల కాలినడక చిహ్న శిలాఫలకాల్ని సైతం ప్రారంభించారు. ఈ బృంద సభ్యులందరూ ఉదయాన నడక ప్రారంభించే ముందు ఖచ్చితంగా ‘భారత రాజ్యాంగ పీఠిక’ను (ప్లెడ్జ్) పఠిస్తారు. విశారదన్ ఒక చేతిలో భారత రాజ్యాంగాన్ని, మరో చేతిలో నాలుగు సింహాల అశోక రాజ దండాన్ని పట్టుకొని నడుస్తారు. ఆయన ప్రసంగాల్ని పీడిత ప్రజలంతా వేలాదిగా స్వచ్ఛందంగా హాజరై వింటున్నారు.
విశారదన్ మహారాజ్ ఈ సుదీర్ఘ కాలినడకలో ఎన్నో మౌలికమైన ప్రశ్నలను లేవదీస్తున్నారు. కాకతీయ సామ్రాజ్యంలోని నలభై వేల చెరువులు తవ్వింది ఏ చేతులు? రామప్ప గుడికి బండలు మోసి గుండెలు పగలగొట్టుకుంది ఎవరు? నాలుగు వందల ఏళ్ల నుంచి హైదరాబాద్ నగరాన్ని నిర్మించిన కూలీలు ఎవరు? ఇలా ఎన్నో ప్రశ్నలు సంధిస్తూ ఆయన అడుగులు వేస్తున్నారు.
యాభై ఏళ్లు ఆంధ్రోళ్లు దోపిడీ చేసిన్రని తెలంగాణ అగ్రకులాలు పోరాడి తెలంగాణ రాజ్యం నిర్మించుకున్నప్పుడు., రెండువందల ఏళ్లు ఆంగ్లేయులు దోపిడీ చేసిన్రని ఈ దేశ అగ్రకులాలు వారిని వెళ్లగొట్టి భారతదేశాన్ని పరిపాలించినప్పుడు, రెండువేల ఏళ్ల అగ్రకుల ఆధిపత్య సమాజంలో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, సాంస్కృతికంగా అణచివేతకు గురైన తొంభై శాతం అణగారిన కులాలు తమ స్వరాజ్యాన్ని నిర్మించుకోవద్దా? అన్న ప్రశ్నాస్త్రాన్ని సంధిస్తున్నారు విశారదన్. అగ్రకుల నాయకత్వంలో భౌగోళిక సరిహద్దులతో ఒక రాష్ట్రం ఏర్పడితే ఆ రాష్ట్ర అణగారిన కులాలు ఏ విధంగా బాగుపడతాయో ఒక్కరన్న దీనికి లెక్కలతో సమాధానం చెపితే ఈ పాదయాత్రనే విరమించుకుంటాను అంటున్నారు విశారదన్ మహారాజ్. ఆంధ్రవాళ్లు దోపిడీ చేసినప్పుడు కూడా అక్కడి ఆంధ్రాలోని అణగారిన కులాలు ఏం బాగుపడ్డాయి? అని అడుగుతున్నారు. అంటే అక్కడి ఆంధ్రా దోపిడిదారులూ అగ్రకులాలే, వారిని ప్రశ్నించి రాష్ట్రం తెచ్చుకున్న తెలంగాణ ఉద్యమ నాయకత్వమూ అగ్రకులాలే అంటుంది ఈ యాత్ర. ఈ అగ్రకుల ‘రాజ్య క్రీడ’లో బలైపోయేది బీసీ, ఎస్సీ, ఎస్టీలే అంటున్నది ఈ ‘స్వరాజ్య పాదయాత్ర’.
మొత్తంగా తెలంగాణలో అగ్రకుల ఉద్యమాలన్నీ ప్రశ్నలే వేస్తున్నాయి సమాధానం తీసుకురాలేదు, కానీ పీడితుల నెత్తురు ఏరులై పారింది, అణగారిన కులాలంతా అమరులైపోయారు... ఈ ఆవేదన విశారదన్ ప్రతి ప్రసంగంలోనూ ప్రతిధ్వనిస్తున్నది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని అణగారిన కులాలు స్వీయ రాజకీయ చైతన్యంతో, స్వీయ శక్తితో రాజ్యం సాధించాలి. ఇదొక్కటే వారి తరతరాల బానిసత్వానికి, అంతులేని దుఃఖానికి, పేదరికానికి విరుగుడు అంటున్నారు విశారదన్. ఈ స్వీయ రాజకీయ యుద్ధానికి భారత రాజ్యాంగం అందించిన ఆయుధాలున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఓటే ఖడ్గంగా యుద్ధం చేద్దామని ఈ పాదయాత్ర పిలుపునిస్తున్నది. ఓటు విలువని, భారత రాజ్యాంగంలోని ప్రధాన విలువలైన అధికరణలని ప్రతి పౌరుడికి వివరిస్తూ, ఒక విశ్వాసాన్ని ఒక ఆశని ‘ధర్మ బోధ’ చేస్తూ, ప్రజల్ని ప్రోది చేస్తూ సాగుతున్నది ఈ యాత్ర.
అదే సమయంలో ఇక్కడ ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలకు పలు బలమైన పదునైన ప్రశ్నల వర్షం కురిపిస్తుంది ఈ యాత్ర. అన్ని అగ్రకుల పార్టీలు (బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు) 90 శాతం ఉన్న అణగారిన కులాలకే, అంతే నిష్పత్తి ప్రకారం అధికారంలో భాగస్వామ్యం కల్పించాలని, అదే ప్రజాస్వామ్యమని, అదే గణతంత్ర రాజ్యమని, రాజ్యాంగ ధర్మబోధ చేస్తూ అడుగులు వేస్తున్నది ఈ యాత్ర. ఇందులో భాగంగానే ఆయా అగ్రకుల పార్టీల ముందు డీఎస్‌పీ కొన్ని డిమాండ్స్ పెడుతున్నది: 1) దళితుడికే ముఖ్యమంత్రి పీఠాన్ని వదిలేయండి. 2) 90శాతం క్యాబినెట్ శాఖలని బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వండి. 2) మీ మీ పార్టీల సంస్థాగత పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని, పార్టీ క్రింది శాఖల పదవులన్నీ 90శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలకే కేటాయించండి. 3) అధికారంలో ఉన్న పార్టీలు, రేపు అధికారంలోకి రాబోయే పార్టీలు చీఫ్ సెక్రటరీ నుంచి ఎమ్మార్వో వరకు బ్యూరోక్రసీ మొత్తం 90శాతం బీసీ ఎస్సీ ఎస్టీ అధికారులకు ఇవ్వాలి. అట్లనే డీజీపీ నుంచి ఎస్సై వరకు ప్రధాన అధికార పోస్టులు కేటాయించాలి. 4) మీ మీ పార్టీలు అధికారంలోకి వస్తే రాష్ట్ర బడ్జెట్లో 90శాతం నిధులను బీసీ, ఎస్సీ, ఎస్టీలకే కేటాయించాలి. 5) పార్టీలో 90శాతం టిక్కెట్లను బీసీ, ఎస్సీ, ఎస్టీలకే కేటాయించండి. ఇట్లా అగ్రకుల పార్టీలని ఆత్మరక్షణలోకి నెడుతూ సాగుతుంది ఈ యాత్ర.
మొత్తంగా తెలంగాణ ప్రాంత చరిత్రలో ఇంత భారీ స్థాయిలో అణగారిన కులాల విముక్తి కోసం, వారి రాజ్యాధికారం కోసం ప్రయత్నం జరిగింది లేదు. ఈ పాదయాత్ర ఏప్రిల్ 30వ తేదీకి 412 రోజులు, పదివేల కిలోమీటర్ల దూరం పూర్తి చేసుకుంటుంది. ఆ రోజు హైదరాబాద్ సరూర్‌నగర్ మైదానంలో లక్షమందితో భారీ సభ జరగబోతున్నది. అంతేకాదు, ఈ బృహత్ భావజాల సంఘర్షణ నుంచి పుట్టే భౌతిక శక్తిగా ఒక రాజకీయ పార్టీని ఆ సభలో ప్రకటించబోతున్నారని తెలుస్తున్నది.
హరప్ప
పరిశోధక విద్యార్థి, ఉస్మానియా యూనివర్సిటీ