‘కారా’ ఆధునికతను నిరసించారా?

ABN , First Publish Date - 2023-03-27T00:55:11+05:30 IST

‘ఆధునికత’ అనేది పాశ్చాత్య నాగరికత వల్ల మనకు అబ్బింది. ‘నాగరికత’ అనే పశ్చిమ దేశాల భావనను ‘వలస పాలన’ మనపై రుద్దింది. ఈ సరికొత్త భావనలు అన్నీ అనర్థాలు మోసుకొచ్చాయని చెప్పబోవడం...

‘కారా’ ఆధునికతను నిరసించారా?

‘ఆధునికత’ అనేది పాశ్చాత్య నాగరికత వల్ల మనకు అబ్బింది. ‘నాగరికత’ అనే పశ్చిమ దేశాల భావనను ‘వలస పాలన’ మనపై రుద్దింది. ఈ సరికొత్త భావనలు అన్నీ అనర్థాలు మోసుకొచ్చాయని చెప్పబోవడం లేదు. ఈ కొత్త పోకడల మోజులో ప్రాచీనత సాంతం క్షుద్రమైందనే అభిప్రాయంలో కూరుకుపోయామా అన్నదే కీలకం. దీన్నే గూగీవా థియాంగో ‘‘డికాలనైజింగ్‌ ది మైండ్‌’’ -అంటే నిర్వలసీకరణ అన్నాడు. పాశ్చాత్య నాగరికత మనపై రుద్దిన ఆధునికతను ఎలాంటి శషభిషలు లేకుండా అంగీకరించడంలోనే పేచీ ఉంది.

అరవయ్యో దశకం చివర తెలుగునాట దూసుకు వచ్చిన మార్క్సిస్ట్‌-లెనినిస్ట్‌ పార్టీలు కూడా ఆధునికత విషయంలో మోజు పడ్డాయి తప్ప తీక్షణ దృష్టితో పరిశీలించలేదు. కొల్లా వెంకయ్యలాంటి పార్టీ నేతలు ఉబలాటంతో నెత్తినెత్తుకున్నారు.

వామపక్ష సాహిత్యకారులు పదే పదే ప్రస్తావించే గుగీవా థియాంగో దశాబ్దం క్రితం రాసిన ‘ఖిౌఝ్ఛ ్టజిజీుఽజ ఖీౌటుఽ ్చుఽఛీ ్ఛూఠీ’ పుస్తకంలో ఆధునికత పేరిట ప్రపంచవ్యాప్తంగా చలామణీ అవుతున్న ప్రగతిశీలత, ఆధునికత గురించి అనేక సందేహాలను లేవదీశారు. అసలు నాగరికత అనేది ఓ కుట్ర అంటూ కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. కాంట్‌ మొదలు హెగెల్‌ వరకు చెప్పిన తాత్వికతలో కుట్ర ఉందంటూ బాహటంగానే రాశారు.

పాశ్చాత్య పాలన వల్ల మనకు అబ్బిన నాగరికత నిజంగానే మేలు చేసిందా? గురజాడ ‘కన్యాశుల్కం’ నాటకం మొదలు కాళీపట్నం రామారావు ‘యజ్ఞం’ కథ వరకు పరిశీలిస్తే... ఏమిటి కనిపిస్తుంది?

కారా మాస్టారు వెళ్లిపోయాక వారి కథలు ‘అప్రజ్ఞాతం’ మొదలు ‘సంకల్పం’ వరకు వరుసగా పదిహేను కథలు చదివాక మాస్టారు ఆధునికతను నిరసించారా అనే సందేహం కలిగింది. ‘యజ్ఞం’ కథను పదే పదే, సుమారు 1994 నుంచి పాతిక సార్లు చదివిన తర్వాత, మాస్టారితో ఉన్న చనువు కొద్దీ భిన్న సందర్భాల్లో వారితో చర్చించిన తర్వాత మాత్రమే, ‘ఆధునికత’ అనే భావన విషయంలో మాస్టారు ఏమనుకుంటున్నారు అనే సందేహానికి జవాబు వెతికేందుకు ప్రయత్నిస్తున్నాను.

‘అప్రజ్ఞాతం’ కథ 1951లో ‘జయ్‌ భారత్‌’ పత్రికలో అచ్చయింది. ‘యజ్ఞం’ కథ 1966లో ‘యువ’ దీపావళి సంచికలో వెలువడింది. రెండు కథల నడుమ ఎడం సుమారు దశాబ్దన్నర కాలం. ఈ దందహ్యమాన కాలం తర్వాతే ఆయన ‘విప్లవ రచయితల సంఘం’లో చేరి ఉంటారు. అంటే మాస్టారికి అంతకుముందే మన గతం ఎలా పతనమైందో అనే స్పష్టత ఉంది. రావి శాస్త్రి పరిచయమూ ఉంది. వారి ప్రభావమూ ఉండే ఉంటుంది. ఆధునికతను ఎలాంటి ప్రశ్నలూ లేకుండా అంగీకరించిన ‘విరసం’తో కారా ఎలా కొనసాగారనే సందేహం రావడం సహజం. ‘కారా’ ఎప్పుడూ తన అభిప్రాయాలను దాచుకోలేదు. కుండబద్దలు కొట్టి నట్లు చెపుతూ వచ్చారు. కారా సంస్థాగత బానిసత్వం చేయలేదు. చేయలేని స్థితిలో రాజీనామా చేశారే తప్ప సిద్ధాంతాల ఊబిలో కూరుకుపోలేదు. అందుకే వారు విరసంతో సంస్థాగతంగా దూరమయ్యారు.

‘యజ్ఞం’ కథ చదివిన వాళ్లందరూ శ్రీరాములు నాయుడ్ని దూషించి, అప్పల్రాముణ్ని నెత్తినెత్తుకునే మాట నిజమే కానీ, ప్రస్తుతం మనం అనుభవి స్తున్న కష్టసుఖాలు శ్రీరాములు నాయుడు కోరి తెచ్చినవా? లేదా అప్పల్రాముడు నిరసించినవా అనే సందేహం రాకపోవడమే చిత్రం!

ఆధునికతను మైమరచి ఆహ్వానించిన మర్స్కిస్ట్‌ - లెనినిస్ట్‌ పార్టీలు ‘కారా’ ‘యజ్ఞం’ కథలో అప్పల్రా ముణ్ని అతివినయంతో అభిమానించారు. కానీ మరి మనం శ్రీరాములు నాయుడి అభివృద్ధి పంథాను అభిమానిస్తున్నాం కదా. ఆధునికత వల్ల వచ్చిన అభివృద్ధి నమూనా వల్ల బాధితుడైన అప్పల్రా ముణ్ని ఎలా ఆదరించగలం? ఒకవైపు శ్రీరాములు నాయుడు ప్రాతినిధ్యం వహించే ఆధునికతకూ, మరోవైపు పతనావస్థలో ఉన్న అప్పల్రాముడికీ వంత పాడటంలో ద్వైదీభావం లేదా? నిజంగానే మాస్టారు కథలో వాపోయినట్టూ అప్పల్రాముడు కోరుకున్న వ్యవస్థ మేలయిందా?

సాంతం పదిహేను కథలు చదివిన తర్వాత మనకు అర్థమయ్యేదేంటంటే మాస్టారు ఆధునికతను నిరసించారని. కాబట్టి ఇప్పటికైనా కమ్యూనిస్టులు, వారి కనుసన్నల్లో పనిచేస్తున్న సాహిత్య సంస్థలు గతాన్ని మదింపు వేస్తున్నప్పుడు కాస్తంత జాగరూ కతతో ఉంటే మంచిది! పూనకంతో ఆహ్వానించి ఆనక ఆరాముగా చారిత్రక తప్పిదమనే తీర్మానం చెప్పడం కన్నా ముందే నిర్ణయించడం మేలు.

హరి ప్రసాద్‌ గార్లదిన్నె

76739 96504

Updated Date - 2023-03-27T00:55:11+05:30 IST