దేముడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2023-09-25T00:40:03+05:30 IST

దేముడు చచ్చిపోయినట్లు రాత్రి కలొచ్చింది నింగిలోంచి ఏ ఒక్క నక్షత్రము నేల రాలలేదు ఆకాశం బోరున విలపించినట్లు కుండపోతగా వర్షం కురిసిందీ లేదు...

దేముడి ఆత్మహత్య

దేముడు చచ్చిపోయినట్లు

రాత్రి కలొచ్చింది

నింగిలోంచి

ఏ ఒక్క నక్షత్రము నేల రాలలేదు

ఆకాశం బోరున విలపించినట్లు

కుండపోతగా వర్షం కురిసిందీ లేదు

కనీసం ఒక్క భక్తుడైన

గుక్కపట్టి ఏడ్చింది లేదు

ఏ నాయకుడూ

గుండాగి గుటుక్కు మనలేదు

ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలు

యథావిధిగా పనిచేస్తూనే వున్నాయి

మద్యం దుకాణాలు తెరిచే ఉన్నాయి

యదేచ్ఛగా మాంసం విక్రయిస్తునే ఉన్నారు

నూట ఒకటోసారి పెట్రోలు ధర పది రూపాయలు పెరిగింది

బోరుబావిలో పడ్డ పాపాయిలా రూపాయి బిక్కచచ్చిపోయింది

ఇవ్వాళ మరో రేపిస్టుకి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది

ఇందాకే రాజుగారు నాలుగో డ్రస్సు మార్చి ఫొటోలకు పోజులిచ్చారు

రాత్రి వచ్చిన కల నిజమైంది

ఊరి బయట చెరువులో దూకి

దేముడు ఆత్మహత్య చేసుకున్నట్టు

ప్రభుత్వం ఇప్పుడే ప్రకటించింది!

సాబిర్‌

91547 05556

Updated Date - 2023-09-25T00:40:03+05:30 IST