‘దీక్ష’ ఒక మైలురాయి
ABN , First Publish Date - 2023-11-29T02:22:24+05:30 IST
‘మన అన్న కేసీఆరు రామక్క... ఏమి పనులు జేసెనే రామక్క... సావు నోట్లె తలబెట్టి రామక్క... ఢిల్లి మెడలు వంచినాడు రామక్క... ఢిల్లి మెడలు వంచినాడు రామక్క...
‘మన అన్న కేసీఆరు రామక్క... ఏమి పనులు జేసెనే రామక్క... సావు నోట్లె తలబెట్టి రామక్క... ఢిల్లి మెడలు వంచినాడు రామక్క... ఢిల్లి మెడలు వంచినాడు రామక్క... తెలంగాణ తెచ్చినాడు రామక్క’ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గల్లీ గల్లీలో మార్మోగిన, మార్మోగుతున్న పాట ఇది. అవును నిజమే కేసీఆర్ నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించి ‘తెలంగాణ వచ్చుడో... కేసీఆర్ సచ్చుడో...’’ అని పట్టుబట్టి ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు కనుకనే డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన సాధ్యమయింది. అందుకే డిసెంబరు 9కి ముందు... నిజంగానే నవంబర్ 29ని ఆనాటి నుంచి తెలంగాణను ఊపేసిన ఆ పదకొండు రోజులను తప్పనిసరిగా యాది చేసుకో వాల్సిందే. అందుకే నేడు ‘దీక్షా దివస్’... సరిగ్గా అయిదు దశాబ్దాల తెలంగాణ ఉద్యమంలో ఒక కీలకమైన, సానుకూల, చరిత్రాత్మకమైన ‘తెలంగాణ ప్రక్రియ ప్రారంభం అవుతున్నది’ అన్న చిదంబరం ప్రకటన అంతిమ పరిణామంగా జరిగిన కేసీఆర్ దీక్ష వల్లనే సాధ్యమయింది.
మలి తెలంగాణ ఉద్యమం బుద్ధి జీవులు, మేధావులు, ఉద్యోగులు, విశ్వవిద్యాలయాలు, చైతన్యవంతమైన అనేక విడివిడి ‘వేదిక’లు ‘సంఘటన’ల రూపంలో ప్రారంభం అయింది. కానీ ఈ విడివిడి ఆకాంక్షలను గుజికుచ్చి ఒక దండలా మార్చింది కేసీఆర్ రాజకీయ పార్టీ పెట్టినందువల్లనే సాధ్యమయింది. తొలి తెలంగాణ ఉద్యమంలో వచ్చిన పార్టీలు మఖలో పుట్టి పుభలో మాడిపోయాయి. తెలంగాణ కోసం విడివిడి ప్రయత్నాలు విఫలమయ్యాయి. కానీ స్పష్టమైన తెలంగాణ సాధన లక్ష్యం, రాజకీయ అస్తిత్వ ఆవశ్యకతా ప్రకటన దూరదృష్టితో స్థానిక ఎన్నికల నుంచి అన్ని ఎన్నికల్లో పోరాటం ఫలితాలనిచ్చింది. ఈ రాజకీయ అస్తిత్వమే ఢిల్లీలో అన్ని రాజకీయ పార్టీలకూ తెలంగాణ ఎజెండాను వినిపించగలిగింది. ఈ రాజకీయ అస్తిత్వమే చివరకు పదమూడు పార్టీల నుంచి తెలంగాణకు ఆమోద ముద్ర వేయించగలిగింది. దక్షిణాది అంటేనే చిన్నచూపు, అందునా ప్రాంతీయ భావనలు, అస్తిత్వం అంటేనే ఒక ద్వేషంతో నిండిన ఢిల్లీలో తెలంగాణ రాజకీయ చక్రం తిప్పగలిగిన ఒక సత్తా ఏర్పడింది. అది సంఖ్యవల్ల సాధ్యం కాలేదు. కానీ, అనేక ఎత్తుగడల వల్ల సాధ్యమయింది. దానికి కర్త, కర్మ, క్రియ కేసీఆర్. ఆయన వెంట ఒక మార్గదర్శిగా నిలబడినవాడు జయశంకర్. జరిగిన చరిత్ర ఇదే. తెలంగాణలో ఒక చరిత్రాత్మక దీక్ష కూడా కేసీఆర్‌దే. అందుకే గ్రామీణ మహిళలు, బతుకమ్మ అడుకునే ఆడపడుచులు ‘ఢిల్లి మెడలు వంచినాడు రామక్క’ అన్నారు. అయిదు దశాబ్దాల చరిత్రలో ఢిల్లీ మెడలు వంచాలనుకోవడం–అటునుంచి నరుక్కురావాలనుకోవడంలోనే ఈ మొత్తం క్రమం దాగి వున్నది. అది కేసీఆర్ ఉద్యమ ఎత్తుగడల్లో ఉన్నది. దీక్షా దివస్ రోజున ఆయన ఈ దీక్షా దక్షతకు గౌరవం, గుర్తింపు చరిత్రలో ఇవ్వవలసిందే. అంతిమ పరిణామమైన కేసీఆర్ దీక్షకు ముందు తెలంగాణ వీరోచిత పోరాటం చేసింది. విద్యార్థులు నిలబడ్డారు. కేసీఆర్ దీక్ష అనంతర పరిణామాలు అప్పటిదాకా పూర్తి శాంతియుతంగా జరిగిన ఉద్యమ వాతావరణాన్ని వేడెక్కించాయి.
కేసీఆర్ కేంద్రమంత్రిగా పనిచేశారు. డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. శాసనసభకు చాలాసార్లు ఎన్నికయ్యారు. అన్నింటికి మించి ఒక ఉద్యమానికి నాయకుడు. కానీ కేవలం దీక్ష చేస్తానని బయలుదేరిన నేరానికి అయనను రిజర్వ్ పోలీసులు, గ్రేహౌండ్స్ అలుగునూరులో అమర్యాదకరంగా అరెస్ట్ చేశాయి. వరంగల్ ఆ తర్వాత ఖమ్మం... అక్కడ దౌర్జన్యం... విరమించినట్టు తప్పుడు ప్రచారం. ఇవన్నీ తెలంగాణ సమాజాన్ని కుదిపేశాయి. కేసీఆర్ ఆరోగ్యం క్షీణిస్తున్న దశలోనే శ్రీకాంతాచారి మంటల్లో కాలిపోయి తొలి బలిదానం చేసుకున్నాడు. తెలంగాణ అంతటా ఒక ఉద్రిక్త వాతావరణం వ్యాపించింది. నిమ్స్ పరిసరాలు ఆ ఉద్రిక్తతను ప్రతిబింబించాయి. రోశయ్య ప్రభుత్వం హడావిడి... అఖిలపక్షం తెలంగాణ అంగీకారం. ఢిల్లీలో అలజడి. శాంతియుతమైన ఉద్యమం, మరో రూపం తీసుకుంటున్నదన్న ఎరుక. ఒకేరోజు కాంగ్రెస్ ఆగ్రశ్రేణి అనేక సమావేశాల అనంతరమే తెలంగాణ ప్రకటన వెలువడింది.
ఇప్పుడొక యాది. నేను అప్పుడు ఆంధ్రజ్యోతిలో అసిస్టెంట్ ఎడిటర్‌గా ఉన్నాను. ఉద్యమ సంబంధాలవల్ల అన్ని రకాల సంఘాలు, పార్టీల నాయకులు కూడా మాట్లాడేవారు. కేసీఆర్ దీక్ష ప్రారంభించినాడు ఆ నిర్బంధం వల్ల ఏర్పడిన సానుభూతిని, తెలంగాణ ప్రజల అభిప్రాయాలను ఏర్పరచడానికి దీక్ష విరమణ ప్రచారం జరిగింది. గద్దర్ లాంటి వారు దీక్షకు వ్యతిరేకంగా మాట్లాడారు. కానీ, పదిరోజుల పరిణామాల అనంతరం కేసీఆర్ దీక్ష విరమించుకోవలసిందిగా అదే గద్దర్ విజ్ఞప్తిచేశారు. అది ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో గద్దర్ ఫోటోతో సహా అచ్చయింది. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ, సంపాదకులు శ్రీనివాస్, నేను కేసీఆర్‌ను చూసి ఆరోగ్య పరిస్థితులు అంచనావేయడానికి వెళ్ళాం. ఆయనతో మాట్లాడాము. అంతకు ముందు స్వయంగా నేను ‘నిమ్స్ బెడ్ మీద ఉండగానే’ ఇంటర్వ్యూ చేశాను. శ్రీకాంతాచారి బలిదానం మీద కన్నీళ్లు పెట్టుకున్నారు కేసీఆర్. క్షీణించిన ఆయన ఆరోగ్యం మీద అప్పుడు వార్త రాశాం. అంటే దీక్ష ప్రారంభమయిన తర్వాత జరిగిన పరిణామాల్లో తెలంగాణ అన్ని రకాల సంస్థలను, వేదికలను, విడివిడిగా ఉన్న ఉద్యమకారులను ఆ దీక్ష ఏకం చేసింది. కేసీఆర్ ఉద్యమం కోసం బతికుండాలి అని గద్దర్ ప్రకటన తర్వాత మరుసటి రోజు దాదాపు 23 సంఘాలతో తెలంగాణ ప్రజాఫ్రంట్, ఐక్యకార్యాచరణ కమిటీ, జర్నలిస్టు ఫోరం, జేఏసీలతో సహా అందరు ఏకగ్రీవంగా ‘కేసీఆర్ దీక్ష విరమించాలని‘ ప్రకటించి అక్కడినుంచి నిమ్స్‌కు బయలుదేరాం. అక్కడ అప్పటికే ఒక నిర్ణయం తీసుకుని, తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత కేసీఆర్ దీక్ష విరమించారు. ఇది ఒక వాస్తవం. కేసీఆర్ దీక్షవల్ల ఒక ఐక్యతాభావం సాధ్యమయింది.
అందుకే జయశంకర్‌సారు... ‘ఇక తెలంగాణ వెనుకకు పోదు. ఎన్నడు లేనంత ఐక్యత ఈ దీక్షవల్ల సాధ్యమయింది. కేసీఆర్ ఒక రాజకీయ క్రమాన్ని నమ్మకుని తెలంగాణపై పూర్తి అవగాహనతో, తెలంగాణ ప్రజల భాషలో, యాసలో, నుడికారంలో ప్రజల్లోకి తీసుకెళ్లగలిగి, ‘తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో’ అని ప్రకటించినాడు కనుకనే దీక్ష తెలంగాణ సమాజాన్ని ఏకం చేసింది. ఢిల్లీ మెడలు వంచి ప్రకటన తెచ్చింది’ అన్నారు.
అందువల్ల బహుముఖంగా సాగిన ప్రత్యేక తెలంగాణ సుదీర్ఘ ఉద్యమంలో కేసీఆర్ దీక్ష అత్యంత కీలక పరిణామం. తెలంగాణ ఉద్యమానికి ఒక విస్తృతి ఉన్నది. అది సకల జనుల, సబ్బండ వర్ణాల ఏకతవల్ల సాధ్యమయింది. తెలంగాణ కులంలేని, మతంలేని, జాతి భేదంలేని, వృత్తి భేదంలేని, పేద, ధనిక భేదంలేని ఒక అభేద్యమైన ‘ఏకాత్మ’గా పోరాడింది కనుకనే సాధ్యపడింది. అందులో ఒక రాజకీయ క్రమాన్ని, విస్పష్టమైన రాజకీయ స్వీయ అస్తిత్వ నమూనాను, గత అనుభవాల వెలుగులో శాంతియుత, సంప్రదింపుల మార్గంలో ఎత్తుగడలు రూపొందించుకున్నారు కనుక అయిదు దశాబ్దాల ఉద్యమంలో తెలంగాణ ఉద్యమపార్టీ ఒక్కటే ఒక రాజకీయ పార్టీగా, కేసీఆర్ ఒక్కడే ఒక నాయకునిగా సఫలం అయిన విజేతలు. ఆయన దీక్ష కూడా చరిత్ర పుటల్లో అగ్రశ్రేణి పరిణామంగా నమోదు కావలసిందే. తారుమారు విలువల కాలంలో తెలంగాణ డిసెంబర్ 9 తర్వాత అడ్డుకున్నవాళ్ళు చరిత్ర గురించి మాట్లాడడం గొప్ప విషాదం. విరోధాభాస.
గోదావరి జిల్లా కవి, రచయిత సోమసుందర్ తెలంగాణ సాయుధ పోరాటాన్ని కీర్తిస్తూ నిజాం సేనల మీద వజ్రాయుధం విసిరినవాడు. అనంతర కాలంలో ఆయన ప్రత్యేక తెలంగాణకు శషభిషలు లేకుండా మద్దతు పలికాడు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదట సాహిత్య సాంస్కృతిక ఉద్యమం, అనంతరం రాజకీయ ఉద్యమం అన్నారు ఆయన. సాహిత్య సాంస్కృతిక ఉద్యమానికి స్పష్టత ఉంటుంది, నిజాయితీ ఉంటుంది, రాజకీయ ఉద్యమానికి ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి అని తేల్చారాయన. అట్లాగే తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఖాళీలు ఉండవచ్చు. కానీ, వాటిని మన రాజకీయ అభిప్రాయాల రీత్యా, ఇష్టాయిష్టాల రీత్యా పూరించలేము. అర్ధ సత్యాలు, అసంపూర్ణ వాస్తవాలతో పూరించలేము. సత్యాన్ని దాచిపెట్టి నిరాకరించలేము. అది వక్రీకరణ అవుతుంది. కేసీఆర్ దీక్ష నిశ్చయంగా తెలంగాణ ఉద్యమంలో కీలక మలుపు. మైలురాయి. జై తెలంగాణ.
అల్లం నారాయణ
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్