మహాభారతానికి నేడు కావాల్సిన వ్యాఖ్యానం

ABN , First Publish Date - 2023-03-13T01:17:37+05:30 IST

మహాభారతాన్ని పునర్వ్యాఖ్యానిస్తూ సృజనాత్మకరచనలు దాదాపు ప్రతి భారతీయభాషలోనూ వచ్చాయి. ఆ భాషలలో అవి క్లాసిక్స్‌గా కూడా మిగిలిపోయాయి. కేరళకు చెందిన ఎం.టి. వాసుదేవన్‌ నాయర్‌ ‘సెకండ్‌ టర్న్‌’ రాశారు...

మహాభారతానికి నేడు కావాల్సిన వ్యాఖ్యానం

మహాభారతాన్ని పునర్వ్యాఖ్యానిస్తూ సృజనాత్మకరచనలు దాదాపు ప్రతి భారతీయభాషలోనూ వచ్చాయి. ఆ భాషలలో అవి క్లాసిక్స్‌గా కూడా మిగిలిపోయాయి. కేరళకు చెందిన ఎం.టి. వాసుదేవన్‌ నాయర్‌ ‘సెకండ్‌ టర్న్‌’ రాశారు, కన్నడంలో భైరప్ప ‘పర్వ’ రాశారు, మరాఠీలో విష్ణు సఖారాం ఖండేకర్‌ ‘యయాతి’ రాశారు, తమిళంలో సుబ్రహ్మణ్యభారతి ‘పాంచాలి శపథం’ రాశారు, ఒరియాలో ప్రతిభా రాయ్‌ ‘యాజ్ఞసేని’ రాశారు. ఇక హిందీలో చెప్పనక్కర్లేదు. వీళ్లంతా ఆధునిక, సమకాలీన సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని, సమకాలీన సందర్భంలో భారతాన్ని వ్యాఖ్యానించే ప్రయత్నం చేశారు.

కానీ, ఈ భాషల తాలూకు ప్రాచీన సాహిత్యాలు మహాభారత ప్రధాన సాహిత్యాలు కావు; రామాయణ ప్రధాన సాహిత్యాలు. తమిళంలో కంబన్‌ ఉన్నాడు, హిందీలో తులసీదాస్‌ ఉన్నాడు, మరాఠీలో వైష్ణవసాహిత్యం, పాండు రంగ సాహిత్యం ఉన్నాయి. తెలుగులో ప్రాచీన సాహిత్యం మొదలు కావడమే మహాభారతంతో మొదలైంది. దాదాపు 300ఏళ్ల పాటు జరిగింది ఆ మహా యజ్ఞం. ఆశ్చర్యంగా ఆధునిక తెలుగుసాహిత్యంలో మహాభారతానికి చెప్పుకో దగ్గ పునర్వ్యాఖ్యానాలు ఏమీలేవు. యథార్థానికి తెలుగువాడి మనస్తత్వం, తెలుగువాడి జీవలక్షణం భారతానికి చాలా సన్నిహితంగా ఉంటాయి; అది రామాయణ జీవలక్షణం కాదు. కానీ, తెలుగులో రామాయణ కావ్యాన్ని రాసిన ఆధునిక కవికి జ్ఞాన పీఠ పురస్కారం వచ్చింది. ఇదొక వైరుధ్యం.

భారతానికి తెలుగులో సవిస్తరమైన వ్యాఖ్యానాలు రాని లోటును, భారత మని పేరు పెట్టకుండా, దాదాపుగా భారతకథలాంటి కథ రాసిన ‘కన్యాశుల్కం’ కొంతవరకు పూరించిందనిపిస్తుంది. ‘కన్యాశుల్కం’ ఎట్లా మహాభారతం తాలూకు ఆధునికరూపమో వివరిస్తూ అడ్లూరి రఘురామరాజు ఒక పెద్ద పుస్తకం రాశారు. గురజాడ ‘కన్యాశుల్కం’ రాయడంతో; నన్నయ ప్రారంభించిన వెయ్యేళ్ల భారత సంప్రదాయం పక్కకిపోయి ఆధునిక సాహిత్య సంప్రదాయం వచ్చింది. కన్యాశుల్కం భారతానికి పూర్తి ప్రతినిధి కాదు కానీ, భారతం తాలూకు కొన్ని సమస్యలను దృష్టిలోపెట్టుకుని గురజాడ అప్పారావుగారు దానిపై పునర్వా ఖ్యానం చెయ్యడానికి ప్రయత్నం చేశారు. అలాగే, ఈనాటి కాలంలో మహా భారతాన్ని అర్థం చేసుకుని పునర్వ్యాఖ్యానించుకోవలసిన అవసరం ఉంది. ‘మంత్రకవాటం తెరిస్తే మహాభారతం మన చరిత్రే’ అనే పుస్తకం ద్వారా కల్లూరి భాస్కరం అటువంటి ఒక లోటును పూరించే ప్రయత్నం చేశారు.

నేటి భారతదేశంలో ఈ పుస్తకానికి నిస్సందేహంగా ఒక ప్రాసంగికత ఉంది. మహాభారతాన్ని హిందువుల తాలూకు ఒక ఇతిహాసమన్నాం కానీ, పురాణం అనలేదు. ఇతిహాసమంటే, ‘ఇలా ఉండే’దని చెప్పేది. అందులో మంచి-చెడుల గురించిన తీర్పు ఉండదు. ఇలా చేసేవారు, ఇలా ఉండేవారు, ఇలా పుట్టేవారు, ఇలా పెళ్లి చేసుకునేవారు, ఇలా చంపుకునేవారని చెప్పడమే అందులోని విషయం తప్ప; ఇలా ఎందుకు పుట్టారు, ఇలా ఎందుకు పెళ్లి చేసుకున్నారు, వాటిద్వారా ఏమైనా విలువలు నిలబెట్టరా అన్నది కాదు. భగవద్గీతను హిందువుల ప్రస్థాన త్రయంలో ఒక ముఖ్యమైన పుస్తకమని మనందరం అంగీకరిస్తాం. మహాభార తాన్ని తమ వారసత్వంగా తీసుకున్న హిందువులు, ఇప్పుడు హిందూమతం గురించి మాట్లాడుతున్న హిందువులు- వీరిద్దరూ ఒకళ్ళేనా; ఇప్పుడు హిందూ మతం గురించి మాట్లాడుతున్న హిందువులు మహాభారతాన్ని చదివారా, అర్థం చేసుకున్నారా అనే ప్రశ్నలు ఈ పుస్తకాన్ని చదివే క్రమంలో ముందుకు వస్తాయి.

భాస్కరం సనాతన శ్రోత్రియ కుటుంబంలో జన్మించారు. వారి నాన్నగారు గొప్ప పండితులు, కవి, పౌరాణికులు. ‘‘నాలోని పౌరాణికుడు విజృంభిస్తున్నా’’ డని భాస్కరం ఒకచోట రాస్తారు. ఒక పౌరాణిక సంప్రదాయానికి చెందిన మనిషిగా, ఉన్న పుస్తకాన్ని యథాతథంగా చదివి, ఒక మూఢవిశ్వాసిగా నమ్మి ఆ పుస్తకాన్ని ముందుకు తీసుకురావాల్సిన సంప్రదాయపరంపరకు చెందిన మనిషాయన. అలా కాకుండా ఒక విద్యార్థిగా, ఒక అన్వేషిగా, ఒక జిజ్ఞాసిగా ఆయన తనను తాను ఓపెనప్‌ చేసుకుంటూ వెళ్లడం చాలా గొప్ప విషయం.

ఈ పుస్తకం తాలూకు విశేషమైన విలువ ఎక్కడ ఉందంటే- నిజంగా మీరు హిందూ సంప్రదాయాన్ని నమ్ముతున్నవారైతే మొట్టమొదటిగా మీరు చేయ వలసింది ఏమిటో ఇది చెబుతుంది. మీ మూలాల గురించి మాట్లాడుతున్న ప్పుడు, మీ గ్రంథాల గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు వీలైనంత జాగరూ కులుగాను, ఓపెన్‌గాను, నిష్పాక్షికంగాను ఉండండి; మీ పుస్తకాలు ఏం మాట్లా డుతున్నాయి, వాటిలో ఉన్న పురావస్తు అవశేషాలు ఏం మాట్లాడుతున్నాయి, ఫలానా శబ్దం ఏం చెబుతోందనేది దృష్టిలో పెట్టుకోండి, ఇది చాలా అత్యవ సరమైన విషయమని ఈ పుస్తకం అంటుంది. భాస్కరం ఎవరి పక్షమూ తీసుకో లేదు. ముందే చెప్పినట్టుగా, ఒక ఇతిహాసంగా మహాభారతం ‘ఇలా ఉండే’దని చెప్పేది మాత్రమే. భాస్కరం ఆ ఇతిహాసలక్షణాన్నే తన పుస్తకంలోనూ అనుసరించారు.

యథార్థానికి ఈ పుస్తకం మహాభారతం గురించిన పుస్తకం మాత్రమే కాదు; మహాభారతాన్ని ఒక ఉదాహరణగా తీసుకుని, ఆ టెక్స్‌ట్‌ను ఆధారం చేసుకుని జరిపిన ఒక తులనాత్మక పరిశీలన. ఇది ప్రధానంగా భారత్‌, ఆసియామైనర్‌, యూరప్‌, మధ్యప్రాచ్యాలకు సంబంధించిన పురాణ గాథల మధ్య సారూప్యతను చర్చిస్తుంది. ఇలాంటి పరిశీలన యూరప్‌లో 19వ శతాబ్దంలో మొదలైంది. సైన్సు వెలుగులో, ఇప్పుడు మన దగ్గర జరుగుతున్నట్టే, అప్పుడు యూరప్‌లో కూడా పురాణాలన్నీ పుక్కిటి కథలనీ, వాటిని చదవాల్సిన అవసరం లేదనీ; సైన్సు వచ్చాక పురాణాలతో పనిలేదనీ భావించారు. 18వ శతాబ్దిని ‘ఏజ్‌ ఆఫ్‌ ఎన్‌లైటెన్మెంట్‌’ (జ్ఞాన వికాస యుగం) అంటాం. ఆ ప్రభావంతో హోమర్‌ను గాని, విర్జిల్‌ను గాని, మొత్తం ఓల్డ్‌ టెస్టమెంట్‌ ప్రాఫెట్స్‌ను కానీ వాళ్లు పట్టించుకోలేదు. 19వ శతాబ్దికి వచ్చేసరికి సైన్స్‌ తాలూకు ఉద్రేకం తగ్గి, సైన్స్‌ చెప్పని చాలా అంశాలు, చాలా సమాధానాలు పురాణాల్లో దొరుకుతాయనీ, ఒకసారి వాటిని పరిశీలిద్దామనీ, పరిశోధిద్దామనే తపన మొదలైంది. 19వ శతాబ్ది మధ్యభాగం నుంచి, అంటే 1840 నుంచి మొదలైన ఆ పరిశీలన ఇప్పటికీ ఇంకా ఇంకా విస్తృతస్థాయిలో కొనసాగుతూ ఉంది.

భాస్కరం ప్రధానంగా 19వ శతాబ్ది చివరి కాలానికి, 20వ శతాబ్ది పూర్వా ర్ధానికి సంబంధించిన తులనాత్మకపౌరాణిక అధ్యయనాలను; ముఖ్యంగా గ్రీకు పౌరాణిక అధ్యయనవేత్త జార్జి థామ్సన్‌ను, తెలుగులో రాంభట్ల కృష్ణమూర్తిని, కొంతమంది తొలినాటి మార్క్సిస్ట్‌ భౌతికవాదతాత్వికులను, లూయీ హెన్రీ మోర్గన్‌ వంటి మానవశాస్త్రవేత్తలను బాగా అధ్యయనం చేశారు. తులనాత్మక పౌరాణిక అధ్యయనాలలో అన్నిటికన్నా ఉత్తమమని చెప్పదగింది, జోసెఫ్‌ కాంబెల్‌ అధ్యయనం. ఆయన ‘ఓరియంటల్‌ మైథాలజీ’, ‘ఆక్సిడెంటల్‌ మైథాలజీ’, ‘ప్రిమిటివ్‌ మైథాలజీ’, ‘క్రియేటివ్‌ మైథాలజీ’ అనే నాలుగు పుస్తకాలు రచిం చాడు. ఇలాంటి అధ్యయనాల వెలుగులో భాస్కరం మహాభారతాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేశారు.

మన విశ్వాసాలు, మన పురాణాలు, మన చరిత్ర, మన సంస్కృతి ఏం చెప్తు న్నాయి; మన పూర్వ గ్రంథాలు ఏం చెప్తున్నాయి, మన జాతికి మన సంస్కృతికి మూల నిర్మాతలైన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, టెక్స్‌ట్‌ ఏం మాట్లాడు తోంది అనేదాన్ని పక్కనపెట్టి; మనం కొన్ని విశ్వాసాలను ఏర్పరచుకొని వాటిని నమ్ముకుంటూ వాటికోసం ఒకరితో ఒకరం యుద్ధం చేసుకుంటున్న నేటి సందర్భంలో- ప్రపంచంలో భారతదేశం ఒకటే అత్యున్నతదేశమని గాని, ప్రపం చంలో తక్కిన దేశాలన్నీ నిద్రపోతుంటే భారతదేశంలోనే సంస్కృతి వికసించిం దని గాని, భారతదేశం మాత్రమే ప్రపంచంలో అత్యుత్తమ సంస్కారం పొందిన దేశమని కానీ భావించకండని ఈ రచయిత అంటారు. ఒకప్పుడు భారతదేశ మనిగాని, లెబనాన్‌ అనిగాని, సిరియా అనిగాని, గ్రీస్‌ అనిగాని లేవు; ఇవన్నీ ఒకే ప్రాంతంగా ఉన్నాయి, ఇవి మానవులందరి ఉమ్మడి ఆస్తి అంటారు.

ఈ విషయాన్ని చాలా కాలం కిందట యూంగ్‌ అనే ఒక మనస్తత్వ శాస్త్రవేత్త కనుక్కుని చాలా ఆశ్చర్యపోయాడు. ఆయన దగ్గరికి వచ్చే రకరకాల జాతులకు చెందిన రోగులు తమకు వస్తున్న కలల గురించి చెబుతూ ఉంటే; ఈ కలలన్నీ వాళ్ళ జాతికి, భాషకి మతానికి సంబంధం లేకుండా ఒకే రకమైన ప్రతీకలుగా, ఒకే రకమైన భాష మాట్లాడుతున్నవిగా ఆయన గమనించాడు. దాంతో, ‘మనుషులకి రకరకాలుగా ఒక వైయక్తిక చేతన ఉండొచ్చేమో కానీ, మానవజాతి మొత్తానికి ఒక ఉమ్మడి చేతన ఉంది; మనందరం ఒక సామూ హిక చైతన్యంతో అనుసంధానమై ఉన్నాం, అంటే నీ మనసులో నా మనసులో, నీ స్వప్నావస్థలో నా స్వస్నావస్థలో మనం ఒక్కరిగానే ఉన్నాం; జాగృతావస్థకు వచ్చిన తర్వాత నీ జాతి నా జాతి, నీ మతం నా మతం, నీ భాష నా భాష అని కొట్టుకుంటున్నాం; కానీ మనం కలలు కంటున్నప్పుడు మన కలలు మాట్లాడే భాష ఒక్కలాగే ఉంటుం’దన్న అవగాహనకు ఆయన వచ్చాడు.

ఆయన అలా అన్న తర్వాత ప్రపంచం చాలా ఆశ్చర్యపోయింది. ఆయన చెప్పినది ఆధారంగా రెండు దారుల్లో అన్వేషణ మొదలుపెట్టారు. ఒక దారిలో మనస్తత్వశాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురాణకథలను పరిశీలించడం మొదలుపెట్టారు. వాటన్నిట్లో కూడా అవే భయాలు, అవే ఆందోళనలు, అదే నెర్వస్‌నెస్‌, అదే దీక్ష, అదే పోరాటపటిమ, అదే మూఢత్వం ఉన్నట్టు గ్రహిం చారు. వాటిని వర్గీకరించడం మొదలుపెట్టారు. ఇది ఒక రకమైన అధ్యయనం. ముఖ్యంగా యూంగ్‌ అనుయాయి జోసెఫ్‌ కాంబెల్‌ ఈ రకమైన అధ్యయనం చేశాడు. ఆయన ‘ఏ హీరో విత్‌ థౌజండ్‌ ఫేసెస్‌’ అనే పుస్తకం రాశాడు. ఈ పుస్తకాన్ని నేను 30ఏళ్ల క్రితం చదివినప్పుడు, నా ప్రపంచం ఒక్కసారిగా ఏడు సముద్రాల పరిధికి విస్తరించిపోయింది. ‘అరె, నేను నా ఊరు, నా భాష, నా సంస్కృతి, నా జాతి అని అనుకుంటు న్నాను, కాదు; ప్రతి మనిషి, ప్రతి మనిషికి సంబం ధించిన వాడే’ననుకున్నాను. శ్రీశ్రీ ఒకచోట ‘‘ఈ నేల మీద నడయాడుతున్న ప్రతి ఒక్కరూ ఈ నేల మీద ఒకప్పుడు నడయాడిన ప్రతి ఒక్కరికీ వారసుడే’’నని రాసాడు.

రెండోవారు ఏంత్రొపాలజిస్టులు. వీరు వివిధ ఆదిమజాతులను అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. వారిలో మలినోవస్కీ ఒకరు. ఆయా తెగలు, వారికి సంబంధించిన క్రతువులు, విశ్వా సాలను పరిశీలిస్తే; వాటికీ, ఉన్నత సంస్కృతులుగా చెప్పుకునే గ్రీకు, రోమన్‌, ఇండియన్‌, ఈజిప్షియన్‌ సంస్కృతుల తాలూకు అత్యుత్తమ గ్రంథాలకీ మధ్య ఆయనకు చాలా పోలికలు కనిపించాయి. ఉదాహరణకు, టోబ్రియాండ్‌ దీవులలో ఉండే తెగలకి ఈజిప్షియన్‌ సంస్కృతి గురించి తెలియదు, హోమర్‌ గురించి తెలియదు, వ్యాసుడి గురించి తెలియదు. కానీ వాళ్ల నమ్మకాల్లో వాళ్ళ కథల్లో; వీళ్ళ నమ్మకాల్లో వీళ్ళ కథల్లో ఒక ఉమ్మడితనం కనపడుతుంది. లెనిస్ట్రాస్‌ అనే ఆయన దానిని ఒక స్ట్రక్చర్‌గా ప్రతిపాదించాడు. వీళ్ళనే మనం స్ట్రక్చర్‌లిస్ట్‌లని అంటూ ఉంటాం. వీళ్ళు యూనివర్సల్‌ స్ట్రక్చర్‌లిస్ట్‌లన్నమాట. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పురాణకథలు, నమ్మకాల మధ్య వారు ఒక ఉమ్మడితనాన్ని ప్రతిపాదించారు. 20వ శతాబ్ది ద్వితీయార్ధం నుంచి దానిపై విస్తృతమైన పరిశోధనలు జరుగుతూ వచ్చాయి.

భాస్కరం దాదాపుగా వీరందరి పరిశోధనల సరళిని ఈ పుస్తకంలో ప్రతి బింబించారు. ఈ పుస్తకం ఒక మ్యూజింగ్‌, ఒక అన్వేషణ, ఒక ప్రయాణం. ఈయన ఎక్కడా కూడా ఒకచోట మొదలుపెట్టి, ఒకచోట ముగించే ప్రయత్నం చేయలేదు. చివరికొచ్చేసరికి, ‘ఈ వ్యాసపరంపరలో ప్రస్తుతానికి ఇది చివరి వ్యాసమే తప్ప ముగింపుకా’దని 789వ పేజీలో రాస్తారాయన. వీటిలో చర్చించిన అనేక అంశాలకు పూర్తి న్యాయం చేశానని తను అనుకోవట్లే దంటారు.

భాస్కరం ఈ అన్వేషణను కొనసాగించాలి. ముఖ్యంగా ఆయన 20వ శతాబ్ది సగందాకా వచ్చిన అధ్యయనాలను చదివారు. 20వ శతాబ్ది పూర్వార్థంలో కూడా చాలామంది, ముఖ్యంగా జీన్‌ ప్రియరీ వెర్నాంట్‌ అనే ఆయన గ్రీకు మైథాలజీ మీద అద్భుతమైన కృషి చేశారు. గత 10, 20ఏళ్లలో మైథాలజీమీద యూరప్‌లో గొప్ప పుస్తకాలు వచ్చాయి. నలదమయంతులు, తపతీసంవరణులు, యయాతీ శర్మిష్టల కథలతోసహా అనేక అంశాలను భాస్కరం ఈ పుస్తకంలో అద్భుతంగా వ్యాఖ్యానించారు. వీటిని ఈ కొత్త పరిశోధనల వెలుగులో మరొకసారి పునర్వ్యాఖ్యానించాలని, పునరాలోచించాలని కోరుకుంటున్నాను.

వాడ్రేవు చినవీరభద్రుడు

Updated Date - 2023-03-13T01:17:37+05:30 IST