Share News

చేను చెక్కిన శిల్పం సోమేపల్లి

ABN , Publish Date - Dec 19 , 2023 | 02:29 AM

కవిత్వంలో నిబిడమై ఉండే మట్టివాసనను మానవత్వపు భాషలో రంగరించి, సరికొత్త రంగునూ రూపునూ అక్షరానికద్దిన ఉదాత్తమైన కవి సోమేపల్లి వారి ఇహలోక నిష్క్రమణ...

చేను చెక్కిన శిల్పం సోమేపల్లి

‘ఈ తల్లిమట్టిని కళ్ళకద్దుకోవటంతో

నా దినచర్య ప్రారంభమవుతుంది’

కవిత్వంలో నిబిడమై ఉండే మట్టివాసనను మానవత్వపు భాషలో రంగరించి, సరికొత్త రంగునూ రూపునూ అక్షరానికద్దిన ఉదాత్తమైన కవి సోమేపల్లి వారి ఇహలోక నిష్క్రమణ సాహితీలోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది, కంటతడి పెట్టించింది. ఈ నెల 14న గుంటూరులోని స్వగృహంలో తుదిశ్వాస విడిచిన సోమేపల్లి వెంకటసుబ్బయ్య కవిగా, సాహితీపోషకులుగా, వివిధ సంస్థల నిర్వాహకులుగా చిరపరిచితులు.

ప్రకాశం జిల్లాలో ఒక మారుమూల గ్రామం గన్నవరంలో సాధారణ రైతుకుటుంబపు మట్టిపాదులో మొలకెత్తిన సోమేపల్లి స్వయంకృషితో కల్పవృక్షంగా ఎదిగారు. పుష్పించారు. కవితాపరిమళాలు వెదజల్లారు. జర్నలిస్టుగా ‘ఆంధ్రజ్యోతి’లో ఓనమాలు దిద్దుకున్న సోమేపల్లి వెంకటసుబ్బయ్య గ్రూప్–2 ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ శాఖలో ఎంఆర్ఓగా ఉద్యోగజీవితం ప్రారంభించారు. అంచెలంచెలుగా అనేక హోదాలను అధిష్టించి డిప్యూటీ కలెక్టర్‌గా పదవీవిరమణ చేశారు.

నీతిగా నిజాయితీగా పనిచేస్తూ ఉత్తమాధికారిగా అవార్డులందుకున్నారు. సమాంతరంగా సాహితీవేత్తగా ఎదిగారు. ‘లోయలో మనిషి’, ‘తొలకరి చినుకులు’, ‘చల్లకవ్వం’, ‘చేను చెక్కిన శిల్పాలు’, ‘పచ్చని వెన్నెల’, ‘నాగలికి నా నమస్కారం’, ‘రెప్పల చప్పుడు’ – కవితాసంపుటాల్లో తమ గుండెచప్పుళ్ళను వినిపించారు. వట్టి వచనంలో కొట్టుకుపోతున్న తెలుగుకవిత్వానికి మట్టిభాష నేర్పారు. గ్రామీణ పదబంధాలకు ప్రాణంపోశారు. జడ్డిగం నుండి జాలువారే విత్తనాల్లా అక్షరాలను పాఠకుల హృదయక్షేత్రాల్లో వెదజల్లారు. కవిత్వపు పంటలు పండించారు. జీవితం లోనూ కవిత్వంలోనూ ఆచరణాత్మకతకు అగ్రతాంబూలమిచ్చారు. అధికారదర్పానికి దూరంగా ఉంటూ మంచితనంతో మమకారంతో అందరికీ దగ్గరయ్యారు. ‘జీవితమంటే నాలుగక్షరాలు కాదు, నలుగురితో ఆత్మీయతను పంచుకోవడం’ అని ఆచరణలో నిరూపించారు. జననానికీ మరణానికీ మధ్య గల కాలాన్ని కలంతో కొలిచారు, జయించారు.

కవిత్వంలో పెద్దకవులు పలువురుంటారు. పెద్దమనసున్నవారు మాత్రం అరుదుగా కనిపిస్తారు. చిన్నా పెద్దా అందరినీ గౌరవించే సంస్కారం సోమేపల్లిని ఉన్నతస్థాయిలో నిలిపింది. ఆ పెద్దరికమే యువకవుల భుజం తట్టింది. కొత్తకలాల ముద్రణకు ఆలంబనయింది. పైరగాలి వంటి తీయని పలకరింపయింది. గుంటూరు జిల్లా రచయితల సంఘం, ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘాల ఆవిర్భావానికి శ్రీకారం చుట్టి, కవిసమ్మేళనాలతో క్రమంతప్పని సాహిత్యకార్యక్రమాలతో కవిత్వానికి కొత్త ఊపిరులూదిన సోమేపల్లి సాహితీసేవ చిరస్మరణీయం. చద్ది బువ్వలో, చల్ల కవ్వంలో తదేకంగా వినిపించే కనిపించే సోమేపల్లి వెంకటసుబ్బయ్య గారు అప్పుడెప్పుడో నా ‘ఈ గాయాలకు ఏం పేరు పెడదాం?’ కవితాసంపుటిని అంకితం తీసుకుని, ఇప్పుడు నాకూ ఆత్మీయులకూ నా కుటుంబ సభ్యులకూ గుండెగాయం చేసి ‘మట్టి పొరల్లోకి’ మౌనంగా వెళ్లిపోయారు. కవిత్వంతో కాలాన్ని జయించిన సోమేపల్లి వారికి ఆత్మీయ అక్షరనివాళి!

డా. బీరం సుందరరావు

Updated Date - Dec 19 , 2023 | 02:29 AM