ఎవరినైనా ‘అపర పాణిని’ అని అనవచ్చా?

ABN , First Publish Date - 2023-10-02T01:10:10+05:30 IST

ఇటీవల ఒక సంస్కృత పండితుడు దివంగతుడైనప్పుడు ఆయన ప్రతిభను ప్రశంసిస్తూ ‘అపర పాణిని’ అని కీర్తించారు. పాణిని మహర్షి ఒక వైయాకరణ శిఖరాగ్రం. వ్యాకరణంలో నిష్ణాతులైన వాళ్ళని వ్యాకరణ శాస్త్రజ్ఞులనీ, వ్యాకరణ పండితులనీ అనాలి...

ఎవరినైనా ‘అపర పాణిని’ అని అనవచ్చా?

ఇటీవల ఒక సంస్కృత పండితుడు దివంగతుడైనప్పుడు ఆయన ప్రతిభను ప్రశంసిస్తూ ‘అపర పాణిని’ అని కీర్తించారు. పాణిని మహర్షి ఒక వైయాకరణ శిఖరాగ్రం. వ్యాకరణంలో నిష్ణాతులైన వాళ్ళని వ్యాకరణ శాస్త్రజ్ఞులనీ, వ్యాకరణ పండితులనీ అనాలి. కాని, కనీసం వైయాకరణులని కూడా పిలవకూడదు. వైయాకరణుడంటే వ్యాకరణ శాస్త్ర నిర్మాత. పాణిని మహర్షి కాక సంస్కృతంలో ఇతర వైయాకరణులు వున్నారు. వీళ్ళు స్వతంత్రంగా వ్యాకరణ గ్రంథాలు రచించారు.

వైయాకరణుల్లో కొందరు ప్రసిద్ధ వ్యక్తులు: కాత్యాయనుడు లేదా వరరుచి (వార్తిక కారుడు), పతంజలి (మహాభాష్యం), మహేంద్రుడు (ఐంద్ర వ్యాకరణం), బృహస్పతి (మాహేశ్వర వ్యాకరణం), కాశ కృత్స్నుడు (శబ్ద కలాపం), అపిశలి (పంచపాది, అపిశలి వ్యాకరణం), శాకటాయనుడు (వ్యాకరణ లక్షణ శాస్త్రం), శర్వవర్మ (కాతంత్ర వ్యాకరణం), హేమచంద్రుడు (శబ్దానుశాసనం), పాణిని మేనమామ ఐన వ్యాడి (సంగ్రహం), చంద్రాచార్యుడు (చాంద్ర వ్యాకరణం), పూజ్యపాదుడు (జైనేంద్ర వ్యాకరణం), భోజరాజు (సరస్వతీ కంఠాభరణం), క్రమదీశ్వరుడు (సంక్షిప్త సారం), జుమరనంది (జుమరం), పద్మనాభుడు (సుపద్మ వ్యాకరణం), ముగ్ధ బోధుడు (సారస్వత వ్యాకరణం), రూప గోస్వామి (హరినామామృతం), బలరామ పంచాననుడు (ప్రబోధ ప్రకాశం), ఇంకా- భరద్వాజుడు, భాగురి, పౌష్కర సాది, చారాయణుడు, వైయాఘ్రపది, పాల్వకీర్తి, వృత్తికారుడు యక్షవర్మ, అమరసింహుడు (అమరకోశం - నామలింగానుశాసనం) లాంటి వాళ్ళు. ఇక తెలుగులో చిన్నయసూరి (బాల వ్యాకరణం), బహుజన పల్లి సీతారామాచార్యులు (ప్రౌఢ వ్యాకరణం) సైతం వైయాకరణులే. పాణిని ఎనిమిది అంతస్థుల అష్టాధ్యాయ భవన నిర్మాణం తరువాత పై పేర్కొన్న వ్యాకరణాలన్నీ నామమాత్రాలు అయిపోయాయి. పతంజలి మహాభాష్యం, వరరుచి వార్తికాలు, అమరకోశం మాత్రం నిలిచి వున్నాయి.

వ్యాసకర్త దివంగత సంస్కృత పండితుడిని గురుభక్తితో ‘అపర పాణిని’ అని వర్ణించినా, పాణిని మహర్షి ఎందుకు, ఎలా ఏ మాత్రం పోలిక లేని వాడో పరిశీలిద్దాం. ‘ఋషిర్దర్శనాత్‌’ అనే అనే నిరుక్త వచనాన్ని సార్థకం చేస్తూ, పాణిని ‘అష్టాధ్యాయ’, ‘ధాతు పాఠం’, ‘గణపాఠం’, ‘లింగానుశాసనం’, ‘ఉణాది సూత్రకోశం’ అనే ఐదు వ్యాకరణ గ్రంథాలు రచించాడు. ఇందులో అష్టాధ్యాయ పేరుకు తగినట్టుగా, 8 అధ్యాయాలతో, 3959 సూత్రాలతో వున్నది. ఈ ప్రామాణిక గ్రంథకర్త పాణిని దర్భపవిత్రపాణి ఐ, శుచి ప్రదేశంలో కూర్చుని, ఈ సూత్రాల్ని నిర్మించాడు. వీటిలో ఒక్క అక్షరం కూడా నిరర్థకం కావడానికి అవకాశం లేదని భాష్యకారుడు పతంజలీ, పాణిని సూక్ష్మేక్షిక మహత్తరమైందని వాక్యకారుడు వరరుచి అనడం ‘అష్టాధ్యాయి’ వైశిష్ట్యాన్ని చాటుతోంది.

పాణిని తనకు ముందున్న అసంఖ్యాక వ్యాకరణాల్ని పరిశీలించి, అష్టాధ్యాయిని నిర్మించి, వ్యాకరణాన్ని సులభతరం, విస్తృతం చేసి, ఒక వ్యవస్థ ఏర్పరిచాడు. దీని గొప్పతనాన్ని హ్యూన్‌త్సాంగ్‌, ప్రొ. మోనర్‌ విలియమ్స్‌, సర్‌ డబ్ల్యు హంటర్‌ వేనోళ్ళ శ్లాఘించారు. అష్టాధ్యాయ ఒక అద్భుత హర్మ్యం. ఆయన Ceteris paribus విధానం అమోఘం. కంప్యూటర్లకి తగిన ఏకైక గ్రంథరాజం. ఇది ప్రభవించిన నాటి నుంచి నేటి వరకు యావత్‌ భారతంలోనూ పఠన పాఠనాల్లో వున్నది. దీన్ని మించిన వ్యాకరణ శాస్త్ర గ్రంథం వేరొకటి ఇంతవరకు బయల్దేరలేదనడం సాహసం కాదు. కాలపరీక్షకు తట్టుకుని నిలిచిన వ్యాకరణ గ్రంథం పాణినీయం మాత్రమే.

పాణిని ప్రతిభ చాలా గొప్పదని అష్టాధ్యాయ వల్ల స్పష్టమవుతుంది. జయాదిత్యుడు ‘ఉదక్త్‌ చ విపాశః’ (4-2-73) అనే సూత్రం వృత్తిలో ‘మహతీ సూక్ష్మే క్షికా వర్తతే సూత్ర కారస్య’ అని కొనియాడాడు. భాష్యకారుడైతే ‘తత్రాశక్యం వర్ణేనాప్యనర్థకేన’ అన్నాడు. ఇక పాశ్యాత్యుల ప్రశంసలు సరేసరి. మానవ మస్తిష్కం నుంచి వెల్వడిన అద్భుత రచన అని అందరూ ఏకకంఠంగా నుతించారు.

వైదిక, లౌకిక భాషలు రెండింటికీ అనుశాసనమైన పాణినీయం ‘ముఖం వ్యాకరణం స్మృతం’ అనే సూక్తిని సార్థకం చేసి, వేదాంగంగా అగ్రతాంబూలం పొందింది. పాణినీయం నాల్గేసి పాదాలున్న ఎనిమిది అధ్యాయాల్లో సువిభక్తమై సూత్రలక్షణాలకు ఆదర్శప్రాయమై వెల్గొందుతూ వున్నది.

పాణినీయం సంస్కృత భాష నిత్య వ్యవహారంలో వున్న రోజుల్లో రాసింది. వాణిజ్య పరిభాషా, ఉచ్చారణ, స్వరవిధానం సైతం మనకు ఇందులో కనిపిస్తాయి. పాణిని శేముషీ విశేషానికి అనుబంధ కల్పన పరాకాష్ఠ. ప్రత్యయం, అది చేరినందువల్ల వచ్చే గుణ-వృద్ధి-టి లోపాదులు సూచించే అనుబంధం, స్వరాన్ని సూచించే అనుబంధం, కావాల్సిన చోట స్త్రీ ప్రత్యయాన్ని తెల్పే అనుబంధం - ఇన్నిటిని సంపుటి చేసి, ప్రత్యయ విధానం చేసిన పాణిని ప్రతిభను వేనోళ్ళ కొనియాడాలి.


అంతేకాదు- ప్రత్యయం ఏకాక్షరం కానప్పుడు దాన్ని బీజ గణితంలో a+b+c = K అనుకుని ఆదేశించే పద్ధతిని ప్రవేశపెట్టి పాణిని శాస్త్ర లాఘవం సాధించాడు. ఉదాహరణకి- ‘‘గోత్రే కుంజాదిభ్య శ్‌ ఛ్ఫఞ్‌’ (4-1-98) అనే సూత్రం తీసుకుందాం. గోత్ర అపత్య అర్థంలో కుంజాది గణ శబ్దాలకు ‘అయన’ ప్రత్యయం చేరుతుంది. తర్వాత ‘వ్రాత్‌చ్ఫఞో రస్త్రియామ్‌’ (5-3-113) అనే సూత్రం వల్ల ‘య’ ప్రత్యయం వస్తుంది. ‘అయన’ ప్రత్యయం అనేకాక్షరం గనక, దానికి బీజ గణిత పద్ధతిలో ‘ఫ’ అనే సంజ్ఞను ఏర్పరిచాడు. ఞ కారం ఆదివృద్ధినీ, ఆద్యుదాత్త స్వరాన్నీ సూచించే అనుబంధం. అయితే, దీనికి ఏకద్వివచనాల్లో ఞిత్‌ స్వరమూ, బహువచనంలో చిత్‌ స్వరమైన అంతోదాత్తత్వమూ వస్తాయి. దాన్ని సూచించడానికి చకారం కూడా అనుబంధం చేశాడు. కనక, పై రెండు సూత్రాల వల్ల ఏర్పడే క్రౌంజాయన్య, బ్రాధ్నాయన్యాది శబ్దాలు రూప నిష్పత్తినే కాకుండా, స్వరవిధిని కూడా తెలిపేటట్టు అనుబంధానుసంధానం చేసి, సూక్ష్మంలో మోక్షం కల్పించాడు మహర్షి.

అణ్‌, ణ, అఞ్‌ అనే మూడు ప్రత్యయాల వల్లా అంగానికి ఆదివృద్ధి వస్తుంది. మూడూ విధించేది ‘అ’ అనే ప్రత్యయం. ‘శివాదిభ్యో2ణ్‌’ (4-1-112) అనే సూత్రంతో శైవ శబ్దమూ, ‘ఉత్సాదిభ్యో2ఞ్‌’ (4-1-86) అనే సూత్రంతో ఔతు శబ్దమూ, ‘ప్ర జ్ఞాశ్రద్ధార్బాభ్యోణః’ (5-2-101) అనే సూత్రంతో ప్రాజ్ఞ శబ్దమూ నిష్పన్నమవుతాయి. అణ్‌, అఞ్‌ ప్రత్యయాలతో ఏర్పడ్డ శైవ, క్షత్స శబ్దాలకు స్వరభేదం వుంటుంది. కాని, రెంటికీ స్త్రీలింగంలో ఙీప్‌ ప్రత్యయమే వచ్చి, శైవీ, ఔత్సీ అనే రూపాలేర్పడతాయి. ఐతే ణ ప్రత్యయం అణ్‌, అఞ్‌ల లాగానే ఆదివృద్ధి కలిగించినా, స్త్రీ లింగంలో వాటి లాగా ఙీప్‌ రాదు. టాప్‌ వచ్చి, ప్రాజ్ఞా అనే రూపం ఏర్పడుతుంది. ఈ రకంగా అనుబంధానుసంధానంలో ప్రతిభ చూపి, పాణిని శాస్త్ర లాఘవం సాధించాడు.

అన్నింటికంటే గొప్ప ప్రజ్ఞ ‘పూర్వత్రాసిద్ధమ్‌’ (8-2-1) అనే సూత్రంతో ప్రారంభించి, త్రిపాది (3పాదాలు) రచించడంలో చూపించాడు. త్రిపాది సూత్రాలకు సపాద సప్తాధ్యాయ (7 అధ్యాయాలు + 1 పాదం) సూత్రాలు వర్తించవు. భాషా చిత్రమంతా కళ్ళకు కట్టినట్టుండి, దాన్ని రెండు వర్గాలుగా వింగడించుకోగలిగితేని గాని ఇది సాధ్యం కాని పని. చిన్న ఉదాహరణ: అసౌ ఆదిత్యః అనే చోట సంధి చేసినపుడు - ‘ఏచో2యవాయావః’ (6-1-75) అనే సూత్రం వల్ల అసావ్‌ ఆదిత్యః అని ఏర్పడి అసావాదిత్యః అనే రూపం సిద్ధిస్తున్నది. ఐతే, ‘లోపంః శాకల్యస్య’ (8-3-19) అనే త్రిపాది సూత్రం వల్ల అసావ్‌ అనే చోట పదాంత వకారం లోపించి, అసాఆదిత్యః అని నిలుస్తున్నది. ఇక్కడ ‘అకఃసవర్ణేదీర్ఘః’ (6-1-97) అనే సపాద సప్తాధ్యాయలోని సూత్రం వల్ల సవర్ణ దీర్ఘ సంధి వచ్చి, అసాదిత్యః అనే అనిష్ట రూపం ఏర్పడుతుంది. ‘పూర్వత్రాసిద్ధమ్‌’ (8-2-1) దీన్ని వారిస్తుంది. ఇలాంటి ప్రయత్నశీలతను శ్లాఘిస్తూ పతంజలి, పాణిని మహర్షి తపస్సును వర్ణించాడు.

అష్టాధ్యాయలో పాణిని వర్తమాన కాలం, భవిష్యత్‌ కాలం లాంటి సంజ్ఞలకు బదులుగా లట్‌, లిట్‌ ఇత్యాది నూతన సంజ్ఞలను ఏర్పాటు చేశాడు. టి, ఘు, భ లాంటి ఏకాక్షర సంజ్ఞలు పాణిని ఏర్పరిచినవే. ఈ రకంగా కొత్త గుర్తులతో సర్వాంగ సుందరమైనా, సంగ్రహంగా వుండి, కాలాన్ని ధిక్కరించి, పఠన పాఠనాల్లో నిలువగల్గిన అష్టాధ్యాయని నిర్మించి ఇచ్చిన పాణిని మహర్షికి మనం ఎంతో రుణపడి వున్నాం. దాన్ని కేంద్రంగా చేసుకుని వార్తికాలు, వృత్తులు, భాష్యాలు, ఇంకా అనేక వ్యాఖ్యాన ఉపవ్యాఖ్యానాలు బయల్దేరి ఒక గొప్ప శాస్త్ర జలధి ఏర్పడడం కంటే పాణినీయం గొప్పతనానికి ఇంకేం నిదర్శనం కావాలి?

అందువల్ల ఎవరిని వైయాకరణుడు, ఎవరిని వ్యాకరణ శాస్త్రజ్ఞుడు అనాలో నిర్ణయించుకోవాలి. అనన్య సామాన్య నిరుపమధిషణ వున్న పాణిని మహర్షికి సాటి రాగల వాళ్ళు ఎవరూ లేరని గ్రహించాలి.

అప్పరుసు విజయ రామారావు

91770 86363

Updated Date - 2023-10-02T01:10:10+05:30 IST