రంగంలోకి జిల్లా పెద్దలు

ABN , First Publish Date - 2023-02-06T23:06:28+05:30 IST

వైరా నియోజకవర్గంలోని అధికార బీఆర్‌ఎస్‌లోని రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

రంగంలోకి జిల్లా పెద్దలు

వైరా, ఫిబ్రవరి 6: వైరా నియోజకవర్గంలోని అధికార బీఆర్‌ఎస్‌లోని రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బీఆర్‌ఎస్‌ అధిష్ఠానంపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైరాలో తమ అభ్యర్థిగా బాణోతు విజయాబాయిని ప్రకటించి సంచలనం సృష్టించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వైరా నియోజకర్గంలోని 20 మంది బీఆర్‌ఎస్‌ నాయకులపై అధిష్ఠానం సస్పెన్షన్‌ వేటు వేసింది. ఈ నేపథ్యంలో సోమవారం అశ్వారావుపేట నియోజకవర్గంలో పొంగులేటి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో దమ్ముంటే తనను సస్పెండ్‌ చేయాలని బీఆర్‌ఎస్‌ అధిష్ఠానానికి బహిరంగ సవాల్‌ విసిరారు. ఇప్పటికే పొంగులేటి వెంట రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ వైస్‌ ఛైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌, మున్సిపల్‌ ఛైర్మన్‌ సూతకాని జైపాల్‌, ఆత్మ కమిటీ ఛైర్మన్‌ కోసూరి శ్రీనివాసరావు, కొణిజర్ల ఎంపీపీ గోసు మధుతో సహా పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఇతర ముఖ్యనాయకులు వెళ్లడంతో నష్టనివారణ కోసం అత్యవసరంగా మంగళవారం వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయిలో విస్తృత స్థాయి సమా వేశాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్‌, ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్‌ సమావేశంలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు.

వైరా వ్యవహారం ఇప్పటికే బీఆర్‌ఎస్‌ అధిష్టానం దృష్టికి వెళ్లడంతో ఈ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టింది. వైరాకు చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు సోమవారం హైదరాబాద్‌ వెళ్లి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డిని కలిశారు. ఆయన వైరాలోని పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు. ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌, ఎమ్మెల్యే రాములు నాయక్‌తో కూడా నాయకులు సమావేశమయ్యారు. ఆ కొద్దిసేపటికే మంగళవారం వైరాలో నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించి ప్రకటించారు. ఇదిలా ఉంటే పొంగులేటి సోమవారం వైరాలోని తమ వర్గానికి చెందిన పలువురు నాయకులకు నేరుగా ఫోన్‌ చేసి తన వెంట రావాలని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలతో మరి కొద్ది రోజుల్లో వైరా బీఆర్‌ఎస్‌లోని రాజకీయాలు వేగంగా మారిపోతాయనే చర్చ సాగుతోంది.

మధిరలోనూ సస్పెన్షన్లకు పెరుగుతున్న ఒత్తిడి

మధిర, ఫిబ్రవరి 6: పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధిర నియోజకవర్గ ఆత్మీయ సమావేశానికి వెళ్లిన పలువురు బీఆర్‌ఎస్‌ నేతలను, ప్రజాప్రతినిధులను సస్పెండ్‌ చేయాలనే ఒత్తిడి పెరుగుతోంది. అయితే అధినాయకత్వం నుంచి అటువంటి ఆదేశాలు రాలేదు. ఇటీవల బోనకల్‌లో పొంగులేటి నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అదే వేదికపై అధినాకత్వంపై పొంగులేటి విమర్శనాస్త్రాలు సంధించిన విషయంవిదితమే. అయితే గతంలో ఎలా ఉన్నా బహిరంగంగా కొంత మంది బీఆర్‌ఎస్‌ నాయకులు అధిష్ఠానంపై అసమ్మతి వ్యక్తం చేయడంతో వారు పార్టీని వీడనున్నట్లు స్పష్టమైంది. ఆ సమావేశానికి వెళ్లిన వారిలో డా. కోట రాంబాబు, మధిర పట్టణ మాజీ అధ్యక్షుడు దేవిశెట్టి రంగారావు, మర్లపాడు సొసైటీ అధ్యక్షుడు కటికల సీతారామిరెడ్డి, మధిర కౌన్సిలర్‌, మాజీ ఎంపీపీ యర్రగుంట లక్ష్మీ, యర్రగుంట రమేష్‌, మడుపల్లి బుజ్జి, యన్నం కోటేశ్వరరావు, ఎర్రుపాలెం మండలం నుంచి అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, ఓ జడ్పీటీసీ, ఒక ఎంపీటీసీ, బోనకల్‌, ఎర్రుపాలెం మండలాలకు చెందిన పలువురు సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు ఉన్నారు. వైరాలో అక్కడి ఎమ్మెల్యే చొరవతో సస్పెన్లకు తెరలేపారు. దీంతో మధిరలోనూ వీరందరినీ పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడం ఖాయమని పార్టీలో ప్రచారం జరుగుతున్నది. పొంగులేటి ఇంకా పార్టీలోనే కొనసాగుతున్నందున ప్రస్తుతానికి వేచి చూసే ధోరణి అవలంబించడం మేలా.. లేక వైరా ఎమ్మెల్యేలాగా చేయాలా అనే మీమాంసలో ఇక్కడి నాయకత్వం ఉన్నది.

Updated Date - 2023-02-06T23:06:29+05:30 IST