వేమన కీర్తిని పదిలం చేసిన బ్రౌన్ కృషి
ABN , First Publish Date - 2023-11-06T00:25:16+05:30 IST
హిందువుల గురించి ఆ బేడూబ్‌వా వ్రాసిన పుస్తకం ద్వారా తనకు గ్రామీణ చాటుపద్యకవి అయిన వేమన పేరు తెలిసిందని బ్రౌన్ రాసుకొన్నాడు....
హిందువుల గురించి ఆ బేడూబ్‌వా వ్రాసిన పుస్తకం ద్వారా తనకు గ్రామీణ చాటుపద్యకవి అయిన వేమన పేరు తెలిసిందని బ్రౌన్ రాసుకొన్నాడు.
1824 మార్చి 5వ తేదీనాడు బ్రౌన్ - వేమన పద్యాలు అనువాదం మొదలుపెట్టాడు. కొందరు పరిశోధకులు ఆ బెడూబ్‌వా పుస్తకాన్ని బ్రౌన్ 1824లో చదివి అప్పుడే వేమన గురించి తెలుసుకొని ఉంటాడని భావించారు. తరువాత బ్రౌన్ తన నిఘంటు నిర్మాణం గురించి రాసు కొంటూ ‘‘నేను మచిలీపట్నం చేరుకొన్న కొన్నాళ్ళకే అతణ్ణి (వేమనను) చదివే ప్రయత్నాలు కొన్ని చేశాను’’ అనీ ఒకనొక ఆకస్మిక ఘటన (యాక్సిడెంట్) తనను వేమనవైపుకు మళ్లించిందనీ చెప్పాడు. 1824 మార్చి నాటికి అనువాదం మొదలుపెట్టాడట. వేమన పద్యాల సేకరణ అంతక ముందే మొదలై ఉండాలి. బ్రౌన్ వేమన పద్యాలను పరిశీలిస్తున్నప్పుడు తన దృష్టికి వచ్చిన పదాలనూ, అర్థాలనూ ఆ తెల్ల కాగితాల మీద రాస్తూ వచ్చాడు. వేమన పద్యాల సేకరణ చేస్తున్న కాలంలో వేమన పద్యాల తొలి ప్రతిని అప్పుడు మచిలీపట్నం కోర్టులో సదర్ అమీన్‌గా ఉన్న తెలుగు పండితుడు తిప్పాభట్ల వెంకట శివ శాస్త్రి నుంచి సంపాదించాడు. ఆ తాళపత్ర ప్రతికి ‘ఎ’ అని గుర్తు పెట్టాడు. ఈ తాళపత్ర ప్రతిలోని పద్యాలను కాగితాల మీద రాసే పనికి కనకాద్రి అనే అతణ్ణి నియమించాడు. ఆ ప్రతిని ‘బి’ అని సూచించాడు. ఆ సమయంలోనే కడప నుంచి ఒక ప్రతి వచ్చింది. అందులోని పద్యాలనూ కనకాద్రి ‘బి’లోకి ఎక్కించడం మొదలు పెట్టాడు. ‘బి’ ప్రతిని కనకాద్రి ప్రతిగానూ సూచించేవారు.
మచిలీపట్నంలో అందుబాటులో ఉన్న ప్రతులను సేకరించి, వాటి పరిశీలన చేస్తూ తక్కిన ఊళ్లలో ఉండే వేమన పద్యాల ప్రతుల సేకరణ కోసం బ్రౌన్ ప్రయత్నం మొదలు పెట్టాడు. 1824 మార్చి 5 నాడు మొదలైన వేమన పద్యాల అనువాదం అంచెలంచెలుగా సాగింది. మొదట వేమన పేరు మీద వాడుకలో ఉన్న కొన్ని అశ్లీల పద్యాలను (అశ్లీల పర్వం) అనువదించసాగాడు బ్రౌన్. అనుమా నాలున్న వాటిని, మరీ అశ్లీలంగా తోచిన వాటిని ఆంగ్లంలోకి కాక లాటిన్ భాషలోకి అనువదించాలని నిర్ణయించుకొన్నాడు. ‘‘శాశ్వతమైన పాఠము, క్రమమూ నిర్ణయించేదాకా అను మానస్పదమైన పద్యాలను లాటిన్‌లో రాసుకొంటాను’’ అని తనకు తాను సూచించుకొన్నాడు. పద్యాలు మొదటి భాగం అనువాదం 1824 జూలై 31 నాటికి పూర్తయింది. 1824 ఆగస్ట్ 8 నాడు మొదలైన వేమన పద్యాల రెండవ భాగం అనువాదం నవంబర్ 4 దాకా కొనసాగింది. రెండు భాగాలలోని ఆ పద్యాల అనువాదంతో బాటు అశ్లీల పర్వంలోని 55 పద్యాలకు అను బంధ పుస్తకంలోని 91 పద్యాలకూ అనువాదం చేశానని ‘వెంకటశివ’, ‘కనకాద్రి’ ప్రతులలోని అన్ని పద్యాలూ (పున రుక్తులుగా కనిపించిన 37 మినహాయించి) ఈ రెండు భాగాలలో ఉన్నాయని వాటి మొత్తం సంఖ్య 1152 అనీ రాసుకొన్నాడు.
1824 నవంబర్ 23న కుంఫిణీ ప్రభుత్వం బ్రౌన్‌ను రాజమండ్రి కలెక్టర్, మేజిస్ట్రేట్ ప్రధాన సహాయకుడిగా నియమించింది. రాజ మండ్రికి వెళ్లినా బ్రౌన్ వేమన పద్యాల అనువాదం మానలేదు. నవం బరు 5 నాడు మొదలు పెట్టిన మూడవ భాగం అనువాదం 1825 జనవరి 18 దాకా సాగింది. నాలుగవ భాగం 1825 ఏప్రిల్ 21 నాటికి పూర్తి చేశాడు. కనకాద్రి ప్రతి నుంచి మినహాయించిన పద్యాలనూ, ఇతర ప్రతులనుంచి తీసుకొన్న అదనపు పద్యాలనూ అనువదించి అనుబంధంగా ఐదవ భాగం రూపొందించాడు బ్రౌన్. 1824 నవంబర్ 23 నాడు - వేమన పద్యాలకు సంబంధించి ఒక పీఠిక రాశాడు. ఆ పీఠికలో అప్పట్లో తెలుగు ప్రాంతాల గురించి వివరించి తెలుగు భాషా సాహిత్యాల గురించి గొప్పగా రాసి వేమన సాంప్రదాయం గురించి ప్రస్తావించాడు. వేమన పద్యాల పరిష్కరణ కోసం తాను సంప్రదించిన అనేక ప్రతుల గురించి అందులో పేర్కొన్నాడు. వేమన కాలం గురించి చర్చిస్తూ వేమన క్రీ.శ. 1652 జన్మించి ఉండవచ్చుననీ అందుకు ఆధారంగా ఈ పద్యాన్ని కూడా ప్రస్తావించాడు.
కం. నందన సంవత్సరము న బొందుగ వైశాఖ శుద్ధ పుష్యమి
యందున్
వింధ్యాద్రి సేతు మధ్యమునందున వకవీరుడు(ట్టు) సహజము వేమా!
వేమన పద్యాలకు సంబంధించిన ఐదు బాగాల వ్రాతప్రతిలో బ్రౌన్ ఎన్నో అభిప్రాయాలు వెలిబుచ్చాడు. అనువాదం చేస్తున్నప్పుడు ఎడమవైపు పుటలలో తెలుగు పద్యం పాఠం, ఎదురుగా కుడిపక్కన పుటలలో ఆంగ్లానువాదం ఇచ్చాడు.
వేమన పద్యాలు ఎన్నో ‘‘సంస్కృతంలోని హితోపదేశం, భగవద్గీత, రామాయణం వంటి వాటిలోని సూక్తులకు అనువాదాలు’’ అని అభిప్రాయపడ్డాడు. ‘విశ్వదాభిరామ’ అనే పదబంధాన్ని ‘విశ్వద - అభిరామ’ అనవచ్చునని, ‘విశ్వద’ అంటే ‘దేవుడు’ అనీ, ‘అభిరామ’ అంటే ఆ సర్వాంతర్యామిలో ఆనందించేవాడు, ‘విశ్వత’ అంటే విశ్వవ్యాప్తమైన అనీ ‘అభిరామ’ అంటే అంద మైన అనీ, విశ్వదాభిరామ వినుర వేమ అంటే ‘విశ్వానికే ఆనందమైన ఓ వేమా వినుమా అని వివరించాడు’.
బ్రౌన్ వేమన పద్యాల గురించి రాసిన వ్యాఖ్యాలను ప్రస్తా విస్తూ ‘‘మూలార్థం యెరుంగుటకు నిష్కపటముగా ప్రయ త్నించిన పుణ్యాత్ముడితడొక్కడే. ఐనను ఇతని భాషాంతరీ కరణము అనేక పద్యములకు భావమెరుగకయే చేయబడి నది’’ అని రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ అభిప్రాయం చెప్పాడు. రెండవ భాగం మొదట బ్రౌన్ వేమనను హిందూ వ్యంగ్య రచయితగా, నీతివేత్తగా పేర్కొన్నాడు. మూడో భాగం ‘మొదట వేమనను ‘నీతి తత్త్వవేత్త’ అని వర్ణించాడు.
‘‘కన్యవరుడు జేరి కదియంగజేరిన/ ఉత్స యందు పిండము ద్వయించె/ హెచ్చు కులజుడెవడు హీనుకులజుండెవడురా/ విశ్వదాభి రామ వినుర వేమ!’’ ఇలా వేమన కులము నెంచు కుటిలాత్ములను బహిరంగంగా విమర్శించిన ధీరగుణవంతుడు. తత్త్వ విచారణలో బాహ్య విమర్శ సుస్పష్టంగా తెలిసిన రచయిత. అందుకే ఆ మహనీ యుడు పదుగురికి ఆదర్శంగా ప్రజల నాలుకల యందు నిలిచాడు.
మొదటి భాగం ప్రారంభంలో""The verses of Vemana (Democritus) The Moral Philosopher'' అని ఉంది. డిమో క్రిటిస్ (క్రీ.పూ. 460-370) గ్రీకు తత్త్వవేత్త. ‘నవ్వే వేదాంతి’గా ఆయన ప్రసిద్ధుడు. వేమన తన నాటి సంఘాన్ని పరిహసించాడనే ఉద్దేశంతో బ్రౌన్ ఈ పోలిక తెచ్చి ఉండవచ్చు. ‘‘వేర్వేరు ప్రతులను సరిపోల్చి పాఠాలనూ ఛందస్సును పరిష్కరించి జాగ్రత్తగా రూపొందించి, తెలుగు నుంచి అనువదించి’’నట్టు పేర్కొన్నాడు బ్రౌన్.
వేమన పద్యాలను ఎంత జాగ్రత్తగా సరిదిద్దినా వ్యాకరణంలోనూ ఛందస్సులోనూ ఆలంకారికంగానూ లోపాలు ఉంటాయనీ, వాటిని దిద్దితే కొత్త రచన చేసినట్టవుతుందనీ, ఇప్పుడున్న స్థితిలోనే ముద్రిం చడం మంచిదనీ అంటాడు బ్రౌన్. ఆ దిశగా ఎంతో శ్రమించాడు. ‘‘ఏ రెండు ప్రతులలోనూ ఒకేరకమైన అమరిక కనిపించలేదు. తేడాలు రెండు నుంచి ఎనిమివందల పద్యాల దాకా ఉండేవి’’ అని తన ‘వేమన పద్యములు’ తొలి ప్రచురణలో రాసుకొన్నాడు (1829).
1825లో సెలవులో వెళ్లే ముందు బ్రౌన్ ‘ఆంధ్ర గీర్వాణ చ్ఛందము’ అనే తెలుగు పేరుతో ఆంగ్లంలో""The Prosody of Telugu and Sanskrit Languages Explained'' అనే పుస్తకం రాశాడు. ఈ రచనను చెన్నపట్టణం కాలేజ్ బోర్డ్ సభ్యుడిగా ఉండిన రిచర్డ్ క్లార్క్ ప్రోత్సాహంతో రాసినట్టు బ్రౌన్ తన పీఠికలో చెప్పాడు. రావి పాటి గురుమూర్తిశాస్త్రి, వఠ్యం అద్వైత బ్రహ్మయ్యశాస్త్రి, ములు పాక బుచ్చయ్య శాస్త్రి ఈ రచనకు సాయబడ్డారు. బ్రౌన్ తన ఛందోగ్రంథం ప్రతిని 1825 డిసెంబర్ 13న కాలేజ్ బోర్డ్‌కు ఇచ్చారు. బోర్డ్ వారికి రాసిన లేఖలో తాను రెండేళ్ళ ముందు ఆ రచన చేసినట్టు, ఆ శాస్త్రంలో నిష్ణాతులైన బ్రాహ్మణుల సాయంతో తన రచననూ అతి జాగ్రత్తగా పరిష్కరించినట్టూ వివరించాడు.
వేమన పద్యాల ప్రతుల సేకరణ వల్ల కలిగిన అనుభవంతో బ్రౌన్ తెలుగు సాహిత్యానికి సంబంధించిన ప్రతులను ముమ్మ రంగా సేకరించసాగాడు. అట్లా సేకరించిన తాళపత్ర ప్రతులను కాగితాల మీద రాయించడంతోపాటు ఆ రచనలను పండితుల సాయంతో పరిష్కరించే పనినీ ప్రారంభించాడు. ఛందస్సు గురించి తన రచన ప్రచురణతో బ్రౌన్ ప్రాచ్య సాహిత్య పండితులయిన ఆంగ్లేయులలో ఒకడుగా గుర్తింపు పొందాడు. తన రచనకు ఆదరణ లభించడంతో బ్రౌన్ మద్రాస్ కాలేజ్ వారికి రెండు ప్రతి పాదనలు పంపించాడు. వాటిలో ఒకటి తాను పరిష్కరించి అనువదించిన వేమన పద్యాల ప్రచురణ. రెండవది మద్రాస్ కాలేజ్‌లోని గ్రంథాలయంలో తెలుగు విభాగం అభివృద్ధికి ప్రణాళిక.
ప్రభుత్వంవారు గవర్నరుకు సిఫారసు చేస్తూ బ్రౌన్‌కు మూల ప్రతికి పారితోషికంగానూ అనువాదానికి కాపీరైట్ హక్కులకు గానూ, మెచ్చదగిన ఆయన ప్రయత్నాలకు గుర్తింపుగానూ వెయ్యి వరహాలు బ్రౌన్‌కు ఇవ్వడానికి అనుమతించాలనీ మద్రాస్ కాలేజ్ బోర్డ్ కార్యదర్శి హెచ్. హార్క్‌నెస్ మద్రాసు ప్రభుత్వ ముఖకార్యదర్శికి ఒక సూచన పంపించాడు. గవర్నర్ బ్రౌన్‌కు వెయ్యి వరహాలు తాను మంజూరు చేయకుండా ఆమోదం కోసం లండన్‌లోని ‘కుంఫిణీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్’ కు పంపాడు. తరువాత కాలేజ్ బోర్డ్ వారు వేమన పద్యములు ముద్రించే పని మొదలు పెట్టారు. 1829లో ఆ పుస్తకం వెలు వడింది. బ్రౌన్‌కు యాభై ప్రతులు ఇచ్చారు. వేమన పద్యాలలో బ్రాహ్మణ విమర్శ ఉంది కనుక తన రచన పండితులకు నచ్చక దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావద్దన్నారనీ వారి కోరిక మేరకు కాలేజ్ బోర్డ్ నడుచుకొందనే బ్రౌన్ అభిప్రాయపడ్డారు. అట్లా 450 ప్రతులు మాయమైనాయనీ పదేళ్ళ తర్వాత గ్రంథాలయంలో అవి చెత్తగాగితాలుగా చుట్టబడి కనిపించాయనీ బ్రౌన్ ఆ తర్వాత రాశాడు. దాంతో తాను వేమనను ప్రచురించడానికి ఏర్పాట్లు చేసుకొన్నానీ రాశాడు.
బ్రౌన్ సేకరించిన వేమన పద్యాలు మూడు సార్లు వేరు వేరు రూపాల్లో అచ్చయ్యాయి. 1829లో ‘వేమన పద్యములు (The verses of Vemana Moral, Religious and Satirical)' పేరిట మద్రాసులోని కాలేజ్ పక్షాన అచ్చయింది. ఇందులో 693 పద్యాలు మూడు భాగాలలో ఇంగ్లీష్ అనువాదాలతో కూర్చాడు బ్రౌన్. ఇంగ్లీష్‌లో ఆ భాగాలను ‘బుక్స్’ అని సూచించాడు. రెండు భాగాల చివర తెలు గులో ‘రెండవ యాశ్వాసము సంపూర్ణము’ అని ఉంది. తొలి భాగంలో 200 పద్యాలు, రెండవ దానిలో 214 పద్యాలు, మూడవ దానిలో 279 పద్యాలు ఉన్నాయి. 1839లో 1163 పద్యాలతో ‘వేమన పద్యములు’ ప్రచురించాడు బ్రౌన్. ఆ సంకలనానికి ఇంగ్లీష్‌లో "The verses of Vemana; Moral, Devout, Mystical and Satirical' అని పేరు పెట్టాడు. 1829 నాటి మొదటి సంకలనంలోని ‘రిలిజియస్’ అనే మాట ఈ సంకలనంలో ‘మిస్టికల్’ అని మారింది. ఈ సంకలనంలో 1824 నాటి మూడు భాగాలున్నాయి. మూడవ భాగంలో మార్పేమీ లేదు. ఒకటవ భాగంలోనూ రెండవ భాగంలోనూ చేర్చడానికి చెరొక పద్యం అనుబంధంగా ఇచ్చాడు బ్రౌన్. 1163 పద్యాలకు అనుబంఽ దంగా రెండు పద్యాలు ఉన్నట్టు 1842లో వీరభద్రయ్య 1164 పద్యా లతో ఒక సంకలనం రూపొందించాడనీ శార్వరినామ సంవత్సరం (అంటే 1840)లో 500 పద్యాలను ఒక బ్రాహ్మణుడు సంగ్రహంగా, వ్యాఖ్యానంతో ముద్రించాడనీ బ్రౌన్ పేర్కొన్నాడని బంగోరే 1980లో వెలువరించిన ‘వేమన పద్యాలు’ పుస్తకం ముందుమాటలలో చెప్పారు. వేమన పద్యాలను బ్రౌన్ తెలుగు నేర్చుకొనే ఇంగ్లీష్ వారికి ప్రాథమిక స్థాయిలో పనికివచ్చేవిగా పరిగణించాడు. ఈ విషయం బ్రౌన్ 1829 సంకలనానికి రాసిన పీఠికలో కనిపిస్తుంది.
కొత్తపల్లి రామాంజనేయలు
99517 70751