Share News

బీసీ కుల గణన ఎన్నికల ఎత్తుగడేనా?

ABN , First Publish Date - 2023-11-29T02:15:09+05:30 IST

రాష్ట్రంలో చేపడుతున్న బీసీ కులాల గణన కేవలం ఎన్నికల ఎత్తుగడగా కనిపిస్తోంది. బీసీ కులాల గణనను వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బందితో నిర్వహించే...

బీసీ కుల గణన ఎన్నికల ఎత్తుగడేనా?

రాష్ట్రంలో చేపడుతున్న బీసీ కులాల గణన కేవలం ఎన్నికల ఎత్తుగడగా కనిపిస్తోంది. బీసీ కులాల గణనను వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బందితో నిర్వహించే విధంగా చేస్తున్న ఏర్పాట్లు తుతూమంత్రంగా వున్నాయే తప్ప, శాస్త్రీయంగా లేవు. అసలు రాష్ట్ర ప్రభుత్వం సేకరించే వివరాలను కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తుందా లేదా అన్న అంశంపై కూడా స్పష్టత లేదు. విద్యా, ఉద్యోగాలలో, పరిపాలనా, ఆర్థిక అంశాలలో తమకు దక్కవలసిన వాటా దక్కడం లేదనే భావంతో బీసీ కులాల జనాభాను లెక్కించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం బీసీ కులాల జనాభా వివరాలు రాష్ట్రాలు సేకరిస్తున్నందున ఆయా వివరాలు ఆయా రాష్ట్రాలకే పరిమితం చేసే అవకాశం వుంది. ఉదాహరణకి బీసీ కులాలకు వివిధ రాష్ట్రాలలో మండల కమీషన్‌ నివేదిక రాకముందునుంచే విద్యా, ఉద్యోగాలలో రిజర్వేషన్లు అమలయ్యాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం బీసీ రిజర్వేషన్లను అమలు చేయలేదు. మండల్‌ కమిషన్‌ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తర్వాత మాత్రమే దేశవ్యాప్తంగా బీసీ కులాలకు రిజర్వేషన్లు అమలయ్యాయి. అందువల్ల రాష్ట్రాలు సేకరించిన బీసీ కులాల జనాభా వివరాలకు కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదిస్తుందని స్పష్టంగా ప్రకటించాలి.

కేంద్ర ప్రభుత్వం ప్రతి పదేళ్ళకు ఒక పర్యాయం దేశవ్యాప్తంగా నిర్వహించే జన గణనలో భాగంగా సేకరించే షెడ్యూల్‌ కులాలు, షెడ్యూల్‌ తెగల జనాభా వివరాల ప్రాతిపదికనే కేంద్ర ఎన్నికల సంఘం పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీలలో ఎస్సీ ఎస్టీ సీట్లను రిజర్వు చేస్తోంది. ఉత్తరోత్తరా చట్టసభలలో బీసీ వర్గాలకు కూడా రిజర్వేషన్‌ కల్పించాలంటే ఎస్సీ ఎస్టీల తరహాలోనే జనాభా గణన జరగాలి. ప్రస్తుతం రాష్ట్రాలు సేకరించే బీసీ కులాల జనాభా వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదిస్తుందన్న నమ్మకం లేదు. మహాఅయితే రాష్ట్ర ప్రభుత్వాలు సేకరించే వివరాలను కేవలం ఆయా రాష్ట్రాలలో స్థానిక ఎన్నికల వరకు ఉపయోగపడతాయి.

బీసీ గణన విషయంలో నిన్నటి వరకు కేంద్రం ప్రభుత్వం మోసం చేస్తే నేడు రాష్ట్ర ప్రభుత్వం అందుకు సిద్ధం అవుతున్నట్టు కనిపిస్తోంది. నిజానికి బీసీ కులాల వివరాల సేకరణ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. గతంలో 1932లో జరిగిన బీసీ కుల గణనను నాటి బ్రిటీషు ప్రభుత్వం నిర్వహించిందే కానీ, రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించలేదు. కేంద్రప్రభుత్వం జనాభా వివరాల సేకరణలో భాగంగా బీసీ కులాల గణనను చాలా సులభంగా చేయవచ్చు. బీసీ కులాల వివరాల సేకరణకు ప్రత్యేకంగా యం త్రాంగాన్ని నియామించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం జనాభా వివరాల సేకరణలో భాగంగానే ఎస్సీ ఎస్టీ జనాభా వివరాలను సేకరిస్తున్నారు. అదే తరహాలో జనాభా వివరాల సేకరణ పత్రంలో ఎస్సీ ఎస్టీ కాలమ్లాగనే బీసీ కులాలకు సంబంధించిన కాలమ్ కూడా ఏర్పాటు చేస్తే దేశవ్యాప్తంగా ఒకేసారి బీసీ కులాల జనాభా కూడా బహిర్గతం అవుతుంది.

కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి చెందిన కొంతమంది అగ్రనేతలకు అసలు బీసీ కులాల వివరాలు సేకరించడం ఇష్టం లేదని అర్థం అవుతోంది. ఎందుకంటే బ్రిటీషు కాలంలో జరిగిన కులగణన, మండల్‌ కమిషన్‌ నివేదిక నేపథ్యంలో దేశ జనాభాలో 52 శాతం బీసీ కులాలకు చెందిన జనాభా ఉందన్న ప్రచారం బాగా జరిగింది. దాంతో బీసీ కులాలకు చెందిన నాయకులు అధికారంలో ‘మేమెంతో మాకంతా...’ అంటూ ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. ఈ స్థితిలో తాజాగా బీసీ కులాల జనాభా వివరాలు సేకరిస్తే ఆ తర్వాత చట్ట సభలలో తమ సీట్ల సంఖ్య పెరగాలని లేదా రిజర్వేషన్‌ కల్పించాలనే డిమాండ్‌ వస్తుంది. దాంతో తమ అధికార పీఠాలు కదిలిపోతాయన్న ఆలోచనతోనే పాలక వర్గాలకు చెందిన అగ్రనేతలు బీసీ కులాల జనాభా వివరాల సేకరణకు అంగీకరించలేదని బీసీ నేతలు అభిప్రాయ పడుతున్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు మొక్కుబడిగా బీసీ కులాల జనాభా వివరాలు సేకరించడం కాకుండా శాస్త్రీయంగా సేకరించాలి. రాష్ట్ర ప్రభుత్వం సేకరించే బీసీ కులాల జనాభా వివరాలను కేంద్ర ప్రభుత్వంతోపాటు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తిస్తుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ప్రకటన చేయాలి. ఇదే సమయంలో బీసీ కులాల జనాభా వివరాలు సేకరించడానికి ముందు ఆయా కులాలవారికి జనాభా వివరాల సేకరణకు సంబంధించి పూర్తి అవగాహన కల్పించాలి. లేదంటే వివిధ కారణాలతో బీసీ కులాలకు చెందిన వారు తమ వివరాలను బహిర్గతం చేయడానికి ముందుకు రాకపోవచ్చు. ఉదాహరణకి న్యూనత భావంతో వుండే కొన్ని బీసీ కులాలకు చెందినవారు జనాభా వివరాల సేకరణ సమయంలో పక్కింటి ఎందురింటివాళ్ళ దృష్టిలో తాము తక్కువ కులానికి చెందినవారమని తెలిసిపోతుందన్న ఉద్దేశ్యంతో తాము అగ్రకులానికి చెందిన వ్యక్తులుగా చెప్పుకొనే ప్రమాదం వుంటుంది. అంతేకాకుండా కొంతమంది ఉద్దేశ్యపూర్వకంగా జనాభా గణన సమయంలో ఉన్నది వున్నట్టుగా చెబితే ప్రభుత్వ పరంగా ఇప్పటి వరకు లభిస్తున్న సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని ప్రచారం చేస్తున్నారు. దాంతో బీసీ కులాలకు చెందిన వారు అసలు వివరాలు జనాభా సేకరణ సమయంలో చెప్పకుండా తప్పించుకొనే అవకాశం ఉంది. అందువల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇతర ఆర్థిక అంశాలతో కులగణనకు ముడిపెట్టకూడదు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి.

అన్నవరపు బ్రహ్మయ్య

Updated Date - 2023-11-29T02:15:10+05:30 IST