మహావక్త బాల శ్రీనివాసమూర్తి

ABN , First Publish Date - 2023-04-27T01:26:05+05:30 IST

సాహితీ మిత్రులు ఎవరూ మరిచిపోని ప్రసంగాల ఫీచర్ ‘కావ్య పరిమళం’.

మహావక్త బాల శ్రీనివాసమూర్తి

సాహితీ మిత్రులు ఎవరూ మరిచిపోని ప్రసంగాల ఫీచర్ ‘కావ్య పరిమళం’.

నా ప్రారంభోపన్యాసం, నందిని సిధారెడ్డి అధ్యక్షోపన్యాసంతో శ్రోతలు టూకీగా కావ్యంలోకి ఎంటరయ్యేవారు. ఇక ప్రధాన వక్తలు రస, ధ్వని విశేషాలతో శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేసేవారు. ఆ కావ్యాన్ని ఇదివరకే చదివి ఉన్నవారిలో కొత్త ఆలోచనల్ని రేకెత్తించేవారు. చదివి ఉండని వారికి ఆ కావ్యాన్ని తప్పక చదివి తీరాలన్న ఆసక్తిని జనింప జేసేవారు. సాహిత్య అకాడెమీ లక్ష్యం కూడా అదే.

2019 మార్చి ఒకటిన పల్లా దుర్గయ్య కావ్యం ‘గంగిరెద్దు’ మీద డా. గుమ్మన్నగారి బాలశ్రీనివాస మూర్తి ఒక గంటకుపైగా గుక్క తిప్పుకోకుండా మాట్లాడాడు. పన్నెండు కావ్యాలు, పన్నెండు మంది వక్తలను శ్రద్ధగా వింటున్న నాకు బాలశ్రీనివాస్‌లోని వక్త కొత్తగా ఆరోజు నన్ను మహదానందపరిచాడు. అడపాదడపా గడిచిన ముప్పై యేండ్లుగా పరస్పరం రాసినవి చదవుతూ, ఉపన్యాసాలు వింటూ ఉన్న మా ఇద్దరి మధ్య ఆ ఉపన్యాసపు చర్చ సభానంతరం సుదీర్ఘంగా నడిచింది. అపారమైన విషయ పరిజ్ఞానం, విస్తారమైన అధ్యయనం, ఉదాహరణలతో కూడిన ఉపకరణాల వినియోగం, సమయ స్ఫూర్తి, ఔచిత్యం వెరసి తనను గొప్ప వక్తగా నిలిపిందని తర్వాత విన్న అనేక ఉపన్యాసాల ద్వారా నేను ధృవపరుచుకున్నాను. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆహ్వానం మేరకు హాజరై ప్రసంగించేవాడు. ఆ వాగ్ధాటి కోసమే అతనిని అందరూ వక్తగా పిలుస్తారన్నది సాహిత్య మిత్రులందరికీ తెలుసు. కరీంనగర్‌లో తెరవే మిత్రులు ‘తెలంగాణ రుబాయిలు’ పరిచయసభ పెట్టినప్పుడు ఎం.నారాయణ శర్మతోపాటు హైద్రాబాద్ నుండి బాలశ్రీనివాస మూర్తిని ప్రత్యేకంగా ఆహ్వానించింది అందుకే. కానీ ఆ రోజు తన ప్రసంగంలో ‘ఏనుగు నరసింహారెడ్డి కవి, విమర్శకుడు, అనువాదకుడు, మంచి వక్త కూడా’ అన్నాడు. ఇక అప్పటి నుంచి బాలన్నతో పోటీపడి ఓడిపోతూనే ఉన్నాను నేను. నన్ను అక్కున చేర్చుకున్న ఆత్మీయ మిత్రుడు వాళ్ళ నాన్న లక్ష్మీ నరసింహశర్మ లాగే తెలంగాణ గర్వించదగ్గ విద్వత్ సంపన్నుడు.

పత్రికా రచయితగా, ప్రైవేటు లెక్చరర్‌గా, గ్రూప్స్ కోచ్‌గా, విశ్వవిద్యాలయ ఆచార్యుడిగా లెక్కకు మిక్కిలి పుస్తకాలు చదివాడు. విమర్శను ప్రత్యేక ఆసక్తిగా పెట్టుకొని అనేక పుస్తకాలు రాసాడు. అనేక పుస్తకాలకు సంపాదకత్వం వహించాడు. ఆయన రచనల్లో ‘ఆత్మకథల్లో అలనాటి తెలంగాణ’ గొప్ప పరిశోధనాగ్రంథం. తెలంగాణ ఉద్యమానికి అది పరోక్ష భూమికని సమకూర్చింది. ‘వెలుతురు కొలను’ పుస్తకంలోని సున్నితమైన వ్యాసాలు మూల రచనల మీద పాఠకులకు ఆసక్తి పెంచుతాయి. ‘విలక్షణ పీవీ నరసింహారావు జీవిత చరిత్ర’ దివంగత పీవీని నలుపు తెలుపులో నిలబెట్టిన బయోగ్రఫీ. ‘సమకాలీన వాదాలు–సాహిత్య విమర్శ’, ‘తెలంగాణ పత్రికలు’, ‘తెలంగాణం–తెలుగు మాగాణం’, ‘తుషార సమీరం’ తదితర విలక్షణమైన రచనలు బాల శ్రీనివాస్ ఆలోచనా ధోరణికి అద్దం పడతాయి. మా ప్రసిద్దిపేట, జీవన హిందోళం ఆత్మకథాత్మక రచనలు. ఇవి కాకుండా జన నేతలు, అక్షర మూర్తులు, ప్రతిభా మూర్తులు, తెలంగాణ చరిత్ర సంస్కృతి వారసత్వం, సాహితీ సుధ, తెలంగాణ సాహిత్య చరిత్రలకు సంపాదకత్వం వహించి విశేష సారస్వత సేవ చేసాడు. అధ్యయనమే జీవితంగా, రాయడమే లక్ష్యంగా సాగిన బాల శ్రీనివాసమూర్తి వేలాది పేజీలను ఎడిట్ చేసి ప్రూఫ్‌లు చూసి ప్రచురణ కర్తలకు గొప్ప భరోసానిస్తూ ఉండేవాడు. తెలంగాణ యూనివర్సిటీలో పరిశోధన విద్యార్థులకు సరియైన దిశానిర్దేశం చేయడంలో బాల శ్రీనివాస్ సర్‌ను మించినవారు లేడంటారు. స్నేహానికి, ప్రేమకు, ఆత్మీయ పలకరింపుకు ఒక స్థిర చిరునామాగా నిలిచిన బాల శ్రీనివాసమూర్తి 1966 సెప్టెంబర్ 5న సిద్ధిపేటలో గొప్ప విద్వత్ కుటుంబంలో జన్మించాడు.

అన్నీ గొప్ప క్రమశిక్షణతో, ప్రణాళికతో నిర్వహించిన బాల శ్రీనివాసమూర్తి తన మరణాన్ని అసలే పసిగట్టలేకపోయిన అమాయకుడు. అన్ని వేగాలనూ, స్వయంకృషితో అందుకున్న బాల శ్రీనివాస్ కాలం పన్నిన వలలో చిక్కిపోయాడు. ఏప్రిల్ 24న ఈ లోకం విడిచిన ఆయనను గుర్తు చేసుకున్నప్పుడల్లా ఆయన వాగ్ధాటి గుర్తొస్తుంది.

– ఏనుగు నరసింహారెడ్డి

Updated Date - 2023-04-27T01:27:19+05:30 IST