ముస్లిం తెలుగు కవుల్లో ఆణిముత్యం
ABN , First Publish Date - 2023-08-21T02:54:03+05:30 IST
మట్టిని చదవనివాడు మనిషి కాలేడు. మనిషిని చదవనివాడు కవి కాలేడు. మనిషినీ, మనిషి జీవితంలోని ఎగుడు దిగుళ్లనీ ఆసాంతం చదివి కవిత్వం రాసినవాడు షేక్ దావూదు కవి.
మట్టిని చదవనివాడు మనిషి కాలేడు. మనిషిని చదవనివాడు కవి కాలేడు. మనిషినీ, మనిషి జీవితంలోని ఎగుడు దిగుళ్లనీ ఆసాంతం చదివి కవిత్వం రాసినవాడు షేక్ దావూదు కవి. ఛందోబద్ధ పద్య కవిత్వం పట్ల దావూదు కవికి వున్న ఆరాధన చివరిశ్వాస వరకు కొనసాగింది. వైవిధ్యం, సరళమైన శైలి, పదబంధాల సమవేతంతో పదునైన పద్యరచనలో ఆయనది నిలువులెత్తు యెదిగిన వ్యక్తిత్వం.
‘‘ఎన్నడొ యుద్ధభూమి నశియించుట తథ్యము నాడు నీకు పే
రున్నె? యొకింత శాశ్వత మహ్నోత ధార్మికలక్ష్య శుద్ధి సం
పన్నుడవై గదా యిపుడు ప్రాణము లర్పణ చేసినావు నా
చిన్ని యనుంగ! నీ వమృత జీవివి భావి చరిత్ర వీధులన్’’
- రాణా సంగ్రామ సింహుని పుత్రుడు, భావి రాజ్యాధిపతి ఉదయసింహుని ప్రాణరక్షణకై శత్రువుకు ఊయలలో నిదురిస్తున్న తన కుమారుణ్ణి చూపిన త్యాగమయి దాసిపన్నా. చరిత్రలో కన్నతల్లి హృదయాన్ని ఆ రకంగా ఆవిష్కరించారు దావూదు కవి. ‘దాసిపన్నా’ దావూదు కవి గారి సాంప్రదాయక ఖండకావ్యం. అలాంటి భావగాంభీర్య రచనా పటుత్వం గల రచనల కారణంగానే ఆయన విశ్వనాథ సత్యనారాయణ, దివాకర్ల వేంకటావధాని, పుట్టపర్తి, విద్వాన్ విశ్వం, జాషువా, తుమ్మల సీతారామ చౌదరి లాంటి ప్రఖ్యాతి కవుల ప్రశంసా పరంపర నందుకోగలిగారు.
కీ.శే. షేక్ దావూదు కవి కడప జిల్లా చిట్వేలి గ్రామంలో తండ్రి సుల్తాన్ సాహెబు, తల్లి ఖాదర్‌బీ లకు 1916 జూలై 1న జన్మించారు. చిన్ననాటనే తల్లిదండ్రుల్ని కోల్పోయి, జీవన యానంలో బతుకు తెరువుకై నెల్లూరు చేరుకొన్నారు. అక్కడ రూపాయిన్నర పెట్టుబడితో ట్రంకురోడ్డులో పెట్టుకొన్న కిళ్లీకొట్టు తెలుగు సాహిత్యం పట్ల అతనిలో తొలి బీజాంకురం వేసింది. అలనాటి సుప్రసిద్ధ నెల్లూరు కవులు మరుపూరు కోదండ రామిరెడ్డి, పిలకా గణపతిశాస్త్రి, బెజవాడ గోపాలరెడ్డి, రేవూరి సుబ్బారావు, జక్కా సుధాకరం వంటి ఉద్దండులు ప్రతి సాయంత్రం ‘సాహిత్య తాంబూల సేవన మంజూష’ (కిళ్లీకొట్టుకి కవులు పెట్టుకొన్న ముద్దుపేరు) వద్దకి చేరటం, తమతమ పద్యరచనా పఠనం గావించటం దావూదు కవిలో సాంప్రదాయక పద్యరచన పట్ల ఆసక్తిని పెంచిన విషయాలు. తనకు తొలి ఆడబిడ్డ పుట్టిన పిదప ఆయన ఆనాటి సంస్కృతాంధ్ర పండితులైన దుర్భా సుబ్రహ్మణ్య శర్మ గారిని ఆశ్రయించి తన 22వ యేట విద్యాభ్యాసానికి వొడిగట్టారు. అప్పటి సాటి పండిత వర్గం శర్మగారి వద్దకు చేరి ‘‘సాయిబుకు సంస్కృతం నేర్పుతున్నావటగా! ఇక రాళ్లదెబ్బలకు సిద్ధంగా వుండు’’ అంటూ అవహేళన చేశారట. అయితే సంస్కృతాంధ్ర భాషల్లో మదరాసు విశ్వవిద్యాలయం ద్వారా విద్వాన్ పట్టా పుచ్చుకొని, వుత్తరోత్తరా నంద్యాల పురపాలక పాఠశాలలో తెలుగు పండితుడిగా చేరిన పిదప తన తొలి నెల వేతనాన్ని గురువుగారి పాదపద్మాలకి గురుదక్షిణగా మనియార్డరు ద్వారా సమర్పించుకున్నారు దావూదు కవి. మనియార్డరు చేతపుచ్చుకొని తనను దెప్పిపొడిచిన పండిత మిత్రుల్ని సమావేశ పర్చి ‘‘ఇదుగోనండీ! నా సాయిబు శిష్యుడు విసిరిన తొలిరాయి’’ అంటూ దాన్ని అందరికీ చూపి పొంగిపోయారట దర్భా సుబ్రహ్మణ్య శర్మ. ఆ గురు శిష్యుల ఆత్మబలం అటువంటిది.
ఆపై రాయలసీమలోనే తొలి కళాశాలయైున కర్నూలులోని ఉస్మానియా కాలేజీ ఉర్దూ అధ్యాపకుడిగా, శాఖాధిపతిగా ముప్పయి ఏడేళ్లు పని చేశారు దావూదు కవి. ఆ రోజుల్లోనే శ్రీ షిర్డీసాయి శతకం రచించి గురువుగారికి అంకిత మిచ్చారు. తర్వాత ‘దాసీపన్నా’ ఖండకావ్యం, ‘సూఫీసూక్తులు’, ‘సంస్కార ప్రణయం’, ‘అశ్రువులు’, ‘చిత్త పరివర్తనము’, ‘రసూల్ప్రభు శతకము’ మొదలగు ఖండకావ్యాలను ప్రచురించారు. ‘‘చల్లనగల వెన్నెలకు సౌరభము, ఆ రెండునుగల కర్పూరమునకు కోమలత, ఆ మూడు గుణములుగల మలయ మారుతమునకు మధురత్వము కలుగుచో అది సుకవి వాక్కులకు సమానమగు’’నని పింగళి సూరన నుడివినట్టు దావూదు కవి పద్యాలలో వాటికి కొరత వుండదు.
‘ఆరామ సీమలం దారాడు కోయిల
పలుకుల విరజిమ్ము ప్రణయ రసము
అల సరోవరముల గలవరింతల జొక్కు
భ్రమరగీతలనున్న విమల రసము
పొలముల దిరుగుచు పలుమారు సతిబిల్చు
గువ్వకుత్తుకలోని గుప్తరసము
సతతమ్ము పెంటికై వెతగుంది నుతిసేయు
శొరికారాగ ప్రశస్తరసము’’
- ఇలా అలతి అలతి పదాలతో విపులార్థ రీతిని జొప్పించి, సాటి కవులను మెప్పించి రాయలసీమనందే కాక యావదాంధ్ర దేశంలో మేటి సాహితీ సంస్థల ద్వారా పెక్కు సన్మానాలను అందుకొనటమే కాదు, అభినవ తిక్కన తుమ్మల సీతారామమూర్తి, జాస్తి వేంకటనరసయ్య వంటి అగ్రగణ్య కవులతో కలసి పద్యరచనలు చేసిన విద్వత్ సాహితీ సంపన్నుడు దావూదు కవి. ఉస్మానియా కళాశాలలోని తెలుగుభాషా సమితి ద్వారా విశ్వనాధ వారిని, శ్రీశ్రీ, జాషువా, దివాకర్ల, అభినవ తిక్కన పుట్టపర్తి, శేషేంద్ర వంటి లబ్ధ ప్రతిష్టుల్ని ఆహ్వానించి, ఉపన్యాసాలు ఇప్పించి సముచిత రీతిని సన్మానించి, కర్నూలు సాహితీ క్షేత్రంలో తన స్థానాన్ని సుస్థిర పర్చుకున్నారు. అదీగాక ఆనాటి వర్ధిష్ణు అవధానులైన గండ్లూరి దత్తాత్రేయశర్మ, నరాల రామారెడ్డి, గాడేపల్లి కుక్కుటేశ్వరరావు వంటి వారి అవధానాలను పెక్కుమార్లు ఏర్పాటు చేసి, వారి ఖ్యాతి ఆంధ్రదేశమంతటా విస్తరించడానికి దోహదపడ్డారు. అవధాన ప్రక్రియలో అప్రస్తుత ప్రసంగ పృచ్ఛకుడిగా ఆయన చతురోక్తులు శ్రోతల హృదయాలలో చిరస్థాయిగా నిల్చిపోతాయి.
అటు కళాశాల వుద్యోగంతోపాటు, ఇటు పల్లెపట్టులనుండి విద్యాభిలాషులై వచ్చిన విద్యార్థులందరికీ తన యింటనే ఆశ్రయం కల్పించి, వారిని హిందీ, తెలుగు భాషల్లో నిష్ణాతుల్ని గావించి, విద్యాదాతగా వందలాది శిష్యుల జీవితాలకి వెలుగు ప్రసాదించారు దావూదు కవి. శుద్ధ గాంధేయవాది కావటాన హిందూ-ముస్లిం మతాలపట్ల సమభావన కలిగి కులమతాలకు అతీతంగా విద్యాదానం చేస్తూ, అదే విషయాన్ని సభాముఖంగాను తెలియజేస్తూ వచ్చారు. యువకవులు, ఛందోబద్ధ కవితా రచనలో చేయి తిరిగిన విద్వాంసుల గోష్ఠి ప్రతి సాయంత్రం ఆయనింట కొలువు తీరేది. సాహిత్య చర్చ, భారత భాగవత రామాయణాది పద్యాలు వల్లెవేయడం ఆ వేదికపై నిరంతర కార్యక్రమం.
శతక వాఙ్మయ పరిశోధకులు, నిజాము కళాశాల ఉపన్యాసకులు కీ.శే. గోపాలకృష్ణ రావు ప్రోత్సాహ స్ఫూర్తితో దావూదు కవి ‘రసూల్ప్రభు శతకాన్ని’ విరచించారు. ‘‘మతపరంగా నేను ముస్లిమును, కాని జాతి పరంగా శుద్ధ హిందువును’’ అంటూ సభాముఖంగా ప్రకటించిన ఆ కవి నాస్తికుల పట్ల నిరసన ప్రకటించారు:
‘‘దేవుడు లేడటంచిపుడు దేబెలు కొందరు నాస్తికాధముల్
కావరముని మానసిక గౌరవమింగనక వాగసాగి రే
భావమొ? స్వార్థభాషులగు పాపులకెక్కడి రీతి, నీతి స
ద్భావము లుల్లసిల్ల గలవా యిక వారికి నో రసూల్ప్రభూ!’’
- అతులిత మాధురీ మహిమ, రచనా శుద్ధితో రాజిల్లిన ఆయన పద్యాల అల్లిక రాయలసీమ ముస్లిం తెలుగు కవుల ప్రజ్ఞాపాటవ ప్రతిబింబమై విరాజిల్లుతుందనటంలో సందేహం లేదు.
ఈతకోట సుబ్బారావు
- 94405 29785