ఆడవారి కళ్ళతో ప్రపంచాన్ని చూపించే ప్రయత్నం

ABN , First Publish Date - 2023-07-24T04:48:04+05:30 IST

ఆధునిక మహిళ స్వేచ్ఛా సాధికారతలకు ప్రతీక స్వర్ణ కిలారి సంపాదకత్వంలో వచ్చిన ‘ఇంతియానం’ స్త్రీల యాత్రాకథనాల సంకలనం. ‘‘తెలుగులో తొలి మహిళా యాత్రా కథనాల సంకలనం...

ఆడవారి కళ్ళతో ప్రపంచాన్ని చూపించే ప్రయత్నం

పలకరింపు : స్వర్ణ కిలారి

ఆధునిక మహిళ స్వేచ్ఛా సాధికారతలకు ప్రతీక స్వర్ణ కిలారి సంపాదకత్వంలో వచ్చిన ‘ఇంతియానం’ స్త్రీల యాత్రాకథనాల సంకలనం. ‘‘తెలుగులో తొలి మహిళా యాత్రా కథనాల సంకలనం ఇదే’’ అంటారు యాత్రా రచయిత దాసరి అమరేంద్ర. భిన్నశైలిలో సాగే 45మంది మహిళల విభిన్న యాత్రానుభవాలను ఒకచోటకూర్చి వినూత్న ప్రయోగానికి నాంది పలికిన స్వర్ణ కిలారితో సంభాషణ.

‘ఇంతియానం’ సంకలనం ప్రధాన ఉద్దేశం కేవలం స్త్రీల యాత్రా కథనాలను రికార్డు చేయడమేనా?

మహిళల యాత్రా రచన అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది తెలుగు మహిళ పోతం జానకమ్మగారు 1873లో రాసిన ‘జానకమ్మ ఇంగ్లాండ్‌ యాత్ర’. తర్వాత మూడేళ్లకు దాన్ని ఆవిడే ఇంగ్లీషులోకి ‘పిక్చర్స్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ యాత్ర’గా అనువదించి ప్రచురించారు. దాదాపు వందేళ్ళ తర్వాత నాయని కృష్ణకుమారి గారు రాసిన ‘కాశ్మీర దీపకళిక’ వచ్చింది. మళ్ళీ దాదాపు యాభై ఏళ్ల తర్వాత మహిళల యాత్రా రచనలే ప్రధానంగా ‘ఇంతియానం’ సంకలనం వచ్చింది. యాత్రలన్నీ పురుషుల దృక్కోణంలోనే ఎందుకు చదవాలి? ఆకాశంలో సగం అంటున్నారు కదా కనీసం ఒకటోవంతు మహిళా యాత్రాకథనాలు పుస్తక రూపంలో ఎందుకు లేవు? మహిళల దృక్కోణంలో ప్రపంచాన్ని ఎందుకు చూడకూడదు? అన్న ఆలోచనల నుండి పుట్టిందే ‘ఇంతియానం’. రాబోవు తరాల మహిళలకి యాత్రలు చేయడానికి గానీ, వాటి గురించి రాయడానికి గానీ ప్రేరణగా ఉండాలి అనే ఉద్దేశ్యంతోనే పుస్తకం తెచ్చాము.

ఈ పుస్తకానికి ప్రేరణ ఎక్కడి నుంచి కలిగింది?

23 ఏళ్ల అమ్మాయి బ్లాగర్‌, యాత్రా రచయిత్రి శివ్యానాధ్‌ రాసిన ‘ది షూటింగ్‌ స్టార్‌’ ఆంగ్ల పుస్తకం చదువుతున్నపుడు కలిగిన అనుభూతిలోంచి పుట్టిన ఆలోచనే ‘ఇంతియానం’. అతి చిన్న వయసులో ఒంటరిగా ప్రపంచ దేశాలు పర్యటిస్తూ, సంచార జీవనం గడుపుతూ తన రచనల ద్వారా ఎందరి లోనో యాత్రాస్ఫూర్తిని కలిగించిన శివ్యానాధ్‌ అంటే ఇష్టం ఏర్పడింది. నా తెలుగు శివ్యానాఽథ్‌ల వెతుకులాటే ‘ఇంతియానం.‘

తెలుగులో ఇలాంటిది ఇదే మొదటి ప్రయత్నం అని ముందే తెలుసా?

నేను ఈ పుస్తకాన్ని తీసుకొచ్చే పని ప్రారంభించినప్పుడు, ఇదే మొదటి మహిళా యాత్రా సంకలనం అవుతుందని తెలీదు. విడుదల అయిన తర్వాత చాలామంది నాతో తెలుగులో పుస్తకరూపంలో వచ్చిన మొదటి మహిళా యాత్రా సంకలనం ఇదే అంటుంటే ఎవరైనా గతంలో ఈ ప్రయత్నం చేశారా అని వెతికాను. 1838లో వచ్చిన ఏనుగుల వీరాస్వామి ‘కాశీయాత్ర చరిత్ర’ నుంచి నేటి వరకు తెలుగులో అనేక యాత్రా గ్రంథాలు, వ్యాసాలు వచ్చాయి, వస్తున్నాయి. అయితే మీరన్నట్టు తెలుగులో పూర్తిగా మహిళా రచయితలే రాసిన మొట్టమొదటి యాత్రా సంకలనం మాత్రం ఇంతియానమే.

కొన్ని కథనాలు యాత్రా విశేషాల కంటే కూడా ఆత్మానుభవాల మీదే సాగాయి అనిపిస్తోంది?

సందర్శకులకు (టూరిస్టులకు) యాత్రికులకు (ట్రావెలర్స్‌)కు ఉన్న మౌలికమైన తేడా అదే కదా. కేవలం భౌతికంగా ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళి చూసి, నాలుగు ఫోటోలు దిగి వచ్చేయడం యాత్ర కాదు అనుకుంటాను. బాహ్య ప్రపంచం నుండి అంతః ప్రపంచం లోకి చేసే సంచారమే యాత్ర అని నా ఫీలింగ్‌. అలాంట ప్పుడు కచ్చితంగా ఆత్మానుభవాలు ఉంటాయి, ఉండాలి కూడా. మనం సాధారణంగా చూసే ప్రాంతాలు లేదా ఆల్రెడీ చూసిన ప్రదేశాలు రచయితలు తమ ఆత్మానుభవంలో ఎలా ఆవిష్కరించారన్నదే పాఠకులకి ముఖ్యం. కేవలం సమాచారం కోసమే అయితే మొబైల్లో గూగుల్‌ కంటే మనమేం ఎక్కువ ఇవ్వగలం? ఫోన్‌ ఇవ్వలేనిది పుస్తకం మాత్రమే ఇచ్చేదీ ఈ తేడానే కదా. తన ఆత్మానుభూతికి అక్షర రూపమిచ్చి పాఠకులని యాత్రికులుగా మార్చగలిగేవారే యాత్రా రచయితలు.

ఇందులోని కథనాలన్నీ స్త్రీ స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలకు ప్రతీకగా నిలిచాయనడంలో సందేహం లేదు. అయితే వీటి ఎంపిక యాదృచ్ఛికంగానే జరిగిందా? లేదా అలా ఉన్నవాటినే తీసుకున్నారా?

ఇంతియానంలో మొత్తం 45 మంది మహిళల యాత్రానుభవాలుంటాయి. అందరూ విభిన్నమైన సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సామాజిక నేపథ్యంతోపాటు భిన్నవయస్కుల వారున్నారు. అందులోనూ ఒక్కొక్కరి జీవన మార్గాలు, శైలులు విభిన్నం. అందరిలోనూ ఉన్న ఒకే ఒక కామన్‌ పాయింట్‌ స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ ఉంటేనే మహిళలు యాత్రలు చేయగలరు. 45 మంది భిన్న మహిళల ఏకస్వర స్వేచ్ఛా నినాదమే ఇంతియానం. ఇవన్నీ కేవలం యాత్రావ్యాసాలు మాత్రమే కాదు. వాళ్ళ ఆత్మగౌరవపు స్వేచ్ఛా రచనలు.

ఇక ఎంపిక అంటారా, సంపాదకురాలిగా దీనికి ఎటువంటి నియమాలు, పరిమితులు పెట్టలేదు. లబ్దప్రతిష్టులైన రచయిత్రులని అడిగాను, సామాజిక మాధ్యమాల్లో అద్భుతంగా రాసే రచయిత్రులను అడిగాను, బాగా రాయగలరు అని అనుకున్న కొత్తవాళ్ళని కూడా భాగస్వామ్యం చేశాను. రచయిత్రుల్లో పాతికేళ్ళ నుంచి ముప్పాతికేళ్ల వయసున్న వాళ్ళు ఉన్నారు. అలాగే తొలి పర్యటన చేసిన వాళ్ళ నుంచి మొదలుకుని సుమారు 170 దేశాలకు పైగా తిరిగిన వాళ్ళ వరకూ ఉన్నారు. తొలి యాత్రానుభవాలను, తలపండిన యాత్రానుభవాలనూ ఇందులో చేర్చాము. పుస్తకం ఇంత విభిన్నంగా, వైవిధ్యంగా ఉండటానికి ఇదే కారణం.

ఈ సంకలనం తీసుకు రావడంలో మీకు మీరుగా గుర్తించిన పరిమితులు, పొందిన అనుభూతి?

ఇది పక్కా ప్రణాళిక ప్రకారం చేసిన సంకలనం కాదు. అప్పటికప్పుడు వచ్చిన ఆలోచనను వాయిదా వేయకుండా వెంటనే మొదలుపెట్టాను. పెద్దగా పరిమి తులు ఏం పెట్టుకోలేదు. యాత్రా కథనం కేవలం సమాచారపూరితంగా ఉండ కుండా ఉండాలి అనుకున్నా, దానికి తగ్గట్టుగానే అన్ని వ్యాసాలు రావడం చాలా సంతోషంగా అనిపించింది. ఇక అనుభూతి మాటల్లో చెప్పలేను. పుస్తకం మొదలుపెట్టినప్పటి నుంచి ఔట్‌ పుట్‌ వచ్చేదాకా ఎక్సైటింగ్‌గా ఎదురు చూశాను. సంతృప్తిని ఇచ్చిన సంకలనం ఇది.

ఈ సంకలనానికి కొనసాగింపుగా మరో ప్రాజెక్టు ఏమైనా తీసుకొచ్చే ఆలోచన ఉందా?

ఇంతియానం చేస్తున్నప్పుడు దీనికి కొనసాగింపు మరో సంకలనం చేయాలని అనుకోలేదు. అయితే ఇది విడుదల అయ్యాక వచ్చిన అనూహ్య స్పందన చూసి, ఇంతియానం-2 కూడా తీసుకురావాల్సి వచ్చేలా ఉంది. చాలామంది పాఠకులు, రచయితలు, మిత్రులు కూడా కొనసాగింపుగా రెండవ భాగం తీసుకురమ్మని అడుగుతున్నారు. అనివార్యంగా కొందరి యాత్రానుభవవాలను ఇందులో భాగస్వామ్యం చేయడంలో నేను మిస్‌ అయ్యాను. సమయాభావం వల్ల మరికొందరు వ్యాసాలు ఇవ్వలేకపోయారు. ఈసారి వారందరినీ కలుపుకుని ఇంతియానం 2 తేవాలన్న ఆలోచన ఉంది.

ఇంటర్వ్యూ : సాంత్వన్‌

Updated Date - 2023-07-24T04:48:04+05:30 IST