Alaha Singaracharulu : వ్యక్తి కథతో పాటు ప్రాంత గాథను చెప్పే ఆత్మకథ
ABN , First Publish Date - 2023-09-04T03:23:01+05:30 IST
అళహ సింగరాచార్యులు రచన ‘అధ్యాపకుడి ఆత్మకథ’లో తెలంగాణ జీవితం ఉంది. పల్లె ప్రజల అమాయకత్వం ఉంది. స్వచ్ఛత ఉంది. ఆనాటి తెలుగు, సంస్కృతం చదివే విద్యార్థుల జీవితం ఉంది. ఒకనాటి పెద్దాయన తన దగ్గర కూర్చోపెట్టుకుని తన కథతో పాటు... తన ప్రాంతపు గాథను మనకు కథలా చెప్తే ఎలా ఉంటుందో ఈ పుస్తకం అలా ఉంటుంది.
అళహ సింగరాచార్యులు రచన ‘అధ్యాపకుడి ఆత్మకథ’లో తెలంగాణ జీవితం ఉంది. పల్లె ప్రజల అమాయకత్వం ఉంది. స్వచ్ఛత ఉంది. ఆనాటి తెలుగు, సంస్కృతం చదివే విద్యార్థుల జీవితం ఉంది. ఒకనాటి పెద్దాయన తన దగ్గర కూర్చోపెట్టుకుని తన కథతో పాటు... తన ప్రాంతపు గాథను మనకు కథలా చెప్తే ఎలా ఉంటుందో ఈ పుస్తకం అలా ఉంటుంది.
కండ్లకుంట అళహ సింగరాచార్యులు ‘అధ్యాపకుడి ఆత్మకథ’ 1930లనాటి తెలంగాణ జన జీవితాన్ని, వారి ఆచార వ్యవహారాలను, ముఖ్యంగా పేద బ్రాహ్మణ కుటుంబాల బతుకులను, నాటి తెలంగాణ వెనుకబాటుతనాన్ని అక్షరీకరించిన ఆత్మకథ. ఇప్పటిదాకా దాశరథి రంగాచార్య ‘జీవనయాన’మే తెలంగాణ జీవితాన్ని అద్భుతంగా చిత్రించిన ఆత్మకథ అనుకునేవాడిని. ఆ సరసన ఇప్పుడు అధ్యాపకుడి ఆత్మకథ కూడా చేరింది.
సింగరాచార్యుల వారు స్వయంగా అధ్యాపకుడు కావడం చేతనేమో ఆత్మకథలో ప్రతి అంశాన్ని సామాన్య పాఠకులకు కూడా స్పష్టంగా అర్థమయ్యేలా వివరంగా రాశారు. ఉదాహరణకు ‘1930 దశాబ్ద పల్లె జీవితం’ అనే అధ్యాయంలో ఆనాటి తెలంగాణ పల్లెల్లో ఉదయం లేవడం దగ్గర నుంచి జీవితం ఎలా ఉంటుందో చక్కగా వివరించారు. ‘‘ఉదయం లేవగానే గంటె తీసుకువెళ్లి పొరుగింట్లో నిప్పు తీసుకువచ్చి పొయ్యి రాజేయడం అప్పటి అలవాటు. అగ్గిపెట్టెల విరివి వాడకం లేదప్పటికి. పేడతో పిడకలు చేసి ఎండబెట్టి నిలువ చేసుకునేవారు. నిప్పు మీద ఎండిన పిడకబెడితే త్వరగా అంటుకుంటుంది. కూరగాయల విషయానికొస్తే అప్పటికి పాలకూర, టమాటాలు లేవు. బెండ, గోకరి, వంగా అనే విత్తనాలను మళ్ళ లోను బీర, కాకర, పొట్ల, సొరకాయ విత్తనాలను పాదులలోను విత్తే వారం. చుక్కకూర, బచ్చల కూర, తోటకూర, గంగవాయిల కూర అనేవి కూడా మళ్లల్లో పండించే వాళ్ళం. ఏనాడైనా బస్తీకి వెళితే ఆలుగడ్డలు కొని తెచ్చుకునే వాళ్ళం. ఆ రోజుల్లో ఆలుగడ్డలు వండుకోవడం గొప్పగా అనుకునేవారు. పల్లెల్లో పాలు, పెరుగు, కూరగాయలు అమ్మడం నా బాల్యం చివరి రోజుల్లో మొదలయ్యింది.’’ ఇలా బూడిద గుమ్మడికాయ, చింతచిగురు వంటి విశేషాలు తోపాటు ఆకలి పోరాటాన్ని, అది తీరిన తరువాత వచ్చే సంతృప్తిలోని తీయదనాన్ని వివరించారు. విద్యార్థులకు పాఠ్యాంశంగా ఉంచతగ్గ అధ్యాయం ఇది. అలాగే ఆనాటి పిల్లల ఆట పాటలను గురించిన విశేషాలు చెప్పారు. సోల, గిద్దెల్లో కొలవడం... మైలు, ఫర్లాంగు దూరాలు, హాళీ సిక్కా రూపాయలు, పొద్దు, జాము కాలాన్ని గుర్తించడం వంటి వివరాలు ఉన్నాయి
అలాగే చాలా పుస్తకాలలో బ్రాహ్మల సంగతి వచ్చినప్పుడు మేము వైదికులమని, నియోగులమని ప్రస్తావన ఉంటుంది. వాటికి తేడా నాకు తెలిసేది కాదు. పుస్తకంలోనే ఆ వివరం తెలిసింది. బ్రాహ్మణుల్లో స్మార్తులు, వియోగులు, శ్రీవైష్ణవులు అని ముఖ్యంగా మూడు రకాలు ఉంటారట. స్మార్తులు పూజారులుగాను, నియోగులకు కరణీకం కొన్నిచోట్ల దొరతనం ఉండేవట. వైష్ణవుల పరిస్థితి ఆ రోజుల్లో చాలావరకు దయనీయంగా ఉండేదట.
సింగరాచార్యులవారు ఎనిమిది మంది సంతానంలో ఆరవ వారు. తండ్రితో ఆయన అనుబంధం ముచ్చటగా ఉంటుంది. ఆయన చదువు సొంత ఊరు భక్తలాపురం వీధిబడితో ఆగిపోవలసిందే. ఒకసారి ఇంటికి వచ్చిన బంధువు యాదగిరి దేవస్థానంలో సంస్కృత పాఠశాలలో అధ్యాపకులుగా ఉన్న వేదాంతం వెంకట నరసింహాచార్యులు గారు తన సొంత ఆసక్తితో సింగరాచార్యుల వారిని యాదగిరి పాఠశాలకు తీసుకొని వెళ్లారు. జీవితంలో అది పెద్ద మలుపు. లేకపోతే వీధిబడి లోనే తన చదువు ముగిసిపోయేదని సింగరాచార్యులు రాసుకున్నారు. అక్కడ చదువుకుంటున్న సందర్భంలో ఒక మిత్రుడి ద్వారా సీతారాంబాగ్ దేవాలయంలో నిర్వహిస్తున్న సంస్కృత పాఠశాల విషయం తెలుసుకొని అక్కడికి చేరినారు. అలా అలా స్వశక్తితో చదువు కొనసాగించి, తర్వాత ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే డాక్టరేట్ పట్టా పొంది ఉత్తమ అధ్యాపకుడిగా తనను తాను మలుచుకున్న విధానం స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఆయనకు డైరీ రాసే అలవాటు ఉండటం చేత ఇందులోని విషయాలన్నీ కళ్ళకు కట్టినట్టు అక్షరీకరించారు.
సింగరాచార్యుల వారికి ప్రాచీన సంస్కృతి అన్నా, ఆచారాలన్నా గౌరవం ఎక్కువ. మొదట విశాలాంధ్రను సమర్థించినా, స్వయంగా అనుభవమైన కొన్ని అవహేళనల వల్ల ప్రత్యేక తెలంగాణను బలపరిచిన వారు.
ఏది ఏమైనా ‘అధ్యాపకుడి ఆత్మకథ’ తప్పక చదవాల్సిన పుస్తకం. ఇందులో తెలంగాణ జీవితం ఉంది. పల్లె ప్రజల అమాయకత్వం ఉంది. స్వచ్ఛత ఉంది. ఆనాడు తెలుగు, సంస్కృత భాషలు చదివే విద్యార్థుల జీవితం ఉంది. ఒకనాటి పెద్దాయన తన దగ్గర కూర్చోపెట్టుకుని తన కథతో పాటు... తన ప్రాంతపు గాథను మనకు కథలా చెప్తే ఎలా ఉంటుందో ఈ పుస్తకం అలా ఉంటుంది.
-కమల్