అటు తరవాత

ABN , First Publish Date - 2023-04-03T01:14:21+05:30 IST

నువులేని నా పగళ్ళు, దార్లు మూసుకుపోయిన చీకటి రాత్రులయ్యాయి. నా రాత్రుళ్లు, మోకాళ్ళవరకు కురిసిన మంచు పగళ్ళయ్యాయి. నా రోజులు...

అటు తరవాత

నువులేని

నా పగళ్ళు, దార్లు మూసుకుపోయిన చీకటి రాత్రులయ్యాయి.

నా రాత్రుళ్లు, మోకాళ్ళవరకు కురిసిన మంచు పగళ్ళయ్యాయి.

నా రోజులు, నువ్వు వెళుతూ వెళుతూ దగ్గరికి వేసిన తలుపుల

దగ్గరే ఆగిపోయాయి.

నువ్విచ్చి వెళ్ళిన రంగుపువ్వులసజ్జ

నీ పరిమళాన్ని పంచి

నిలుచున్న చోటే ప్రాణం పోసుకున్న శిల్పం అయ్యింది.

అమాయకపు తెల్ల చేమంతిపువ్వు

పచ్చిపదును జ్ఞాపకమై కొస్తూనే వుందింకా.

నువ్వెళ్ళిపోయాక

దోసిళ్లలో ఎక్కువసేపు నిలవనివి మనసులోకి మార్చుకున్నాక

మనసులో ఎక్కువసేపు ఆగలేనివి కళ్లలో చిప్పిల్లాక

చుట్టూ ఉన్న ప్రపంచపు పైతెర

కొంచెం కొంచెం తొలగిపొయి

అక్కడక్కడా మిణుగురు వెలుగులు

పాత పురుగులై

బంధాల గాయాల్ని తొలుస్తున్నాయి.

నువ్వెళ్ళిపోయాక

నడవాల్సిన దానికంటే ఎక్కువే నడిచాను.

తెంపుకోవాల్సిన వాటికంటే ఎక్కువే తెంపుకున్నాను.

దిగాల్సిన లోతుల కంటే ఎక్కువే దిగాను.

పైపైకి, లోలోపలికి వెళ్లడానికింకేం మిగళ్లేదు.

భయమేం లేదు

నిన్ను కలిసిన అనుభవం ముందు, కలుస్తామన్న నమ్మకం ముందు

ఈ లోతులూ దూరాలు వాటికవే కురచనవుతాయని తెలుసు.

నువ్వొచ్చి వెళ్ళాక

ఈ ప్రపంచానికీ నేనూ, నాకీ ప్రపంచమూ దూరమయ్యాయి.

అయినా నాకేం పట్టింపు లేదు

అదే చుట్టూ తిరిగి తిరిగి ఎప్పుడో ఓసారి మళ్ళీ ఉన్న చోటుకొస్తుంది.

మనుషులు మళ్ళీ తలెత్తి పలకరిస్తారు.

మళ్ళీ ఎప్పట్లా పక్షుల గొంతుల్లో రాగాలు పోల్చుకోగలను.

రాలిన ఎర్రతురాయి పూలు మళ్ళీ నా అరిపాదాల్ని గుర్తుపడతాయి.

మనసు లోతుల్లో అలలెత్తుతున్న ఈ తుమ్మెద రొద

ఏదో ఒక నమ్మకంతో కలిసి సద్దుమణిగిపోతుంది.

నా పగళ్ళు, మళ్ళీ వెలుగు పూలు పూస్తాయి

నా రాత్రుళ్లు, మళ్ళీ సంపెంగ గీతాలు పాడుకుంటాయి.

నా రోజులు, నీ రంగులన్నిటినీ కలుపుకుని

తెలుపు పోతపోసుకుంటాయి.

రవి వీరెల్లి

ravinder.verelly@gmail.com

Updated Date - 2023-04-03T01:14:21+05:30 IST