Share News

ఆద్యంతాలు

ABN , First Publish Date - 2023-10-16T01:46:11+05:30 IST

యుద్ధం తర్వాత పరిస్థితులు వాటంతటవే చక్కబడవు. ఎవరో ఒకరు పూనుకొని వాటిని చక్కబెట్టాలి. శవాలు నిండిన బళ్ళు వెళ్లాలంటే,...

ఆద్యంతాలు

యుద్ధం తర్వాత పరిస్థితులు

వాటంతటవే చక్కబడవు.

ఎవరో ఒకరు పూనుకొని వాటిని చక్కబెట్టాలి.

శవాలు నిండిన బళ్ళు వెళ్లాలంటే,

ఎవరో ఒకరు పూనుకొని

చెత్తనంతా రోడ్డుకు ఒక పక్కన నెట్టివేయాలి.

పగిలిపోయిన అద్దపు ముక్కల్లోనో,

రక్తంతో తడిసిన గుడ్డ పీలికల్లోనో,

సోఫాల నుండి పైకి పొడుచుకొచ్చిన స్ర్పింగ్‌ ల్లోనో,

ఏ రొంపిలోనో, బూడిద కుప్పల్లోనో,

ఎవరో ఒకరు చిక్కుకు పోవాల్సిందే.

ఒరిగిపోయిన గోడ కూలకుండా

ఎవరో ఒకరు

ఓ దూలాన్ని లాక్కొచ్చి ఊతగా పెట్టాల్సిందే.

పగిలిపోయిన కిటికీ అద్దాల్ని, ఛిద్రమైన ఇంటి తలుపుల్ని

ఎవరో ఒకరు బిగించాల్సిందే

అదృశ్యమైన ఆ సుందర దృశ్యం

దృశ్యమానం కావాలంటే

మరి కొన్ని సంవత్సరాలు గతించాలి.

ఈలోగా కెమెరాలన్నీ

మరో యుద్ధపు దృశ్యాలు చిత్రీకరించడానికి తరలివెళ్ళాయి.

ఇప్పుడు మనం

మళ్లీ వంతెనలు, రైలుస్టేషన్లు నిర్మించాలి.

ఇక మడచి, మడచి మన

చొక్కా చేతులు పీలికలవుతాయి.

చీపురు చేత పట్టుకుని,

ఆ ఊరు ఎంత అందంగా ఉండేదో

చెబుతూ ఉంటుంది ఒకావిడ.

ఇంకా తెగిపోని తన తలను ఆడిస్తూ

వింటూ ఉంటుంది మరొకావిడ.

కానీ, నిస్తేజమైన తమ ఊరును తలచుకుంటూ

అప్పటికే కొంతమంది నిస్త్రాణంగా తిరుగాడుతూ ఉంటారు.

పెరిగిపోయిన గడ్డి పొదల్లో నుండి

ఎవరో ఒకరు ఒక్కోసారి

తుప్పు పట్టిపోయిన వాదనలను ఇంకనూ వెలికి తీసి,

చెత్తకుప్పలోకి చేరుస్తుంటారు.

కొంచెం మాత్రమే తెలిసిన వాళ్లకు,

కొంచెంలో మరి కొంచెం మాత్రమే తెలిసిన వాళ్లకు,

చివరకు ఏమీ తెలియని వాళ్లకు,

అక్కడ ఏం జరుగుతుందో

తెలిసినవాళ్ళు చెప్పాలి.

కారణ, ప్రభావాల సమాధులపై

ఏపుగా పెరిగిన గడ్డి దుబ్బుల్లో నుండి

పెరికిన గడ్డిపరకను నోట్లో పెట్టుకుని,

మెరిసిపోయే వెండి మబ్బుల్ని చూస్తూ మురిసిపోయే

ఎవరో ఒకరిని

ఇప్పుడు మనం మేల్కొల్పాలి.

విస్లావా షింబోర్స్కా,

ఆంగ్లానువాదం: జొఆనా ట్రెచియాక్‌ హస్‌

తెలుగు అనుసృజన: చింతకుంట్ల సంపత్‌ రెడ్డి

98495 01696

Updated Date - 2023-10-16T01:46:11+05:30 IST