అబ్బూరి అనువాద కళ
ABN , First Publish Date - 2023-12-11T02:51:03+05:30 IST
అబ్బూరి వరదరాజేశ్వరరావు అనువాదంలో చేయి తిరిగిన గాఢతృష్ణ కల్గిన కవి అని అతని అను వాదాలు నిరూపిస్తాయి. ఏ కవైనా ఇంకో కవిని అనువాదంలోకి తీసుకొచ్చినప్పుడు ఆ కవికి...
అబ్బూరి వరదరాజేశ్వరరావు అనువాదంలో చేయి తిరిగిన గాఢతృష్ణ కల్గిన కవి అని అతని అను వాదాలు నిరూపిస్తాయి. ఏ కవైనా ఇంకో కవిని అనువాదంలోకి తీసుకొచ్చినప్పుడు ఆ కవికి మన్నికైన అనుభవ పరిసరాల్లోని కవిత్వఖండికలనే తీసుకుంటాడేమో.
అబ్బూరి సమకాలీకుడు, స్నేహితుడైన శ్రీశ్రీ అనువదించిన కవిత్వం అతని హృదయానికి ఎంత దగ్గరో, అదే రీతిలో అబ్బూరి అనువదించడానికి ఎంపిక చేసుకున్న కవితలూ అతనికి చేరువైనవే. అబ్బూరి straight poems చదివి నప్పుడు కల్గిన కంపనస్థితి- అతని అనువాద కవిత్వం లోనూ కనిపించడమే నేను ఈ నిరూపణకు రావడానికి కారణం. అబ్బూరి అనువదించిన కవులను, వారి కవిత్వాన్ని చూస్తే మనకు ఇదే రూఢీ అవుతుంది.
‘ఆర్థర్ రాంబో’ (1854-1891) అను ఫ్రెంచ్ కవిని అబ్బూరి వరద రాజేశ్వరరావు అనువదించారు. రాంబో కవిత్వ వ్యక్తీ కరణకు అబ్బూరి కవిత్వ వ్యక్తీకరణకు సంబంధం వున్నట్లు కనిపిస్తుంది. పూర్తి ఆధునిక కవిత్వ వ్యక్తీకరణకు ముందు దశ అబ్బూరి వరదరాజేశ్వరావు గారిదైతే - ఆర్థర్ రాంబో గద్యంలో పద్యాన్ని విస్తరించినట్టు తెలుస్తుంది. రాంబో రాసిన ‘ఎ సీజన్ ఇన్ హెల్’ ఆధునికవాద సాహిత్యానికి పూర్వగామిగా చెబుతారు. ‘ఎ సీజన్ ఇన్ హెల్’ అనే రచన గద్యపద్యం. రాంబో ఒక surrealist, symbolist poet..
అబ్బూరిని- బహుశా ఒక విషాద అణువు ఎప్పుడూ వెంటాడేదనుకుంటాను. అతని దిగులు వ్యాపించిన కవిత్వపు వ్యక్తీకరణల్లాంటివి- రాంబో రాసి అబ్బూరి అనువదించిన ‘జిప్సీ కవి’ కవితలో కనిపించటం గమనిస్తాం.
‘చిరిగిపోయిన జేబుల్లో చేతులాడించుకుంటూ
తిరుగుతానెక్కణ్ణో’
-అని మొదలౌతుంది ‘జిప్సీ కవి’ కవిత.
జీవితం సృష్టించిన లోయల గుండా ప్రయాణం చేసే కవి- జీవితం చెల్లాచెదురు చేస్తే పుట్టిన అలజడిలో పూర్తిగా తడిసిపోతూ- కవికి బతుకు లోతు అర్థమౌతుంది.
‘కప్పుకున్న బొంతకు గుడ్డకన్నా కంతలెక్కువ’ అంటాడు రాంబో.
- ఎంత దిగుళ్ల గుహల్లో నడిచినా- చివరకు ఇలా అంటాడు రాంబో- అబ్బూరి రూపంలో-
‘చిరిగిపోయిన చెప్పుల్లో కాళ్లు దూర్చుకుని
హత్తుకుంటాను హృదయానికి ఒక పాదాన్ని వీణలా’
అబ్బూరి, రాంబో- ఇద్దరూ ఆశాజనకమైన కవులే అన డానికి- ఈ ముగింపును మనం గమనించవచ్చు. అబ్బూరి straight poems లోనూ ఈ నిర్మాణం కనిపిస్తుంది.
2
అనువాదం మక్కీకి మక్కీ కాకుండా- అనువాదకుడి నేటివిటీకి వర్తింపచేసుకోవటం అనువాదంలో ఒక ముఖ్య మైన పని అని మనం అనుకుంటున్నప్పుడు- శ్రీశ్రీ వలే అబ్బూరీ అదే పని చేశారు. అబ్బూరి గారి అనువాద కళ అబ్బురపరుస్తుంది.
మూలంని అనువాదంలోకి తీసుకొచ్చినప్పుడు అనువాదకుడు బహుశా కొన్ని వాక్యాలను అక్కర్లేదు అనుకుంటాడేమో- అందుకే అబ్బూరి గారు కూడా నిర్దాక్షిణ్యంగా కొన్ని వాక్యాలను వదిలేస్తారు. ఉదాహరణకు ‘On those pleasant September evenings’ అన్న వాక్యం అనువాదంలో లేదు. మచ్చుకి ఇదొక్కటి మాత్రమే-అబ్బూరి- కవితాశీర్షికలను కూడా మార్చారు. అలా మార్చడం వలన తెలుగు అనువాదానికి కచ్చితంగా ఒక అందం చేకూరింది. రాంబో 'My Bohemian Existence' అనే శీర్షికే తెలుగులోకి వచ్చేసరికి ‘జిప్సీ కవి’ అయింది. ఇలా శీర్షికను పెట్టడమే ఒక నైపుణ్యం ఉంది.
ఆర్థర్ రాంబోదే ‘Sensation’ కవితాశీర్షిక మాత్రం అలానే వుంచారు- ‘సంచలనం’ అని. కొన్నిసార్లు అనువాదం చాలా అందంగా అమరుతుందనేదానికి ఈ కవితా శీర్షికనూ, మొత్తం కవితనూ ఉదాహరణగా చెప్పొచ్చు. చాలా మంచి అనువాదం. రాంబో ఈ ‘ఫ్రెంచ్ కవిత’కు మూడు ఆంగ్లానువాదాలు దొరుకుతున్నాయి. మూడు ఆంగ్లానువాదాలూ బాగున్నాయి. అబ్బూరి వరద రాజేశ్వరావు గారి తెలుగు అనువాదం ఆంగ్లానువాదాల పక్కన సగౌరవంగా నిలబడే అర్హత వున్న అనువాదమే. ఇంగ్లీష్ నుంచి తెలుగు అనువాదంలో- ఒక్కొక్క వాక్యం చాలా Natural flavourతో అమిరిపోయింది. ఇది నిస్సందే హంగా అనువాదకుడి గొప్పతనమే. మచ్చుకి కొన్ని వాక్యాలు తీసుకుందాం.
I will not speak,
I will have no thoughts
-అని రాంబో అంటే, అబ్బూరి గారు:
‘పదాలతో లేదు నాకు ప్రమేయం
భావాలకంత కన్న లేదు నిమిత్తం’
-అని అంటారు.
ఎంత సున్నితంగా తెలుగులోకి తర్జుమా చేశారో చూడండి. ఇది అనువాదకుడి చేయితిరిగినతనమని అనకుండా వుండ గలమా?
Infinite love will mount in my soulకి ‘నా హృదిలో ప్రణయం ఉప్పొంగుతుంది.. మేరలేని నీరధిలా...’ అని అనువదిస్తారు.
ఈ కవితలోని తర్వాత వచ్చే వాక్యాలు కూడా ఇంతే అద్భుతంగా అల్లబడ్డాయి.
3
అబ్బూరి వరదరాజేశ్వరావు గారు మరో ప్రఖ్యాత ఫ్రెంచ్ కవిని అనువదించారు. అతను చార్లెస్ బోద్‌లేర్ (1821- 1867). ఆంగ్లంలో బోద్‌లేర్ కవిత Epilogue అని వుంది. అనగా- ఉపసంహారం. అబ్బూరి ‘నగరం’ అని పేరు పెట్టారు. మొత్తం ఆ కవితను చదివాక- ‘నగరం’ శీర్షిక సరైన శీర్షికగా మనకనిపిస్తుంది. బోద్‌లేర్ ఆంగ్ల కవితను నేను చదువుతూ వెళ్తున్నప్పుడు- ఆ కవిత నా మీద వేసిన impactను బట్టి చూస్తే ఆ కవితకు ‘నగరం’ శీర్షికను వుంచడమే సరైనదనిపించింది. కవిత్వ ఆధునిక వ్యక్తీకర ణకు సంబంధించిన స్పృహ లేకుండా ఏ కవీ ‘నగరం’ అని- శీర్షికను ఇవ్వలేరు. అబ్బూరి ఆధునిక మార్గగామి కాబట్టే ఆ శీర్షికను పెట్టగలిగారు- శీర్షిక వస్తువు పరిధి దాటివెళ్లలేదు. కఠిన వాక్యవిన్యాసాలను సరళతరం చేయడం అనువాదకుడి గొప్ప లక్షణమైతే అబ్బూరి ఆ పనిని సమర్థవంతంగా నిర్వహించారు.
బోద్‌లేర్ ఒక కవితను ‘సంధ్యా సంగీతం’ పేరుతో శ్రీశ్రీ అనువదించారు. అదే బోద్‌లేర్‌ని అబ్బూరీ అనువదించారు. ఆనాటి ఇద్దరు మిత్రులను ఫ్రెంచ్ కవులు ఎంతగా తమ కవిత్వంతో వెంటాడేరో తెలుస్తుంది.
4
హంగేరియన్ కవి అటిలా జోసెఫ్ (1905-1937) కవిత ఒకదానిని ‘ముగ్ధగీత’గా అనువదించారు అబ్బూరి. హంగేరి దేశ కార్మికవర్గం వైపు నిలబడి, గొప్ప ‘శ్రామికుల కవి’గా ప్రసిద్ధి పొందాడు అటిలా జోసెఫ్.
అటిలా జోసెఫ్ "With Pure Heart' అను కవితని అబ్బూరి గారు ‘ముగ్ధగీత’ పేరుతో అనువదించారు.
అటిలా జోసెఫ్:
I've no father, no parent
have no god and no homeland
not a cradle and no shroud
no lover, no one to hold
-అని దుఃఖగీతానికి పల్లవిని ఆలపిస్తే...
‘లేడు నాకు పరమేశ్వరుడు
లేడు నాకు ధరణీశ్వరుడు
తాల్చి యెరుగదు నా
తల్లి నల్లపూసల పేరు!
లేదు గూడు, లేదు పాడె తోడు
బహుదూరం ప్రణయం నాకు’
-అని అబ్బూరి అనువదిస్తారు.
ఇది కూడా ఒరిజినల్ కవితకు మక్కీకి మక్కి అనువాదం కాదు. అనువాదకుడి స్వీయ ఆవరణంలోకి మూల కవితను తీసుకుని తనదైన చూపులోంచి, దృక్పథ తాత్వికత లోంచి చేసిన అనువాదం ఇది. అనువాదకుడి జీవననేపథ్యం ఈ కవితలోకి రావడం గమనించొచ్చు. మొత్తం కవిత అంతా ఇలాగే వుంటుంది. మూల కవి, అనువాదకుడి మధ్య సమన్వయం ఇదంతా.
I've no father, no parent
have no god and no homeland
-అన్నదాన్ని
‘లేడు నాకు పరమేశ్వరుడు
లేడు నాకు ధరణీశ్వరుడు’గా
అనువదించడంతోనే అబ్బూరి అనువాద సామర్థ్యం మనకు ద్యోతకమౌతుంది.
5
మొత్తం అబ్బూరి వరదరాజేశ్వరావుగారివి ఆరు అనువాద కవితలు అందుబాటులో వున్నాయి. ఫ్రెంచ్ సర్రియలిస్టు కవి ‘ఆర్ధర్ రాంబో’ కవితలు మూడు, బోద్‌లేర్ కవిత ఒకటి, హంగేరియన్ కమ్యూనిస్టు కవి ‘అటిలా జోసెఫ్’ కవిత ఒకటి, టి.యి. హ్యూమ్ కవిత ఒకటి.
‘కవి బతికిన కాలానికి కవిత్వం ఒక గాఢమైన చిహ్నం’ అని ఎవరైనా ఒక కవిని గురించి మాట్లాడుకునేటప్పుడు అంటుంటాం- ఇక్కడ అబ్బూరి రాజేశ్వరరావు గారి ఈ కొన్ని అనువాద కవితలకైనా ఈ మాటని వర్తింపజేయవచ్చని భావిస్తున్నాను.
బాలసుధాకర్ మౌళి