Share News

ముఖం మీద సీతాకోకచిలుకల నీడ

ABN , First Publish Date - 2023-11-06T00:20:03+05:30 IST

నీవు నిద్రపోతే నీ లాగా రాత్రి యెందుకు నిద్రపోతుంది? నీవు ఉదయం లేచే సరికి అది పొలిమేర దాటిపోయి వుంటుంది!...

ముఖం మీద సీతాకోకచిలుకల నీడ

నీవు నిద్రపోతే

నీ లాగా రాత్రి యెందుకు నిద్రపోతుంది?

నీవు ఉదయం లేచే సరికి

అది పొలిమేర దాటిపోయి వుంటుంది!

గదిలో దీపం కూడా ఆరిపోయి వుంటుంది

నేలమీద వొలికిన చీకటి

ఎప్పుడో జారిపోయి వుంటుంది

కిటికీ దగ్గర తిరిగే

సీతాకోక చిలుకల నీడ

నీ ముఖం మీద పడుతుంటుంది

నీవు కళ్ళు నులుపు కుంటూనే వుంటావు

నిద్రపోని రాత్రి

ఎక్కడో ఎగిల్లువారంగా

నదిలో మునిగిపోయివుంటుంది.

నిద్రపోతే, నీవు నిద్ర పోతావు!

చీకటి దాటి పోవాలనుకొన్న రాత్రి,

చీకట్లో యెందుకు నిద్రపోతుంది!?

నిద్ర విశ్రాంతి కోసమా?

ఊహలు దరిచేరడం కోసమా?

ఉదయమే లేచి

మరిచి పోయిన వాటిని

వెదుక్కోవడం కోసమా?

రస్తా వదిలేసి

ఇలా పందెం వేసుకోవడానికి కాదు!

నిద్ర పోవడం కలలు కనడానికి!

కలలో ఎప్పుడూ మేల్కొని వుండడానికి!

ఆశారాజు

asharaju.poet@gmail.com

Updated Date - 2023-11-06T00:20:07+05:30 IST