Share News

75 ఏళ్ల రాడికల్‌ హ్యూమనిస్టు ఉద్యమం

ABN , First Publish Date - 2023-12-13T02:22:12+05:30 IST

భావవిప్లవ తాత్వికుడు, రాడికల్‌ హ్యూమనిస్టు ఉద్యమ నిర్మాత ఎం.ఎన్‌.రాయ్‌. తీవ్రజాతీయ వాదిగా జీవితాన్ని ప్రారంభించి, ఆంతర్జాతీయ కమ్యూనిస్టు నాయకుడిగా ఎదిగి, చివరికి...

75 ఏళ్ల రాడికల్‌ హ్యూమనిస్టు ఉద్యమం

భావవిప్లవ తాత్వికుడు, రాడికల్‌ హ్యూమనిస్టు ఉద్యమ నిర్మాత ఎం.ఎన్‌.రాయ్‌. తీవ్రజాతీయ వాదిగా జీవితాన్ని ప్రారంభించి, ఆంతర్జాతీయ కమ్యూనిస్టు నాయకుడిగా ఎదిగి, చివరికి రాడికల్‌ హ్యూమనిస్టు తత్వవేత్తగా పరిణతి చెందాడు. ఆసియా, అమెరికా, ఐరోపా ఖండాలలోని అనేక దేశాలలో విప్లవకారుడుగా చరిత్ర నిర్మాణంలో పాల్గొన్నాడు. అంతిమంగా తన మేధాసంపత్తిని, అనుభవాన్ని రంగరించి, ఆధునిక విజ్ఞాన శాస్త్రాల వెలుగులో రాడికల్‌ హ్యూమనిజమనే మానవవాద తత్వాన్ని ప్రపంచ మానవాళికి అందించాడు.

భారత్‌, ఇతర ఆసియా దేశాల్లో కమ్యూనిస్టు విప్లవాన్ని పెంపొందించేందుకు రాయ్‌ చాలా కృషి చేశాడు. అందులో బాగంగానే తాష్కెంట్‌లో ‘భారత రాజకీయ సైనిక పాఠశాల‘ను నెలకొల్పాడు. ఆ పాఠశాలలోని కొద్ది మంది సభ్యుల సహకారంతో 1920 అక్టోబరు 17న ‘కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా‘ను ఏర్పాటు చేశాడు. భారతదేశంలో కమ్యూనిస్టు బృందాలను సృష్టించి, వారికి ధనసహాయం చేశాడు. 1926 నాటికి రాయ్‌ కమ్యూనిస్ట్‌ ఇంటర్నేషనల్‌లో అత్యున్నత స్థానానికి ఎదిగాడు. కొమింటర్న్‌ ప్రిసీడియం, పొలిటికల్‌ సెక్రటేరియట్‌, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ, వరల్డ్‌ కాంగ్రెస్‌ అనే నాలుగు అధికార విధాన నిర్ణాయక కమిటీలన్నిటిలో సభ్యుడిగా ఎన్నుకోబడ్డాడు. 1927లో స్టాలిన్‌ హయాంలో చైనా విప్లవాన్ని పర్యవేక్షించడానికి చైనా వెళ్లాడు. అయితే చైనాలో రాయ్‌ సిద్ధాంతం గాని, భావాలు గాని అమలుకాలేదు. రాయ్‌ రష్యాకు తిరిగి వచ్చేటప్పటికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అధికారికంగా తాను పరపతిని కోల్పోయినట్లు రాయ్‌ గ్రహించాడు. బరోడిన్‌, బుఖారిన్‌ వంటి మిత్రుల సహకారంతో రష్యా నుండి ఆయన రహస్యంగా బయటపడగలిగాడు.

1924లోనే బ్రిటిష్‌ ప్రభుత్వం రాయ్‌ మీద, ఇండియాలోని ప్రముఖ కమ్యూనిస్టు నాయకుల మీదా కాన్పూరు కుట్ర కేసును బనాయించింది. వీరందరిపై కఠిన కారాగార శిక్షలు విధించి అమలు చేసింది. రాయ్‌ విదేశాల్లో ఉన్నందున అతడిపై చర్య తీసుకోడానికి వీలుపడలేదు. ఇండియాకు వెళ్లవద్దని మిత్రులు వారిస్తున్నా, వెళితే అరెస్టవుతానని తెలిసి కూడా రాయ్‌ 1930 డిసెంబరులో రహస్యంగా ఇండియా చేరాడు. 1931 జూలైలో రాయ్‌ని బొంబాయిలో అరెస్టు చేశారు. 1931 జూలై నుంచి 1936 నవంబరు వరకు రాయ్‌ జైలు జీవితం గడిపాడు. జైలులో ఉండగానే రాయ్‌ విస్తారంగా ఆధునిక విజ్ఞానశాస్త్ర గ్రంథాలను అధ్యయనం చేశాడు. దాదాపు 9000 పేజీల రచనలు చేశాడు. జైలు నుండి విడుదలయ్యాక కాంగ్రెస్‌లో చేరాడు. రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంగా కాంగ్రెస్‌తో తీవ్రమైన విభేదాలు వచ్చాయి. దాంతో కాంగ్రెస్‌ నుండి బయటకు వచ్చి 1940లో రాడికల్‌ డెమోక్రటిక్‌ పార్టీని రాయ్‌ స్థాపించాడు.

ప్రపంచ యుద్ధంలో ఫాసిస్టు శక్తులు పరాజయం పొందుతాయని, ఫాసిస్టు వ్యతిరేక యుద్ధం వల్ల బ్రిటన్‌లోను ఇతర మిత్రపక్ష దేశాల్లోను సంభవించే సామాజిక, ఆర్థిక మార్పుల ఫలితంగా భారతదేశానికి, ఇతర వలస దేశాలకు స్వాతంత్ర్యం లభిస్తుందని 1942 డిసెంబర్‌లో లక్నోలో జరిగిన రాడికల్‌ డెమోక్రటిక్‌ పార్టీ మహాసభల్లో రాయ్‌ ప్రకటించాడు. రాయ్‌ చెప్పిన జోస్యాలు రెండూ నిజమైనాయి.‍

రాయ్‌ యుద్ధానంతర భారతదేశ నిర్మాణంపై దృష్టిని కేంద్రీకరించాడు. రెండు మౌలిక రచనలు చేశాడు. ‘భారతదేశ ఆర్థికాభివృద్ధికి ప్రజాప్రణాళిక’, ‘స్వతంత్ర భారత రాజ్యాంగ ముసాయిదా’ రచించి, ప్రచురించాడు. డెహ్రాడూన్‌లో 1946లో జరిగిన పార్టీ అధ్యయన తరగతుల్లో రాయ్‌ తొలిసారిగా రాడికల్‌ హ్యూమనిస్టు భావాలను ప్రకటించాడు.

1946 డిసెంబరులో బొంబాయిలో జరిగిన రాడికల్‌ డెమోక్రటిక్‌ పార్టీ మహాసభలో తాను చెప్పదలచుకున్న తత్వసారాన్ని 22 సిద్ధాంతాల రూపంలో రాయ్‌ ప్రతిపాదించాడు. అవే రాడికల్‌ హ్యూమనిస్టు సూత్రాలుగా పేరు గాంచాయి. రాయ్‌ 1947 మే నెలలో నవ్యమానవవాద ప్రణాళికను ప్రకటించాడు. దానికనుగుణంగానే 1948 డిసెంబరులో కలకత్తాలో జరిగిన అఖిల భారత మహాసభలో రాడికల్‌ డెమోక్రటిక్‌ పార్టీని రద్దుచేశాడు. రాజకీయ పార్టీల గురించి, అధికార రాజకీయాల గురించి రాయ్‌ చేసిన ఉపన్యాసాలు ‘రాజకీయాలు, అధికారం, పార్టీలు’ అనే గ్రంథంగా వెలువడ్డాయి.

మూఢనమ్మకాలు, నిరక్షరాస్యత, నిరుద్యోగం వంటి సమస్యలున్నందువల్ల భారత్‌లో పార్టీ రాజకీయాలు తప్పనిసరిగా అవినీతికరమైన అధికార పోరాటంగా మారగలవని రాయ్‌ సరిగానే అంచనావేశాడు. రాజకీయరంగంలో పార్టీ రహిత, నిర్మాణాత్మక, భాగస్వామ్య ప్రజాస్వామ్యాన్ని, ఆర్థిక రంగంలో ‘సహకార ఆర్థిక విధానాన్ని’ ఆయన ప్రతిపాదించాడు.

సమాజంలోని ఏ రంగంలోనైనా ఆశించిన మార్పు రావాలన్నా ముందుగా ఆ మార్పులకు సంబంధించిన భావాలు ప్రజల్లో పెంపొందాలి. రాజకీయ రంగంలో గాని, ఆర్థిక రంగంలో గాని, విప్లవాత్మక మార్పులు సంభవించాలంటే ముందుగా వాటికి సంబంధించిన విప్లవ భావాలు ప్రజల మనసుల్లో ఏర్పడాలి. అంటే ప్రజల తాత్విక భావాల్లో ముందుగా ఆ మార్పు రావాలి. దానినే భావవిప్లవం అంటారు.

అటువంటి భావవిప్లవాన్ని భారతదేశంలో ప్రారంభించి, దాన్ని విజయపథంలో నడిపించడానికి భారత రాడికల్‌ హ్యూమనిస్టు ఉద్యమాన్ని చేపట్టాడు. అదే తరువాత భారత రాడికల్‌ హ్యూమనిస్టు సంఘంగా ఏర్పడింది. దీనికి తోడు రాయ్‌ కలకత్తాలో 1948లోనే భారత పునర్వికాస సంస్థను స్థాపించాడు. తద్వారా హేతువాద, మానవవాద భావవిప్లవ సాహిత్యాన్ని సృష్టించడానికి కృషిచేశాడు. రాయ్‌ ప్రారంభించిన రాడికల్‌ హ్యూమనిస్టు ఉద్యమానికి ఇప్పటికి 75 సంవత్సరాలు పూర్తయింది (1948–2023).

1987 మార్చి 21న బెంగాలులోని 24 పరగణాల జిల్లాలో అర్బేలియా అనే గ్రామంలో జన్మించిన రాయ్‌ 1954 జనవరి 25న గుండెపోటుతో డెహ్రాడూన్‌లో తుదిశ్వాస విడిచాడు.

రాయ్‌ భావాల ఆవశ్యకత నేడు మరింతగా ఉంది. మతాలు, రాజకీయాలు ప్రపంచ మానవాళికి ప్రమాదకరంగా పరిణమించిన ఈ దశలో రాడికల్‌ హ్యూమనిస్టు భావాల ప్రచారానికి అభ్యుదయవాదులు అంకితం కావాలని ఆశిస్తున్నాను.

డా. గుమ్మా వీరన్న

ఉపాధ్యక్షులు, భారత హేతువాద సంఘం

(రాడికల్‌ హ్యూమనిస్టు ఉద్యమం ప్లాటినం జూబిలీ ఉత్సవాల సందర్భంగా బాపట్ల జిల్లాలోని ఇంకొల్లులోని రాడికల్‌ హ్యూమనిస్టు సెంటర్‌లో డిసెంబర్‌ 13 నుంచి 17 వరకు అధ్యయన తరగతులు)

Updated Date - 2023-12-13T02:22:14+05:30 IST