నమ్మకాన్ని దెబ్బతీస్తున్న నోట్ల రద్దు

ABN , First Publish Date - 2023-05-27T02:36:27+05:30 IST

బబహుశా, మన పాలనా వ్యవహారాలూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి స్ఫూర్తి పొందుతున్నాయేమో?!

నమ్మకాన్ని దెబ్బతీస్తున్న నోట్ల రద్దు

బబహుశా, మన పాలనా వ్యవహారాలూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి స్ఫూర్తి పొందుతున్నాయేమో?! ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే ప్రస్తుత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోనూ, దాని పాలన కింద వివిధ సంస్థలలోనూ స్పిన్ డాక్టర్ (రాజకీయ పక్షం తరఫున వివిధ అంశాలను ప్రజలకు వివరించే వ్యక్తి)లకు బాగా డిమాండ్ ఉన్నది. తాజా సందర్భంలో, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ)లో ఇటువంటి స్పిన్ డాక్టర్‌లు ఉన్నారు. అలాగే ప్రభుత్వం తరఫున బౌలింగ్ చేస్తున్న ‘ఆర్థికవేత్తలూ’ ఈ కోవలోకి వస్తారు.

రూ.2000 కరెన్సీ నోట్లను ‘ఉపసంహరించుకుంటున్నట్లు’ ఈ నెల 19న ఆర్బీఐ ప్రకటించడంతో ఈ స్పిన్ డాక్టర్లకు ఒక గొప్ప అవకాశం వచ్చి పడింది. దాంతో వారు తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం ‘డీ మానిటైజేషన్’ ఎంత మాత్రం కాదని ఈ స్పిన్ డాక్టర్లు వాదిస్తున్నారు. అవునా? 2016లో జరిగిందేమిటో ఒకసారి గుర్తుచేసుకోండి. పెద్ద నోట్లను రద్దు చేసిన ఆ సందర్భంలో ప్రభుత్వ నోటిఫికేషన్లు, సర్క్యులర్లలో ‘ఉపసంహరణ’ అనే పదాన్నే ఉపయోగించారే కానీ డీమానిటైజేషన్ అనే పదాన్ని వాడనేలేదు.

సరే, నవంబర్ 8, 2016 నాటి ఘటనలు నా మనసులో (మీ మనసులో కూడా కాదూ?) వేగంగా కదులుతున్నాయి. ఆ రోజున గౌరవనీయ ప్రధానమంత్రి జాతీయ టెలివిజన్ ఛానెల్‌లో రూ.500, రూ.1000 కరెన్సీ నోట్లు ఇంకెంత మాత్రం చట్టబద్ధమైన కరెన్సీ నోట్లు కాదని నాటకీయంగా ప్రకటించారు. శతాధిక కోట్ల భారతీయులకు ఇదొక హఠాత్పరిణామం, సందేహం లేదు. ప్రధానమంత్రి ప్రకటనతో ఉన్న పాటున దేశంలో చెలామణీలో ఉన్న మొత్తం కరెన్సీ నోట్లలో 86 శాతం నోట్లు చట్ట విరుద్ధమైనవిగా అయిపోయాయి. పర్యవసానమేమిటి? అయోమయం, అరాజకత్వం, అస్తవ్యస్తత, కల్లోలం, గందరగోళం... ఇలాంటి పదాలతో మాత్రమే ఆ నోట్ల రద్దు అనంతర పరిస్థితిని అభివర్ణించగలం. సరే, ఇప్పుడా బాధాకరమైన, భయానకమైన రోజులను గుర్తుచేసుకోవడం వల్ల ప్రయోజనమేమిటి?

రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన రోజునే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం నిశ్శబ్దంగా మరొక నిర్ణయం కూడా తీసుకున్నది. రూ. 2000 కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టడమే ఆ నిర్ణయం. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 24(1) ప్రకారం ఈ 2000 రూపాయల కొత్త నోట్లను జారీ చేసింది. సరే, స్పిన్ డాక్టర్లు ఈ చర్యను ‘రీ మానిటైజేషన్’ అని అభివర్ణించారు. ఏమైనా రెండు కొత్త పదాలు ప్రజల అనుభవంలోకి వచ్చాయి. వాటిలో ఒకటి డీమానిటైజేషన్ కాగా రెండోది రీమానిటైజేషన్. ప్రజలు ఆర్థికవేత్తలు కాదు కదా. ఆ రెండు కొత్త పదాలను అర్థం చేసుకోవడానికి వారు తమ బుర్రలు బద్దలుగొట్టుకున్నారు మరి. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి, అదే సమయంలో రూ,2000 నోట్లను ఎందుకు జారీ చేసింది? పాత నోట్ల స్థానంలో, అదే విలువ, కొత్త రూపు రేఖలతో కొత్త నోట్లను ఎందుకు ప్రవేశ పెట్టలేదు? పూర్తిగా భిన్న వర్ణం, పరిమాణంలో ఉన్న కొత్త కరెన్సీ నోటును ఎందుకు ప్రవేశపెట్టింది? మూడు లక్ష్యాలతో డీమానిటైజేషన్ చర్యను చేపట్టినట్లు మోదీ ప్రభుత్వం ప్రకటించింది. అవి: నకిలీ కరెన్సీ నోట్లను నిర్మూలించడం, నల్లధనాన్ని వెలికితీయడం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న వారికి నిధులు అందకుండా జేయడం. మరి వీటిలో ఏ ఒక్కటైనా నెరవేరిందా? లాభాల దురాశతో సరుకులను దాచిపెట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన నల్లబజారు వ్యాపారస్తులు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాదారులు, ఉగ్రవాదులు చాలా సంతోషంగా రూ.2000 కరెన్సీ నోట్లను ఆహ్వానించారు. ఎందుకంటే ఆ కొత్త కరెన్సీ వారి వారి కార్యకలాపాలకు మరింత సౌలభ్యాన్ని సమకూర్చింది మరి.

కొత్త కరెన్సీ నోట్‌ను ప్రవేశ పెట్టడంలో ప్రభుత్వ సంకల్పం ఏమైనప్పటికీ ప్రజలు రూ.2000 నోట్‌పై పెద్దగా ఉత్సాహం చూపలేదు. దాన్ని పూర్తిగా త్యజించారనే చెప్పాలి. మారక ద్రవ్యంగా అది పూర్తిగా నిరుపయోగకరమైనది. చాలా కొద్ది మంది దుకాణదారులు మాత్రమే రూ.2000 నోట్‌ను తీసుకోవడానికి సంసిద్ధపడ్డారు అలాగే సేవల రంగం వారు సైతం తమ వినియోగదారుల నుంచి ఆ పెద్ద నోట్‌ను తీసుకోవడానికి అంతగా అంగీకరించలేదు. జారీ అయిన కొద్ది వారాలకే రోజువారీ లావాదేవీలలో రూ.2000 నోట్ కన్పించకుండా పోయింది. అయినప్పటికీ ఆర్బీఐ 2018 సంవత్సరం వరకూ రూ.2000 నోట్‌ను ముద్రించి, జారీ చేస్తూనే ఉన్నది. అవన్నీ చెలామణిలో ఉన్నాయా? లేదు. అవి చాల వరకు బ్యాంకుల ఖజానా గదులలోనే ఉండిపోయాయన్న సత్యం ఇప్పుడు వెల్లడయింది. మరి మిగతావి అయినా తమ ఆర్థిక కార్యకలాపాలకు నగదును ఉపయోగిస్తున్న లక్షలాది ప్రజల చేతుల్లో ఉన్నాయా? లేదు లేదు అనేదే సమాధానం. దేశ జనాభాలో చాలా కొద్దిమంది వద్ద మాత్రమే రూ.2000 నోట్లు ఉండిపోయాయి. వారెవరో మరి చెప్పనవసరం లేదు. ఇంతకూ రూ.2000 కరెన్సీ నోట్‌ను ఎందుకు ప్రవేశపెట్టినట్టు? ఈ ప్రశ్నకు హేతుబద్ధమైన సమాధానం ఇంతవరకూ లభించనేలేదు.

రూ.2000 కరెన్సీ నోట్‌కు సంబంధించి మరో తార్కిక ప్రశ్నకు కూడా సమాధానం లభించడం లేదు. 2023లో ఎందుకు దాన్ని ఉపసంహరించారు? అన్నదే ఆ ప్రశ్న. బ్యాంకులకు రాసిన లేఖలో ‘పెద్ద నోట్ల రద్దు తరువాత తలెత్తిన అవసరాలను తీర్చేందుకు రూ.2000 నోట్లు జారీ చేశామని’ ఆర్బీఐ పేర్కొంది. ఏ లక్ష్యంతో వాటిని జారీ చేశామో ఆ లక్ష్యం నెరవేరిందని కూడా ఆర్బీఐ పేర్కొంది! ఇతర కరెన్సీ నోట్లు మార్కెట్‌లో తగినంత పరిమాణంలో వచ్చిన తరువాత 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఆ నోట్ల ముద్రణను నిలిపివేసినట్టు కూడా ఆర్బీఐ తెలిపింది. నిజానికి ఈ దేశ సామాన్య ప్రజలకు అంత పెద్ద విలువైన కరెన్సీ నోట్ అవసరం లేదు. ఆచరణాత్మక ప్రయోజనాల దృష్ట్యా అది పూర్తిగా నిరుపయోగమైనది. సామాన్య ప్రజలు, మధ్యతరగతి వారు రూ.50, రూ.100 మొదలైన తక్కువ విలువ గల కరెన్సీ నోట్లతో పాటు మళ్లీ ప్రవేశపెట్టిన రూ.500 నోట్లతో తమ అవసరాలను తీర్చుకుంటున్నారు (నోట్ల రద్దు జరిగిన కొద్ది కాలానికే రూ.500 నోట్‌ను ప్రవేశపెట్టి తీరాల్సిన పరిస్థితి ఏర్పడటం గమనార్హం). మరి రూ.2000 నోట్లను ప్రజలు పెద్దగా వినియోగించుకోనప్పుడు ఆ కరెన్సీని అంత భారీ పరిమాణంలో ఎందుకు ముద్రించారు? ఈ ప్రశ్నకూ ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదు. ఆర్బీఐ ఒక వివరణతో వాటి ముద్రణను సమర్థించుకుంది. రూ.2000 కరెన్సీ నోట్ షెల్ఫ్ లైఫ్ (ఉపయోగానికి అనువైన వ్యవధి) కేవలం నాలుగైదు సంవత్సరాలు మాత్రమేనని ఆ వివరణలో పేర్కొంది. అదే నిజమైతే 10, 20, 50, 100 రూపాయల నోట్ల షెల్ఫ్ లైఫ్ మరింత తక్కువయి ఉండి తీరాలి. ఈ స్వల్ప విలువ కరెన్సీ నోట్ల స్థానంలో తరచు కొత్త నోట్లను ప్రవేశపెడుతున్నప్పుడు రూ. 2000 నోట్ల విషయంలో కూడా నిర్ణీత సమయంలో కొత్త వాటిని జారీ చేయడానికి ఇబ్బంది ఏముంది? చెప్పవచ్చిన దేమిటంటే ప్రభుత్వ పక్షాన మాట్లాడుతున్న వారు అసత్యాలు మాత్రమే చెపుతున్నారు. తాము అల్లిన అబద్ధాల వలలో తామే చిక్కుకుపోయారు. ఫలితంగా భారతీయ కరెన్సీ విశ్వసనీయత దెబ్బతింది. ‘రూ.2000 నోట్లను తీసివేయడం వల్ల ఆర్థిక వ్యవస్థలో నగదుపై నమ్మకం పోతుంది. రూ.500 నోటును కూడా తీసేస్తారా అన్న ప్రశ్న ప్రజల మదిలో తలెత్తుతుందని’ ప్రముఖ ఆర్థికవేత్త ఒకరు అన్నారు.

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలో భారత్ అధికారిక ప్రతినిధి కె.వి. సుబ్రమణియన్ ఒక వింత వివరణ ఇచ్చారు. ‘నల్లధనాన్ని సంచితం చేసుకున్నవారు తమ సొమ్మును చాలవరకు రూ.2000 నోట్లలో దాచుకున్నారని చెప్పవచ్చు. కనుక ఆ నల్లధనాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం ఏడు సంవత్సరాల అనంతరం తన తాజా నిర్ణయాన్ని తీసుకున్నదని సబ్రమణియన్ మహాశయుడు అన్నారు. ఈ వివరణ ఇగ్–నోబెల్ పురస్కారానికి (ఒక పరిహాసపూర్వక అవార్డు) అర్హమైనది సుమా! సుబ్రమణియన్ విచిత్ర వివరణ వెలువడిన వెంటనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక కీలక ప్రకటన వెలువడింది. ఎవరైనా సరే తమ గుర్తింపు కార్డ్ చూపకుండా, ఎలాంటి ఫామ్ నింపకుండా, ఆ నగదు ఎక్కడ నుంచి వచ్చిందో తెలుపనవసరం లేకుండా రూ.2000 నోట్లను బ్యాంకుల్లో మార్పిడి చేసుకోవచ్చన్నది ఆ ప్రకటన సారాంశం. ఎస్‌బిఐని అనుసరించి అనేక బ్యాంకులు కూడా అటువంటి ప్రకటనలు చేశాయి. 2016లో రద్దయిన రూ.500, రూ.1000 నోట్లలో 99.3 శాతం వెనక్కి వచ్చినట్టుగానే ఇప్పుడు ‘చెలామణీ’లో ఉన్న రూ.2000 నోట్లు కూడా ఇంచుమించు అన్నీ ఆర్బీఐకి చేరతాయని నిశ్చితంగా చెప్పవచ్చు. స్పిన్ డాక్టర్లు దీనిపై మరొక అద్భుతమైన కథ తప్పక చెపుతారు: ‘మహాశక్తిమంతమైన భారత ప్రభుత్వం ఏడు సంవత్సరాల భగీరథ ప్రయత్నాల తరువాత దేశంలోని నల్లధనాన్ని పూర్తిగా వెలికితీయడంలో సంపూర్ణంగా విజయవంతమయింది; అవినీతిని పూర్తిగా రూపుమాపింది; మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారుల ఆట కట్టించింది; ఉగ్రవాదులను, వారికి నిధులు అందిస్తున్న శక్తులను నిలువరించింది’! తమ మేధో సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు తదుపరి

గొప్ప అవకాశం కోసం ఘనత వహించిన మన సర్కారీ మేధావులు వేచివున్నారు.

పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2023-05-27T02:36:27+05:30 IST