MLA: కాంగ్రెస్ ఎమ్మెల్యే కన్నుమూత

ABN , First Publish Date - 2023-01-05T08:21:39+05:30 IST

తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ (టీఎన్‌సీసీ) మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్‌ ఇళంగోవన్‌ తనయుడు, ఈరోడ్‌ తూర్పు(Erode East) నియోజకవర్గం

MLA: కాంగ్రెస్ ఎమ్మెల్యే కన్నుమూత

- పలువురు నేతల నివాళి

ప్యారీస్‌(చెన్నై), జనవరి 4: తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ (టీఎన్‌సీసీ) మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్‌ ఇళంగోవన్‌ తనయుడు, ఈరోడ్‌ తూర్పు(Erode East) నియోజకవర్గం శాసనసభ్యుడు తిరుమగన్‌ ఈవేరా (46) బుధవారం ఉదయం కన్నుమూశారు. ఈరోడ్‌ తూర్పు నియోజకవర్గానికి 2021 ఏప్రిల్‌ 6న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన తిరుమగన్‌, తన సమీప టీఎంసీ అభ్యర్థి యువరాజాపై 8904 ఓట్ల తేడాతో విజయం సాధించారు. గత కొంతకాలంగా తిరుమగన్‌ తీవ్ర అస్వస్థతకు గురై ఇంటివద్దే చికిత్స పొందుతున్నారు. బుధవారం ఉదయం ఉన్నట్టుండి ఆయనకు గుండెపోటు రావటంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో తిరుమగన్‌ మృతదేహాన్ని ఈరోడ్‌ కచేరి రోడ్డులో ఉన్న ఆయన నివాసానికి తరలించారు. కుమారుడి మరణ వార్త తెలియగానే నగరంలో ఉన్న ఈవీకేఎస్‌ ఇళంగోవన్‌ తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. వెంటనే ఆయన ఈరోడ్‌కు బయలుదేరారు. తిరుమగన్‌ మృతివార్తతో రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులంతా ఆవేదన చెందారు. పార్టీ ప్రముఖులంతా ఈరోడ్‌కు పయనమయ్యారు. 59 యేళ్ల తర్వాత ఈరోడ్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ఘనత తిరుమగన్‌కే దక్కింది. ద్రవిడ ఉద్యమనేత పెరియార్‌ మునిమనమడైన తిరుమగన్‌ ఎమ్మెల్యేగా గెలిచినందుకు ఈరోడ్‌ పార్టీ నాయకులంతా హర్షం వ్యక్తం చేశారు. అయితే శాసనసభ్యుడిగా పూర్తి కాలం సేవలందించక ముందే తిరుమగన్‌ మృతిచెందటంతో ఈరోడ్‌ నాయకులంతా శోకతప్తులయ్యారు. తిరుమగన్‌ 2006 నుంచి 2010 వరకు రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా, 2014 నుంచి 2017 వరకు పార్టీ అధికారిక ప్రతినిధిగా, 2016 నుండి ఏఐసీసీ సభ్యుడిగా, 2021లో టీఎన్‌సీసీ ప్రధాన కార్యదర్శిగాను వ్యవహరించారు. 1999లో మద్రాస్‌ యూనివర్సిటీలో బీఏ పూర్తి చేసిన ఆయన వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. తిరుమగన్‌ మృతిపట్ల ముఖ్యమంత్రి స్టాలిన్‌, ప్రతిపక్షనేత ఎడప్పాడి పళనిస్వామి, టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సహా ఇతర రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు.

Updated Date - 2023-01-05T08:30:05+05:30 IST