విద్యుత్ కేంద్రంలో రూ.3 కోట్ల పరికరాల దోపిడీ
ABN , First Publish Date - 2023-02-03T08:29:28+05:30 IST
స్థానిక మీంజూరు సమీపంలో ఉన్న ఉత్తర చెన్నై థర్మల్ విద్యుత్ కేంద్రం(North Chennai Thermal Power Station) వద్ద కంటైనర్లలోని రూ.3

- ఏడుగురి అరెస్టు
చెన్నై, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): స్థానిక మీంజూరు సమీపంలో ఉన్న ఉత్తర చెన్నై థర్మల్ విద్యుత్ కేంద్రం(North Chennai Thermal Power Station) వద్ద కంటైనర్లలోని రూ.3 కోట్ల విలువైన ఎలక్ర్టికల్ పరికరాలను దోచుకెళ్ళిన ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ థర్మల్ విద్యుత్ కేంద్రం వద్ద ప్రస్తుతం మూడో యూనిట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇటీవల బెంగళూరు నుంచి కంప్యూటర్లు, సీసీ కెమెరాల పరికరాలు, టీవీలు సహా ఎలక్ట్రికల్ పరికరాల లోడుతో రెండు కంటైనర్లు ఆ యూనిట్‌కు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ రెండు కంటైనర్ల తలుపులను ధ్వంసం చేసి గుర్తు తెలియని దుండగులు వాటిలోని రూ.3 కోట్ల విలువైన పరికరాలు దోచుకెళ్ళారు. వాచ్‌మెన్ పళని ఫిర్యాదు మేరకు మీంజూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దోపిడీ దొంగల ఆచూకీ కోసం తీవ్రంగా గాలించారు. ఈ నేపథ్యంలో ఎన్నూరు ప్రాంతంలో కొందరు టీవీలు, సీసీ కెమెరాలను తక్కువ ధరకు అమ్ముతున్నట్లు పోలీసులకు తెలిసింది. వెంటనే మీంజూరు పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్ళి ఎలక్ర్టికల్ పరికరాలు విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. ఆ విచారణలో ఏడుగురు దోపిడీ దొంగలు ఉత్తర చెన్నై విద్యుత్ కేంద్రం వద్దకు పడవలో వెళ్ళి కంటైనర్లను పగులగొట్టి వస్తువులను దోచుకెళ్ళినట్లు వెల్లడైంది. వారిచ్చిన సమాచారం మేరకు ఎన్నూరుకు చెదిన హరీష్, విఘ్నేశ్, వాసు, ప్రతాప్, ముత్తుపాండి, అజిత్, అరుళ్‌పాండి అనే ఏడుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుండి చోరీకి గురైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.