జీఎస్‌టీలో ఆమ్నెస్టీ పథకం అంటే..
ABN , First Publish Date - 2023-11-19T05:36:56+05:30 IST
జీఎ్‌సటీ చట్టంలో ఒక కొత్త క్షమాభిక్ష పథకం (ఆమ్నెస్టీ స్కీమ్)ను ప్రవేశపెట్టారు. ఇది అప్పీల్‌కు సంబంధించినది. దీని గురించి తెలుసుకోవటానికి ముందు జీఎ్‌సటీలో అప్పీల్ అంటే ఏమిటి?...
జీఎ్‌సటీ చట్టంలో ఒక కొత్త క్షమాభిక్ష పథకం (ఆమ్నెస్టీ స్కీమ్)ను ప్రవేశపెట్టారు. ఇది అప్పీల్‌కు సంబంధించినది. దీని గురించి తెలుసుకోవటానికి ముందు జీఎ్‌సటీలో అప్పీల్ అంటే ఏమిటి? ఒక ఆర్డర్ మీద అప్పీల్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.
జీఎ్‌సటీకి సంబంధించి ఏవేని ఉల్లంఘనలకు పాల్పడినట్లు భావిస్తే.. డిపార్ట్‌మెంట్ ఒక వ్యక్తికి లేదా వ్యాపార సంస్థకు ముందుగా ఒక నోటీస్ ఇస్తుంది. ఈ నోటీస్ అనేది ట్యాక్స్‌కు సంబధించినదై ఉండవచ్చు లేదా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ), రిఫండ్, వడ్డీ లేదా ఇతర కారణాల వల్ల అయి ఉండవచ్చు. నోటీ్‌సలోని అభియోగాలు, దానికి సంబంధించి సదరు వ్యక్తి లేదా సంస్థ ఇచ్చిన జవాబులను, సంబంధిత ఆధారాలను బట్టి ఒక ఆర్డర్ ఇవ్వటం జరుగుతుంది. ఈ ఆర్డర్ లేదా నిర్ణయం తనకు అనుకూలంగా లేదని భావిస్తే ఆ వ్యక్తి లేదా సంస్థ ఆ ఆర్డర్ మీద అప్పీల్ చేసుకోవచ్చు. సాధారణ భాషలో చెప్పాలంటే ఇది దిగువ కోర్ట్ ఇచ్చిన ఆర్డర్‌కు వ్యతిరేకంగా ఎగువ కోర్టుకు వెళ్లినట్లు.
అయితే ఇలా అప్పీల్ చేసుకునేందుకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఆర్డర్ తనకు అందిన మూడు నెలలలోపు అప్పిలేట్ అథారిటీ ముందు అప్పీల్ చేయాల్సి ఉంటుంది. తగు కారణాలు చూపటం ద్వారా అదనంగా ఒక నెల సమయం కూడా పొందవచ్చు. అలాగే తను ఏ ఆర్డర్ మీద అప్పీల్ చేస్తున్నాడో ఆ ఆర్డర్‌కు సంబంధించి తను ఆమోదించే విషయాలు అంటే అడ్మిట్ చేసే విషయాలు, విభేదించే విషయాలు అంటే డిస్ప్యూట్ చేసే విషయాలు విడివిడిగా చూపాలి. తను అడ్మిట్ చేసే వాటికి సంబంధించి మొత్తం అంటే పన్ను, వడ్డీ, పెనాల్టీ మొదలైనవి చెల్లించాలి. విభేదించే వాటిలో పన్ను మీద మాత్రం 10 శాతం చెల్లించాలి. దీనినే ‘ప్రీ డిపాజిట్’ అంటారు. దీన్ని ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. ఒక వ్యాపార సంస్థకు వ్యతిరేకంగా ఒక ఆర్డర్ ఇవ్వటం జరిగింది. ఇందులో రూ.లక్ష ట్యాక్స్, మరొక రూ.లక్ష పెనాల్టీతో పాటుగా వడ్డీని కూడా డిమాండ్ చేయటం జరిగింది అనుకుందాం. ఇందులో రూ.40,000కు సంబంధించి ట్యాక్స్ దానికి సంబంధించిన పెనాల్టీ, వడ్డీకి సంబంధించి తను ఆమోదిస్తున్నాడు. మిగతా రూ.60,000కు సంబంధించిన ట్యాక్స్, పెనాల్టీ, వడ్డీ మీద తాను అప్పీల్ చేస్తున్నాడనుకుంటే.. ముందుగా తాను ఆమోదించే మొత్తాన్ని ట్యాక్స్, పెనాల్టీ, వడ్డీతో పాటుగా చెల్లించటంతో పాటు, తాను అప్పీల్ చేసుకుంటే రూ.60,000ల్లో పది శాతం అంటే రూ.6,000 ప్రీ డిపాజిట్‌గా చెల్లించాలి. ఇవి అప్పీల్ చేసుకోవటానికి కనీస నియమాలు.
అయితే, ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన ఆమ్నెస్టీ పథకం ఏం చెబుతుందంటే 2023 మార్చి 31 లేదా అంతకంటే ముందు ఏదేనీ ఆర్డర్ ఇచ్చి దాని మీద పైన చెప్పిన నిర్ణీత గడువు లోపు అప్పీల్ చేసుకోలేకపోయినా, లేదా అప్పీల్‌ను నిర్ణీత గడువు లోపు అప్పీల్ చేయలేదన్న కారణంతో కొట్టివేసినా, ఆయా వ్యక్తులు 2024 జనవరి 31 లోపు అప్పీల్ చేసుకోవచ్చు. అయితే పైన చెప్పిన నియమాలతో పాటుగా ఈ స్కీమ్ కింద అప్పీల్ చేసుకునే వ్యక్తులు 2.5 శాతం అదనంగా ప్రీ డిపాజిట్ చెల్లించాలి. అంటే 10 శాతం బదులుగా 12.5 శాతం ప్రీ డిపాజిట్ చెల్లించాలి. అందులో కనీసం 20 శాతం ఐటీసీ కాకుండా నగదు చెల్లించటం ద్వారా చెల్లింపు జరపాలి అంటే క్యాష్ లెడ్జర్ ద్వారా చెల్లించాలి. అలాగే ఈ స్కీమ్ కింద ట్యాక్స్‌తో సంబంధం లేని ఆర్డర్ మీద అప్పీల్ చేయలేరు. అంటే ట్యాక్స్ లేకుండా కేవలం ఐటీసీ లేదా రిఫండ్ మొదలగు వాటితో కూడిన ఆర్డర్ మీద అప్పీల్ చేయలేరు. ఏది ఏమైనా 2023 మార్చి 31 లేదా అంతకంటే ముందు ఇచ్చిన ఆర్డర్ మీద సకాలంలో అప్పీల్ చేయలేని వారికి ఈ ఆమ్నెస్టీ పథకం ఒక మంచి అవకాశం.
రాంబాబు గొండాల