ఇష్టమైన కారు కోసం ఎంతైనా చెల్లిస్తాం..
ABN , First Publish Date - 2023-01-18T00:48:19+05:30 IST
ఒకపక్క ద్రవ్యోల్బణ భయాలు వెన్నాడుతున్నప్పటికీ భారతీయ వినియోగదారులు తాము కొనబోయే కొత్త కారుకు ప్రీమియం ధర చెల్లించేందుకు...
భారత వినియోగదారుల అభిమతం
న్యూఢిల్లీ : ఒకపక్క ద్రవ్యోల్బణ భయాలు వెన్నాడుతున్నప్పటికీ భారతీయ వినియోగదారులు తాము కొనబోయే కొత్త కారుకు ప్రీమియం ధర చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారు. 47 శాతం మంది రూ.10-25 లక్షల శ్రేణిలోని కార్లపై మొగ్గు చూపుతున్నారు. ధర కన్నా కొత్త టెక్నాలజీతో అనుభవానికే వారు ప్రాధాన్యం ఇస్తున్నారని డెలాయిటీ అధ్యయనంలో తేలింది. తమకు ఇష్టమైన, మంచి అనుభూతితో కూడిన అనుభవాన్ని అందించే కారు కోసం 4-12 వారాలైనా వేచి ఉండేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపారని ఆ నివేదిక తెలిపింది. గ్లోబల్ ఆటోమోటివ్ కన్స్యూమర్ స్టడీ పేరిట డెలాయిటీ గత ఏడాది సెప్టెంబరు 21-29 తేదీల మధ్యన ఈ సర్వే నిర్వహించింది.
సర్వే ముఖ్యాంశాలు..
రూ.10 లక్షల లోపు ధరలో కారు కొనాలనుకునే వారి సంఖ్య 28 శాతం ఉంది. 57 శాతం మంది రూ.10-25 లక్షల శ్రేణిలోని ఎలక్ట్రిక్ కారు కొనాలన్న ఆసక్తిని, 20 శాతం మంది రూ.10 లక్షల లోపు విద్యుత్ కారు కొనాలన్న ఆసక్తిని ప్రకటించారు.
37 శాతం మంది నిర్వహణ వ్యయాలకు, అనుభవానికి మధ్య సమతూకం సాధించాలనుకుంటున్నారు.
ఒక బ్రాండ్ నుంచి మరో బ్రాండ్‌కు మారే సమయంలో నాణ్యత (62 శాతం), ఫీచర్లు (48 శాతం), బ్రాండ్ ఇమేజ్ (46 శాతం) పరిశీలిస్తామని చెప్పారు.
విద్యుత్ కార్లు కొనాలనుకోవడానికి తక్కువ ఇంధన వ్యయాలు, మెరుగైన డ్రైవింగ్ అనుభవం, తక్కువ మెయింటెనెన్స్ వ్యయాలే కారణమని ఎక్కువ మంది చెప్పారు.
కనెక్టెడ్ ఫీచర్లకు ధర చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు 49 శాతం మంది చెప్పారు. నెలవారీ డిజిటల్ సబ్‌స్ర్కిప్షన్ సేవలు ప్రారంభించడం ద్వారా అదనపు ఆదాయ వనరులు పొందాలనుకునే ఓఈఎంలకు ఇది ఒక సవాలుగా ఉండనుంది.