Promoters: ప్రమోటర్లు సహకరించకపోతే పరిస్థితి ఇలాగే ఉంటుంది మరి..

ABN , First Publish Date - 2023-03-26T04:35:31+05:30 IST

అప్పుల్లో కూరుకుపోయి తిరిగి చెల్లించలేని హైదరాబాద్‌కు చెందిన ఒక కంపెనీపై కార్పొరేట్‌ దివాలా పరిష్కార ప్రక్రియ ప్రణాళిక (సీఐఆర్‌పీ)కు నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఇటీవల ఆదేశాలు...

Promoters: ప్రమోటర్లు సహకరించకపోతే పరిస్థితి ఇలాగే ఉంటుంది మరి..

సీఐఆర్‌పీ, లిక్విడేషన్‌కు అడుగడుగున అడ్డంకులు

  • కరిగిపోతున్న ఆస్తుల విలువ

  • కొన్ని సందర్భాల్లో అస్మదీయుల చేతికి కారు చౌకగా కంపెనీలు!

  • నీరుగారుతున్న ఐబీసీ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అప్పుల్లో కూరుకుపోయి తిరిగి చెల్లించలేని హైదరాబాద్‌కు చెందిన ఒక కంపెనీపై కార్పొరేట్‌ దివాలా పరిష్కార ప్రక్రియ ప్రణాళిక (సీఐఆర్‌పీ)కు నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియను సవాల్‌ చేస్తూ ఆ కంపెనీ ఎన్‌సీఎల్‌ఏటీని ఆశ్రయించింది. అక్కడ కూడా వ్యతిరేక ఆర్డర్‌ రావడంతో ఏకంగా సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టు.. నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఆదేశాలను సమర్థించడంతో ఎట్ట్టకేలకు సీఐఆర్‌పీకి బిడ్లను ఆహ్వానించడం జరిగింది. రుణాలు తీసుకున్న కంపెనీలు అప్పులు తిరిగి చెల్లించలేనప్పుడు రుణదాతలు (బ్యాంకులు, ఆర్థిక సంస్థలు) తాము ఇచ్చిన రుణాలను తిరిగి రాబట్టుకునేందుకు ఇన్‌సాల్వెన్సీ బ్యాంక్‌రప్టసీ కోడ్‌ (ఐబీసీ ) 2016 కింద ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయిస్తాయి. అయితే.. అన్ని కంపెనీలు కాకపోయినా.. కొన్ని కంపెనీల ప్రమోటర్లు రుణ పరిష్కార ప్రక్రియ అమలుకు అడుగడుగున అడ్డుపడుతున్నారు. ఎన్‌సీఎల్‌టీ సీఐఆర్‌పీకి ఆదేశించడంతో పాటు దాన్ని ఆచరణలోకి తీసుకురావడానికి రిసొల్యూషన్‌ ప్రొఫెషనల్‌ (ఆర్‌పీ)ను నియమిస్తుంది. దివాలా పరిష్కార ప్రక్రియ ప్రణాళికను సమర్పించి, కంపెనీని గాడిలోకి తెచ్చే వారి నుంచి బిడ్లను ఆహ్వానించడంతో పాటు కంపెనీ కొత్త యాజమాన్యం చేతిలోకి వెళ్లే వరకూ దాని నిర్వహణ బాధ్యతలు ఆర్‌పీ చేతిలో ఉంటాయి.

అయితే.. కొన్ని కంపెనీల ప్రమోటర్లు సీఐఆర్‌పీకి ఆదేశాలు జారీ చేసిన నాటి నుంచి దాని అమలు వరకూ అడగడుగున అడ్డంకులు కల్పిస్తున్నారు. ఈ అడ్డంకులను అధిగమించి దివాలా పరిష్కార ప్రక్రియకు బిడ్లను ఆహ్వానించినా కంపెనీని గాడిలో పెట్టేందుకు ఆసక్తి చూపిన వారికి (కంపెనీలకు) కీలకమైన సమాచారాన్ని ఇవ్వడంలో కూడా అప్పుల్లో కూరుకుపోయిన సదరు కంపెనీ ప్రమోటర్లు సహకరించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. వెండార్లు, ఖాతాదారుల నుంచి కంపెనీకి రావాల్సిన నగదును తమ పలుకుబడి ఉపయోగించి రాకుండా చేస్తున్నారు.

ఆస్తుల విలువ క్షీణించి..

బిడ్లను దాఖలు చేయడానికి ఏ కంపెనీ ముందుకు రానప్పుడు రుణాల్లో కూరుకుపోయిన కంపెనీకి సంబంధించిన రుణదాతల కమిటీ (సీఓసీ) ఆ కంపెనీ ఆస్తులను విక్రయించడానికి ఆసక్తి చూపుతుంది. అప్పటికే మరింతగా చిక్కుల్లో కూరుకుపోయిన కంపెనీ ఆస్తులను కారు చౌకగా విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అప్పుడు కంపెనీ ప్రమోటర్లకే చెందిన అస్మదీయులు రంగంలోకి ప్రవేశించి కారు చౌకకు కంపెనీని కొనుగోలు చేసిన సందర్భాలు ఉంటున్నాయి. అంటే.. అప్పులు చెల్లించకుండా కారు చౌకకు పరోక్షంగా ప్రమోటర్లే ఆ కంపెనీని చేజిక్కించుకుంటున్నారు. భారీగా రుణాలు ఇచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు నామమాత్రపు మొత్తమే లభిస్తోంది. చివరకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు నష్టపోతున్నాయి. జాతి సంపద కరిగిపోతోంది.

అసలు ఉద్దేశానికి గండి..

కంపెనీ అప్పులు తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లోకి వెళ్లినప్పుడు తక్కువ సమయంలో కంపెనీ విలువను గరిష్ఠం చేసి అప్పులిచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ రుణాలను వసూలు చేయాలి. దీంతోపాటు నష్టాల్లో కూరుకుపోయిన కంపెనీని మళ్లీ గాడిలోకి తీసుకురావాలన్నది ఐబీసీ ప్రధాన ఉద్దేశం. సీఐఆర్‌పీ సజావుగా సాగితే.. కంపెనీకి గరిష్ఠ విలువ లభిస్తుంది. జాప్యం జరిగే కొద్దీ కంపెనీ విలువ తగ్గిపోతుంది. జాప్యాన్ని వీలైనంత పొడిగించి విలువను తగ్గించడానికి ప్రారంభం నుంచి ప్రమోటర్లు లిటిగేషన్లను సృష్టిస్తున్నారని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

Updated Date - 2023-03-26T11:11:56+05:30 IST