ఔషధాల గిరాకీకి ఢోకా లేదు
ABN , First Publish Date - 2023-08-02T02:22:48+05:30 IST
మధ్య, దీర్ఘకాలంలో జనాభాలో వృద్ధుల శాతం పెరగనుందని, ఈ కారణంగా జెనరిక్స్, ఓవర్-ది-కౌంటర్(ఓటీసీ), బ్రాండెడ్ ఔషదాలకు గిరాకీ పెరగనుందని అరబిందో ఫార్మా అంచనా వేస్తోంది...
అరబిందో ఫార్మా
2024నాటికి రూ.5.26 లక్షల కోట్లకు దేశీయ ఫార్మా పరిశ్రమ
బయోసిమిలర్లపై కంపెనీ దృష్టి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): మధ్య, దీర్ఘకాలంలో జనాభాలో వృద్ధుల శాతం పెరగనుందని, ఈ కారణంగా జెనరిక్స్, ఓవర్-ది-కౌంటర్(ఓటీసీ), బ్రాండెడ్ ఔషదాలకు గిరాకీ పెరగనుందని అరబిందో ఫార్మా అంచనా వేస్తోంది. ప్రపంచ జనాభాలో వృద్ధుల శాతం 2015లో 12 శాతం ఉండగా.. 2050 నాటికి 22 శాతానికి చేరనుంది. 80 శాతం మంది వృద్ధులు తక్కువ, మధ్య ఆదాయం దేశాల్లోనే ఉండనున్నారని వార్షిక నివేదికలో కంపెనీ వెల్లడించింది. దేశీయ ఫార్మా పరిశ్రమ అమ్మకాలు 2024 నాటికి 6,500 కోట్ల డాలర్లకు (దాదాపు రూ.5.26 లక్షల కోట్లు) చేరుకుంటాయని పేర్కొంది. అంతేకాకుండా 2030 నాటికి ఇవి 13,000 కోట్ల డాలర్లకు పెరుగుతాయని తెలిపింది.
బయోసిమిలర్ల విక్రయాల్లో 18% వృద్ధి: ఈ ఏడాది బయోసిమిలర్ల మార్కెట్ 3,000 కోట్ల డాలర్ల మేరకు ఉంటుందని అంచనా. ఇది 2028 నాటికి 7,000 కోట్ల డాలర్లకు చేరుకుంటుందని ఫార్మా నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే ఈ మార్కెట్ ఏటా 18 శాతం చొప్పున పెరగనుందని అరబిందో ఫార్మా వెల్లడించింది. క్యురా టెక్ బయోలాజిక్స్ ద్వారా బయోలాజిక్స్ అభివృద్ధిపై అరబిందో దృష్టి సారించిందని 14 బయోసిమిలర్లను అభివృద్ధి చేసే ప్రక్రియలో ఉందని పేర్కొంది. బయోసిమిలర్ల అభివృద్ధి ప్రక్రియను వేగిరం చేయడానికి కంపెనీ పరిశోధన, అభివృద్ధిపై చేస్తున్న ఖర్చులో 39 శాతాన్ని బయోసిమిలర్ల అభివృద్ధికి వెచ్చిస్తున్నట్లు వార్షిక నివేదికలో వెల్లడించింది.
ఏపీఐల వ్యాపార విస్తరణ: భారత కంపెనీల జెనరిక్ ఔషధ ఎగుమతులు పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా జెనరిక్ ఔషధాల గిరాకీలో 20 శాతాన్ని భారత కంపెనీలు సరఫరా చేస్తున్నాయి. ప్రస్తుతం దేశీయ ఔషద కంపెనీలు వర్థమాన దేశాలకు జెనరిక్స్‌ను ఎగుమతి చేయడంపై దృష్టి కేంద్రీకరిస్తున్నాయి.
జెనరిక్స్ ఎగుమతులను పెంచుకోవడంతో పాటు బయోసిమిలర్ల అభివృద్ధి, యాక్టివ్ ఫార్మా ఇన్‌గ్రిడియెంట్స్ (ఏపీఐ) వ్యాపార విస్తరణ, వర్థమాన దేశాలకు విస్తరించడం, చైనాలో కార్యకలాపాలను పెంచడంపై అరబిందో ఫార్మా దృష్టి కేంద్రీకరించనున్నట్లు పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ.. వాటిని కంపెనీ అధిగమించిందని అరబిందో ఫార్మా ఎండీ కే నిత్యానంద రెడ్డి తెలిపారు.