ఎల్‌నినో ముప్పు పొంచి ఉంది..
ABN , First Publish Date - 2023-06-26T01:57:57+05:30 IST
ద్రవ్యోల్బణం 4 శాతం స్థాయిలో అదుపు చేసేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) తీవ్రంగా కృషి చేస్తున్నదని గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. అయితే ఎల్‌నినో తమ ప్రయత్నాలకు...
ఈ ఏడాది ద్రవ్యోల్బణం అంచనా 5.1 శాతం
4 శాతానికి అదుపు చేయాలన్నదే మా లక్ష్యం
ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
ముంబై: ద్రవ్యోల్బణం 4 శాతం స్థాయిలో అదుపు చేసేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) తీవ్రంగా కృషి చేస్తున్నదని గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. అయితే ఎల్‌నినో తమ ప్రయత్నాలకు సవాలు విసురుతోందని చెప్పారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 6.5 శాతం వృద్ధిని సాధిస్తుందన్న విశ్వాసం ప్రకటించారు. ఆయన తన కార్యాలయంలో ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆర్‌బీఐ గత మే నెల నుంచి పలు విడతలుగా రెపో రేటును 2.50 శాతం మేరకు పెంచడంతో పాటు ప్రభుత్వం సరఫరాలపరమైన చర్యలు చేపట్టడం వల్ల అప్పటికి 7.8 శాతానికి దూసుకుపోయిన ద్రవ్యోల్బణం ప్రస్తుతం 4.25 శాతానికి దిగివచ్చిందని చెప్పారు. ‘‘ద్రవ్యోల్బణ ధోరణులు నిశితంగా గమనిస్తూనే ఉంటాం. అయినా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అది 5.1 శాతం వరకు ఉండవచ్చు’’ అని దాస్ వ్యాఖ్యానించారు. ద్రవ్యోల్బణం తీరును బట్టి మాత్రమే వడ్డీ రేట్లు కూడా ఉంటాయని, ద్రవ్యోల్బణం తగ్గినట్టయితే ప్రజలు తక్కువ వడ్డీ రేట్లను ఆశించవచ్చని ఆయన అన్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో కమోడిటీ ధరలు పెరిగిపోవడం ద్రవ్యోల్బణం పోటెత్తడానికి కారణమని ఆయన తెలిపారు. ప్రస్తుతం అంతర్జాతీయ విపణిలో బ్యారెట్ 76 డాల ర్ల స్థాయిలో కదలాడుతున్న క్రూడాయిల్ ధరలు ద్రవ్యోల్బణ కోణంలో ఆందోళనకరమైన అంశం కాదని ఆయన అన్నారు. భౌగోళిక, రాజకీయ అంశాల కారణంగా అంతర్జాతీయంగా ఆటుపోట్ల స్థితి ఉండడం, దేశీయంగా రుతుపవనాలు ప్రస్తుతం మన ముందున్న సవాళ్లని దాస్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రుతుపవనాలు సాధారణంగానే ఉండవచ్చని అంచనాలున్నప్పటికీ ఎల్‌నినో పరిస్థితులు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయనంటూ దాని విషయం తీవ్రంగా పరిశీలనలోకి తీసుకోవలసి ఉంటుందని ఆయన అన్నారు. ఎలాంటి అస్థిరతలనైనా తట్టుకోగల స్థాయిలో బలంగా నిలబడాల్సిందేనని నొక్కి చెప్పారు.
బ్యాంకుల రుణ వృద్ధి 16 శాతం ఉన్నదని చెబుతూ ఆర్‌బీఐ అన్ని పరిస్థితులను పరిశీలిస్తున్నదన్నారు. కార్పొరేట్ రుణాలకు ప్రత్యేకించి ప్రాజెక్టు రుణాలకు డిమాండ్ పెరగడం కూడా ఆనందదాయకమని చెప్పారు. ఈ ఏడాది ఇప్పటివరకు రూపాయి ఆటుపోట్లు తక్కువగానే ఉన్నాయని, డాలర్‌తో మన కరెన్సీ బలపడిందని దాస్ తెలిపారు. 2024 ఆర్థిక సంవత్సరంలో కరెంట్ ఖాతా లోటును కూడా సమర్థవంతంగానే అదుపు చేయగలమనే విశ్వాసం ప్రకటించారు.
మూడింట రెండు వంతుల నోట్లు వచ్చేశాయి...
రూ.2000 కరెన్సీ నోటు ఉపసంహరించుకోవాలన్న నిర్ణయం తీసుకున్న రోజు నుంచి నెల లోపే మూడింట రెండు వంతుల నోట్లు వాపసు వచ్చేశాయని దాస్ తెలిపారు. మొత్తం రూ.3.62 లక్షల కోట్ల విలువ గల 2,000 నోట్ల ఉపసంహరణ నిర్ణయం మే 19న ప్రకటించగా రూ.1.8 లక్షల కోట్ల విలువ గల నోట్లు ఆర్‌బీఐ వద్దకు వాపసు వచ్చేశాయని ఈ నెల 8వ తేదీన ప్రకటించిన ద్రవ్యవిధానంలో ఆర్‌బీఐ ప్రకటించింది. కాగా ఇప్పటివరకు రూ.2.41 లక్షల కోట్ల విలువ గల నోట్లు తిరిగి వచ్చాయని ఆయన తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. వాటిలో 85 శాతం డిపాజిట్ల రూపంలో రాగా మిగతావి ఇతర కరెన్సీలుగా మార్పిడి అయినట్టు ఆయన చెప్పారు. నోట్ల వాపసుకు తుది గడువు సెప్టెంబరు 30 వరకు ఉంది, నోట్ల ఉపసంహరణ ప్రతికూల ప్రభావం ఏదీ ఆర్థిక వ్యవస్థపై పడినట్టు తమకు కనిపించలేదని చెప్పారు.