Share News

మార్కెట్‌ మరింత పైకి సెన్సెక్స్‌, నిఫ్టీ కొత్త రికార్డులు

ABN , Publish Date - Dec 29 , 2023 | 04:50 AM

ఈక్విటీ మార్కెట్‌లో జోరు యథాతథంగా కొనసాగుతూనే ఉంది. క్రూడాయిల్‌ ధరలు అదుపులోనే ఉండడంతో పాటు ఎఫ్‌పీఐ పెట్టుబడులు, విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల...

మార్కెట్‌ మరింత పైకి సెన్సెక్స్‌, నిఫ్టీ కొత్త రికార్డులు

ముంబై: ఈక్విటీ మార్కెట్‌లో జోరు యథాతథంగా కొనసాగుతూనే ఉంది. క్రూడాయిల్‌ ధరలు అదుపులోనే ఉండడంతో పాటు ఎఫ్‌పీఐ పెట్టుబడులు, విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాల నడుమ గురువారం నాడు కూడా మార్కెట్లు కొత్త రికార్డుల దిశగా దూసుకుపోయాయి. ఎనర్జీ, మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో జరిగిన కొనుగోళ్లు కూడా మార్కెట్‌ లాభాలకు దోహదపడ్డాయి. వరుసగా ఐదో రోజున కూడా సాగిన ర్యాలీలో సెన్సెక్స్‌ 445.91 పాయింట్లు లాభపడి 72484.34 పాయింట్ల ఆల్‌ టైమ్‌ హైని తాకింది. చివరికి 371.95 పాయింట్ల లాభంతో మరో ఆల్‌ టైమ్‌ హై 72410.38 వద్ద ముగిసింది. నిఫ్టీ ఒక దశలో 21801.45 పాయింట్ల చారిత్రక గరిష్ఠ స్థాయిని తాకినా చివరికి 123.95 పాయింట్ల లాభంతో చారిత్రక రికార్డు 21778.70 వద్ద ముగిసింది. ఐదు వరుస సెషన్లలో సెన్సెక్స్‌ 1904.07 పాయింట్లు, నిఫ్టీ 628.55 పాయింట్లు లాభపడ్డాయి.

  • స్టాక్‌ ఎక్స్ఛేంజిల వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం బుధవారం విదేశీ ఇన్వెస్టర్లు రూ.2926.05 కోట్ల విలువ గల షేర్లు కొనుగోలు చేశారు.

ఇన్వెస్టర్లకు రూ.12.80 లక్షల కోట్లు లాభం

ఐదు రోజుల ర్యాలీలో ఇన్వెస్టర్ల సంపద (బీఎస్‌ఈలో లిస్టింగ్‌ అయిన కంపెనీల విలువ) రూ.12,80,559.20 కోట్లు పెరిగింది. గురువారం మార్కెట్‌ ముగిసే సమయానికి ఇది చారిత్రక గరిష్ఠ స్థాయి రూ.3,63,00,558.07 కోట్ల వద్ద స్థిరపడింది.

Updated Date - Dec 29 , 2023 | 04:50 AM