చిన్న షేరు.. చిన్నబోయె!

ABN , First Publish Date - 2023-03-31T02:04:15+05:30 IST

ఈ మార్చి 31 (శుక్రవారం)తో ముగియనున్న 2022-23 ఆర్థిక సంవత్సరం చిన్న కంపెనీల షేర్లకు అంతగా కలిసిరాలేదు. భగ్గుమన్న ధరలు, అధిక వడ్డీ రేట్లు, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ప్రభావంతో...

చిన్న షేరు.. చిన్నబోయె!

  • 2022-23లో బీఎ్‌సఈ స్మాల్‌క్యాప్‌ సూచీ 6% డౌన్‌

  • 1% పైగా నష్టపోయిన సెన్సెక్స్‌, మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌

న్యూఢిల్లీ: ఈ మార్చి 31 (శుక్రవారం)తో ముగియనున్న 2022-23 ఆర్థిక సంవత్సరం చిన్న కంపెనీల షేర్లకు అంతగా కలిసిరాలేదు. భగ్గుమన్న ధరలు, అధిక వడ్డీ రేట్లు, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ప్రభావంతో మార్కెట్‌ సూచీలు నేలచూపులు చూశాయి. ప్రధాన కంపెనీలతో పోలిస్తే చిన్న షేర్లు అధిక ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దాంతో, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు బీఎ్‌సఈ స్మాల్‌క్యాప్‌ సూచీ 1,616.93 పాయింట్లు (5.73 శాతం) క్షీణించింది. కాగా, మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 270.29 పాయింట్లు (1.12 శాతం) తగ్గింది. కాగా, బ్లూచిప్‌ కంపెనీల ప్రాతినిథ్య సూచీ అయిన బీఎ్‌సఈ సెన్సెక్స్‌ 608.42 పాయింట్ల (1.03 శాతం) తగ్గుదలను నమోదు చేసుకుంది.

గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో (2020-21, 2021-22) మార్కెట్లో ఉత్సాహం ఉరకలేసింది. ప్రామాణిక ఈక్విటీ సూచీలైన సెన్సెక్స్‌, నిఫ్టీ రెండంకెల వృద్ధిని కనబర్చాయి. 2022-23లో మాత్రం సూచీలు స్వల్ప నష్టాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సాధారణంగానే మార్కెట్లు వరుసగా రెండేళ్లు జోరు కనబరిస్తే, మూడో ఏడాదిలో పెద్దఎత్తున లాభాల స్వీకరణ జరగడం పరిపాటే. ఇందుకు దేశీయ, అంతర్జాతీయ ప్రతికూల పరిణామాలు కూడా తోడయ్యాయని విశ్లేషకులు పేర్కొన్నారు.

సూచీల కనిష్ఠ, గరిష్ఠాలు

  • గత ఏడాది జూన్‌ 20న 23,261.39 పాయింట్ల వద్దకు పడిపోయి ఏడాది కనిష్ఠాన్ని తాకిన బీఎ్‌సఈ స్మాల్‌క్యాప్‌ సూచీ.. సెప్టెంబరు 15న మళ్లీ 30,185.95 పాయింట్ల స్థాయికి ఎగిసి సరికొత్త ఏడాది గరిష్ఠాన్ని నమోదు చేసుకుంది.

  • గత జూన్‌ 20న 20,814.22 పాయింట్ల వద్ద 52 వారాల కనిష్ఠానికి పడిపోయిన బీఎ్‌సఈ మిడ్‌క్యాప్‌ సూచీ.. డిసెంబరు 14న 26,440.81 పాయింట్ల వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది.

  • బీఎ్‌సఈ సెన్సెక్స్‌ గత జూన్‌ 17న 50,921.22 పాయింట్ల వద్ద ఏడాది కనిష్ఠాన్ని తాకింది. డిసెంబరు 1న 63,583.07 పాయింట్ల వద్ద ఆల్‌టైం రికార్డు గరిష్ఠాన్ని నమోదు చేసుకుంది.

మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపిన ప్రధాన అంశాలు

  • రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా తలెత్తిన సరఫరా అవాంతరాలతో ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయికి పెరిగిన ధరలు

  • యూఎస్‌ ఫెడ్‌ రిజర్వ్‌ సహా అగ్రరాజ్యాల సెంట్రల్‌ బ్యాంక్‌లన్నీ వడ్డీ రేట్లను వేగంగా పెంచుతూ రావడం

  • ఆర్థిక మాంద్యం భయాలు, విదేశీ ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు పాల్పడటం

  • అదానీ-హిండెన్‌బర్గ్‌ వివాదం, అమెరికన్‌ సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ పతనం

2023-24లో మార్కెట్‌ మళ్లీ పైకి!

మార్కెట్‌పై కమ్ముకున్న అనిశ్చితి మబ్బులింకా తేరుకోలేదని, వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24) తొలి త్రైమాసికంలోనూ సూచీలు తీవ్ర ఊగిసలాటలకు లోను కావచ్చని ఈక్విటీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, అమెరికా ఫెడ్‌ రేట్లు గరిష్ఠంగా ఏ స్థాయి వరకు పెరగవచ్చన్న విషయంపై 2023-24లోనే స్పష్టత రావచ్చని, ఆ తర్వాత మార్కెట్లు మళ్లీ పుంజుకోవచ్చన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో భారీగా లాభాల స్వీకరణకు గురైన చిన్న, మధ్య స్థాయి కంపెనీల షేర్లకు మళ్లీ డిమాండ్‌ పెరగవచ్చన్నారు.

ఆర్థిక సంవత్సరం రిటర్నులు(%)

స్మాల్‌క్యాప్‌ మిడ్‌క్యాప్‌ సెన్సెక్స్‌

2020-21 114.89 90.93 68.0

2021-22 36.64 19.45 18.29

2022-23 - 5.73 - 1.12 - 1.03

(ఇప్పటివరకు)

Updated Date - 2023-03-31T02:04:15+05:30 IST