సెన్సెక్స్ 140 పాయింట్లు డౌన్
ABN , First Publish Date - 2023-11-21T01:33:10+05:30 IST
దేశీయ ప్రామాణిక ఈక్విటీ సూచీలు వరుసగా రెండో రోజూ నష్టాలు చవిచూశాయి. అధిక వాల్యువేషన్ల ఆందోళనలతో మదుపరులు వాహన, యుటిలిటీ, కమోడిటీ రంగ షేర్లలో...

ముంబై: దేశీయ ప్రామాణిక ఈక్విటీ సూచీలు వరుసగా రెండో రోజూ నష్టాలు చవిచూశాయి. అధిక వాల్యువేషన్ల ఆందోళనలతో మదుపరులు వాహన, యుటిలిటీ, కమోడిటీ రంగ షేర్లలో అమ్మకాలకు పాల్పడటంతో పాటు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లూ పెట్టుబడుల ఉపసంహరణను కొనసాగించడం ఇందుకు కారణమైంది. ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు నష్టాలకు కొంత అడ్డుకట్ట వేయగలిగాయి. సోమవారం ట్రేడింగ్‌లో ఆద్యంతం తీవ్ర ఊగిసలాటలకు లోనైన సెన్సెక్స్.. ఒక దశలో 247 పాయింట్ల వరకు క్షీణించింది. చివరికి 139.58 పాయింట్ల నష్టంతో 65,655.15 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 37.80 పాయింట్లు కోల్పోయి 19,694 వద్ద క్లోజైంది.
ఆల్‌టైం కనిష్ఠానికి రూపాయి: భారత కరెన్సీ సరికొత్త జీవితకాల కనిష్ఠ స్థాయికి పతనమైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ మరో 12 పైసలు క్షీణించి రూ.83.35 వద్ద ముగిసింది. మన ఈక్విటీల నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల ఉపసంహరణ ఇందుకు కారణమైంది. డాలర్‌తో మారకంలో ఆసియాలోని మిగతా కరెన్సీలు బలపడినప్పటికీ, రూపాయి మాత్రం బలహీనపడింది. కాగా, గత ఆల్‌టైం కనిష్ఠ స్థాయి రూ.83.33 ఈ నెల 13న నమోదైంది.